top of page

మారీచి పరిణయము


'Maarichi Parinayam' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

త్రేతాయుగమునకు సంబంధించిన కథ. కల్పిత గాథ.

'మారీచి పరిణయమ' ను కావ్యమును వ్రాసిన వారు మోహనాంగి అను కవయిత్రి. శ్రీకృష్ణదేవరాయల వారి కూతురు.

రామరాయలవారి పట్టమహిషి.

అలనాడు మారీచసుబాహులనెడి రక్కసులు విశ్వామిత్రుని యాగమును నాశనము చేయుచు అనేక విఘ్నములు చేగూర్చుచున్నారు. అట్టి సమయమున

విశ్వామిత్రుడు దశరథమహారాజు సహాయము కోరగా , దశరథుడు తన కుమారులు శ్రీరామలక్ష్మణులను మునికి యాగసహాయమునకు పంపెను.

మారీచసుబాహులతో యుద్దసమయమున లక్ష్మణుడు వేసిన బాణప్రయోగ ప్రభావము చేత మారీచుడు సముద్రతీరమున పడెను. అప్పుడతనికి పదునాలుగేండ్ల బాలిక శీతలోపచారములు చేసి స్వస్థత చేకూర్చెను. అనుకోని విధముగా దొరికిన ఆ బాలికను మారీచుడు ఎంతో ప్రేమతో పెంచుకొనసాగెను.

దండకారణ్యములో ఆశ్రమము కట్టుకొని మారీచుడు నివసించుచుండెను. మారీచునిచే సాకబడిన ఆ కన్నెపిల్ల 'మారీచి' యను పేర పిలువబడుచుండెను. ఆ విధముగా మారీచి ఆతనికి పెంపుడు బిడ్డయైనది.

మారీచుని వృత్తాంతమంతయు రామాయణగాథతో ముడివడి యున్నది కదా!

------

సీతారామలక్ష్మణులు , అప్పుడు అరణ్యవాసము చేయుచున్నారు. వీరు కూడా ఒక పర్ణశాల లో నివసించుచున్నారు. సీతారాముల పర్ణశాల, మారీచాశ్రమమునకు సమీపమునందే యున్నది.

ఒకనాడు ఆశ్రమమునకు దగ్గరనే యున్న పుష్పవనములో మారీచి,లక్ష్మణులు ఒకరి నొకరు చూచుకొనుట సంభవించినది. వారి హృదయములలో ప్రణయబీజ మంకురించి , దినదిన ప్రవర్ధమానము కాజొచ్చినది.

ఇంతలో , ఇదివరకే లక్ష్మణునిచే దెబ్బతిన్న మారీచుడు , అతనికి దగ్గరగా నుండుట క్షేమము కాదని యెంచి, తన నివాసమును లంక కీవలి సముద్రపు టొడ్డునకు మార్చుకొనెను.

అచ్చట ఒకనాడు , మారీచి రావణుని కంట బడినది. అతడామెను మోహించి దొంగలించుకొనిపోవ నుపాయ మాలోచించుచుండెను. మారీచుడు బ్రతికి యున్నంత

వరకును, మారీచి నపహరించుటకు వీలు కాదని యెంచిన రావణుడు అతని చావునకై పరిపరి విధముల నాలోచించుచుండెను.

తరువాత రామలక్ష్మణుల వలన శూర్పణఖ పరాభవింపబడుట, ఖరదూషణాదుల

వధ, శూర్పణఖ తనకు జరిగిన పరాభవమును రావణునికి తెలుపుట, మున్నగు ఘట్టములు సంభవించును. పిమ్మట రావణుడు శూర్పణఖావమానమునకు బహు

క్రోధము కలవాడై సీత నపహరించి రామునికి ప్రతీకారము చేయ నిశ్చయించుకొనెను.

అందుకు మారీచుని మాయలేడిగా నుపయోగించుకొనినాడు.

మారీచ వధానంతరము, రావణుడు రామా, రామా యని ఏడ్చుచున్న సీతనూ ; లక్ష్మణా, లక్ష్మణా యని ఏడ్చుచున్న మారీచిని లంక కెత్తుకొనిపోయెను.

తరువాత సుగ్రీవ సఖ్యము, సీతాన్వేషణము , లంకాదహనము,సేతుబంఘనము--

మున్నగునవి యథాప్రకారము సాగిపోవును.

యుద్దమారంభమయినపిమ్మట , ఒకనాడు సమరమున లక్ఛ్మణుడు మూర్ఛపొందినాడు. రాముడు శోకాకుల చిత్తుడై నిరాశతో నున్నాడు. "

“జాంబవంతుడప్పుడు పదునాలుగేండ్లు నిద్రాహారములు లేనివారు శుశ్రుష చేసినచో మనకు , లక్ష్మణస్వామి మూర్చనుండి తేరుకుని దక్కునని చెప్పెను. అట్టి కఠోర వ్రతులెవ్వరని విచారించుచుండగా , నారదమహర్షి అక్కడికి వచ్చి ' మారీచి' యను కన్య యున్నదని చెప్పెను.

