top of page

సబల


'Sabala' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

“అమ్మాయి చిన్నా! ఏంటీ.. అక్కడేం చేస్తున్నావు? ఇలారా” అన్నాడు వాళ్ళ తాత రామారావు తన మనవరాలిని.

“మరేమో మన పక్కింటి చంటీ వాళ్ళ అక్కని వాళ్ళ నాన్న కొడుతున్నారు” అని చెప్పింది ఐదు ఏళ్ళు కూడా నిండని చిన్నా తన ముద్దు ముద్దు మాటలతో.

“ ఏంటి నాన్నా, ఏం జరిగింది?” అంటూ అడుగుతూ వచ్చింది చందన.

“ఏదో గొడవలే” అంటూ మాట మార్చాడు రామారావు.

చందన ఆ ఊరిలో ఒక మంచి కాలేజీ లో లెక్చరర్‌ గా ఉద్యోగం చేస్తోంది. చక్కని ఇల్లూ, మంచి ఉద్యోగం,హోదా కలిగి ఆనందంగా జీవితం కొనసాగిస్తోంది చందన.

అయినా రామారావు, జానకమ్మలు కూతురు జీవితం లోని వెలితిని అనుభవిస్తూనే ఉన్నారు.

అదే వారి అల్లుడు కిరణ్‌ గురించి. కిరణ్‌ చందన భర్త. అతను కూడా లెక్చరర్‌. ఐదు ఏళ్ళ చిన్నాని చందన తల్లిదండ్రులు చూసుకుంటారు. పది గంటలకు కాలేజీ కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చి, తిరిగి తన పరిశోధనాంశం పై నిమగ్నమైపోతుంది. అయినప్పటికి కూతురుకు ఏ లోటూ రానివ్వదు. ఎంతో అభిమానవంతురాలు. తనకాళ్ళ పై తాను నిలబడి ఎవ్వరిపై ఆధారపడకూడదనుకునే ఆలోచనకలది, పదిమందికి సహాయపడే స్వభావం చందనది. నిండుకుండ మనస్థత్వం. ఒక రోజు ప్రొద్దున్నే 6 గంటలకు అలా వాహ్యాళికి వెళ్ళింది. శీతాకాలం అది. వెన్నెల ఉషోదయం కోసం ఎదురు చూసే సమయం. పొగమంచు లో ఏవో కొన్ని కొత్త సొగసులు ఆస్వాదిస్తూనే ఆలోచిస్తోంది చందన. ఎదురుగా పొగమంచు లో ఓ అమ్మాయి చెట్టుకింద కూర్చుని ఏడుస్తోంది. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి ఓదారుస్తున్నాడు. తీరా చూస్తే ఎవరో కాదు, వారి పక్కింటి గోపాలం అంకుల్‌ గారి అమ్మాయి. అంతకు ముందు రోజున జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది చందనకు. ఆమె దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చింది.

“వారిది ప్రేమ వ్యవహారం. ఆ గొడవలో నీవెందుకు కలగజేసుకుంటున్నావు? అది వాళ్ళ కుటుంబానికి సంబంధించినవిషయం” అంటూ రామారావు వాదిస్తున్నాడు.

“అలా కాదు నాన్నా, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని.. ఎందుకు వాళ్ళు తిడుతున్నారు?” అంటూ తన వాదన కొనసాగిస్తూనే అంది.

దాంతో కోపంగా “నువ్వు ఇలా మొండితనంగా వితండవాదం చేసే నీ జీవితం లో కావలసిన ఆనందాన్ని కోల్పోయావు. మళ్ళీ అలా ఆలోచించకు” అంటూ రామారావు హెచ్చరికగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అక్కడ గదిలో నిశ్శబ్ధం ఆవరించింది ఏవో ఆలోచనలు చందనను చుట్టుముట్టాయి.

‘స్వతంత్రంగా ఆలోచించి స్వేఛ్ఛగా జీవించాలనుకోవడం, దానికోసం ప్రయత్నించడం ఎదుటి వారికి మొండితనంగా, అహంకారంగా కనిపిస్తాయా?’

