top of page

నా జీవన. . . . ఆశాలతా ?


'Na Jivana Asalatha' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

అయిదువందల ఏళ్ళ నాడు అల్లసాని పెద్దన గండపెండేరం తొడిగించుకుని, బిరుద ప్రధానం పొందినప్పుడు ఆయనకు కలిగిన ఆనందమేదో తెలీదు. ఆరొందల ఏళ్ళ క్రితం ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో కనకాభిషేకం చేయించుకున్న శ్రీనాథుని ఆనందడోలికల 'తూగు' ఊహించలేం. ఏడొందల ఏళ్ళ క్రితం తిక్కన సోమయాజి మనుమసిద్దికి రాజ్యం తిరిగి ఇప్పించినప్పుడు లభించిన సత్కారము తో ఆయన పొందిన సంతోషం ఏ విధమైందో గ్రహించలేం. . . కానీ, అవన్నీ ఒక చోట చేరితే కలిగే హృదయోల్లాసం నేనిప్పుడు అనుభూతిస్తున్నాను. అందుక్కారణం దేశకాలమాన పరిస్థితులననుసరించి, నా తల్లిదండ్రులు ఎంతో సహృదయంతో నాకు " వధూన్వేషణ " అవకాశం కలిపించడం.

" వధూన్వేషణ" అంటే స్వయంవరం లాంటిది. వధువు స్వయంగా వరుణ్ణి ఎంపిక చేసుకోవడం స్వయంవరం! వరుడు స్వయంగా వధువు నెంపిక చేసుకోవడం " వధూన్వేషణ" కాదా !

నేను ఒక్కగానొక్క కొడుకును కావడమో, మా అమ్మానాన్నలు అభ్యుదయ భావాలు

వంటబట్టించుకోవడమో, ధనవ్యామోహానికి మా కుటుంబం దూరంగా ఉండటమో...

ఇవన్నీ కలిపి , మా వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం ‘ రంగు-రూపు, ప్రాంతం-భాషా వగైరా, వయసు-బంధుత్వం.. పట్టింపులన్నీ సడలించి నచ్చిన అమ్మాయి ఎవరైనా సరే చూసుకొమ్మని , ఎంపిక చేసుకొమ్మని’.. ఆరునెలలు సమయం కూడా ఇచ్చారు . అష్టావధాన క్రీడలో అవధానికి చంధోవస్తు నిర్ణయం లేకుండా ఆశుకవిత చెప్పమన్నంత ఆనందంగా ఉందంటే, ఉండదా మరి? అయితే ఇది నేను అనుకున్నంత తేలిక విషయం మాత్రం కాదు.

నేను డాక్టరునో, యాక్టరునో, పోలీసాఫీసరునో, రెవెన్యూ ఉద్యోగినో. . . . . కనీసం ప్రభుత్వ

కార్యాలయం సాధారణ గుమాస్తానో కాదు. ప్రభుత్వం ఎంపిక జేసిన ఓ ఉపాద్యాయుణ్ణి. పోనీ నేను భోధించే విషయమైనా పై రాబడి సాధించే గణితం , ఆంగ్లం, భౌతిక రసాయన శాస్త్రాలో కాదు . నేనో తెలుగు పండితుణ్ణి. మనకు ఇంతటి అవకాశం లభించిన తరువాత ' గంతకు తగ్గ బొంత' ను ఎంపిక చేసుకుంటే ఏం లాభం.

మనం మనుషులం. మనమెట్లా ఉన్నా కొన్ని కలలు-ఊహలు, ఆలోచనలు-ఆకాంక్షలు

ఆశలు-ఆశయాలు, కోరికలు-గొంతెమ్మ కోరికలు ఉండటం సహజం. ఇవన్నీ తీరే అవకాశం లేక, తీర్చుకునే సదుపాయం లేక, కాలానికి తలొగ్గి, ఏదో విధంగా సర్దుకుపోతూ , జీవితకాలమంతా సాధింపు చట్రంలో నలిగిపోతూ ఉంటారు. నేనలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు.

