top of page

అంగద రాయబారము

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Angada Rayabharam' Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


పోగాలం దాపురించిన వారు హితుల మాటలను పెడ చెవిన పెడతారు.

విభీషణుడు, మండోదరి, శ్రేయోభిలాషులు, మంత్రులు... ఎందరు చెప్పినా రావణుడు సీతాదేవిని విడిచి పెట్టలేదు.

చివరి ప్రయత్నంగా శ్రీరాముడు అంగదుడిని రాయబారిగా పంపాడు.

ఆ ఘట్టాన్ని రమ్యంగా రచించారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

ఇక కథ ప్రారంభిద్దాం.


అంగద రాయబారము శ్రీమద్రాయణములోని యుద్దకాండము లోని ఘట్టము.

అతి కీలక ఘట్టము.

లంకను ముట్టడిస్తున్నట్లుగా వానరుల గర్జనలూ, సింహనాదాలూ, శంఖ, భేరీ ధ్వనులూ వినవచ్చాయి. ఆ ధ్వనులకు భూమి కంపించింది. కంపించిన భూమిని చూసి సీతామాత ఆనందిస్తే , రాక్షసులు భయపడ్డారు. మంత్రులు సహా రావణుడు కూడా భయపడ్డాడు. భయపడినా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ యుద్దానికి సైన్యాన్ని సిద్దం చేశాడు. అది మాల్యవంతుడికి నచ్చలేదు. ఆయన రావణాసురుని పెదతాత.

చేసిన పాపాలకు రావణుని తపశ్శక్తి తగ్గిందని, కావున సీతమ్మవారిని శ్రీరాముల వారికి అప్పగింగించ మన్నాడాయన.


రావణాసురుడు అందుకు ససేమిరా అంగీకరించలేదు. లంకలోని రాక్షసుల మేలు కోరి చెబుతున్నానన్నాడు. పెద్దల మాటను పెడచెవిన పెట్టకని, అర్థం చేసుకోమన్నాడు. మాల్యవంతుడు పెద్దవాడు, వృద్ధుడైననూ రావణుని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాడు. వినలేదు రావణుడు. వినకపోగా మాల్యవంతుని జబ్బపట్టుకుని సభాప్రాంగణం నుంచి ఈడ్చి బయటపడవేశాడు.


రాక్షసజాతిలో కడు వృద్ధుడూ, పెద్దవాని మాటే వినలేదు. ఇక మన మాటలూ ఏమి వింటాడు యని మంత్రి, దండనాథ, పురప్రముఖులు నోటమాట కరవై కిమ్మనాస్తి గా ఉండిపోయారు. రావణడు ఏం చెబుతాడు యన్నట్లుగా వేచిచూడ సాగారు.


వారితో రక్షణ ఏర్పాట్లగురించి సుదీర్ఘంగా మంతనాలు సాగించాడు రావణుడు. సుదీర్ఘ చర్చల పిదప తూర్పు, పడమర, దక్షిణ ద్వారాల్ని ప్రహస్త, ఇంద్రజిత్తు, మహోదరులు రక్షించాలని వెనువెంటనే ఆజ్ఞలు జారీచేసెను.


శత్రువులు ఎక్కువగా దాడిచేసే ఉత్తర ద్వారాన్ని తానే రక్షిస్తానన్నాడు రావణుడు.

రావణుని రక్షణ ఏర్పాట్లు ఇలా ఉండగా అక్కడ సువేలాద్రి సమీపంలోని తన వానర

దండుతో యుద్దానికి సంబంధించిన చర్చల్లో తలమునకలైనారు రామ, లక్ష్మణ, సుగ్రీవ,విభీషణ తదితర ప్రముఖులు చెప్పింది వింటూ ఎక్కడ ఏది అవసరమో అక్కడ అది సమకూర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు .


