top of page
Original.png

ముగ్గుల ముసలం

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #MuggulaMusalam, #ముగ్గులముసలం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Muggula Musalam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published in manatelugukathalu.com on 13/01/2026

ముగ్గుల ముసలం - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


​సంక్రాంతి వస్తోందంటే ఊరంతా ఆనందంగా ఉంటుంది కానీ, మా ఇంట్లో మాత్రం అదో రకమైన ‘సైకలాజికల్ వార్’. దానికి కారణం నా భార్య కాంతానికి పట్టుకున్న ‘ముగ్గుల పిచ్చి’. దానికి తోడు ఏదో పత్రిక వారు ‘ముగ్గుల పోటీలు’ ప్రకటించడంతో కాంతం తనని తాను ఒక గొప్ప చిత్రకారిణిగా ఊహించుకోవడం మొదలుపెట్టింది. పొద్దున్నే లేచి బయట ముగ్గు వేయడానికి వెళ్తే, అది ముగిసేసరికి సూర్యుడు నడినెత్తికి వస్తాడు. రాగానే ఎలగోలాగా వంట తగలేసి అది బాక్సుల్లో కుక్కి నన్ను, బాబుని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. ఇక అప్పటి నుంచి మోతలు మోగిస్తూ వేయబోయే ముగ్గు ప్రాక్టీస్ మొదలుపెట్టుతుంది.


​నిన్నటికి నిన్న అర్ధరాత్రి దాహం వేసి లేచాను. హాల్లో మసక వెలుగులో ఎవరో కూర్చుని ఉండటం చూసి దయ్యం అనుకుని గజగజ వణికిపోయాను. తీరా చూస్తే అది మా కాంతం! నేను ఆఫీసు పని కోసం తెచ్చుకున్న పేపర్ల నిండా పిచ్చిపిచ్చిగా చుక్కలు పెట్టి చంపేస్తోంది.


 ఆఖరికి బాత్‌రూమ్‌లో కూడా నాకు ప్రశాంతత లేదు. ఒకరోజు ఉదయం నేను షేవింగ్ చేసుకుందామని వెళ్తే, అద్దం మీద తెల్లటి చుక్కలు ఉన్నాయి. ఏంటని పరిశీలించి చూస్తే.. అవి నా షేవింగ్ క్రీమ్ చుక్కలు! కాంతం వెనక నుండి వచ్చి, "ఏమనుకోకండి.. తెల్లవారుజామున ఒక కొత్త ఐడియా వచ్చింది. పేపర్ దొరకలేదు, అందుకే అద్దం మీద మీ షేవింగ్ క్రీమ్‌తో చుక్కలు పెట్టి ప్రాక్టీస్ చేశాను" అంది కిలకిలా నవ్వుతూ.


​మర్నాడు ఆఫీసులో ఒక ముఖ్యమైన రిపోర్ట్ ఫైల్ తీశాను. తీరా చూస్తే ఆ రిపోర్ట్ మీద క్లర్క్ రాసిన మేటర్ పక్కనే.. "21 చుక్కలు - మధ్య 8 వరకు" అని పెద్దగా రాసి ఉంది. అంతేకాదు, దాని పక్కనే కొన్ని చుక్కలు కూడా ఏదో ఆకారంతో పట్టి ఉన్నాయి. నాకు కోపం నరాలకి ఎక్కింది. "ఏయ్! ఏంటిది? రిపోర్ట్ అడిగితే ఇదేదో మంత్ర తంత్రాల నంబర్లు, బొమ్మలు వేసిచ్చావు?" అని క్లర్క్ మీద విరుచుకుపడ్డాను. వాడు పాపం, బిత్తరపోయి చూస్తూ "నేను రాయలేదు సార్.." అని వణికిపోయాడు. సడన్‌గా నాకు కాంతం అర్థరాత్రి చేసిన చుక్కల యజ్ఞం గుర్తుకొచ్చింది. సరేలే.. ఇంకోసారి జాగ్రత్త అని వాడిని పంపేశాను. నయం.. అది చూసుకోకుండా హెడ్ ఆఫీసుకి పంపలేదు!