ఇంతవరకు విద్య, ఉద్యోగం నేపథ్యం లో ' వివాహం విద్య నాశాయా. . . . ' సూత్రాన్ని తూ. చ. తప్పకుండా పాటిస్తూ, ఆడవాళ్ళ వంక చూడకండా ' అభినవ ప్రవరాఖ్య' బిరుదునందుకున్న చరిత్ర నాది . అయితే , అమ్మాయిలనీ కన్నెత్తి చూడకుండా . . . . ' అనే మాట మాత్రం అతిశయోక్తి అలంకారమని అంగీకరించక

తప్పదు .

కనులున్నది కేవలం చదవడానికి కాదు కదా! ప్రకృతిలోని అందాలను వీక్షించడానికి కూడా కదా! అంటే ప్రకృతికే ప్రకృతిలాంటి అమ్మాయిలను చూడటమూ అందులో బాగమే తప్ప వేరు కాదు కదా! ఆ విప్రవరుడు సైతం వరూధిని అందాన్నిచూసి 'భీతహరిణేక్షణా' అంటూ వర్ణించాడు కదా। భార్యగలవాడు , ప్రౌఢవయస్సులో అడుగుపెడుతున్నవాడు, జపహోమనియమగరిష్టుడైన ఆ భూసురునికి అంత

అవకాశమున్నప్పుడు, ఈ వడుగును ఈ మాత్రం వెసులుబాటివ్వడం న్యాయమే కదా! కనుక 'చూడడమనే కళ' నాకు వ్రతభంగదోషం గానీ , బిరుదప్రదానకళంకం గానీ కాదు. కానేరదు. కాబట్టి , నాకు ' ఊహ' తెలిసినప్పటి నుండి నేను ' కన్న' ముద్దుగుమ్మలనందరినీ ఒక్కసారి చూసుకునేందుకు పాతసినిమా రింగులను కళ్ళ ముందు తిప్పేశాను.

నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఎనిమిది లో పోతన పద్యం లాంటి చూడచక్కని అమ్మాయుండేది . ఛందస్సులో ఆయన మాటలు కమ్మొచ్చులో తీసినట్లొదిగి పోయినట్లే, వయసైన ఆ అమ్మాయి అంచందాలు చక్కగా తీర్చిదిద్దినట్లు ఒద్దికగా ఉండేది . ఖాళీ సమయంలో నా మాట వినకుండా కళ్ళు ఆ అమ్మాయి కోసం పరుగులు పెట్టేవి . కానీ , భాగవతాన్ని ' ఆరాధనా' దృష్టితోనే చూడాలన్న నియమం లాగా మా మీసాల హెడ్మాస్టారు అందరినీ డేగకళ్ళ తో ప్రతీక్షణం పర్యవేక్షించేవారు. అంతటి క్రమశిక్షణ చట్రంలో అవకాశమే దొరకలేదు . ఎప్పుడూ ఒకే ఒక్కసారి కనిపించి, కనిపించడంతో ఊరుకోక నన్ను చూసి అందంగా నవ్వింది . అంతే! ఆ మాత్రానికే మూడు రాత్రులు నిద్రపట్టక నాలుగు రోజులు లెక్కల మాస్టారు వెంకట్రావు గారు చేతిలో చావు దెబ్బలు తిన్నాను. అయినా అంత అందమైన అమ్మాయి ఇంకా పెళ్ళికాకుండా ఉంటుందనుకోవడం మూర్ఖత్వమే.

ఇంటర్‌ లో గుంటూరు శేషేంద్రశర్మ కవిత వంటి సౌందర్యభరితమైన " శోభన"తారసపడింది. రోజుకొక్కసారైనా కళ్ళతో పలకరించేది. పులకరింపజేసేది . విశాలమైన ఆ కళ్ళ లో కలల సౌదం నిర్మించుకొని కలకాలం బతికేయచ్చు. అడిగేవాళ్ళులేకపోవడంతో మొదటి ఏడాది సగం సబ్జెక్టులు ఢమాల్‌. సప్లిమెంటరీ అతి కష్టంమీద గట్టెక్కాను. రెండో సంవత్సరం లోనూ ఆ పరిస్థితి కొనితెచ్చుకోవడం శోభనకుసుతరాము ఇష్టం లేనట్లుంది. అందుకే ఓ షేక్‌హాండ్‌ పట్టుకుని చెక్కేసింది. ఏమాట కామాటే చెప్పుకోవచ్చు. అంతటి నెరజాణ ఇంత జీవితంలో ఇంకెక్కడా తారసపడలేదు.