చందనకు తాను ఎదుర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. చందన తల్లిదండ్రులది ఒక కుగ్రామము. పక్కనే ఉన్న నగరం లో తాను చదువుకునేది. కూతురిని గారాబంగా పెంచినా తల్లిదండ్రులు ఆమెకు ఎలాంటి లోటూ రానివ్వలేదు. వారి ఊరిలోనే కాలేజీలో చదివిన మొదటి అమ్మాయి చందన. చదువులో చాలా చురుకుగా ఉండేది. ఎంతో ఉల్లాసంగా,ఆనందంగా చదువు కొనసాగిస్తున్న సమయం. తల్లిదండులు వ్యవసాయం చేస్తూన్నా ఏ నాడూ కూతురిని కష్టపెట్టలేదు.

ఒకనాడు కాలేజీకి వెళ్ళివస్తున్న సమయంలో దూరపు బంధువు చందనకు ఎదురు పడి పలకరించాడు. " హాయ్‌ చందనా, ఎక్కడకు వెళ్ళివస్తున్నావు. బాగున్నావా" అని. తాను కూడా అంతే హుషారు గా సమాధానం ఇచ్చింది.

' మీరు ఇలా వస్తున్నారేమిటీ?’ సందేహంగా అడిగింది చందన.

" మాకు కొద్ది రోజుల్లో పరీక్షలున్నాయి. లైబ్రరీకి వెళ్ళివస్తున్నాను” చెప్పాడతను. ఇద్దరూ అలా దారిలో నడుస్తూ ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. చందన కు అతడు కొత్త పరిచయం. బంధువుల అబ్బాయి అయినా పెద్దగా తెలియదు కాని ఆ అబ్బాయికి మాత్రం చందన బాగా తెలుసు. గత సంవత్సరముగా ఆమెను గమనిస్తున్నాడు. మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు ఇలా హఠాత్తుగా కలిసివచ్చింది. కాలేజీ చదువులు, ఉన్నత విద్య లాంటి ఎన్నో విషయాలు చెబుతూ అలా దారి వెంట నడక సాగిస్తున్నారు. చందన గమ్యంవచ్చింది.

“సరేనండి,నేను మళ్ళి కలుస్తాను, ఉంటాను” అంటూ చందన తన దిశ ను మార్చింది. ఇంతవరకు ఆ అబ్బాయి మోములో ఉన్న సంతోషం చందనతో పాటే వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న మిత్రబృందం అతన్ని ఆటపట్టించారు. వంశీ తన మనస్సు లో మాటను అనుకోకుండానే చెబుతున్నాడు

" చందన పేరు ఎంత అందమైనదో అంతకన్నా ఆ అమ్మాయి మనసు తెల్లనైనది. చల్లనైనది. తాను గలగల నవ్వుతూ మాట్లాడుతుంటే ముద్దుముద్దు పలుకులు, ముచ్చటైన భావాలు ఎంత బాధనైనా ఇట్టే మరిపించేస్తాయి"


“ఓహో! ఇదీ సంగతి. దీన్నేమంటారు.. లవ్వా, లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైటా, తొలిప్రేమా?” అంటూ ఎవరికి తోచిన మాటసు వారు అంటున్నారు. అవన్నీ నిజమేనన్నట్టుగా మొహంలో చిన్న చిరునవ్వు ఒలకరించేశాడు. చందన కాలేజీకీ వెళ్ళే సమయంలో తారసపడడం, చిరునవ్వులు చిందించడం అంతా జరుగుతోంది. చందనకు తెలియకుండా ఆమెను రోజూ గమనించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ చందనను చూడకుండా,మాట్లాడలేకుండా ఉండలేని పరిస్థితి కి వచ్చాడు.

