top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

రైతే రాణి


'Raithe Rani' written by Ayyala Somayajula Subramanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

సృష్టిలో తొలి రైతు.. మహిళే అయి ఉంటుంది.

అయి ఉండటం ఏమిటి? -- మహిళే !

మగాడికేం ఒంటికాయ శొంఠి కొమ్మ !

బిడ్డల కడుపు నింపాల్సింది అమ్మ। అందులోనూ ఆకలి.. కరువులాంటిది. ఓ పట్టాన వదిలిపెట్టదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. మళ్ళీ పొద్దున, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రికి ! ఒకరైతే.. ఏ అడవిలోకి వెళ్ళి ఆకులో, అలములో ఏరుకుని తినగలరు. గంపెడు పిల్లల్ని బతుకించుకోవాలంటే.. చచ్చినట్టు పండించుకోవాల్సిందే. అవసరం ఆవిష్కరణకు అమ్మ లాంటిది. బిడ్డల ఆకలి అవసరం కోసమే ఆమె వ్యవసాయ ఆవిష్కర్తగా మారి ఉంటుంది. అడివిని సుక్షేత్రమైన మాగాణంలా మార్చ్సుకుని

ఉంటుంది. కలల పంటలైన పిల్లల కోసం విత్తు చల్లి పంట పండించి ఉంటుంది.

ఆ ధాన్యపు రాశులని రేపటి అవసరాల కోసం గృహంలాంటి గుహలో భద్రంగా దాచి ఉంటుంది. ‘అమ్మా! ఆకలి’ అన్నమాట వినిపించకముందే కమ్మగా వండి, వడ్డించి ఉంటుంది. కాలప్రవాహంలో జనావాసాలు గ్రామాలుగా మారాయి. నేల ఆస్తిగా మారింది. పంట వృత్తిగా మారింది. పంట ఆమెదే కాబట్టి, ఇంటి పెత్తనమూ ఆమెదే! ఆ కడుపు మంట కొద్దీ స్త్రీ ప్రాధాన్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడు పురుషుడు. నాట్లకో, కలుపులకో, కోతలకో పరిమితం చేశాడు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఎంత వివక్ష అంటే రైతు అంటే మగాడు గుర్తుకొస్తాడు. ఆ మాట కొస్తే రైతు అనే పదానికి స్త్రీ లింగాన్ని నిఘంటువు లోంచి కూడా మాయం చేశాడు. అయినా రైతు,రాజే ఎందుకు కావాలి ? రాణీ కాకూడదా !

రైతమ్మ, రైతక్క అనిపించుకోకూడదా?

సైన్స్‌ అంతమైన చోట అధ్యాత్మికత మొదలవుతుందో లేదో కానీ, పురుషుడు విఫలమైన చోటి నుంచి స్త్రీల విజయ పరంపర ఆరంభం అవుతుంది. మొనగాడివని మెలేసేవాడు. మట్టి మీద తనకే పట్టా ఉన్నట్టు వ్యవహరించేవాడు. కరువులని తట్టుకోలేక, గిట్టుబాటు ధరలు రాక, గుండెబలం కోల్పోయి గుండెలు బాదుకుంటున్న సమయంలో, మహిళ రంగం లోకి దిగింది. సేద్యాన్ని బిడ్డలా భుజానికి ఎత్తుకుంటోంది. పంటల్నీ, పిల్లల్నీ సమ బాధ్యతతో పెంచి పెద్ద చేస్తోంది. పంట విరగ పండుతోంది. పిల్లలు సమర్థులు అవుతున్నారు.

***

'ఆడపిల్ల.. ఎప్పుడూ ఆడపిల్లే.. ఇక్కడ పిల్లకాదు.. ' ఇది అనాది కాలం నుండి కుటుంబంలో ఉన్న భావన. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ చేయించి.. కొడుకు పుట్టాలని.. తమను పున్నామ నరకం నుంచి తప్పించాలని కోరుకునే తల్లిదండ్రులే ఎక్కువ. అలాంటి సామాన్య తండ్రే మల్లయ్య.

