top of page

అల్లరి-వల్లరి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Allari Vallari' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


పెళ్లిచూపులు... సరదా సంభాషణలు..బావామరదళ్ళ అనురాగం...పూర్తిగా సరదాగా నడిచే ఈ కథను ప్రముఖ రచయిత, కవి అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు రచించారు.' సర్వేంద్రియానాం నయనం ప్రధానం ' అన్నారు పెద్దలు.

మరి దాన్ని తెలుగువాడు కంటికద్దుకోక వదులుతాడా?

అక్షరాలను ఏర్చికూర్చి, పదాలతో మాలలల్లి , చమత్కార సుగంధాలనద్ది తెలుగుతల్లిని అలంకరింప చెయ్యడూ....

పల్లెటూళ్ళో పెళ్ళిచూపులకని వచ్చాడు పూవిల్తుని లాంటి ( అదేనండీ... మన్మథుడు లాంటి)శరణ్‌. అతను ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. పిల్ల బావుంటుంది కన్నూ ముక్కూ తీర్చిదిద్దినట్లు ఉంటాయంటే ఓ సారి చూద్దామని వచ్చాడు. పల్లెటూరి అందాలు కన్నుల పండుగ చేస్తు న్నాయి. దారిలో కన్నులమ్రాను( చెఱుకు) ముక్కలు అమ్ముతుంటే తిన్నాడు. పూలచెట్లు నయనానందకరంగా ఉన్నాయి. కంటికి నదురుగా కనిపించిన రెండు గులాబీలని కోసుకున్నాడు. మేనమామ రాఘవేంద్రతో కలిసి నెమ్మదిగా పిల్ల ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంటి అలంకరణ కంటికి ఇంపుగా ఉంది.

పిల్లతండ్రి రామారావు మొహం మాత్రం ' కంటి చూపుతో చంపేస్తా' నన్నట్లు

ఉంది.

ఇంతలో పిల్ల తల్లి శారదమ్మ వచ్చింది. " నాయనా! ఆయన చూపే అంత! నువ్వదేం పట్టించుకోకుండా పిల్లని నీకళ్ళతో చూడు. నువ్వొస్తావని రెండురోజులుగా కళ్ళలో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తోందనుకో" అంటూండగా పిల్లవైపు దృష్టి సారించిన శరణ్‌ కంటికి సునయన బుగ్గపైన నల్లటి చుక్క కనబడి అనుమానంగా చూశాడు.

" అదేంలేదు బాబూ! కనుదిష్టి తగలకుండా అగరుచుక్క పెట్టామంతే. మాయ

దారి లోకం మీలాంటి మంచి సంబంధం వచ్చిందని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. పిల్లని ఇన్నాళ్ళూ కంటిక రెప్పలా చూసుకుంటూ పెంచాం. ఎండ ఎరుగని కన్నెపిల్ల బాబూ" అంటూ చెబుతూనే ఉంది శారదమ్మ.

ఇంతలో రాఘవేంద్ర కల్పించుకుని " ఆ... అయినా కళ్ళులేని కబోది లోకంతో మనకేం పనండీ ? ఏరా.... శరణ్‌ ! పిల్లా, నువ్వూ చూపులు కలపండి. అదిగో అలా అన్నానని మరీ కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడటం కాదు" అన్నాడు.

శరణ్‌ చూశాడు. వాళ్ళమ్మ చెప్పినట్లు తన కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినట్లుంది. వాళ్ళమ్మ చెప్పకపోయినా తనని చూడగానే సునయన కళ్ళు మెరవటం, వెలిగిపోవటం గమనించాడు. కళ్ళు జిగేల్మనిపించే సునయన అందాన్ని చూసి కళ్ళు తిరిగాయి శరణ్‌ కి.

పరాయి ఆడపిల్లని కన్నెత్తి చూడనివాడు శరణ్‌. పరపురుషుణ్ణి కన్నెత్తకుండా కూడా చూడని మనస్తత్వం సునయనది. కళ్ళు మిరుమిట్లు గొలిపే అందం వాళ్ళిద్దరిదీ. వారిరువురి కళ్ళు కలిసిన శుభసమయంలో హఠాత్తుగా మూడోకంటి వాడికి తెలీకుండా కన్ను కొట్టాడు శరణ్‌. సిగ్గుల మొగ్గయ్యింది సునయన. తొలి చూపులోనే నచ్చేశాడు శరణ్‌. ఆమె కళ్ళలో ఆనందబాష్పాలు చిప్పిల్లాయి. కనులారా చూసుకుంటున్నారిద్దరూ.

" చూసింది చాలు. ఇంక మాలోకంలోకి రండి" అన్నాడు రాఘవేంద్ర.

" ప్రొద్దున ఎడం కన్ను అదిరినప్పుడే అనుకున్నాను అన్నయ్యగారూ ఈ రోజు శుభం జరుగుతుందని" అంటున్న రామారావును, కనుసైగతో ఆపి “అదేనండీ.... నా కుడి కన్ను అదిరిందని చెప్పినప్పుడు" సవరించింది శారదమ్మ.