చందన ను కలిసి " హాయ్‌ చందనా, నీ ఎగ్జామ్స్‌ కోసం నాదొక చిన్న కానుక” అంటూ భయపడుతూనే పెన్‌ తీసి ఇచ్చాడు వంశీ.

“ థాంక్స్‌! కానీ నే నెప్పుడూ ఇలా తీసుకోలేదు. నాకు వద్దు” అంటూ సున్నితంగా తిరస్కరించింది చందన.

“నా కోసం తీసుకో ప్లీజ్‌, నీ పరీక్ష బాగా రాయటానికి నా బెస్ట్ విషెష్‌’ అంటూ బతిమాలాడు. కాదనలేకపోయింది. బహుమతిని అందుకుంది. కానీ ఇంటికి తిరిగి వచ్చిన చందన మనసులో కొద్దిపాటి ఆందోళన. పరీక్షలు పూర్తి అయ్యాయి. వేసవి సెలవులు గడిచాయి. వంశీ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ‘తాను మొదటి రాంకులో పాసయ్యానన్న విషయము చందనకి ఏ విధంగా చెప్పాలా’ అని ఆలోచిస్తున్నాడు. మరునాడు గుడికి వెళ్ళిన చందనను కలుసుకుని “చందనా! ఇదిగో స్వీట్స్‌” అంటూ చేతికిచ్చాడు. 'ఎందుకు' అన్న ప్రశ్నార్థకం సంధించింది చందన.

“నేను మన కాలేజీ ఫస్టొచ్చాను” అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పాడు.

“అలాగా! కంగ్రాట్స్‌” అంటూ వంశీకి ప్రసాదం అందించింది. వెంటనే తన మనసులోని మాట చెప్పడానికి ఆ సమయం అనువైనదిగా భావించాడు. చెప్పాలన్న ఆలోచన మొదలు వంశీకి హృదయ స్పందన వేగం పుంజుకుంది.

“చందనా, నీతో ఒక మాట చెప్పాలి” అంటూ ఆగిపోయాడు.

"చెప్పండి, ఏమిటది" అంటూ తేలికగానే మాట్లాడింది చందన.

“మరేం లేదు.. . నేను.. ఆ.. మీ రిజల్ట్స్‌ ఎప్పుడు?”

“మీరు ఏదో మాట చెప్పాలని, ఏదో అడుగుతున్నారేమిటి” అంది చందన.

వంశీ తెలియదన్నట్లు పెట్టాడు మొహం.

" నేను తప్పకుండా పాసవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది " అంటూ మెట్లు దిగి వెళ్ళిపోయింది చందన.

'ఛ, మొదటిసారి చెప్పాలని తడబడ్డాను. మరోసారి ఖచ్చితంగా చెప్పితీరుతాను’ అనుకుంటూ నిట్టూర్చాడు మనసులో.

అందాల బొమ్మలా పట్టుపరికిణీ కట్టి స్వీట్స్‌ పంచుతూంటే చూసిన వంశీ చందన కిష్టమైన ఐస్‌క్రీం తీసుకెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. చందన ముగ్ధత్వానికి తన మనసులోని మాట దాచుకొనలేకపోయాడు.

" చందనా, నువ్వంటే నా కిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే.. .. . " అంటూ ఆగిపోయాడు.

చందన కనురెప్పలు కొట్టడం ఆపి, ఊహించని మాటకు ఆశ్చర్యపోయింది.

" నీ అభిప్రాయం చెబితే" అంటూ మళ్ళీ ప్రశ్నించాడు.

" నాకు ఇవేవి తెలియదు. మీరు నాకు మంచి స్నేహితులు. అంత వరకే" అంటూ వెళ్ళి పోయింది. చందన

చెప్పిన సమాధానం గురించి కాకుండా, తనపై కోపం రాలేదన్న ఆశతో తనపై ఇష్టం ఉందని భావించాడు వంశీ. తరవాత మంచి రోజు కోసం వేచి చూడసాగాడు.

