top of page

మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌


'Middle Class Melodies' written by Ayyala Somayajula Subramanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

పెళ్ళిచూపుల తతంగం అప్పడే ముగిసింది.

" హమ్మయ్య.. అంతా సవ్యంగా జరిగినట్లే! ఉభయులకూ ఈ సంబంధం నచ్చింది. అబ్బాయి, అమ్మాయిల ఈడూ- జోడూ చక్కగా కుదిరి, జంట చూడముచ్చటగా వుంది.పెద్దలు శుభస్యశీఘ్రం అన్నారు కాబట్టి - ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే.. ముహూర్తాలు పెట్టుకోవచ్చు” అన్నాడు 'పెళ్ళిళ్ళ పేరయ్య' సిద్దాంతి. ఆయన తొందర ఆయనది.

"ఆ.. మిగతా విషయాలు ఏముంటాయి సిద్దాంతి గారూ? ముందునంచీ అనుకున్నవేగా! కాకపోతే..' అంటూ సగంలోనే ఆపి, అమ్మాయి తండ్రి కళ్ళలోకి చూసింది అలివేలమ్మ.

' ఇంకేం కావాలో ? అది మామూలు కోరికో? లేక గొంతెమ్మ కోరికో?' అనుకుంటూ అందరు అడపిల్లల తండ్రుల్లాగే గుండె చిక్కబట్టుకుని బిక్కుబిక్కు మంటూ బిత్తర చూపులు చూశాడు వెంకటరావు.

' కంగారు పడకండి బావగారూ! 'పెళ్ళి కానుక' గా మీరు మా వాడికి ముచ్చటపడి కొనిస్తానన్న అ మోటర్‌ బైకూ.. ఫలానా కంపెనీదే కొనివ్వమని అడగాలనుకుంటోంది మా ఆవిడ!" నవ్వుతూ చెప్పాడు పెళ్ళికొడుకు తండ్రి అప్పారావు.

' పిడుగుపాటు' తప్పినా, 'జడివాన' కి జడుస్తున్న వాడిలా "ఏం చెల్లెమ్మా.. నువ్‌ చెప్పే మోటర్‌బైక్ రేటెక్కువా?" అనడిగాడు వెంకటరావు జంకుతూనే.

' అబ్బే! అదేం లేదన్నయ్యగారూ.. మీరు కొనిస్తానన్న కంపెనీ బైకు కన్నా ఇది ఓ మూడువేలు తక్కువే!" అంది అలివేలమ్మ. అదివిని మనసు కాస్త కుదుటపడినా నమ్మశక్యం కాలేదు వెంకటరావుకు. అప్పనంగా వస్తుంటే 'అమెరికాని కూడా రాసివ్వ'మని అడిగేవాళ్ళున్న ఈ రోజుల్లో తాను కొనిస్తానన్న దానికంటే తక్కువ ధర బైక్‌ ఎందుకడుగుతున్నారో అర్థంకాలేదతడికి.

' మిడిల్‌క్లాస్‌ బడుగుజీవి' ఆలోచలెలా ఉంటాయో మరో ' మిడిల్‌క్లాస్‌' వాడే అర్థం చేసుకోగలడు. వెంకటరావు మనసులోని భావం ఇట్టే కనిపెట్టేసిన అప్పారావు- " అదేం లేదండీ బావగారూ! రేటు తక్కువైనా మైలేజీ ఎక్కువిస్తుందట ఆ బైక్‌ . లీటర్‌ పెట్రోల్‌ పోస్తే నూటయాభై కిలోమీటర్లు పరుగెడుతుందని.. మా ఆవిడ టీవీలో చూసే డైలీ సీరియల్‌ మధ్యలో బ్రేక్ లిచ్చి మరీ ఆ బైక్‌ గురించి ఊదరగొడుతున్నారుగా.. అదీ సంగతి !" అసలు విషయం వివరించారు.

తేలికపడ్డ మనసుతో వెంకటరావు ముఖంలో కూడా చిరు దరహాసం మెరిసింది.