కొడుకు కావాలని ఏడుగురు ఆడపిల్లలను కన్నాడు. అతని పేదరికం, వారికి చదువు చెప్పించలేక పోయింది. కానీ అంతకన్నా గొప్పవిద్యనే నేర్పింది. అదే వ్యవసాయం! ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న బిడ్డలు, కొడుకులు లేని లోటును తీర్చారు. పేదరైతు అయిన తండ్రిని పాతిక ఎకరాల ఆసామిని చేశారు. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దమైన ఆ ధీర వనితలు ఇవాళ్టి మన కథావస్తువు సివంగులు (" రైతమ్మలు- రైతేరాణులు )".

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని కుగ్రామం. బండి మల్లయ్య కష్టం తప్ప లోకం పోకడ తెలియని సామాన్య రైతు. నిరక్షరాస్యుడు. ఆయన బలం, బాధ్యత రెండూ కూతుళ్ళే. మల్లయ్య పెద్ద కూతురు యాదమ్మ, రెండో కూతురు లింగమ్మ, మూడో కూతురు లక్ష్మమ్మ, నాలుగో కూతురు ఎల్లమ్మ, ఐదో కూతురు అంజమ్మ, ఆరో కూతురు గంగమ్మ, ఏడవ ఆఖరి కూతురు. బాలనాగమ్మ.

"రైతుమిత్ర" అవార్డు వచ్చిందని తెలిసి 'ఇండియా టుడే' విలేఖరి వారిని ఇంటర్వ్యూ చేయడానికి ఆ ఊరికి వచ్చి , విచారించగా, ఆ కుటుంబం గురించి చెప్పిన మాటలు.. విలేఖర్ రవీందర్‌ కు మల్లయ్య ఇల్లు సులభం గానే దొరిరింది. ఇంటికాడ ఎవ్వరూ లేరు. పక్కనోళ్ళను అడిగితే తోట కాడికి పోయిండని చెప్పిండ్రు. మల్లయ్య కు ఫోన్‌ చేస్తే తోట బాట చెప్పిండు.....ఆ తొవ్వంబెట కొంత దూరం వెళ్ళంగనే మోటర్‌ సైకిల్‌ పై ఓ అమ్మాయి వచ్చింది.

" మీరేనా ఫోన్‌ చేసింది?" అంటూ దారి తీసింది. పొలం చేరగానే విలేఖరిని తండ్రి దగ్గర వదిలి

పెట్టి, అక్క గంగమ్మతో కలిసి ట్రాక్టర్‌ కు పుట్‌వీల్‌ ఎక్కించే పనిలో నిమగ్నమయింది. చూస్తుండగానే అక్కాచెళ్ళెలిద్దరూ (గంగమ్మ,బాలనాగమ్మ), నారుమడిని

దున్నేపనిలో పడ్డారు. నిజమే ! మల్లయ్య కూతుళ్ళు పని రాక్షసులు. శ్రమ వారి రక్తంలో ఉంది. తండ్రికి కొడుకులు లేని లోటు రానివ్వద్దన్న ఆలోచన మనసులో ఉన్నట్టుంది." “ఆడపిల్లను ఇంత గొప్పగా ఎలా పెంచగలిగారు?” అని విలేఖరి రవీందర్‌ అడిగితే, సంతోషం, గర్వం కలగలిపి వచ్చిన ఆ తండ్రి భావోద్వేగాలివి.

“వాళ్ళతోనే కలిసొచ్చింది. నిజానికి బిడ్డలతోనే కలిసొచ్చింది. పిల్లలు చిన్నగ ఉన్నప్పుడు భూములకు అంత విలువ లేకుండె. ఏడొందల రూపాయలకు చొప్పున మూడెకరాలు కొన్నం. కొడుకు కావాలన్న ఆశతో ఏడుగురు ఆడపిల్లలను కన్నం. కానీ నాకిప్పుడు ఆ బాధ లేదు. కొడుకులు ఉన్నోళ్ళ కంటె ఎక్కువ నా కూతుళ్ళు నన్ను చూసుకుంటున్నరు. ఐదుగురు బిడ్డలకు పెండ్లి చేసిన. ఇంకా ఇద్దరున్నరు. బిడ్డలు బంగారమసుంటోళ్ళు. కష్టానికి భయపడేటోళ్ళు కాదు. అట్ల భయపడితే ఇయ్యాల ఇరవై ఐదెకరాల బత్తాయి తోట ఉండేది కాదు. ఇంకా ఏడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసే వాడిని కాదు.