చందనంటే తనకున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో ఆలోచించసాగాడు. కానీ సమయం దొరకడంలేదు. చందన ఒకరోజు కొండమీద ఆలయానికి వెళ్ళింది. ముందుగానే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు వంశీ. ఆ రోజు వంశీని గుడిలో చూసి మాట్లాడలేకపోయింది. పూజ ముగియగానే చందనకి ఎదురువచ్చి " ఆ చల్లని చంద్రుడికి ఎంత దట్టమైన అడవి పైనా కోపం రాదు. అన్నింటిపైనా తన వెన్నెల కురిపిస్తాడు. కానీ ఈ ' చందనం లాంటి వెన్నెలకు నా పై కోపం లేదంటే నేను చెప్పే మాటలు విని నాతో మాట్లాడాలి' ప్లీజ్‌.." అంటూ బతిమాలాడు. మౌనంగానే మారుచూడకుండా నడవబోయింది.

" ప్లీజ్‌.. చందనా! నే చెప్పేది విను. నేను అబద్దం చెప్పడం లేదు. నిజంగా నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను. ఈ దేవుడి ముందు ప్రమాణం చేస్తున్నాను. " అంటూ తన ఆవేదన అంతా నివేదించాడు. చందన ఏమీ మాట్లాడలేదు.

“మౌనం అర్ధాంగీకారం అని అనుకుంటాను. చెప్పు, చందనా” అన్నాడు వంశీ.

చందన ఏ మాత్రం తొణకని స్వరంతో " నీవు అంతగా నన్ను ఇష్టపడితే మా అమ్మానాన్నలను అడిగి పెళ్ళి చేసుకో” అంది.

ఆ సమాధానంతో తన ప్రేమను అంగీకరించిందని భావించి ఆ కొండపై నుంచి " చందనా, ఐ లవ్‌ యూ” అంటూ గట్టిగా చిరుగాలి హోరెత్తేలా అన్నాడు.

చందన స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న రామారావు చందనను నిలదీశాడు. జరిగినదంతా చెప్పింది చందన.వాళ్లకు ఈ పెళ్ళి సంబంధం ఏ మాత్రం

నచ్చలేదు. అయినా ‘మనం ఇష్టపడి చేసుకోవటం కంటే మనల్ని ఇష్టపడే వారినిచేసుకోవడం మంచిద’ని తల్లిదండ్రులకు నచ్చజెప్పింది. వారిని ఒప్పించింది.

తరువాత వంశీని కలిసి విషయం చెప్పింది. వంశీ తనకు వచ్చిన కొత్త సమస్య తెలియజేసాడు.

‘మా అమ్మా,నాన్న లు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. నిన్ను చేసుకుంటే మా చెల్లెలి పెళ్ళి కట్నం నీవు సంపాదించి ఇవ్వాలట. లేకపోతే ఈ పెళ్ళి జరగదట. కాదూ, కూడదు అని చేసుకుంటే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో తెలియటం లేదు. వారి మాటను నేను కాదనలేకపోతున్నాను” అని చెప్పాడు వంశీ.

అది విన్న చందన నిశ్చేష్టురాలయ్యింది. నోటిలో మాట పెగల్లేదు. " అంత స్వార్థంగా ఆలోచించేవాడివి ప్రేమా, దోమా అంటూ వెంట బడటమెందుకు. ఇప్పుడు తెలిసొచ్చాయా ఇవన్నీ. నేను మా వాళ్ళని ఎంతగానో కష్టపడి ఒప్పించాను. దానికి నీ సమాధానం ఇంతేనా” అంటూ ఎంతో ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.

చందనను గమనించిన రామారావు విషయం కనుక్కున్నాడు. “ప్రేమించే వాడికి ధైర్యం ఉండాలి. అది లేని వాడు అర్హుడు కాడు. ప్రేమల జోలికి వెళ్ళకూడదు. ప్రేమ, పెళ్ళి కంటే ఊరుకున్నది నయం” అన్నాడు.