డిగ్రీ చదువుతుండగా అడివి బాపిరాజు బావ " ముగ్ధ" సరోజ పరిచయమైంది. తెలుగు క్లాసులో సరిగ్గా పందొమ్మిది మందిమి. నా ముందు బెంచే మరి. పేరుకు ముందున్నా సగం మనిషి వెనుకకే ఉండేది. అంటే నా వైపు తిరిగి మాట్లాడుతూండేది. కానీ, నెల తిరక్కుండానే మా తెలుగు లెక్చరర్‌ దృష్టిలో ' ఆమె' పడిపోయింది. ఇతరుల దృష్టి తగలితే ఆ బొమ్మ ఎక్కడ ' పగిలిపోతుందో' నన్నంత జాగ్రత్తగా అతను ఆమెను ' చూసుకో' సాగాడు. ఆ చూసుకోవడం ' సాగీసాగీ' ఇద్దరూ పెళ్ళి చేసుకోవడం దగ్గర గానీ ఆగలేదు మరి!

సెలవుల్లో మా కిట్టిగాడి ఊరెళితే అక్కడ విశ్వనాథ కిన్నెరసాని , నండూరి ఎంకి, గోరేటి ఎంకన్న లచ్చుమమ్మా కనిపించారు. తిండి మానేసి వాళ్ళలో ఎవరినో ఒకరిని చూసుకుంటూ " ఊరిబతుకు" గడిపేద్దామని అనుకున్నా. కానీ ' ఆ కాయకష్టం' చూస్తూంటేనే భయమేసింది. అదే నన్ను ఉద్యోగం వెతుక్కోమ్మని తరిమేసింది.

ఉద్యోగసాధన సక్రమంగా జరక్కపోతే 'అడుక్కుతినే' బతుకవుతుందని బుద్ధికి బుద్ధి చెప్పుకుని , కాలప్రవాహంలో శుద్ది చేసుకోకతప్పలేదు. ఇప్పుడా పిల్లలు తప్పకతల్లులై ఉంటారు.


పల్లెటూళ్ళల్లో అంతే కదా! పండిత శిక్షణ లో ఉన్నప్పడు కరుణశ్రీ కవిత లాంటి లత అనే లతాంగి తారసపడింది. అందంలో విద్యుల్లత, సంస్కారంలో హేమలత, చూపులు మాత్రం ఎప్పడూ కుతకుత. ఆమె తలుచుకున్నప్పడు నాతో మాట్లాడేదీ నేను తలుచుకున్నప్పుడు మాత్రం మాట్లాడలంటే ఏదో భయం , సంకోచం నన్నుఆవరించేవి. ' అగ్నికీ ఆడదానికీ కొంచెం దూరం పాటించాలోయ్‌ ' అని చెప్పేమా తెలుగు మాష్టారు పరందామయ్య గారి మాటలు సరిగ్గా గుర్తుకువచ్చేవి.

ఆమె అందరి ఫోన్‌ నంబరులు తీసుకుంది గానీ , తన నంబరు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. ' దటీజ్‌ లత' అనిపించింది.

హూ! నా పిచ్చిగానీ , పిల్లను వెతుక్కోవడమంటే, చిన్ననాటినుంచీ హృదయఫలకం మీద దృశ్యాదృశ్యంగా ఉన్న చిత్తరువులను తడుముకోవడం కాదు. అది వాస్తవ జీవితాన్ని భ్రమగా భావించడం తప్ప, వేరు కాదు . బాధే సౌఖ్యమనుకుంటే ఆనందం ఉంటుందేమో. కానీ ఊహే నిజమనుకుంటే నిరాశే మిగులుతుంది. అందుకే గతం నుంచి , గతం మరచి ప్రస్తుతం లో మన చుట్టూ మన్మథ బాణాలేమైనా ఉన్నయేమో చూసుకోవడం మంచిది.

చుట్టూ కలియజూస్తే మొట్టమొదట కనిపించింది శకుంతల. సంప్రదాయ కవిత లా

కట్టూ, బొట్టూ బాగుంటాయి. తెల్లని ఛాయ , తేనెరంగు కళ్ళు, లిప్‌స్టిక్ వేసుకున్నట్లుండే

పెదాలు. మా బడిలో విద్యావలంటీరుగా పనచేస్తుండటం అదనపు సౌకర్యం. కానీ

కంద పద్యం లోని ఛందస్సు లా పైకి సరళంగా కనిపించే శకుంతల అంతరంగం అర్థం చేసుకోవడం కష్టం!