​సాయంత్రం ఇంటికి వెళ్ళగానే కాంతం ఏదో వెతుకుతోంది. "ఏం వెతుకుతున్నావ్?" అంటే, "అదేనండీ.. నేను ముగ్గు మర్చిపోకుండా చుక్కలు రాసుకున్న కాగితం కనపడట్లేదు" అంది. నేను ఆ పేపర్ తీసి, "ఇదేనా?" అని అడిగితే, "హమ్మయ్య! దొరికింది. దాని గురించి పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నాను. అయినా ఏది పడితే అది ఆఫీసుకి పట్టుకెళ్లిపోతారెందుకండీ?" అని నన్నే గట్టిగా మందలించింది. ఇంక ఏం మాట్లాడతాను? ఆకలేస్తోంది కాంతం, వంట అయ్యిందా అన్నాను. దానికి కాంతం, "రెండు పూటలా వంట చేస్తూ కూర్చుంటే ముగ్గులు ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి? అందుకే మా అమ్మని రోజు సాయంత్రాలు వంట చేసి పంపమన్నాను" అంది. పాపం, ఆవిడను కూడా వదలలేదన్న మాట!


​ఆవిడకి సారీ మరియు థాంక్స్ రెండూ చెబుదామని ఫోన్ చేశాను. మామగారు ఫోన్ ఎత్తారు. ఉభయకుశలోపరి అయ్యాక, "ఒకసారి అత్తయ్యగారిని పిలుస్తారా?" అన్నాను. దానికి ఆయన గట్టిగా నిట్టూర్చి, "ఆవిడ మొన్ననగా ఇంటి ముందు ముగ్గు వేయడానికి బయటకి వెళ్ళింది నాయనా.. ఇంతవరకు ఇంటికి రాలేదు. బయట ఎక్కడా దరిదాపుల్లో కూడా లేదు. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరూ తెలియదన్నారు. ఒక ఆవిడ మటుకు నిన్న పొద్దున్న పక్క కాలనీలో ముగ్గు వేస్తుంటే చూశాను అంది, కానీ అక్కడ కూడా లేదు" అన్నారు.

 "అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా?" అన్నాను కంగారుగా. దానికి ఆయన, "వద్దు బాబు.. కిందటి సంక్రాంతికి ఇలాగే మూడు రోజులు మాయమైతే కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి రథం ముగ్గు మధ్యలో ఉండగా పట్టుకొచ్చి ఇంట్లో దింపారని నా మీద పెద్ద యుద్ధం చేసి ఆగమాగం అయింది. అందుకే పిచ్చి ముగ్గులన్నీ వేసి విసుగు పుట్టాక తనంతట తానే వస్తుందిలే అని ఊరుకున్నాను" అన్నారు. "మరి మాకు రాత్రి భోజనం ఎలా వస్తోంది?" అని అమాయకంగా అడిగాను. "వంటదేముందిలే నాయనా.. నేనే చేసి పంపుతున్నాను!" అన్నారాయన. ఈయన పరిస్థితి నాకన్నా ఘోరంగా ఉంది పాపం అనుకుని ఫోన్ పెట్టేశాను.


​బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ టేబుల్ చూస్తే.. ఏదో పిల్లి పిండిలో దొర్లి టేబుల్ మీద గెంతినట్టుంది! రకరకాల బొమ్మలు, పిండి ముద్దలు, చుక్కలతో అదో వింత ఆకారంలో ఉంది. "ఏంటే కాంతం ఇవి? ఎవరైనా చూస్తే ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నాం అనుకుంటారు, ఖర్మ!" అనుకుంటూ వాటిని తుడవబోయాను. "ఆగండి! అవేవీ ముట్టుకోకుండా మీ ప్లేస్‌లో కూర్చోండి, అన్నం వడ్డిస్తాను" అంది. కూర్చున్నాక చూస్తే.. అన్నం ప్లేటు చుట్టూ తెల్లటి సున్నపు చుక్కలు ఉన్నాయి! "ఏంటి కాంతం ఇది?" అని అడిగితే, "అదేనండీ.. ప్లేటు చుట్టూ 12 చుక్కలు పెట్టి పద్మం ముగ్గు వేద్దామని ప్లాన్ చేశాను. చుక్కలు పెట్టగానే మీరు వచ్చారు. ఆ ముగ్గు మధ్యలో మీ ప్లేటు భలే కదిరింది కదా!" అంది.