విషయం తెలిసిన వంశీ ఎన్నో సార్లు చందనను కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వంశీని మరిచిపోవడానికి చందనకు చాలా కాలం పట్టింది. రామారావు బంధు

వర్గం లోని ఒక మంచి అబ్బాయి వరుసకి బావ. అతనితో చందన వివాహం జరిగిపోయింది.

నాలుగు ఏళ్ళ తరువాత ఎండాకాలంలో అకస్మాత్తు వడగళ్ళ వాన లాగా వంశీ చందన పని చేసే కాలేజీ లోనే బదిలీ పై చేరాడు.

వంశీ ని చూసిన చందన భర్త కిరణ్‌ చందనను అనుమానించడం మొదలుపెట్టాడు. గతాన్ని పీడకలగా మరిచిపోయిన చందన వాటిని పట్టించుకోవటం మానేసి ఇప్పుడు ఎంతో ఆనందం గా ఉంది. కానీ కిరణ్‌ మాత్రం గతం తాలూకు అనుమానాలు చందనపై కురిపిస్తున్నాడు.

ఒక రోజు కిరణ్‌ సూటిగా " నీకు ఇప్పటికీ వంశీ అంటే ఇష్టమా?” అంటూ సందేహంగా అడిగాడు. ఊహించని ప్రశ్నకు చకితురాలైంది చందన.

" నీ కోసమేనా మళ్ళీ నువ్వున్న చోటికే వచ్చాడు. " మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు.

కాని చందన తడుముకోకుండా " చాలా కాలం కింద జరిగిన ఒక పీడకలను మరిచి

పోయి ఇప్పుడు హాయిగా ఉన్నాను" అంది.

“మరి తను ఇప్పటికీ పెళ్ళి చేసుకోలేదు. నీ కోసమేనా?” అంటూ చందన కు గుబులు పెంచే ప్రయత్నం చేశాడు.

దానికి అనూహ్యరూతిలో స్పందించిన చందన " మీరు కోరుకున్నది దొరకనప్పుడు కోరకుండా లభించేది అనుభవం అంటారు. అది తీపిదైనా కావచ్చు లేదా చేదైనా కావచ్చు. కాని నాకు లభించింది చేదు అనుభవం. అది అనుభవించిన వారు తీవ్ర మనస్తాపానికి గురైతే, దానికి కారణమైన పరిస్థితులపై ద్వేషం కలుగుతుంది. ఆ అనుభవ కారకులపై అసహ్యం కలుగుతుంది. ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలంటే ఒక జీవిత కాలం పట్టవచ్చు.

దాన్ని మార్చడమైనా గాయపడ్డ మనసుకు చాలా కష్టతరమైన పని. అలా నా జీవితంలో ఒకటి. నన్ను ప్రేమించానని డబ్బుకోసం ఆశ పడి నన్ను కోల్పోయిన వాడు ఒకడైతే, ఆ విషయం తెలిసి నన్ను అనుమానపిశాచి లా వెంటాడుతున్నవారు మరొకరు. ఇద్దరూ ఈ సందర్భానికి వర్తిస్తారు” అంటూ ఆవేశంగా చల్లదనం కురిపించే చందనం నిప్పుల వర్షం కురిపించి వెళ్ళిపోయింది.

ఇంకా అనుమాన ప్రవర్తన మార్చుకోని కిరణ్‌ గురించి బాధపడింది చందన. కళ్ళలో సుడులు తిరిగాయి. ఒక్కసారిగా రెండు నెలల క్రితం కిరణ్‌ అన్న మాటలు గుర్తుకువచ్చాయి.

‘మూడు నెలలు గా చూస్తున్నా. నీ జీతం నీవే వాడుకుంటున్నావ్‌. నేను ముందే చెప్పాను. నీ జీతం ఎలా వచ్చిందో అలా నా చేతికి అందించాలని. మరిచిపోయావా?” అన్నాడు కిరణ్‌ కోపంగా.