అయితే.. అలివేలమ్మలో మాత్రం కాసింత ఉక్రోషం పొడుచుకువచ్చింది. " ఔనౌను.. మీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ బైకేదో కొనిచ్చి అన్నయ్యగారు చేతులు దులుపుకుంటారు. కానీ, దానికి రోజూ పెట్రోల్‌ తాగిస్తూ ‘పెంపుడుపిల్ల' లా పోషించాల్సింది మనవాడేగా! మైలేజీ ఎక్కువిచ్చే బండి వాడకపోతే ఎలా? పైగా బంగారం ధరలా డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రోజురోజు కీ నింగినంటుతుంటేనూ..?"

*** *** ***

ప్రవీణ ఆ ఇంటిలోకి అడుగుపెట్టి మూడురోజులైంది.

‘కొత్తకోడలితో అప్పుడే ఇంటిపనులు చేయించడమెందుకులే!’ అనుకున్నారు అత్తామామలు.

అయితే.. ప్రవీణ కాస్త చురుకైన అమ్మాయి. అత్తగారింటికొచ్చిన మూడురోజులలోనే,

ఇంటిపనులూ, పరిస్థితులూ, కుటుంభ సభ్యుల మనస్తత్వలూ, పద్ధతులూ జాగ్రత్తగా గమనిస్తూ ఆకళింపు చేసుకుంది.

అత్తమామలూ, తన భర్త ఆనంద్‍, ఆడపడుచు ఆమనితో నలుగురు సభ్యులున్న మధ్యతరగతికి చెందిన ఆ ఇంటిలోకి తాను ఐదోవ్యక్తిగా అడుగుపెట్టింది. అత్తగారు అలివేలు గృహిణి. మామగారు అప్పారావు గవర్నమెంట్‌ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. భర్త ఆనంద్‍ ప్రైవేట్‌ కంపెనీలో మేనెజర్‌గా చేస్తున్నాడు. ఆడపడపచు బి.టెక్‌. రెండో సంవత్సరం చదువుతోంది. ఇంటిలో పెత్తనమంతా అలివేలమ్మదే. ఆవిడ మనసు మంచిదే కానీ, మాట తీరు కాస్త కటువు. ఆవిడకీ, ఆవిడ నోటి ధాటికీ కుటుంభసభ్యులంతా జంకుతారు. అంతే కాదు. అలివేలమ్మ చాలా పొదుపరి. అనవసరంగా ఒక్కరూపాయి కూడా వృధా కాకూడదనే తత్వం. ఆ ఇంటిలోకి కొత్త కోడలిగా వచ్చింది ప్రవీణ.

ఆ రోజు ఉదయాన్నే హాల్లోని సోఫాలో కూర్చొని పేపర్‌ తిరగేస్తున్న అప్పారావు దగ్గరికొచ్చి చేతిలోని ట్రే ని ఆయన ముందుకు చాపుతూ "మావయ్యా.. కాఫీ!" అంది ప్రవీణ.

" అరె.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఇంత ఉదయాన్నే కాఫీ!" అంటూ సంబరపడుతూ కప్పు అందుకున్నాడాయన.

అటునుంచి వరండాలో కూర్చొని పూలు మాలగా కడుతున్న అలివేలమ్మ దగ్గరకెళ్ళింది ప్రవీణ.

" అదేంటమ్మాయి.. అప్పుడే ఇంటి పనులలోకి దిగావా?" అంటూ కాఫీ చప్పరిస్తూ "అబ్బో.. భలే చేశావే! మా అమ్మాయి ఎప్పుడూ ఇంతటి రుచిగల కాఫీ ఇవ్వలేదు. అంటూ మనస్ఫూర్తిగా అభినందించింది. ఆ తరువాత ఏదో గుర్తొచ్చినదానిలా “అవునూ.. ఇంత ఉదయాన్నే కాఫీ ఇచ్చావ్.. అప్పుడే వంట మొదలెట్టేశావా ఏమిటీ?" అంది.

“లేదత్తయ్యా! ఈ పూటకి ఏం కూర చేయాలో ఇంకా ఏమీ అనుకోలేదు!" చెప్పింది ప్రవీణ.

అంతే! ఒక్కసారిగా అలివేలమ్మ ముఖ కవళికలు మారిపోయాయి.

"ఏమిటీ.. వంట మొదలెట్టకుండానే, కూరేం చేయాలో తెలుసుకోకుండానే స్టౌవ్‌ వెలిగించావా?" అంది.