" ఏరా శరణ్‌... . " పిలిచాడు రాఘవేంద్ర. ఇంకా సునయననే చూస్తున్నాడు శరణ్.

" ఏరా ! కళ్ళు నెత్తికెక్కాయా ? ఈ కాసేపటిలోనే కని, పెంచిన వాళ్ళని మర్చిపోయి కనిపించిన వాళ్ళని చూస్తూ ఉండిపోవడమే?" అని గట్టిగా అనడంతో ఈ లోకంలోకి వచ్చారిద్దరూ.

" ఇంక వీళ్ళేమీ చెప్పక్కర్లేదు. కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకట్లో పడేసినా , ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూనే ఉంటారు. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టించండి. లేకపోతే వీళ్ళు మన పెద్దల కళ్ళుగప్పి తిరిగే ప్రమాదముంది" అభ్యర్థనగా అన్నాడు రాఘవేంద్ర.

" మీరు వెంటనే ఒప్పుకుని , వెంటనే ముహూర్తమనే సరికి కళ్ళు తిరిగినట్లై

నా నోట మాట రావట్లేదు. ఆనందబాష్పాలతో కన్నీళ్ళు కరిగి, కళ్ళు మసకలు కమ్మాయంటే నమ్మండి" అంటూ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు రామారావు.

తుండుతో కళ్ళు తుడుచుకున్నాడు.

అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

" నాన్నా ... మరి నా కెప్పుడు పెళ్ళి?" లేడి పిల్లలా గెంతుతూ వచ్చింది వల్లరి.

" మీకు ఇంకో పిల్ల కూడా ఉందా ?" అడిగాడు రాఘవేంద్ర.

" ఆ. . ఒక కన్ను కన్నూ కాదు. . ఓ బిడ్డ బిడ్డా కాదనుకుంటే , ఇదిగో ఇది పుట్టింది. వల్లరి కాదు. మహా అల్లరి. " ముద్దుగా మొట్టింది శారదమ్మ.

" ఆహా ! నా కోసం తపస్సు చేసి , కంటికీ మంటికీ ధారగా ఏడిస్తే .... పోన్లే కదా అని పుట్టా కదూ నాన్నా ?" చురుకైన కళ్ళతో నవ్వింది వల్లరి.

" నువ్వేం చదువుతున్నావమ్మా ?"

" ఎంసీఏ అయిపోయిందండీ " చెబుతూనే బావగారి వైపు దొంగచూపులు చూస్తోంది. అక్క దగ్గరకెళ్ళి చెవిలో " కళ్ళు కుడుతున్నాయే మీ ఆయన్ని చూస్తే" అంటూ మెల్లగా గిల్లి పరిగెత్తుకుంటూ బాల్కనీ పైకెళ్ళి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని ఊహల్లోకి వెళ్ళింది.

ఆనంద్ బావ గుర్తొచ్చాడు. అతని నిండు కనుల కొలనులో కదలాడే తన రూపం గుర్తొంచ్చింది. ఎంత అల్లరోడో... .

కళ్ళంటేనే కాటుక,

బావుంటేనే వేడుక..... .

ఇలాంటి శుభకార్యం ఇంట్లో జరుగుతుంటే ఎక్కడ తిరుగుతున్నాడో....వస్తే బావుణ్ణుకదా.... అనుకుంది.

ఆనంద్‍ స్వయాన వల్లరి మేనత్త కొడుకు. రామారావు దంపతులకు సునయన పెళ్ళితో బాటు వల్లరి- ఆనంద్‍ ల పెళ్ళి కూడా చెయ్యాలనే ఆలోచనలున్నాయి. అయితే ఈ విషయం సునయనకి పెళ్ళిసంబంధం కుదిరే వరకూ ఆనంద్‍కు చెప్పొద్దన్నారు.

అందుకే వల్లరి తన కళ్ళలో ఆనంద్‍ని బంధీగా ఉంచి అల్లరి చేస్తోంది.


" కళ్ళలో పెళ్ళిపందిరి కనపడసాగే... .

పల్లకీలోని ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే... ... "

హుషారుగా ఈలపాట పాడుకుంటూ గేటు దగ్గర కనిపించాడు ఆనంద్. వల్లరి తుళ్ళిపడే కళ్ళతోనే నవ్వి ' మంచి పాటే బావా.... కానీ పెళ్ళి నీకు కాదుగా ... . త్వరగా లోపలికి రా....' అంది. దాంతో ఆనంద్ అమీతుమీ తేల్చేయాలన్నట్లు ఇంట్లోకొచ్చేశాడు.

" ఏమిట్రా ! ఇంత హటాత్తుగా దిగబడ్డావ్‌?" అడిగాడు రామారావు, మేనల్లుడు ఆనంద్‍ ని.