“ అంతా మీకిస్తే ఇంక నేను, పాప అవసరాలకు బయట అడుక్కోవలసిందే. చూస్తూనే ఉన్నానుగా మీ పిసినారితనం” “అవును. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి, నాకు కూడబెడతావనే నిన్ను పెళ్ళి చేసుకున్నాను. అలా కాదని తెలిస్తే వరకట్నం, వడ్డీ తో సహా వసూలు చేసేవాడిని” అంటూ తన దుర్భుద్ది బయటపెట్టాడు కిరణ్‌.

అది విని చందన ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది. ఇంకేమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెండు రోజులుగా ఆ ఇంట్లో ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కాలేజీ కి కూడా సెలవు పెట్టింది.

తరవాత రోజు చందన కొలీగ్‌ వేణుగోపాల్‌ వచ్చి కాలేజీ లో ముఖ్యమైన మీటింగ్‌ఉందని, ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి వెళ్ళిపోయాడు.

అదంతా విని కిరణ్‌ “చందనా, తప్పకుండా వెళ్ళాలి. అక్కడకు.. . ! చందనా ఒక మాట చెప్పు. వంశీ నీ పెళ్ళికి ముందు ' నువ్వు చాలా తెలివైనదానివని, కట్నం

లేకుండా పెళ్ళి చేసుకుంటాన’ని అన్నాడట. నిజమేనా?” అని అడిగాడు. ' మరెందుకు అతన్ని చేసుకోలేదు' అంటూ. అవేమి పట్టించుకోకుండా లోపలికి వెళుతుంది చందన. “రాయబారం నడిపించి బోర్‌ కొట్టిందా” అన్నాడు వెక్కిరింతగా. చందన కి ఆవేశం ఆగలేదు. కోపంగా అతని వంక చూస్తూ ఉంది చందన.

" ఏంటీ చూస్తున్నావు? వెళ్ళు-వెళ్ళు, రేపు అర్జంట్‌ మీటింగ్‌ ఉందికదా " అన్నాడు నిష్ఠూరంగా. అలా అలా చందన, కిరణ్‌ ల నడుమ అగాధం పెరిగింది.

ఎంతలా అంటే విడాకుల నోటీసులు పంపించేంతవరకు.

“చందనా, నీ కోసం ఎవరో వచ్చారు. కలవాలంటమ్మ. పిల్లాడు ఆందోళన లో ఉన్నాడు” అన్న రామారావు పిలుపుకి ఉలిక్కిపడి లేచి తన జ్ఞాపకాలకు సంకెళ్ళు వేసింది.

తన జీవిత ఆలోచన ఆపింది. ఉదయం గోపాలం అంకుల్‌ రవళి ని కలిసిన తరువాత ఆ అమ్మాయి జీవితం సవ్యంగా సాగేలా చూడాలనుకుంది. తనలో కలిగే ఆవేశభావాలకు కళ్ళెం వేస్తూ వచ్చిన వారిని గమనించింది. వచ్చింది ఎవరో కాదు. రవళిని ప్రేమించిన అబ్బాయి పంకజ్‌మిశ్రా. ఎంతో బాధగా ' మేడం, నేను రవళి ని ఎంతో ఇష్టపడ్డాను. నేను హార్డ్‌వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాను. మీరు మాకు సాయం చేయాలి.. మిమ్మల్ని బతిమాలుతున్నాను. ' అంటూ ఆవేదన గా అన్నాడు. కరిగిన రామారావు కూడా సహాయం గా నిలిచాడు. ' రవళి తల్లిదండ్రులతో మేము మాట్లాడుతాం' అని చెప్పి ఆ అబ్బాయిని ధైర్యంగా

పంపించారు.