కొడుకు కోసం మా అయ్య పద్దెనిమిదేళ్ళకే నాకు పెండ్లి చేసిండు. ఆ తరువాత వచ్చిన భూమిలో పదెకరాలిచ్చిండు. మూడెకరాలు మాగాణి. మిగిలినదంతా పనికిరాని భూమి. మా యామె పార్వతమ్మ, నేను కలిసి మూడెకరాల్లో కందులు, ఆముదము, శెనిగలు పండించేవాళ్ళము. మాకు మొదట ముగ్గురు బిడ్డలు. అప్పుడు నేను చాన్నాళ్ళు జీవాల( గొర్రెల) కాయడానికి పోయేది. నేను గొర్లెంబడి పోతే ....పార్వతమ్మ ఇంటికాడ ఉండి పొలం చూసుకునేది. ఒక్కసారి జీవాలకాడికి పోయినమంటె.. మళ్ళీ మూణ్ణెల్ల తరువాతే నేను ఇంటికి తిరిగొచ్చేది. ఆమెకు జ్వరమొచ్చినా, పిల్లలకేమొచ్చినా నాకు తెలిసేది కాదు. నాకేమొచ్చినా, నొప్పొచ్చినా, రోగ మొచ్చినా వాళ్ళకు తెలిసేది కాదు.

పార్వతమ్మ ఆ ముగ్గురు పిల్లలను గంపల కూర్చొబెట్టుకుని పొలం కాడికి పోయేది.

వాళ్ళను చెట్టుకింద వదిలి పెట్టి అరక కట్టేది. పొద్దు గూకినంక అరక ఇడిసి పిల్లలను తీసుకుని ఇంటికొచ్చేది. ఆ తరువాత మగపిల్లాడని చూసుకుంటూ పోతే, మళ్ళీ నలుగురు ఆడపిల్లలే పుట్టిండ్రు. చివరి రెండు కాన్పుల్లో మగపిల్లలు పుట్టినా బతకలేదు.

బిడ్డలందరి నడుమ ఒకటి, రెండేళ్ళు తేడా.. ఒక్కొక్కళ్ళు ఎదిగొచ్చిన్రు. చిన్నతనం నుంచి వాళ్ళమ్మ పొలంలో పనిచేస్తుంటే చూస్తూ పెరిగినోళ్ళు. అలా అరక కట్టడం నుంచి ఎరువు చిమ్మడం, పొలం దున్నడం, వరలు తీయడం, నాట్లు, పచ్చగలుపు, పురుగుల మందు కొట్టడం, కోత, కుప్పనూర్పిడు.. అన్ని పనుల్లో వాళ్ళే. కూలోళ్ళు వచ్చింది ఇంతవరకు తెల్వదు. అన్నీ మేమే చేసుకునేటోళ్ళం. కానీ బిడ్డల మాత్రం ఎవరినీ బడికి పంపలేకపోయిన. అంతా ఒక్క కచ్చోళ్ళే( ఒకే వయసు) అవడం వల్ల ఒక్కసారే ఇంతమందిని బడికి పంపి ఏం చదివించగలుగుత? అయినా భయపడి బడికి పంపకపోతేంటీ? మంచి బతుకు ఇయ్యాలనకున్న. ఉన్నకాడ కష్టం చేసుకుని బతికేది నయమని నాకు తెలిసిన విద్య పొలంలోకి దింపిన. అయినా పిల్లలకు చదువుకోవాలని ఉండేది. అందుకే పొద్దంతా పనిచేసే రాత్రిపూట బడికి పోయేటోళ్ళు. పుస్తకాలు తెచ్చుకుని బాయికాడ చదువుకునేటోళ్ళు. అందరికీ చదవడం, రాయడం గూడవచ్చు. ఇప్పుడు పొలం లెక్కలన్నీ వాళ్ళే చేస్తరు. కాలం మారింది. ఏ రైతూ సంతోషంగ లేడు. అప్పులతో సస్తున్నడు. బాధ్యతలు మస్తుగైనయి. అతని కున్న ఆస్థి, ఆధారం పొలమే. భూమిలకు రేటొచ్చింది. మరో దారి లేక తెగనమ్ముతున్నడు. పొలం లేని రైతంటే ఆత్మలేని శరీరమే. జీవచ్ఛవమే. ఎవరికీ అసుంటి పరిస్థితి రాకూడదు. చిన్నకమతాలు, పైసలు లేకపోవుడు.. గివన్నీ రైతు ఎదుర్కొంటున్న సమస్యలు.