" ఏమిటి మామయ్యా ... ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఒకళ్ళకే పెళ్ళి చేస్తావా ?" అయినా కుడి కంటికో న్యాయం, ఎడమ కంటికో న్యాయమా?" అడిగాడు ఆనంద్‍.

" అయినా మంచిసంబంధం దొరకాలిగదరా దానిక్కూడా!" అంది శారదమ్మ

" అవున్లే మీ కళ్ళకి మేమేం కనబడతాంలే... . చెట్టంత మేనల్లుణ్ణీ, చిన్నప్పట్నుంచీ వల్లరే ప్రాణంగా బతుకుతున్న వాణ్ణీ నేను మీ కంటికి ఆనట్లా? కళ్ళల్లో పెట్టుకు చూసుకుందామనుకున్నాను. అయినా నా లాంటి చిన్న బ్యాంక్ ఉద్యోగస్థుడు మీ కంటికి ఎలా కనబడతాడ్లే" కోపంగా అడిగాడు ఆనంద్.

" ఎందుకు రా ఆనంద్‍ అలాంటి మాటలు? మా కంట్లో కారంగొట్టి మీరిద్దరూ వేసే వేషాలు తెలియవనుకున్నారా? సునయన గురించే ఆగాం నాయనా! ఈ సంబంధం ఖాయమయ్యాక అన్నయ్యగారితో అదే ... మీ నాన్నగారితో మాట్లాడి పిల్లలిద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి చెయ్యాలనే మా ఆలోచన. అంతేగానీ మా కళ్ళు బైర్లూ కమ్మలేదు. మూసుకునీ పోలేదు .... సరేనా ?" కుండ బద్దలు కొట్టింది శారదమ్మ.

" నిజంగానా అత్తయ్యా"

" నిజమే నాయనా। లేకపోతే కనుపాపే కంటిని మింగినట్లు చెబుతామనుకున్నావా ఏంటీ? మరీ అంత కన్నూ మిన్నూ కానకుండా లేరయ్యా మీ మేనమామ".

" ఛఛ ... . నా ఉద్ధేశం అది కాదత్తయ్యా నేనేదో మామయ్య ఆస్తిమీద కన్నేసి వల్లరిని చేసుకుంటానంటున్నానని మీ రెక్కడనుకుంటారోనన్నదే నా భయం... . అంతే".

మాకు ఆడపిల్లలిద్దరూ రెండు కళ్ళు. ఆస్తైనా పాస్తైనా వాళ్ళకే. ఇందులో ఏముందయ్యా?" అన్నాడు మేనల్లుడుతో రామారావు.

" ఇప్పటికైనా కళ్ళు తెరవండర్రా పిల్లలూ... . మా పెద్దవాళ్ళం ఎప్పుడూ మీ మంచే కోరతామని తెలుసుకోండి. " కల్పించుకుంటూ అన్నాడు రాఘవేంద్ర. వల్లరి కనుసైగతో సునయన లోపలికి వెళ్ళింది.

" మామయ్యా! ఇంక బయలుదేరుదామా!" అంటున్న శరణ్‌ వైపు ఓరకంటితో చూసి

" ఇదిగో అన్నయ్యగారూ.... ఈ పిల్లలు నలుగురినీ ఓ కంట కనిపెట్టి ఉండటం మంచిది. జాగ్రత్తండోయ్‌! వీళ్ళ కన్నుల బాసలు, కలలుకనే కళ్ళు చూస్తూంటే , ఇంక పెళ్ళికి ఆలస్యం అనవసరం. శుభస్య శీఘ్రం" అన్నాడు రాఘవేంద్ర.

" హమ్మయ్య ... రెండు పెళ్ళిళ్ళూ ఒకేసారి చెయ్యకపోతే ఈ వల్లరి నా కంట్లో నలుసై కూర్చోదూ. అసలే కంటబడ్డ పాముని కన్నాన పోనివ్వని మనస్తత్వం దానిది" ముక్తాయింపు ఇచ్చింది శారదమ్మ.

" నా కళ్ళు తెరిపించావత్తయ్యా . ఇంక మా పెళ్ళికోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తాం" అంటున్న ఆనంద్ తో...

" ఇన్నాళ్ళూ మూసుకుపోయాయా ....బావా... చాల్చాలుగానీ బ్యాంక్‌కి బయలుదేరు” చిలిపిగా చూస్తూ అంది వల్లరి… అదే... అల్లరి.

" మీ మేనల్లుడి మీద కూడా ఓ కన్నేసుంచండి. ఎందుకైనా మంచిది" రామారావు రాఘవేంద్రతో అనడంతో అందరూ హాయిగా నవ్వుతుంటే , వెంటనే సునయన మీది నుంచి కన్ను మరల్చాడు శరణ్‌.

-------------------శుభం భూయాత్‌------------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


344 views0 comments

コメント


bottom of page