తన మంత్రులు అనల, శరభ, ప్రఘస, సంపాతులు నలుగురూ పక్షిరూపాలలో లంకను చుట్టి వచ్చారంటూ అక్కడి విశేషాలను రాములవారికి తెలియజేశాడువిభీషణుడు. --


" రామా! లంకలో నేడు పదివేలమంది రథికులు, వేయి మదపుటేనుగల పటాలం, పదివేల అశ్వికదళం, కోటిమంది పదాతి దళం , వారి అవసరాలుతీర్చే నలభైవేల మంది సేవకులు ఉన్నారు. లోగడ కుభేరుణ్ణి కేవలం అరవైవేల మంది సైన్యం తో రావణడు ముట్టడించెను. ఆ సైన్యమే ఇవాళ ఇంతలా పెరిగింది.


సైన్యం ఎంత ఉంటే ఏమిటీ? ధర్మం మన పక్షాన ఉంది కాబట్టి గెలుపు మనదే! అయినా మన జాగ్రత్తలో మనము ఉండాలి. తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. చెప్పండి రామభద్రా! ఏం చేద్దామంటారు?" అడిగాడు విభీషణుడు.


ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు శ్రీరాముడు. కాసేపటికి కళ్ళు తెరిచి చెప్పాడిలా

" లంక తూర్పు,దక్షిణ , పడమర ద్వారాలని ముట్టడించేందుకు వరుసగా నీల అంగద హనుమంతులని నియమించండి. వరగర్వంతో విర్రవీగుతున్న రావణాసురున్ని ఎదురుకొని సంహరించేందుకు లక్ష్మణునితో సహా నేనే ఉత్తరద్వారాన్ని ముట్టడిస్తాను. మూల సైన్యానికి జాంబవంత విభీషణాదులు రక్షకులుగా ఉంటారు. "


సరేనన్నారంతా.


" నేను, నా తమ్ముడు లక్ష్మణుడు, విభీషణుడు , అతని నలుగురు మంత్రులు మాత్రమే మానవ రూపులతో పోరాడుతాం. మిగిలిన వారంతా వారి వారి సహజరూపాలతో ఉండి పోరాడాలి. రూపాలు మార్చకూడదు. "అన్నాడు శ్రీరాముడు.

ఒప్పుకున్నారంతా.


అప్పటికి సూర్యస్తమయం అయింది. సువేలాద్రిపై నిద్రించేందుకు బయలుదేరారు. అతన్ని వానరవీరులు అనుసరించారు. కొందరు కాగడాలు పట్టుకుని దారి చూపిస్తుంటే , ధనుర్దారి లక్ష్మణుడు , శ్రీరాముని ప్రక్కగా నడవసాగాడు. ఇంకొంచెం ప్రక్కగా సుగ్రీవ విభీషణాదులు నడుస్తూ రాముణ్ణి అనుసరిస్తూ నడవసాగారు. ఆలోచిస్తూ అడిగాడిలా శ్రీరాముడు.


" రావణుడు చేసింది తప్పే! వంశగౌరవాన్ని , ధర్మాన్నీ కాదని మహాపాపం చేశాడు. ఆపాపానికి రాక్షసజాతిని ఫణంగా పెడుతున్నాడు. ఒకడు చేసిన పాపానికి జాతి మొత్తం బలి కావలసిందేనా?"


రాముని ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో ఎవరికీ అంతు చిక్కలేదు. మౌనం వహించారంతా. తరువాత మళ్ళీ అదే విషయాన్ని రాముడు రెట్టిస్తే ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. ఏ సమాధానమూ రామునికి సంతృప్తిని కలిగించలేదు. సమాధానాన్ని ఆలోచిస్తూ నిద్రపోయాడురాముడు. ఆతని తమ్ముడు లక్ష్మణుడు సహా అనేకమంది కాపలా కాయసాగారు.


ఆ రాత్రి గడిచింది. సూర్యోదయం అయ్యింది. పర్వతం దిగువున ఉన్న వానరులు లంక ముట్టడించేందుకు బయలుదేరారు. పెద్దపెద్దగా అడుగులు వేస్తూ సింహనాదాలు చేశారు. ఆ అరుపులకి భయపడి , ఆ ప్రాంతం లోని మృగాలన్నీ పరుగుదీశాయి. ఆ పరుగులకి, ఆ అరుపులకీ మళ్ళీ లంక గజగజ వణుకుతూ కంపించింది.


