top of page
Original.png

భోగి పండుగ విశిష్టత

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #BhogiPandugaVisishtatha, #భోగిపండుగవిశిష్టత


Bhogi Panduga Visishtatha - New Telugu Story Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 14/01/2026

భోగి పండుగ విశిష్టత - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

సౌరమానం ప్రకారం సరిగ్గా ఈ రోజుతో అనగా భోగి పండుగతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. ఈ రోజు శ్రీరంగనాథుని సాంగత్యం అనే కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ గోదాదేవి పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు వచ్చిందని భక్తి పరంగా చెప్పవచ్చు! పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకరిగా భూమాత అంశగా అవతరించిన గోదాదేవి ఆండాళ్ తల్లిగా ప్రసిద్ధి పొందింది. భక్తి మార్గంలో నడిచి భగవంతుని పొందడానికి దిశానిర్దేశం చేసిన తల్లి ఆండాళ్! రంగనాథుని తన పతిగా భావించి తిరుప్పావై వ్రతం చేసి, చివరి రోజున రంగనాథస్వామి ఆదేశం మేరకు ఆమె తండ్రి కళ్యాణం ఏర్పాట్లు చేయగా, సర్వాలంకృతురాలైన తల్లి, అందరూ చూస్తూ వుండగానే రంగనాథునిలో ఐక్యం అయ్యింది ఈరోజే! అందుకని వైష్ణవులకు ముఖ్యమైన పండుగ. ఈరోజున గోదారంగనాథుల కళ్యాణం చేస్తారు. 


ఆధ్యాత్మిక దృష్టితో మరోకోణంలో చూస్తే భోగి మంటలకు ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెబుతారు. దక్షిణాయన కాలంలో ఎదురైన కష్టాలు తొలగి, ఉత్తరాయణంలో మంచి రోజులు ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ ఈ మంటలు వేస్తారని విశ్వాసం. అందుకే భోగి పండుగను కేవలం ఆచారంగా కాకుండా ఆత్మశుద్ధి దినంగా కూడా భావిస్తారు. 


చలికాలం ముగిసి, ఎండలు మొదలయ్యే ఈ సమయంలో భోగి పండుగ మన జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ రోజున ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వెలుగుతాయి. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ఉన్న పాత సామాన్లు, చెక్క ముక్కలు, పిడకలతో భోగి మంటలు వేస్తారు. 


 ధనుర్మాసం అంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడకలుగా మారుస్తారు. వాటిని భోగి మంటల్లో వాడటం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడని అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని కొందరు పెద్దలు చెబుతారు. 


 ఈరోజు సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా చిన్నపిల్లలకు భోగి పండ్లను పోస్తారు. పిల్లలను కూర్చోబెట్టి రేగుపండ్లు, కొన్ని పైసలు కలిపి తలపై నుంచి పోస్తారు. పేరంటాళ్ళను పిలిచి వారి చేత పోయిస్తారు. వాళ్ళందరి ఆశీస్సులు పిల్లలకి లభించాలని అలా చేస్తారు. పిల్లలకు దిష్టి తొలగిపోయి పెద్దల ఆశీస్సులు లభించాలని భోగిపండ్లు పోస్తారు. 


పాడైపోయిన పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చడం ద్వారా పనికిరానివి వదిలేసి, కొత్త ఆలోచనలతో జీవితాన్ని కొనసాగించాలనే అంతర్లీనమైన భావం ఈ పండుగలో కనిపిస్తుంది. 


ఉత్తరభారత దేశంలో భోగి పండుగను 'లోహ్రి ' అనే పేరుతో జరుపుకుంటారు. వీళ్లు కూడా భోగి మంటలు వేస్తారు. అందరూ కలిసి ఆ మంటల చుట్టూ ప్రదిక్షణం చేస్తూ పేలాలు చల్లుతారు. పూజిస్తారు. 

 అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు

💐 💐 💐

సుధావిశ్వం



-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page