"అవును!” తనూ ఆశ్చర్యంగానే బదులిచ్చింది ప్రవీణ.

" అంటే? కాఫీకోసం.. కేవలం కాఫీ చేయటం కోసం స్టౌ వెలిగించావన్నమాట!" అని, “పద.. వంటగదిలోకి!" అంటూ చేతిలోని పని పక్కనబెట్టి లేచి వంటగది వైపు కదిలింది అలివేలమ్మ.

ఆమెననుసరించింది ప్రవీణ. వంటగదిలోకి వెళ్ళాక అలివేలమ్మ పెద్దక్లాసే తీసుకుంది కోడలికి.

" చూడమ్మాయ్‌.. మీ ఇంట్లో వంట ఎలా చేస్తారోగానీ, మా ఇంట్లో సంగతి చెబుతా విను. ఉదయం పూట కాఫీకి, టిఫిన్‌కి, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకి అవసరమయ్యే బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ సిద్దంగా పెట్టుకున్న తరువాత స్టౌవ్‌ వెలిగించాలి. ఒకసారి స్టౌవ్‌ వెలిగించామంటే ఆ రోజు మొత్తానికి వంటకాలన్నీ చేసెయ్యాలి. రోజులో స్టౌవ్‌ వెలిగించాల్సింది ఒక్క సారే! ఎందుకంటే.." ఓ క్షణం ఆగి అంది " స్టౌవ్‌ వెలిగించకుండానే వంటగ్యాస్‌ ధర ఎలా భగభగమంటోందో తెలుసుగా! ".

ప్రవీణ ఏదో అనబోయేంతలో.. మళ్ళీ తనే అంది అలివేలమ్మ "చూడమ్మయ్‌! నువ్వు మా ఇంట్లోకి రాకముందు మా నలుగురికీ కలిపి ఒక గ్యాస్‌ సిలిండర్‌ నెలా పదిహేను రోజులొచ్చేది. ఇంట్లోకి కొత్తగా వచ్చింది నువ్వొక్కదానివే కాబట్టి స్టౌవ్‌ ఆన్‌ లో ఉండే టైమ్‌లో పెద్దగా తేడా రాకపోయినా - ఓ సిలిండర్‌ కనీసం నెలా పదిరోజులైనా రావాలి మరి! అర్థమైందా..?"

అత్తగారి మాటలు మెత్తగానే ఉన్నా - వాటిలోని భావతీవ్రత మాత్రం సూటిగానే తాకింది ప్రవీణకి.

మౌనంగానే తలూపింది.

.*** *** ***

ఆ రోజు కొత్త దంపతుల గదిలో ఓ చిన్న సైజు చర్చ జరిగింది.

"ఏమిటండీ.. మీరనేది?"అంది ప్రవీణ ఆశ్చర్యంగా.

"అవునోయ్‌.. రేపు ఆదివారం. ఆఫీసు లేదు. కొత్తగా పెళ్ళయినవాళ్ళం.- సినిమాకి, షికారుకి అలా సరదాగా వెళ్ళొద్దామన్నాను.. ఇందులో నువ్వింతగా ఆశ్చర్యపోవాల్సిందేముందీ?!" అన్నాడు ఆనంద్‍.

" అందుక్కాదండీ.. మీరు చెబుతున్న ప్రోగ్రామ్‌ అంతా వింటూంటే.."

"అవును.. ఉదయం ఇంట్లో టిఫిన్లు ముగించి తొమిదిన్నరకల్లా బయలుదేరుదాం.