తిండిగింజలు లేకపోతే బతుకలేడు. కూరగాయలు లేకపోతే బతుకలేడు. అసుంటప్పుడు నిత్యావసరాల్ని పండించే రైతుకు ఇన్ని కష్టాలెందుకు ? ప్రభుత్వాలకు నా విన్నపం సారు! రైతులకు సబ్సిడీలు ఇవ్వకండి. రుణమాఫీలు కూడా అవసరం లేదు. రవాణా సదుపాయం కల్పించమనండి. కరెంట్‌ కట్‌లు లేకుండా చూడుమనుండి. లంచాల వ్యవస్థను సత్రోల్‌( నాశనము) చేయమనండి. అంతకు మించి మేం ఏమీ అడగం.

ఇగ మా ముచ్చట్ల కొస్తే ఇంటిల్లిపాదీ పొద్దున లేచిన దగ్గర నుంచి పొలం లోనే ఉంటం. వృధా ఖర్చుపెట్టెటోళ్ళు లేకపోవడం వల్ల కొంత నిలదొక్కుకున్నం. పొలమంత తీసి బత్తాయి తోట పెట్టినం. అప్పటి నుంచి బిడ్డలు రెక్కలు, ముక్కలు చేసుకున్నరు. వాళ్ళు చేసిన పనిని మగపిల్లలు కూడా చేయలేరు. పొలం దున్నడం దగ్గరనుంచి పంట ఇంటికొచ్చేదాక.. పనిలో ఇంకొకరు చెయ్యి పెట్టాలిసిన అవసరం లేదు. 1992 లో పెద్ద బిడ్డ పెండ్లి జేసిన. ఆ తర్వాత ఒక్కొక్కరిది చేసుకుంటూ వస్తున్న. ఇప్పటికి ఏడుగురు బిడ్డల పెండ్లి అయింది. తోటలోనే తలా

మూడెకరాలు కట్నం కింద ఇచ్చిన. అల్లుళ్ళంతా వ్యవసాయం చేసెటోళ్ళే. పొలంలో నా బిడ్డలు చేసినంత పని నా అల్లుళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు పొలంలో పని చేస్తుంటే చుట్టుపక్కల చేలోళ్లు ఆశ్చర్యపోతరు. నా పెద్ద బిడ్డ ఒక్కతే పదిహేను ఎకరాల పొలానికి వరాలు తీస్తది. మూడో బిడ్డ కూడా అంతే కష్టం చేస్తది. ఆమెను ఊర్లొనే ఇచ్చిన. నా కూతుళ్ళందరూ పిల్లలను మంచిగ చదివిస్తున్నరు.పెద్దామె కూతురు ఇప్పుడు కాలేజీ పోతుంది. మొత్తం నలుగురు మనవళ్ళు, ఐదుగురు మనవరాళ్ళు. దసరా పండక్కి అందరొస్తరు. ఇల్లంతా సందడి సందడిగ ఉంటది.

ఇగ ఇప్పుడుంది ఆ ఇద్దరే. గంగమ్మ, బాలనాగమ్మ. వాళ్ళు కూడా ఏవో రెండు ముౘట్లు చెబ్తరంట కొడకా, జర ఇను !” చెప్పడం ముగించాడు మల్లయ్య.

తరువాత గంగమ్మ, బాలనాగమ్మ చెప్పడం ప్రారంభించారు.

" మా గురించి చెప్పడానికి ఏముంది కానీ ...అమ్మానాన్నలకు కొడుకులు లేని బాధ లేకుండా చూసుకుంటున్నమన్న సంతోషం మాత్రం ఉంది. మా అక్కజెల్లలందరం పొలం పనులన్నీ చేస్తం. నాన్నే ముందుండి నడిపిస్తడు. గొప్ప చదువులేం లేకపోయినా మా కాళ్ళ మీద మేం బతకగలమన్న ధీమా ఇచ్చిండు. ఇంట్లో ట్రాక్టర్‌ ఉంది. ఎవరో డ్రైవర్‌ ను పెట్టుకోవడం ఎందుకు? .. మాకు డ్రైవింగ్‌ ఎందుకు రాదు, అని పంతం మీద నేర్చుకున్నం. అందరం కష్టం చేసినం. కాబట్టే ఇయ్యాల ఈ మాత్రం ఉన్నం.