త్రికూటపర్వతంపై కొన్ని యోజనముల దూరం విస్తరించి ఉన్న లంకానగరాన్ని సువే

లాద్రిపై నిలుచుని చూశారు రామ లక్ష్మణ సుగ్రీవాదులు. చుట్టూ ప్రాకారం , బురుజులు

తీర్చిదిద్దినట్లున్న బాటలు, భవనసమూహాలు... స్వర్గలోకాన్ని తలపిస్తోంది లంక అనుకున్నారు. ఆకాశాన్ని అంటిన మహాసౌదాన్ని చూశారు. ఆ సౌదంలో రత్నకిరీటం ధరించి కొలువుదీరిన రావణున్ని చూశారు. రావణున్ని చూస్తూనే ఆగ్రహావేశాలతో ఒక్కసారిగా సుగ్రీవుడు ఊగిపోయాడు. ఒక్కసారిగా ఆకాశం లోకి ఎగిరి , రావణసౌధం పై పిడుగు పాటుగా దూకాడు. రావణున్ని సమీపించాడు.


" రావణా" అని కేక వేశాడు.

ఆ పిలుపునకు తలెత్తి , ‘ఎవరు నువ్వు?’ అన్నట్టుగా సుగ్రీవుణ్ణి చూశాడు రావణుడు.


" నా పేరు సుగ్రీవుడు. నేను శ్రీరాములవారికి మిత్రుణ్ణి. నీ బలగర్వాలని అణచడానికి వచ్చాను. కాచుకో". అన్నాడు. రావణుని మీదికి ఉరికాడు. అతని తలపై ఉన్న కిరీటాన్ని నేలపాలు చేశాడు. గదతో యుద్దానికి సిద్దమయ్యాడు. ఊహించని పరిణామం. అది అయినా తట్టుకున్నాడు రావణుడు. తాను కూడా గద అందుకుని సుగ్రీవునితో పోరాటానికి సిద్దమయ్యాడు.

చాలాసేపు ఇద్దరూ గదలతో యుధం చేశారు. మరి కాసేపు మల్లయుద్దం చేశారు. చెమ

టలూ, నెత్తురూ కలగలిపి కారుతున్నా పట్టించుకోవటము లేదు. ఇద్దరూ క్రోధావేశా

లతో పెనుగులాడారు. సుగ్రీవుణ్ణి గెలవటం కష్టమనీ అనుకున్నాడు రావణుడు.

మాయను ఆశ్రయించేందుకు సిద్దమయ్యాడు. గుర్తించాడది సుగ్రీవుడు. క్షణంలో ఆకసానికి ఎగసి , రాముణ్ణి చేరుకున్నాడు. తప్పించుకున్న సుగ్రీవుణ్ణి చూసి కోపోద్రిక్తుడయ్యాడు

రావణుడు. కిందపడ్డ గదను అందుకుని , పెద్దగా కేకలేస్తూ మందిర స్తంభాన్ని మోదాడు. అది రెండు వ్రక్కలైంది.


ప్రక్కన నిలుచున్న సుగ్రీవుణ్ణి ఆందోళనగా, ప్రేమతో చూశాడు శ్రీరాములవారు.

చెమటతో కలగలిపి కాలువలు కడుతున్న రక్తాన్ని చూసి కళవరపడ్డాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. గట్టిగా సుగ్రీవుణ్ణి కౌగలించుకున్నాడు.


మిత్రమా! ఎందుకింత సాహసం? రాజు అయిన వాడు ఏనాడు అనాలోచితంగానూ

వ్యక్తిగతంగానూ సాహసానికి పూనుకోరాదు. నీకేదేయినా జరగరానిది జరిగితే నేనేం

కావాలీ?చెప్పు?” అడిగాడు రాఘవుడు.


" రామా" అంటూ చలించిపోయాడు సుగ్రీవుడు.