మొదట వేణగోపాలస్వామి గుడికి ఇంటినుంచి ఓ ఆరు కిలోమీటర్లుంటుంది. అక్కడ దర్శనం, అర్చన పూర్తయ్యేసరికి పదకొండున్నరవుతుంది. అక్కడనుంచి నా బాల్య స్నేహితుడు సురేష్‌ వాళ్ళింటికెళదాం. సిటీ శివార్ల లో వుంది వాడిల్లు. గుడినుంచి ఓ పన్నెండు కిలోమీటర్లుంటుంది. ఆ దంపతులు మనలని లంచ్‌ కి పిలిచారు. అక్కడ లంచ్‌ ముగించి, కాస్త భుక్తాయసం తీర్చుకుని మధ్యాహ్నం మూడుగంటలకల్లా బయటపడి బొటానికల్‌ పార్క్‌ కొచ్చేద్దాం. వాడింటినుంచి ఓ ఎనిమిది కిలోమీటర్లుంటుంది. పార్క్‌లో సాయంత్రం ఐదుగంటలదాకా గడిపి సినీకాంప్లెక్స్‌ కెళదాం. పార్క్‌నుంచి ఓ తొమ్మిది కిలోమీటర్లుంటుంది. అక్కడ ఏదో వొక హాల్లో మాంచి సినిమా చూద్దాం. సినిమా వదిలాక హాలు నుంచి ఓ ఐదు కిలోమీటర్లు వెళితే ఫేమస్‌ హోటల్‌ ఉందిలే- అందులో డిన్నర్‌ ముగించేసి బయలుదేరామంటే పద్దెనిమిది కిలోమీటర్లలో ఇంటికొచ్చేస్తాం.. ఏమంటావ్‌?" అన్నాడు ఆనంద్‍ చిరునవ్వుతో. ఆ నవ్వులో నా ప్లానింగ్‌ బ్రహ్మాండంగా ఉంది కదా? అన్న విజయగర్వం కూడా ఉంది.

అంతా విని, నింపాదిగా అంది ప్రవీణ- "ఈ కిలోమీటర్ల లెక్కలేమిటండీ.. ఇదేదో తీర్థయాత్రలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నట్లుందే కానీ, కొత్తజంట సరదాగా షికారుకు వెళ్ళినట్లుందా?".

ఆనంద్‍ ముఖం చిన్నబోయింది. " అదేమిటీ.. నీకు నచ్చలేదా? పెట్రోల్‌ ధర అంటించకుండానే భగ్గమంటున్న ఈ రోజుల్లో ప్రతి సరదానీ కిలోమీటర్లలోనే కొలవాలి మరి! ఎంత ప్లానింగ్‌ తో ప్రోగ్రామ్‌ ప్రిపేర్ చేశానో తెలుసా? పైగా, ఈ మొత్తం జర్నీకి ఒక లీటర్‌ పెట్రోల్‌ కంటే ఎక్కువ ఖర్చవదు.." అన్నాడు.

ప్రవీణ చురుగ్గా చూసింది భర్త వంక. " ఏమిటీ.. పొదుపు చర్యలు మీ అమ్మగారితో పాటి మీకూ బాగా వంట బట్టాయే?!" అంది.

" అదేం కాదులే గానీ పొదుపు విషయంలో మా అమ్మధోరణి నాకేం తప్పుగా తోచదు. రోజురోజుకీ నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతూ వుంటే.. మనలాంటి మిడిల్ క్లాస్‌ వాళ్ళు అందుక తగ్గట్టుగా జీవనవిధానాలని మలచుకోవాలి మరి! మా నాన్న పెన్షన్‌, నా ప్రెవేట్‌ జాబ్‌ జీతంతోనే ఈ ఇల్లు గడవాలి. ఇందులోనే పొదుపు చేసి నా చెల్లి పెళ్లి చేయాలి.." అన్నాడు ఆనంద్‍.

అదివిన్న తరువాత అప్పటివరకు అత్తగారి వైఖరి పట్ల తన మనసులో ఏర్పడ్డ కినుక నీటి తెరలా కరిగిపోయినట్లనిపించింది ప్రవీణకు. తేలికపడ్డ మనసుతో భర్తవంక చూస్తూ అంది- " మీరు బైక్‌లో పోసే పెట్రోల్‌ గురించి ఆలోచించారు కానీ, బైక్‌ ని పబ్లిక్‌ ప్లేసులో పార్క్‌ చేసినప్పుడు అయ్యే పార్కింగ్‌ ఫీజుల గురించి ఆలోచించలేదు”

" ఔను సుమా! నాకాసంగతే గుర్తుకు రాలేదు. గుడి, పార్క్, సినిమాహాల్‌ మొదలైన చోట్ల కట్టాల్సిన పార్కింగ్‌ఫీజ్‌లు కూడా కలుపుకుంటే ఖర్చయ్యే మొత్తం తక్కువేమీ కాదు..” అన్నాడు లోలోపలో లెక్కలు కట్టుకుంటూ.