" మగాళ్ళతోనే సేద్యం సాధ్యం కావడం లేదే! మీరు ఆడోళ్ళైనా ఎట్లా నెట్టుకొస్తున్నారు?" అని విలేఖరి రవీందర్‌ అడిగాడు.

గంగమ్మ బంతి పువ్వులా నిండుగా నవ్వి , " ఎండ వస్తే నీడ రాదా అన్నా! కష్టపడితే ఏదో ఒక రోజు మంచే జరుగుతుంది. దేన్నయినా ఇష్టపడి చెయ్యాలే"

మల్ల, మల్లయ్య షురూ చేసిండు

“నాతో పాటు గంగమ్మ, బాలనాగమ్మ కూడా ట్రాక్టర్‌ తోల్తరు. దున్నడం అయినా , దమ్మయినా వాళ్ళే చేస్తరు. లోడుబండి ( లోడెడ్‌ ట్రాక్టర్‌) గూడ నడుపుతరు. నల్లగొండకు పోయి ఎరువులు తీసుకొస్తరు. నాగమ్మ ( చిన్నబిడ్డ) కు లైసెన్స్‌ గూడ వచ్చింది. మోటర్‌, పైప్‌లైన్‌ రిపేర్లన్నీ చూసుకుంటరు. తోటలో ఇద్దరు కలిసి ఒక్కరోజులో నలభై చెట్లకు పాదులు తీస్తరు. పొద్దుగాల ఆరింటికి తోటకు వచ్చినమంటే, మళ్ళీ చీకటి పడితేనే ఇంటికి పోయేది. వచ్చేటప్పుడే అన్నం, పేపరు తెచ్చుకుంటం. పిల్లలే అప్పుడప్పడు వార్తలు చదివి వినిపిస్తరు. తోటలో ఓ పక్క కూరగాయలు వేసినం. పై ఖర్చులన్నీ వాటి మీదే వెళ్తయ్‌. బిడ్డలకిచ్చిన తోటగూడ మేమే చూస్తున్నం. పెట్టుబడి పోనూ మిగతా సొమ్ము వాళ్ళకు పంపిస్తం. ఈ కారు ఇంకొక పదెకరాలు కౌలుకు తీసుకున్నం. దుక్కిదున్ని వాన చినుకులకోసం ఎదురు చూస్తున్నం. వర్షం పడుడు ఆలస్యం పత్తి గింజలు ఏసుటే.

ఆడపిల్ల అంటే బంగారం లెక్క! మొదట మొగ పోరగాళ్ళు లేరని బాధపడ్డా గానీ , నా బిడ్డల చూస్తే సంతోషంగ ఉంటది. ఆడపిల్లలైనా మగోళ్ళ కంటే ఎక్కువ కష్టం చేస్తరు. ఒట్టిగ కూసొనుడు వాళ్ళకు చేతకాదు. భయపడడం తెల్వదు. ఎంత రాత్రయినా సరే బాయి కాడికి పోయి మోటర్‌ ఏస్తరు. సరుకు తేవాలన్నా వాళ్ళే బండి ఏస్కపోయి నల్లగొండలో తీసుకొస్తరు. ఇప్పుడు కొంతమంది పెండ్లం కడుపుతోని ఉండగనే పుట్టేది ఆడపిల్లా, మగపిల్లగాడా అని చూపిస్తున్రు. ఆడపిల్లయితే చంపుడో, పెండ్లాన్ని ఇబ్బంది పెట్టుడో మంచిది కాదు. ఇప్పటికే ఆడపిల్లంటే ఎర్రచందనం అయ్యింది. వచ్చే రోజుల్లో ఆడపిల్ల అంటే బంగారం లెక్క. ఇల్లూ, వాకిలీ సంసారం.. ఇక్కడి తోనే సరిపెట్టుకోవడం లేదు. పలుగు, పార చేతబట్టి పొలం గట్ల వెంబడి నడుస్తూ.. కుటుంబాన్ని నడిపిస్తూ.. మహిళా రైతు, రాణిలా వెలిగిపోతోంది.

ఆకుపచ్చ లోకం.. అమె కిప్పుడు కొత్తబలం.

***శుభం***


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


232 views0 comments

Comments


bottom of page