" ఏమ్మా బాగున్నావా ?" అని ఓ రోజు పరధ్యానంగా పలకరిస్తే ' బాగున్నాను నాన్నా' అనుకుంటూ తిప్పుకుంటూ పోయింది. అప్పటినుంచీ ఇప్పటి దాకా మళ్ళీ మాట్లాడలేదు ఎందుకో! ?

రవళి అన్ని రకాలుగా బాగనిపిస్తుంది. నాతో పాటే ఉద్యోగంలో చేరింది . ఆకర్షణీయమైన విగ్రహమే. కానీ సినారే దీర్ఘ కవిత్వం లాగా పొడవెక్కువ. నేను ఎత్తు బూట్లు వేసుకున్నా ఆమె చెవి దాకా కాను. ఈడు కుదిరినా జోడు ముఖ్యం కదండీ ! ఛందస్సు సరిపోయిందని , అన్వయం లేని పద్యాలు రాస్తే ఎవరి కుపయోగం? అందుకే ఆమె అందాలు అందని ద్రాక్షల్లాగే కనిపిస్తాయి. అనిపిస్తాయి.

ప్రవస్థి కంప్యూటర్‌ టీచర్‌. కొత్తగా బడిలో చేరింది. లేటెస్టుగా అంటే (మరీ జీన్స్‌ కాదు కానీ) చూడముచ్చటగా ఉంటుంది . కానీ జాషువా కవిత్వంలా వేదనాభరిత నేపథ్యాలను ఎప్పుడూ వినిపిస్తూంటుంది.

హైకూలు, . . . . . . రెక్కలు. . . చెక్కలు. . . . లాంటి వాళ్ళు. చూడ్డానికి తప్ప, పెళ్ళాడ్డానికి ఏ విధంగానూ పనికిరాని మొగ్గలు.

ఏంటో! కవిత్వం రాయడానికి సమయం దొరికినప్పుడు ' ఉత్సుకత' రాదు. ఉత్సుకత వచ్చినప్పుడు సమయం అందుబాటులో ఉండదన్నట్లైంది నా పరిస్థితి. అమ్మానాన్నలు వెతికిన సంబంధాలు నచ్చడం లేదు. మన కవకాశమిస్తే దొరకడం లేదు...

మన బాధంతా కృష్ణశాస్త్రి భావకవిత్వంలా అయిపోయింది మరి !. . . . . . . .

బడిలో పై తరగతుల్లోని ఎదిగిన అమ్మాయిలు కొందరు వంకరచూపులు చూస్తూ

' పెళ్ళెప్పడు చేసుకుంటారు మాస్టారూ’ అని అడుగుతూంటారు. మనమిచ్చేఅతి చనువు వాళ్ళను పెడదారుల్లో నడిపిస్తోందా? అన్న భయం కలుగుతుంది, ఆ మాటలతో.

‘నిశ్చితార్థమైపోయిందిరా!’ అని అవసరానికో అబద్దం చెప్పి తప్పుకుంటా!

ఇట్లా నేను ఆలోచానాలోచనాలను సవరించుకుంటూ కూర్చుంటే వివేచన పూర్తిగా నశించి , చివరకు ఏదో ఒక సంబంధానికి తలవంచక తప్పని పరిస్థితి దాపురిస్తుందేమో ! ఇప్పటికే చాటుమాటున ' ముదిరిన బెండకాయ' అంటున్నారని అభిజ్ఞవర్గాల భోగట్టా.

' హలో Mbk! నిన్నే!’ అన్న పిలుపుతో ఉలిక్కిపడ్డాను.

ఆలోచనలని అయోమయంలోకి నెట్టేస్తూ పరధ్యానం పరాకాష్ఠ నందుకుంటుంటే ఇలాంటి పరిస్థితి ఎదురువ్వడం పరిపాటిగా మారిపోయిందీ మధ్య.