"అంతేకాదండీ! అంతంత దూరాలు ట్రాఫిక్‌లో మీరు బైక్‌ డ్రైవ్‌ చేస్తూవుంటే.. గుండె చిక్కబట్టుకుని మీ వెనకాల గమ్మున కూర్చోవాలంటే నా కెంత కష్టంగా ఉంటుందో చెప్పండి? మీరు కూడా డ్రైవింగ్‌లో ఎంత స్ట్రెయినౌతారో ఊహించండి!"

" ఔననుకో। కానీ.."

" కొత్త దంపతులం! సెలవురోజున సరదాగా అలా షికారుకి వెళ్తే ఆ అనుభూతి హాయిగా ఉండాలి కానీ- ఇలా ఖర్చుకి ఖర్చు, మెంటల్‌ అండ్‌ ఫిజికల్‌ స్ట్రెయిన్‌ కలిగించేదిగా ఉంటే ఏం బావుంటుంది?"

"నిజమేననుకో! " అని, ఓ క్షణమాగి, "ఐతే ఏమంటావ్? ప్రోగ్రామ్‌ క్యాన్సిలా?" అన్నాడు నిరుత్సాహంగా.

"అలా అని నేనన్నానా? బైక్‌ ని ఇంట్లోనే వదిలేసి, ఎంచక్కా సిటీబస్‌ లో సండేపాస్ లు కొనుక్కుని వెళ్ళామంటే వంద రూపాయలకి మించి కాదు. పైగా జర్నీ అంతా బస్‌లో పక్కపక్కనే కూర్చొని వేరుశెనక్కాయలు తింటూ.. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిరగొచ్చు. ఏమంటారు?".

ప్రవీణ చెప్పినవాటిని కొన్ని క్షణాలు ఊహించుకున్న ఆనంద్‍ "ఇదేదో బాగానేవుందే! ఖర్చుకి ఖర్చూ తగ్గుతుంది, స్ట్రెయినూ ఉండదు. పైగా సరదాగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం!" అన్నాడు సంబరంగా.

*** *** ***

సరిగ్గా మూడు నెలల తరువాత..

ఓ రోజు సాయంత్రం కుటుంబసభ్యులంతా హాల్లో ఉండగా అలివేలమ్మ ఓ తీర్మానం చేసేసింది.

" ఇకనుంచి ఇంటి పెత్తనమంతా కోడలుపిల్లదే। ఏవండీ.. ఇకప్రతి నెలా మీ పెన్షన్‌ ఎమౌంటూ, ఓరేయ్‌ ఆనంద్‍- నీ జీతం డబ్బులూ.. తెచ్చి ప్రవీణ చేతిలో పెట్టండి. ఇంటి ఖర్చులూ, అజమాయిషీ ఇకపై తనే చూసుకుంటుంది."

అది వింటూనే ఆశ్చర్యపోయారంతా." అదేంటి అలివేలూ! అంత కీలక నిర్ణయానికెలా వచ్చావ్‌?" అంటూ అప్పారావూ; “నువ్వీ నిర్ణయానికెలా రాగలిగావమ్మా?" అంటూ ఆనంద్‍- ఆశ్చర్యంగా అడిగారు.

" అవునర్రా.. ఇంతకాలం నేనే తెలివిగలదాన్ననీ, ఎంతో పొదుపుగా ఇంటిఖర్చుల్నీ, చాలా గుట్టుగా ఇంటి పెత్తనాన్ని నెట్టుకొస్తున్నానని అనుకునేదాన్ని. కానీ కోడలిపిల్ల నా

కంటే తెలివైనదీ, నా కంటే పొదుపరీ అని అర్థమయ్యాక- ఇంటి బాధ్యతలన్నీ తనకి అప్పజెప్పేసి ఇకపై ' కృష్ణారామా' అనుకుంటూ కాలక్షేపం చేయాలనుకుంటున్నాను।

అన్నది అలివేలమ్మ.