​అది చాలదన్నట్టు మా బాబు రవి గదిలోంచి భీభత్సమైన ఏడుపు వినిపిస్తోంది. వెళ్ళి చూస్తే వాడు తన నోట్‌బుక్ పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. "ఏమైందిరా నాన్నా?" అని అడిగాను. వాడు ఆ బుక్ నా చేతిలో పెట్టాడు. అందులో "Write an essay about your Class Teacher" అని ఉన్న చోట మేటర్ లేదు! వాడు ఏడుస్తూ చెప్పాడు, "నాన్నా.. నేను రాత్రంతా కష్టపడి టీచర్ గురించి ఎస్సే రాస్తే, ఆ పేజీ లేదు! అమ్మ ఎప్పుడు ఆ పేజీ తీసేసిందో తెలీదు కానీ, దాని బదులు అక్కడ ఈ గంగిరెద్దు బొమ్మ ఉంది నాన్నా! ఇవాళ క్లాసులో టీచర్ అందరి బుక్స్ కలెక్ట్ చేసి కరెక్షన్ చేస్తుంటే నా బుక్ వంతు వచ్చింది. అది ఓపెన్ చేయగానే ఆవిడకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆ బుక్ అందరికీ చూపించి చాలా గట్టిగా అరుస్తూ— 'ఏరా.. నేను నీకు గంగిరెద్దులా కనిపిస్తున్నానా? రేపు మీ పేరెంట్స్‌ని తీసుకుని వచ్చి ప్రిన్సిపాల్ గారిని కలవమను' అని అందరి ముందు తిట్టింది నాన్నా!" అని బావురుమన్నాడు.


​నాకు కోపం నసాలానికి అంటింది. "కాంతం!!!" అని గట్టిగా అరిచాను. కాంతం చేతిలో ఒక పేపర్ పట్టుకుని హుషారుగా వచ్చి, "ఎందుకు అలా అరుస్తారు? ఈ ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో! నిన్న ఎక్కడో వేశాను, కనపడి చావలేదు.. చుక్కలు రాసుకున్నది మీరు పట్టుకుపోయారు. మొత్తానికి ఎలాగో గుర్తు తెచ్చుకుని మళ్ళీ వేశాను చూడండి.. బాగుంది కదా!" అంది పరవశంగా. అది రవి బుక్కులో ఉన్న అదే గంగిరెద్దు బొమ్మ!


​రవి ఏడుస్తూ "అమ్మా.. ఇదా నువ్వు వెతుకుతున్న ముగ్గు?" అని నోట్‌బుక్ చూపించాడు. అది చూడగానే కాంతం, "అవునురా!" అని చర్రున ఆ పేజీ చింపేసి, "తండ్రీ కొడుకులిద్దరికీ ఇదేం జబ్బో.. నావన్నీ తీసి దాస్తారు!" అని ముక్కు ఎగబీలుస్తూ వెళ్ళిపోయింది.


​నేను, రవి ఒకరినొకరు చూసుకున్నాం. మా మధ్య మాటలు లేవు, కేవలం ఒకరిపై ఒకరికి జాలి మాత్రమే మిగిలింది. ఆ ఇంట్లో కాంతం ముగ్గుల పిచ్చి ముందు మా ఇద్దరి ఆవేదన అరణ్య రోదన అని అర్థం కావడానికి మాకు ఎంతో సేపు పట్టలేదు.


సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page