నేనున్నది స్టాఫ్‌ రూమ్‌ లోనని, పలకరిస్తున్నది సీనియర్‌ అసిస్టెంట్‌ రాఘవ అని క్షణంలో గ్రహించగలిగాను. కంగారుగా నడుచుకుంటూ , " ఏంటండీ , సీనియర్‌ అని గౌరవిస్తుంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ముదిరిన బెండకాయా అని పిలుస్తారు నన్ను?” అని నిష్ఠూరంగా అన్నాను.

“గుమ్మడికాయ దొంగలా అలా భుజాలు తడుముకుంటావేమయ్యా? ముదురు బెండకాయని నేనెప్పుడన్నాను? నీ పేరునే పొడి, పొడి అక్ఛరాలతో పిలిచాను. కాకపోతే

Kbm బదులు Mbk అన్నా”నంటూ నవ్వసాగాడు. ఆ నవ్వు వెనక వ్యంగ్యం స్పష్టంగా

కనిపించింది.

ముడుచుకున్న నా మొహం చూసి , నవ్వును నిగ్రహించుకుంటూ , “నీకు బాధనిపిస్తే పిలవను లేవయ్యా! నీ కేదో ఉత్తరం వచ్చింది. బరువుగా ఉంది. ఖచ్చితంగా ప్రేమలేఖేనని నా అనుమానం. . . . . “ అంటూ ఒక కవరిచ్చాడు.

' ఆ ! ఆయనకు ప్రేమలేఖ రాసే వాళ్ళెవరుంటారు సార్‌! అయిన్ లీవ్‌లెటరే సరిగా

అర్థం చేసుకోగలిగే శక్తి ఆయనకెక్కడిది పాపం!’ ఎన్నాళ్ళ అక్కస్సో కక్కింది శకుంతల

అదేమీ పట్టించుకోకుండా ఉత్తరం పట్టుకుని బయటకొచ్చేసాను. అది నాలుగో

పీరియడ్‌. ఆటస్థలం ఖాళీగా ఉంది. ఓ చెట్టుకిందకెళ్ళి ఉత్తరాన్ని పరిశీలించాను.

పైన ఎక్కడినుంచి వచ్చిందో చిరునామా లేదు. పదునాలుగు పేజీల ఉత్తరం. లోపలి

ఉత్తరంలోని అక్షరాలు లీలగా ఓ వ్యక్తిని గుర్తుకు తెస్తున్నాయి. ఆఖరి పేజీ చివర చూశాను. నా అనుమానం నిజమే . అది లత రాసిన ఉత్తరం!

' తన అందం చూసి గొప్పింటి వాళ్ళు కోడలుగా చేసుకున్నారని, కానీ ఆరునెలల తరువాత భర్త వేధింపులు ఎక్కువయ్యాయని చివరకు హత్యప్రయత్నాలు మొదలయ్యాయని , అవన్నీ భరించలేక కన్నవారింటికి వస్తే అర్థం చేసుకోకపోగా ఇరుగు పొరుగు సూటిపోటీ మాటలతో చంపుకుతింటున్నారని, ఆత్మహత్య చేసుకునే బలహీనురాలిని కాను, కాబట్టే నీ స్నేహ హస్తం కోరుకుంటున్నానని , వీలు చేసుకునిఒక్కసారి కలవ’మనీను. . . . .

లత ఇప్పటికీ నా ఆశాలతే . అయితే అక్కడి పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకోకుండా నిర్ణయానికి రావడం తొందరపాటే. అవుతుంది. అయినా , ఎందుకో ఈ ప్రయాణం నా సమస్యకు పరిష్కారం చూపగలదన్న భరోసా కలిగిస్తుంది.

గొప్ప కవితలు చాలా ఉండొచ్చు. కానీ, మంచి కవిత్వం కొంచమే ఉంటుంది. అర్థవంతమైన జీవితంలాగా, లత నా సకల కోరికలు తీర్చే కల్పలత కానవసరం లేదు.

వడలిపోతాననుకుంటున్న తనకు నేనో ఊతకర్రలా నిలబడితే చాలు.

నా కోరిక నెరవేరాలని మీరూ ఆశీర్వదించండి. సుమనుస్కుల ఆశీఃబలం చాలా

శక్తివంతమన్న కాసుల పురుషోత్తమ ' కవివాక్కు' అజరామరం కదా !

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


284 views0 comments

Comments


bottom of page