" నీకు జరగరానిది జరిగితే ఏం చెయ్యాలో క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాను పరివారం

సహా రావణున్ని ముందు హతమార్చి , తరువాత లంకకు విభీషణున్ని పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆతరువాత భరతున్ని అయోధ్యకు రాజుగా చేసి నేను ప్రాణత్యాగం చేయాలనుకున్నాను. వద్దు మిత్రమా! ఇకనైనా ఎన్నడూ ఇలాంటి దుందుడుకు సాహసాలు చెయ్యకు". అన్నాడు శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి ఆప్యాయంగా నిమిరాడు.


రాముడి అభిమానానికీ, అతని స్నేహానికి జేజేలర్పిస్తూ అన్నాడిలా సుగ్రీవుడు.

" రామభద్రా! నీ సహధర్మచారిణిని హరించిన నీచుడు రావణుని చూడగానే నన్ను

నేను మరిచిపోయాను. వాణ్ణి హతమార్చిగానీ రాకూడదనుకున్నాను. కాని , వాడు మాయను ఆశ్రయిస్తున్నాడని తెలిసి తప్పుకున్నాను. లేకపోతే ..... " పిడికిలి బిగించాడు.


" అన్ని వేళలా ఆవేశాలు పనికిరావు మిత్రమా! అణచుకో". అన్నాడు రాముడు. స్వచ్ఛమైన అతని స్నేహాన్ని మెచ్చుకున్నాడు. లక్ష్మణున్ని చూశాడు.


అతనితో అన్నాడిలా.

( ఇక్కడ స్నేహధర్మం గురించి కొంచెం ముచ్చటించుకుందాం. శ్రీరాముల వారు స్నేహానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో గమనించారా. తన మూలాన స్నేహితులెవ్వరూ

బాధపడకూడదనేది ఆయన సిద్దాంతము. స్నేహితుడు లేకపోతే ప్రాణత్యాగానికైనా

వెనుదీయనని నిష్కర్షగా చెప్పిన వ్యక్తి. తన మూలాన స్నేహితులెవ్వరూ, బంధవు

లెవ్వరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదని ఆయన సిద్దాంతము. ఇటువంటి వ్యక్తిత్వము

కలవాడు కాబట్టే మనకు ఆరాధ్యదైవుడయ్యాడు)


" మన సైన్యాన్ని తీసుకును వెళ్ళి ఫలమూలాలు, చల్లని జలాలూ లభ్యమయ్యే ప్రదేశా

లలో నిలుపు".


అలాగేనన్నాడు లక్ష్మణుడు. ముందుకు నడిచాడు.

శత్రువుకి నష్టం కలిగించే అనేక శకునాలు గమనించాడప్పుడు శ్రీరాముడు. అదే సరైన సమయం అనుకున్నాడు. లంకపై దాడికి సిద్దమయ్యాడు. పరివారంతో సువేలాద్రి దిగాడు. చాలాదూరం నడిచి. ఉద్యానవనాలతో ఉన్న లంక ప్రాకారానికి చేరుకున్నాడు.

రాముడు నిర్ణయించినట్టుగానే నీలుడు, కుముద, ప్రఘస, పనసులు సహాయులుగా

కొంత సైన్యంతో తూర్పుద్వారాన్ని , శతవలీ సహాయంగా అంగదుడు దక్షిణద్వారాన్ని

సుషేణుడు సహాయంగా హనుమంతుడు పడమటి ద్వారాన్నీ ముట్టడించారు. కొండ

లా ఎత్తుగా ఉండి , మహావీరులైన రాక్షసులతో స్వయంగా రావణడు రక్షిస్తున్న ఉత్తర

ద్వారాన్ని లక్ష్మణుడు సహాయకుడుగా , విస్తారసైన్యంతో రాముడు ముట్టడించాడు.

కొండముచ్చులకు ప్రభువులైన గవాక్ష, ధూమ్రాక్షులు సైన్యం సహా రాముడికి అండగా

రెండు వైపులా నిలబడితే , మంత్రులు సహా విభీషణుడు రాముడికి దగ్గరగా నిల

బడ్డాడు.