" నేను నీకిదే చెప్పాలనుకున్నాననమ్మా.. కానీ నువ్వేమంటావోనని వెనుకాడాను. నా భార్య అనికాదు కానీ ప్రవీణ మంచి తెలివైనదీ, పొదుపరీ కూడా। తన 'ప్లానింగ్‌' ప్రకారం నడుచుకుంటే సగానికి సగం ఖర్చు తగ్గడమే కాకుండా దానివల్ల కలిగే ఆనందం, తృప్తీ, నిశ్చింత కూడా ఎక్కువేనమ్మా!" అని రెండు క్షణాలు ఆగి, తను చెప్పేది మిగతావాళ్ళు ఆసక్తిగా వింటున్నారని అర్థమయ్యాక "అంతేకాదమ్మా! రోజూ నేను ఆఫీసుకి వెళ్ళిరావటానికిగాను నెలకి అయ్యే పెట్రోల్‌ ఖర్చుని కూడా సగానికి సగం తగ్గించేసింది తను. తెలుసా?" అన్నాడు ఉత్సాహంగా.

" అదెలా? నెలలో సగం రోజులు మా వాడిని సిటీ బస్సులో ఆఫీసుకు పంపిస్తున్నావా కోడలా?" అత్తగారి మాటలకు బదులిస్తూ "అదేం లేదత్తయ్యా। పక్కింటి పిన్నిగారి వాళ్ళయన రాజారావుగారు తన స్కూటర్‌ పై ఆఫీసుకెళ్ళాక ఓ రోజు పిన్నిగారు మనింటికొచ్చి “ప్రవీణా। మీ అంకుల్‌ కి అసలే పరధ్యానం! మరో నాలుగేళ్ళలో రిటైరౌతారు. అప్పటిదాకా రోజురోజుకీ చీమలపుట్టలా పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్‌ లో స్కూటర్‌ డ్రైవ్‌ చేసుకుంటూ ఆయన క్షేమంగా ఇంటికొచ్చేవరకు నాకు భయంగానే ఉంటోంది సుమా। పోనీ సిటీ బస్సులో పంపిద్దామనుకుంటే ఉదయం, సాయంత్రం ఫుల్‌ రష్‌ గా ఉండే ఆ బస్సుల్లో జనాన్ని తోసుకుంటూ బస్సెక్కి దిగగలిగే కండబలం ఈయనకి లేదు. అలాగని 'ఆటోలో వెళ్ళే ఆర్థిక స్థోమత మాకు లేకపోయె।' అంటూ వాపోవడం మీకు తెలుసుగా! బాగా ఆలోచించి ఆవిడతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాను.."

" ఏవిటదీ..?" ఆసక్తిగా ముందుకు వంగింది అలివేలమ్మ.

" రాజారావుగారి ఆఫీసు కూడా మీ అబ్బాయి ఆఫీసుకు వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి- రోజూ మీ అబ్బాయి వెళ్ళేటప్పుడు రాజారావుగారిని తన బైక్‌పై వెళ్ళి వాళ్ళ ఆఫీసు దగ్గర డ్రాప్‌ చేసేట్లు, మళ్ళీ సాయంత్రం ఆఫీసు నుంచి తిరిొచ్ఛేటప్పుడు ఆయన్ని పికప్‌ చేసుకుని వచ్చేట్లు- ఇందుకుగాను గతంలో ఆయన తన స్కూటర్‌ పై వెళ్ళి రావటానికయ్యే పెట్రోల్‌ ఖర్చులో సగం మనకిచ్చేట్లుగానూ ఒప్పందం కుదుర్చుకున్నాను. దీనివల్ల పక్కింట్ పిన్నిగారికి నిశ్చింతగా వుంటుంది. మనకూ పెట్రోల్‌ ఖర్చు సగం తగ్గుతుంది".

" భలేగా వుందే ఒప్పందం।" అంటూ మెచ్చుకుని, “అంటే మా వాడిని పక్కింటి రాజారావుకి డ్రైవర్‌ గా మార్చావన్నమాట।" అంది అలివేలమ్మ చిలిపిగా, కోడలి తెలివికి మనసులోనే సంతోషిస్తూ.