అంతట విభీషణుడు తన అనుంగు మిత్రుల ద్వారా లంకనుండి 'మారీచి,ని రప్పించెను. ఆమె తన కరకమలములతో లక్ష్మణునకు పరిచర్యలు చేయగా పిమ్మట ఆయన నిద్రనుంచి లేచిన వాని వలె లేచెను. ఈ విధముగా లక్ష్మణుని బతికించుకొందురు.

కానీ వారి ముందు రావణుని ఏ విధముగా గెలవగలమని పెద్ద సమస్య వచ్చినది. అందరూ అసాధ్యమని విచారముతో నున్నారు. అప్పుడు వారి నందరినీ నారదుడు ఊరడించి , రావణునకు బ్రహ్మ శాపమున్నదనెను. ఆ శాప ప్రభావమున

నతనికి కాలము మూడినదని చెప్పెను. ఆ విధముగా రాముని యుద్ధసన్నద్ధుని చేయును.

రావణాసురుడు తొలినాళ్ళలో బ్రహ్మను గూర్చి కఠోరమైన తపస్సు చేసెను. తనకుచావు లేకుండనట్లు వరమిమ్మని కోరినాడు. అందులకు బ్రహ్మదేవుడు" పుట్టిన వారెల్లరూ గిట్టక తప్పదనియూ, ఇట్టి వరమిలిచ్చుట ప్రకృతివిరుద్ధమ" నియు చెప్పెను. అందుకు రావణుడు పరిహాసముతో “తాతా! కూతురును కామించుట కూడా ప్రకృతి విరుద్ధము కాదా!” యనెను. అందుకు బ్రహ్మ కోపించి " కూతురును కామించి

నప్పుడే నీకు కూడా చావు మూడుతుంద" నెను. అది రావణునికి వరముగను, శాపముగను పరిణమించినది. రావణునికి 'మారీచి' కూతురు. ఆమినీతడు వలచి

నాడు. కావున బ్రహ్మ శాపమున రావణునికి చావు తప్పదు. రామా! లెమ్ము. యుద్దానికి సిద్ధము కమ్ము' అని నారదుల వారు శ్రీరామచంద్రుని ప్రభోదించినారు.

రంభానలకూబరుల ప్రణయము పురాణప్రసిద్ధము. నలకూబరుని కడకు పోవుచున్న రంభను ఒకసారి, రావణుడు దారిలో నడ్డగించి బలత్కారముగా ననుభవించినాడు. అప్పుడామెకు సధ్యోగర్భమున నొక కూతురు పుట్టినది. రంభ ఆ శిశువును అక్కడనే వదలివేసి , తనదారిని తాను పోయినది. పార్వతీపరమేశ్వరులు

ఆ మార్గమున పోవుచు ఆ బిడ్డ యేడుపు నాలకించి వచ్చి ఓదార్చి , ఆ బాలిక నెవ్వరైనను దీసుకొని పెంచుకొనువరకు ఆకలిదప్పులు గానీ, నిద్రగానీ , ఎవ్వరివల్ల నే అపాయము గానీ కలుగకుండునట్లు ఆశీర్వదించినారు. ఆ శిశువు పదునాలుగేండ్లు ఆ ప్రదేశమున అట్లేయుండి , కడకు మారీచునకు దొరికినది. అతని పెంపకము వలన మారీచి యైనది. కనుక, మారీచి రావణునకు ఔరసపుత్రియే!

అట్టి నిజకుమారిని వలచిన రావణుడు బ్రహ్మ శాపము వలన చావక తప్పదు కదా!

ఇంక తరువాతి కథ. " రావణ కుంభకర్ణాదుల వధ, సీత అగ్నిప్రవేశము , సీతా రామ

లక్ష్మణులు మారీచి సహితులై పుష్పకవిమానము నెక్కి అయోధ్య కేతెంచుట ,

ఊర్మిళాదేవిని నిద్ర నుండి మేల్కొల్పుట , ఆమె అలకలు, సంగతి నెరిగిన పిమ్మట,

" మారీచిలక్ఛ్మణుల పరిణయము".

లక్ఛ్మణునికి ఇదివరకే ఊర్మిళాదేవి తో వివాహమైనది. ఆమె తన మగడింకొక మగువను చేపట్టుట సహింపదు కదా! ఇప్పుడా చెలువ తన భర్తకు ప్రాణదాన మొనరించినది కావున , ఊర్మిళకు సపత్నీమాత్సర్యముండుటకు వీలులేదు.

-- ఇది మారీచిలక్ఛ్మణుల ప్రణయ, పరిణయ గాథ. ----

--శుభంభూయాత్‌ --------

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



280 views1 comment
bottom of page