బామ్మ - నీటి పాఠం
- Munipalle Vasundhara Rani

- 56 minutes ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #BammaNeetiPatam, #బామ్మనీటిపాఠం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 12 బామ్మ - నీటి (నీతి) పాఠం
Bamma Neeti Patam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle
Published in manatelugukathalu.com on 12/01/2026
బామ్మ - నీటి పాఠం - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
శనివారం ఉదయం సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు. చింటూ తన టైమ్ టేబుల్ చూసుకుని, ఈరోజు నా తోటకి నేనే రాజుని అనుకుంటూ గర్వంగా తోటలోకి వెళ్ళాడు. గబగబా వాటర్ పైపు తీసి ట్యాప్ ఫుల్లుగా తిప్పేశాడు. మొదట మొక్కలకి నీళ్లు పోస్తున్నా, వాడి దృష్టి అంతా పక్కనే ఉన్న గోడ మీద ఎగురుతున్న కాకి మీద పడింది.
పైపుని కాకి వైపు తిప్పి షూ.. షూ.. అంటూ నీళ్లతో దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో నీలిమ స్కూల్ యూనిఫామ్ వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని అటుగా వస్తోంది. అల్లరి మూడ్ లో ఉన్న చింటూ, పైపుని అటువైపు తిప్పి నీలిమను కూడా తడిపేశాడు. నీలిమ ఒక్కసారిగా కేక వేస్తూ, చింటూ! ఏం చేస్తున్నావు? నేను స్కూల్ కి వెళ్తున్నాను కదా, నా యూనిఫామ్ అంతా తడిచిపోయింది అని ఏడుపు మొహం పెట్టి అరిచింది. చింటూ మాత్రం నవ్వుతూ, అదిగో వాన వస్తోంది అక్కా! తడుచుకో అని ఇంకా పైపుతో నీళ్లు చిమ్మడం మొదలుపెట్టాడు. వాడు చేస్తున్న అల్లరికి తోటంతా బురదగా మారిపోయింది.
మొక్కల మొదళ్లలో నీళ్లు ఎక్కువైపోయి అవి భారంగా తలలు వాల్చేశాయి. వాడు మాత్రం హమ్మయ్య! వాన వస్తోంది అంటూ నీళ్లను వృధాగా గాలిలోకి కొడుతున్నాడు.
అంతలో బామ్మ అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా ట్యాప్ కట్టేసింది. చింటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, అయ్యో బామ్మా! ఇంకా చాలా చోట్ల తడవలేదు, అప్పుడే ఎందుకు ఆపేశావు? అని అడిగాడు.
అప్పుడు బామ్మ తన చేతిలో ఉన్న ఒక ఖాళీ గ్లాసుని చింటూకి చూపిస్తూ ఇలా అంది, "చింటూ, ఈ ఖాళీ గ్లాసుని చూడు. నీకు దాహం వేసినప్పుడు ఈ గ్లాసుడు నీళ్లు ఇస్తే నీ ప్రాణం ఎంత లేచి వస్తుంది? కానీ, నువ్వు ఇందాక పైపుతో వృధా చేసిన నీళ్లతో ఇలాంటి వందల గ్లాసులను నింపొచ్చు. అంటే, నువ్వు వందల మంది దాహాన్ని వృధాగా కాలువలో పారబోశావు అన్నమాట! పైగా నీ అల్లరి వల్ల నీలిమ స్కూల్ కి వెళ్లే టైమ్ లో ఇబ్బంది పడింది చూశావా?"
ఆ మాట వినగానే చింటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాడు అల్లరిగా చేసిన పని వల్ల ఇంత నష్టం జరుగుతుందని వాడు అస్సలు అనుకోలేదు.
బామ్మ కొనసాగిస్తూ, "అంతే కాదు చింటూ! నీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ అన్నం పెడుతుంది కదా? ఒకవేళ నువ్వు వద్దంటున్నా నీ నోట్లో బలవంతంగా ముద్దలు పెడుతూనే ఉంటే నీకు ఎలా ఉంటుంది?" అని అడిగింది.
చింటూ ముఖం ముడుచుకుని, "అబ్బా! ఊపిరి ఆడదు బామ్మా, వాంతి వచ్చినట్టు ఉంటుంది" అన్నాడు.
"ఇప్పుడు ఈ మొక్కల పరిస్థితి కూడా అదే చింటూ! వాటికి కావాల్సింది ఒక గ్లాసుడు నీరైతే, నువ్వు పైపుతో ముంచెత్తుతున్నావు. ఆ చిన్న చిన్న మొక్కలు ఊపిరి ఆడక విలవిల్లాడుతున్నాయి. అవి నోరు తెరిచి చెప్పలేవు కానీ, వాటికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ నీరు పోస్తే అవి కుళ్ళిపోయి చనిపోతాయి.
ట్యాప్ లోకి నీళ్లు రావడానికి భూమి తన గర్భంలో ఎంతో నీటిని దాచుకోవాలి. మనం ఇలా వృధా చేస్తే, రేపు మనకు తాగడానికి చుక్క నీరు దొరకదు. అప్పుడు మనం అందరం ఎడారిలో ఉన్నట్టు ఉండాలి. నీకు అది ఇష్టమేనా?" అని గంభీరంగా అడిగింది.
ఎడారి మాట వినగానే చింటూకి భయం వేసింది. "వద్దు బామ్మా! నీళ్లు లేకపోతే నేను అస్సలు ఉండలేను. కానీ పైపుతో పోస్తేనే కదా ఫాస్ట్ గా అయిపోతుంది?" అని అడిగాడు.
అప్పుడు బామ్మ వాడికి ఒక చిన్న సవాల్ విసిరింది. "మనం ఒక పని చేద్దాం. ఈ పైపు పక్కన పెట్టి, ఈ చిన్న మగ్గుతో నీళ్లు పోయి. అప్పుడు ఏ మొక్కకి ఎంత కావాలో నీకే అర్థమవుతుంది. దాంతో నీరు ఆదా అవుతుంది, మొక్కలకి హాయిగా ఉంటుంది" అని చెప్పింది.
చింటూ సవాల్ ని స్వీకరించి మగ్గుతో నీళ్లు పోయడం మొదలుపెట్టాడు.
నీలిమ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. తర్వాత ప్రతి మొక్క మొదట్లో కొంచెం నీరు పోస్తుంటే, ఆ మట్టి నుంచి వచ్చే ఆ మట్టి వాసన వాడికి ఎంతో హాయిని ఇచ్చింది. నీటిని పొదుపుగా వాడుతూ ప్రతి మొక్కను తాకుతుంటే, ఆ మొక్కలు తనతో మాట్లాడుతున్నట్టు చింటూకి అనిపించింది.
నీరు జీవనాధారం. ప్రకృతి మనకిచ్చిన ఈ గొప్ప సంపదను రేపటి తరం కోసం దాచి ఉంచడమే మన బాధ్యత.
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments