top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

శ్రీవారికి ప్రేమలేఖ

ఈ కథ వినడానికి ప్లే బటన్ నొక్కండి.







Video link

'Srivariki Premalekha' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

శ్రీవాణికీ శ్రీధర్‌కీ పెళ్ళి నిశ్చయించారు. శ్రీధర్‌ ఎనభై వేలు తెచ్చుకునే సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌. శ్రీవాణి యాభై వేలు తెచ్చుకుంటూ వేరే కంపెనీలో పనిచేస్తోంది.


అన్నీ ఓకే అయ్యాక ముహూర్తాలు పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ( మాఘమాసం) లో పెళ్ళి.

శ్రీధర్‌కి ఒకరోజు పోస్ట్‌మెన్‌ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు.


ఉత్తరం విప్పుతూంటే గుప్పుమంది పరిమళభరితమైన సెంటు వాసన. విప్పాక అందమైన చేతివ్రాత దర్శనమిచ్చింది.

కళ్ళు పరుగులు తీశాయి.


"ప్రియాతి ప్రియమైన ధర్‌... అదే శ్రీధర్‌ గారూ, ఆ రోజు మిమ్మల్ని చూసాను. మొదటి చూపులోనే నా మనసు మీ వశమైంది. లాభం లేదు…. నా మనస్సును

లాగి బైట పడేయలేను. ధర్‌ ! నిన్ను వదిలి నేను వుండలేను. ఇంత గాఢంగా ప్రేమించానేంటి మిమ్మల్ని...

నేనూ అందగత్తెనే. శ్రీవాణి కన్నా మంచి రంగు నాఒళ్ళు. . . . శ్రీవాణిని మరిచిపోయి, ఆ పెళ్ళి ఆపు చేసి నన్ను పెళ్ళి చేసుకో..


విచ్చుకున్న విరిదండలా ఆకర్షిస్తూ మరుమల్లెలా గుబాళిస్తూ వుంటాను. మీ ఫోటో నా దగ్గర వుంది. నా గుండెలో మీ ప్రతిమ గూడు కట్టి వుంది. స్వఛ్ఛమైన హంస లాంటి మనసు నాది. ముట్టుకుంటే కంది పోయే కనకాంబరంలా సుతిమెత్తని తనువు నాది. నా కేమీ కోరికలు లేవు. ఒక్క మిమ్మల్ని పెళ్ళాడాలన్న కోరిక తప్ప.


శ్రీవాణిని మరిచిపొండి. నే నంటే మీ కిష్టం అనుకుంటే రేపు గ్రీన్‌ షర్ట్‌, బ్లాక్‌పాంట్‌ ధరించి ఆఫీసుకు వెళతారు. అదే నాకు గ్రీన్‌ సిగ్నల్‌. నేనంటే మీకు ఆపేక్షా, ప్రేమా వున్నట్టు లెక్క. శ్రీవాణిని మీరు కాదంటే ఇంకొకరిని పెళ్ళాడి సుఖంగా కాపురం చేసుకోగలదు. కానీ నాకు మీరొక్కరే. మీతో పెళ్ళి. కాకపోతే ఆజన్మ బ్రహ్మచారిణి గా వుండి పోతాను జాగ్రత్త. నా ప్రేమను మీరు అంగీకరించి తీరాలి. లేకపోతే చావే గతి.

ఇట్లు మీ మల్లి. . . . . . . . "


శ్రీధర్‌ నిర్ఘాంతపోయీడు ఆ ఉత్తరం చదివి. అతనికి ఒక ప్రక్క సంతోషం, మరో ప్రక్క భయం కలిగింది.


‘ తనంటే అంత ఇష్టమా ఈ అమ్మాయికి. అయితే ముందు ఎందుకు చెప్పలేదు…! తనకి పెళ్ళి ఖాయం అయ్యాక ఇప్పుడా ఈ ప్రేమలేఖ…


తన ఆఫీసులో పనిచేసే హిమజ.. వాసవి.. గిరిజ గుర్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురికీ తనంటే ఇష్టం. కానీ తనంటే ప్రాణం ఎవరికో తెలుసుకోవాలి.

లంచ్‌ అవర్‌ లో తన కేబిన్‌ నుంచి బయటకొచ్చాడు. అక్కడే హిమజ ఓరగా చూసింది అతన్ని.


వాసవి వచ్చి ' రండి శ్రీధర్‌! కలిసిభోంచేద్దాం’ అంది.

గిరిజ ' ఏం కూర తెచ్చుకున్నారు ధర్‌ గారూ !’ అంది చిలిపిగా చూస్తూ.

గతుక్కుమన్నాడు శ్రీధర్‌. ఆ ప్రేమలేఖ రాసింది గిరిజ నా ! మిల్కీ వైట్‌ గిరిజ నిజంగా సన్నజాజి మొగ్గలాగానే వుంటుంది. తనను ఎప్పటినుంచి లవ్‌ చేస్తూ వుందో! శ్రీ తో పెళ్ళి అనగానే ప్రేమలేఖ రాసింది! ఏమిటో గందరగోళంగా వుంది!


మరునాడు స్నానపానాదులు అయ్యాక కాసేపు ఆలోచనలో పడ్డాడు. పాపం మల్లి తను చెప్పినట్లు ఒప్పుకోక పోతే బాధ పడుతుందేమో! చేసుకుంటే మల్లి అంటే తనకు ఇష్టమని అర్థం. అఫుడు పాపం శ్రీవాణి... పెళ్ళి పీటలమీద ఎక్కవలసిన శ్రీవాణి బాధ పడుతుందేమో! ఎలారా దేవుడా... కొత్త చిక్కే తెచ్చావు! తను కాలేజీ లోనూ, యూనివర్సిటీ లోను చదివేటప్పుడు ఏ అమ్మాయి అయినా తనకు ప్రేమలేఖ రాస్తే ఎంత బాగుండును అని ఉరకలేసేవాడు, ఆశపడేవాడు. ఎవరూ రాయలేదు.


ఇప్పటికి కోరిక తీరింది , కానీ కొంచెం లేట్‌. . . కానీ శ్రీ బాధ పడినా తనకు ప్రేమలేఖ రాసిన అమ్మాయినే పెళ్ళాడాలి. అప్పుడే తన మనసుకు శాంతి. గ్రీన్‌ షర్ట్‌, బ్లాక్‌ పాంట్ ధరించాడు.


ఆఫీసులో పూబంతులందరూ తనను ఆశగా చూస్తున్నట్లు ఫీలయ్యాడు.

" సార్‌, మీ డ్రెస్‌ అదుర్స్‌” అంది హిమజ అతని రూంకొచ్చి.


హిమజ ఆకుపచ్చ జార్జెట్‌ చీర ధరించి వుంది. సందేహం లేదు ఆ ప్రేమలేఖ రాసింది హిమజయే...


‘ఐ లవ్‌ యూ హిమజా’ అనుకున్నాడు మురిసిపోతూ.

" సార్‌ ఏదో కలల్లో విహరిస్తున్నట్లున్నారు. !" అంది హిమజ మురిపెంగా చూస్తూ.

‘మజా మజా’ అనుకున్నాడు సంతోషంతో...


ఇంటికి రాగానే తల్లి ఉత్తరం అందించింది. ఉత్తరం చేతి లోకి తీసుకోగానే ఎలక్ట్రిక్ షాక్‌ లా అనిపించింది.

' ఎవరు రాసారు రా ' అంది తల్లి.

‘మా ఫ్రెండ్‌’ అంటూ గదిలోకి నడిచాడు.


విప్పగానే గుప్పుమంది సెంట్‌ వాసన. విప్పాడు ఆత్రుతగా -

“ధర్‌.. ఎంత అందం గా వున్నావు ఆ డ్రెస్‌ లో... ఒక్క మాటలో చెప్పాలంటే చుక్కల్లో చంద్రుడిలా వున్నారు. మీరు చాలా మంచి మనస్సు గలవారు. నన్ను చూడాలనే ఆత్రుతగా వుంది కదూ. . ! నన్ను ప్రేమించానని చెబితే అప్పుడు ఎదురు పడతాను. మీరు శ్రీవాణి తో పెళ్ళి ఆపండి. శ్రీవాణి తో షాపింగ్‌ చేసారు క్రితం వారం. నా మనసెంత బాధ పడిందో మీకేం తెలుసు..! ఇన్నాళ్ళూ నోరు మూసుకొని వున్నాను. అది నా తప్పే! లోలోన మిమ్మల్ని ఆరాధించి ప్రేమ పిచ్చిదాన్నయ్యాను. మీతో నా పెళ్ళి జరగాలి. మీ ప్రేయసి రోజూ.. రోజూ.. భగవంతునితో మొరపెట్టుకుంటూ వుంది. ఒకపూట భోజనం… రెండో పూట పస్తు. కక్క.. ముక్క లేకపోతే ముద్ద దిగని నాకు మీతో పెళ్ళి కోసం దొండ, బెండ, వంకాయ, సొరకాయలే తింటానని మొక్కుకొని , ఆ భగవంతుడికి పూజ చేస్తున్నాను.


ఇప్పటికైనా నమ్మగలరా.. నా ప్రేమ ఉత్తుంగ తరంగమని, నా ప్రేమ హిమాలయ శిఖరం అని.. నా ప్రేమ మీ ఆఫీసు లో మిస్‌ లకంటే అందమైనదని, శ్రీవాణి కంటే నాజూకుదని.. నా ప్రేమ మీ ఎదురింటి అమ్మాయి విరజ కంటే సొగసైనదని తెలుసుకోండి. 'ధర్‌! నన్ను ప్రేమించడం నేర్చుకోండి. నన్ను పెళ్ళాడి శ్రీలూకి టాటా చెప్పేయండి.. శ్రీలూ ఏడుస్తుందని భయమా! శ్రీలూ ఇంట్లోని పెద్దవాళ్ళు ఆ చెంపా , ఈ చెంపా వాయిస్తారని భయమా..! మీ నాన్నగారు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని బెదిరిస్తారని భయమా..! ఎందుకు భయం? భయం లేని వాడు బ్రతుకును పాలసముద్రంలో ముంచుకుంటాడు. భయం వున్న వాడు బ్రతుకును నీళ్ళ సముద్రంలో ముంచుకుంటాడు. శ్రీలూకి చెప్పేయండి పెళ్ళి జరగదని! నా కోసం శ్రీలూకి చెప్పేయండి ! నా కోసం కొండ మీద కోయిల నైనా దింపుకొస్తారని కోటి ఆశ లతో వున్నా. మత్తు లతో మత్తెకించే, మళ్ళీ, మళ్ళీ కావాలనిపించే మీ మల్లి

బై బై...."


తలపట్టుకున్నాడు శ్రీధర్‌. ఏది ఏమైనా మల్లినే పెళ్ళి చేసుకోవాలనే స్థితికి వచ్చేసాడు.శ్రీవాణితో ఆ మాట చెప్పాలి. పెళ్ళిని ఆపగల సత్తా శ్రీవాణి కే వుంది. ముందు పెళ్ళి ఆపాలి. మల్లి తో పెళ్ళి సెటిల్‌ చేసుకోవాలి. మరి ఆలోచించలేకపోయాడు శ్రీధర్‌. శ్రీవాణికి సెల్‌ ఫోన్‌ తీసి కాల్‌ చేసాడు.

" హలో శ్రీలూ నిన్ను పెళ్ళి చేసుకోలేను. "


"వా...ట్‌...? అటునుంచి శ్రీలు గొంతు కీచుగా అరిచింది. నీతో వివరంగా మాట్లాడాలి. సాయంత్రం నాలుగు గంటలకి రామకృష్ణా బీచ్‌ దగ్గర వెయిట్‌ చేస్తూ వుంటాను. " సమాధానానికి ఎదురు చూడకుండా ఫోన్‌ పెట్టేసాడు. సాయంత్రం నాలుగు వరకు ముళ్ళమీద కూర్చున్నట్లుగా గడిపాడు.


రామకృష్ణా బీచ్‌ లో కూర్చొని ఎదురు చూస్తూ వుంటే శ్రీలూ వచ్చింది. ముఖం వాడి పోయిన కమలంలా వుంది. మనస్సు చివుక్కుమంది. తప్పదు. చెప్పేయాలి. శ్రీలూ పదిలంగా కూర్చొని " హు చెప్పండి" అంది.


శ్రీధర్‌ మరి ఆలస్యం చేయలేదు. తన జేబులోంచి ప్రేమలేఖల కట్ట తీసి శ్రీలూ చేతిలో పెట్టి చదువు అన్నాడు.


శ్రీలూ అర్థం కానట్టు ఆ ప్రేమలేఖల ని తీసుకుని చదివి అర్థం అయినట్లుగా అతని వైపు చూసి " చెప్పండి...!” అంది. “చెప్పేదేముంది. ! నేను ఆ ప్రేమలేఖల ధాటికి ఆ మల్లిని మరిచిపోలేకపోతున్నాను. నన్ను క్షమించు శ్రీలూ, నేను నిన్నుపెళ్ళి చేసుకోలేను. "

ఫక్కున నవ్వింది శ్రీవాణి. బిత్తరపోయి చూసాడు శ్రీధర్‌.


' ఆ మల్లి ని నేనే. మీకో చిన్న పరీక్ష పెట్టాను ' అంది. వెలవెలబోతూ చూసాడు శ్రీధర్‌. " నా పరీక్ష లో మీరు తప్పారు. అయినా మీ మీద నాకు అపారమైన ప్రేమ. మన పెళ్ళి జరుగుతుంది. "

ఆ మాటకి సిగ్గు గా తల వంచుకున్నాడు.


“నన్ను కాదని ప్రేమలేఖల ' మల్లి' ని మీరు ఇష్టపడ్డారు. అయినా సహిస్తున్నాను”

శ్రీవాణి అన్న మాటకి తల ఎత్త లేక " ఆడదాని మనస్సు ఎంత గొప్పది! మగవాళ్ళు ఊసరవెల్లులు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు" అనుకున్నాడు మనస్ఫూర్తిగా….


***శుభం***


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.



లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.

390 views0 comments

Comments


bottom of page