" అలా అనుకుంటే ఎలాగత్తయ్యా। అయినా.. అసలు ఉద్దేశం అదికాదు లెండి.." అంటూ ముందుకి వంగి, మొగుడికి వినిపించకుండా అత్తగారి చెవిలో చెప్పింది-

" ఈ మగాళ్ళు సాయంత్రం ఆఫీసైపోగానే కొలీగ్స్‌తో, ఫ్రెండ్స్‌తో పార్టీలనీ, ఫంక్షన్ లనీ లేనిపోని అలవాట్లు చేసుకుని, ఇంటికి ఆలస్యంగా వస్తూంటారు. ఆ అలవాట్లు కాస్తా రాన్రాను ' వ్యసనాలు' గా మార్తాయి. అందుకే సాయంత్రమవగానే రాజారావుగారిని ఇంటి దగ్గర దిగబెట్టే 'లింక్‌' పెడితే - ఎటూ పక్కదార్లు పట్టకుండా మీ అబ్బాయి కూడా నేరుగా, ఠంచనుగా ఇంటికొచ్చేస్తారనీ!".

అది వింటూనే - "అమ్మ కోడలా.. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు- భలే గడుసుదానివి లే!" అని, “నువ్వు నాకు నచ్చేశావమ్మాయి!" అంటూ మనస్ఫుర్తిగా అభినందించింది అలివేలమ్మ.

ఆ తరువాత కొడుకువైపు చూస్తూ " ఒరే ఆనంద్‍! నీ పెళ్ళాం తెలివి సూపర్‌లెవల్‌ లో ఉందిరా!" అంది.

" నాకు తెలుసమ్మా! కానీ, నీకు తనపై అంత ' గురి' ఎలా కుదిరింది- ఇంటి పెత్తనమంతా అప్పగించేస్తున్నావ్‌?" అన్నాడు ఆనంద్‍. అప్పారావు కూడా " ఔనౌను, ముందు ఆ విషయం చెప్పు అలివేలూ!" అన్నాడు.

“ఉడికిందో, లేదో తెలుసుకోవాలంటే అన్నమంతా చూడాలా? నాలుగు మెతుకులు పట్టి చూస్తే తెలీదూ? కానీ ప్రవీణ ఇంట్లోకొచ్చాక తన కదలికలన్నీ గమనించాను. తన పద్దతులన్నీ పొందికగా ఉన్నాయి. ముఖ్యంగా పొదుపు విషయంలో! ఒక ఉదాహరణ చెబుతా. వినండి.. తను మనింటికి రాకముందు - నేనెంత పొదుపుగా వాడినా - మన నలుగురికీ ఓ గ్యాస్‌ సిలిండర్‌ నెలా పదిహేను రోజులకి మించి సరిపోయేది కాదు. అలాంటిది- తనతో కలిపి ఐదుగురమైనా ఒక్క సిలిండర్‌ని రెణ్ణెల్లకి పైగా సర్దగలిగింది. తెలుసా?"

" ఎలా..?" అసంకల్పితంగా ఆనంద్‍, అప్పారావూ, ఆమని ఒకేసారి అడిగేశారు.

"ఏముందీ.. స్టౌవ్‌ వెలిగించకముందే వరుసగా వండాల్సినవన్నీ సిద్దంగా పెట్టుకుని, మొదట స్టౌవ్‌ పై పెట్టిన గిన్నెకి మూతకి బదులు ఆ తరువాత వండబోయే గిన్నె పెడితే.. కింది గిన్నెలో వేడెక్కిన పదార్థాల ఆవిరి పై గిన్నెకి కూడా పాకి, కింది గిన్నెలోని పదార్థాలు ఉడికేసరికి- పై గిన్నెలోని పదార్థాలు సగం ఉడికేస్తాయి. అలా ఒకదాని మీద ఒకటి పెట్టి వరసగా వండేస్తే సగానికి సగం గ్యాస్‌ ఆదా అవుతుంది. ఇలా ప్రతి విషయంలో కాస్త తెలివిగా మసలుకుంటే ఇంటిఖర్చులో చాలా ఆదా చేయొచ్చు!" వివరించింది ప్రవీణ.

" శహ్‌భాష్‌.. ఇలా పొదుపుగా చేసిన ఆదా కూడా ఒక విధంగా సంపాదనే!" అన్నాడు అప్పారావు.

" నిజమే ! ప్రవీణలాంటి ఆడాళ్ళు ప్రతి ఇంటిలోనూ ఉంటే, రోజురోజుకీ పెరిగే ధరలనీ ధైర్యంగా ఎదురుకోవచ్చు!"అన్నది అలివేలమ్మ.

ఆ మాటతో అందరూ నిండుగా, హాయిగా నవ్వేశారు.

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


235 views0 comments

Commentaires


bottom of page