ఉత్తర, పడమర ద్వారాల మధ్యభాగంలో జాంబవంతుని సహాయసహకారంతో సుగ్రీ

వుడు సైన్యాన్ని రక్షిస్తూ కాపలా కాశాడు. సుగ్రీవాజ్ఞ మేరకు కొండలా ఉన్న సుశేణుడు,

నలుడు, వీరబాహు , సుబాహు లు నాలుగు ద్వారాలనూ కలయతిరుగుతూ వాటిని చుట్టుముట్టారు. చెట్లూ, రాతిగుహలూ పట్టుకుని లక్షలాది వానరులు లంకలోకి గాలికూడా చొరబడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. యుద్దానికి సిద్దమయ్యారంతా.


రాముడు రాజనీతి విశారదుడు. ధర్మశాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించినవాడు. సుగ్రీవ,

విభీషణాదులతో చర్చించాడు. యుద్దాన్ని ప్రారంభించే ముందు రాయబారం పంపడం భావ్యమని చెప్పెను. అంగదుణ్ణి పిలిచి , అతనితో చెప్పాడిలా.


" అంగదా! నువ్వు లంకకు వెళ్ళి , రావణునితో , నిర్భయంగా సంభాషించు. నా మాట

లుగా ఇవి వినిపించు.


రావణా! అవివేకీ! బ్రహ్మవరగర్వంతో నువ్వు దేవ, యక్ష,నాగ, గంధర్వులకూ అప్సరస

లకు, ఋషులూ, రాజసంఘాలకి తీరని ద్రోహాలు చేశావు. ఆ ద్రోహాలకు ప్రతీకార

సమయం వచ్చిందిప్పుడు. నా భార్యను హరించి మహా తప్పు చేశావు. ఆ తప్పుకి శిక్ష

గా నీతో యుద్దం చేసేందుకు నీ కోట ముంగిట నిలుచున్నాను. ఏ బలాన్ని నమ్మి ఏ మోసంతో నా భార్యను హరించావో,, ఆ బలం ఇంకా నీకు ఉంటే రా! చావో రేవో తేల్చుకుందాం. నిజంగా నీవు వీరుడివైతే నా బాణాలను తట్టుకుని నిలబడు. లేదా మరణించి దేవతలూ, రాజర్షుల లోకం చేరుకో! కాదంటే ... ప్రాణాలు నిలుపుకోవాలంటే .. గర్వాన్ని విడిచిపెట్టి ,సగౌరవంగా నా ధర్మపత్నిని నాకు అప్పగించి , నన్నుశరణు వేడుకో!


మూర్ఖుడా! ధర్మదూరుడవు. చపల చిత్తుడవు. నీకిక నిమిషం కూడా రాజ్యాన్ని పాలించే అర్హత లేదు. నీతో యుద్దానికి నేను సిద్దంగా ఉన్నాను. అట్టే సమయం లేదు. నీకు ఇష్టమైన వాటికి వీడ్కోలు చెప్పుకో! రా! యుద్దానికి రా".

రాముడి మాటలు వల్లె వేసుకుంటూ ఆకాశానికి ఎగిరాడు అంగదుడు.

వాయువేగంతో రావణున్ని సమీపించాడు.


" నా పేరు అంగదుడు. నేను వాలి కుమారుణ్ణి. మా ప్రభువు రాముని సందేశం తీసుకొచ్చాను. విను". అన్నాడు.

రాముడు చెప్పిన ప్రతి మాటనీ అక్షరం మరచిపోకుండావినిపించాడు.

రాముడు తరఫు రాయబారపు మాటలను తట్టుకొనలేకపోయాడు రావణుడు. ఒక్క ఉదుటన సింహాసనం మీద నుంచి పైకి లేచాడు. అంగదుణ్ణి కొరకొర చూశాడు. ఆ చూపులకు అంగదుడు మండిపోతాడనుకున్నారందరూ.


" ఈ రాయబారఘట్టం రామాయణ మహా కావ్యానికి ఆయువు పట్టులాంటిది. రాయ

బార విఫలమైన తరువాత నే రామరావణ మహాయుద్దం జరుగుతుంది. "

-------------------------శుభంభూయాత్‌---------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


600 views0 comments

Comments


bottom of page