మరుసటి రేజు ఉదయాన్నే రవళి తల్లిదండ్రులను, ప్రేమించిన అబ్బాయిని, రవళిని అందరినీ పిలిచి సమావేశపరిచింది. ' ఆ అబ్బాయి ఎలా నాకూతురిని పోషిస్తాడు. ఏం చేసి నా కుతురిని కంటికి రెప్పలా చూస్తాడు’ అంటూ ప్రశ్నించాడు గోపాలం. చందన ఆ అబ్బాయితో "“చెప్పు. వాళ్ళ నాన్న అడుగుతున్నారుగా. ఏం పెట్టి పోషిస్తావని. సమాధానం చెప్పు. " అంది చందన.

“నేను చదువుకున్నాను. మంచి ఉద్యోగము చేస్తున్నాను. నన్ను నమ్మండి. రాష్ట్రేతరుడైనంత మాత్రాన ఇలా వద్దనకూడదు. మీకు మా ప్రేమ విషయం చెప్పి పెళ్ళికి ఒప్పించాలని తాపత్రాయపడుతున్నాను. మా తాతగారు చాలాకాలం క్రితం ఆంధ్రాకి వచ్చి సెటిల్‌ అయ్యారు. మాది కూడా మంచి పరువు గల కుటుంబం. మీరు ప్రతీ దానికి పరువు, పరువు అంటున్నారు. మీరు చెప్పకుండా చేసుకుంటే మీరేం చేయగలరు. కావున ఈ పెళ్ళి చేయండి" అన్నాడు. అతని వాదనను చందన బలపరిచింది. ఆ మాటలు విన్న గోపాలం సరియైనదిగా భావించాడు. కూతురి

ధైర్యానికి, కాబోయే అల్లుడి నిజాయితీకి సంతోషపడ్డాడు. అక్కడే వారు తాంబూలాలు ఇచ్చి, పుచ్చుకున్నారు. తనను ఈ పెళ్ళి చేసే విధంగా ఒప్పించినందుకు చందనకు కృతజ్ఞతలు తెలియజేసాడు గోపాలం. చందన కూడా ఎంతో

ఆనందపడింది.

మరునాడు కాలేజీ నుంచి వచ్చిన చందనకు ఒక నోటీసు కనబడింది. దానిని తెరిచి చదివిన చందనకు " తీరం వరకు పరిగెత్తి పడిపోయిన కెరటం" లా

అయింది. తల్లిదండ్రుల నిశ్శబ్ధం, ఆ వాతావరణం తుఫాను ముందు సూచన లా ఉంది. మౌనం వహించిన చందన శాంతం గానే కనిపిస్తున్నా తన మదిలో రగిలే అగ్ని రగులుతూనే ఉంది. ఆమె తల్లిదండ్రులు జరిగే పరిణామాన్ని ఊహించలేకపోతున్నారు. కానీ మరుసటి రోజున జరిగే తుది నిర్ణయానికి అన్నీసిద్దం చేసుకుంది చందన.

" పల్లెపై వెలుతురు కురిపించే జాబిలి, అడవిలో సైతం కురవాలి. అందుకని పున్నమి వెన్నెల కురవక మానదు కదా- పడి లేచిన కెరటం ఉరకలేయక మానదు. అమావాస్యపు నిశీధైనా ఆపలేదు పున్నమి వెన్నెల

వెలుగును, అస్తమించు సూర్యుడికది కాబోదు ముగింపు. దక్కనంత మాత్రాన విజయం- ముగిసినట్లు కాదు జీవితం "

తెల్లారింది. కాని ఈ సూర్యోదయం ఎన్నడూ ఊహించనిది. సమయం దాటుతుందని గమనించిన చందన చిన్నాను తీసుకుని తల్లిదండ్రులు రామారవు, జానకమ్మ లతో కలిసి కోర్టుకు బయలుదేరింది. ఏ మాత్రం చెక్కు చెదరని ధైర్యంతో.. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .. .

ఇది ఒక సబల కథ-----

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

అమ్మ వెళ్ళిపోయింది

ఓ "అమ్మ పోరాటం"

రైతే రాణి

భళి భళిరా భట్టుమూర్తి

మారీచి పరిణయము

మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌

నా జీవన. . . . ఆశాలతా ?

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


471 views0 comments
bottom of page