కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Inspector Sivani' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
శివాణీ పేరు లోనే కాదు, పౌరుషంలోనూ అంతే! మనిషికి కోపము వస్తే శివమెత్తడమే. తెలంగాణ శకుంతల టైపు. నౌగాన్ జిల్లాలోని గరోలీ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అవుట్‌పోస్టింగ్ ఇన్‌చార్జ్ గా విధులు నిర్వహస్తోంది. ఇంతకుముందు అక్కడ ఈవ్ టీజింగ్‌లూ, రాగింగ్‌లూ, దొంగతనాలూ ఎక్కువగా జరిగేవి. శివాణీ అక్కడ చార్జ్ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు పక్కా నిఘా , పెట్రోలింగ్ తో కాపుకాస్తూ ఆడవాళ్ళకు రక్షణ ఇస్తోంది. నిందితులకు కౌన్స్‌లింగ్ ఇస్తూ... వీలైతే ఫోర్త్ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కేసులని త్వరగా పరిష్కరించి క్లోజ్ చేయడం లో కూడా శివాణీ ముందుంటుంది. అందుకే పోలీస్ అధికారులు ఆమెని ‘లేడీ సింగం’ లేక ‘పోలీస్ శివంగి’ అంటూంటారు.
శివాణీ వాళ్ళది మధ్యప్రదేశ్ లోని ' కథువా' అనే కుగ్రామం. తండ్రి మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. తల్లి గృహిణి. నలుగురు అక్కచెళ్ళెళ్ళు. ఉన్న దానితోనే ఎంతో సంతోషముగా గడిపేవాళ్ళు. కానీ విధి చిన్న చూపు చూడటంతో ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే విధివక్రించి ఓ రోడ్డుప్రమాదం లో వాళ్ళ నాన్న చనిపోయాడు. కుటుంబ భారం మొత్తం తల్లిపైనే పడింది. వాళ్ళ అమ్మ అసలు చదువుకోలేదు. తండ్రి మరణం, తల్లి పైన ఆ నలుగురు పిల్లల బాధ్యతను పెట్టింది. దాంతో దిక్కుతోచని పరిస్థితులలో అమ్మ చుట్టుపక్కల ఇళ్ళల్లో పాచిపని చేయడం మొదలు పెట్టింది. అమ్మ అలా ఇల్లూ, ఇల్లూ తిరిగి పనులు చేస్తుంటే శివాణీకి ఏడుపొచ్చేది. అర్ధాకలితో అమ్మ పిల్లలకోసం ఎప్పుడూ కష్టపడుతూ వుండేది. నిరంతరం పిల్లల భవిష్యత్ కోసమే ఆలోచించేది. పిల్లలని బాగా చదివించాలనుకునేది.
అలా వాళ్ళకు దగ్గర ఊళ్ళోనే గవర్నమెంట్ కాలేజీలో శివాణీ ఇంటర్ వరకూ చదివింది. ఆ తరువాత సాగర్ లోని డాక్టర్ హరిచంద్ యూనివర్సిటీలో ‘ఎం. ఏ’ చేసింది. అ సమయం లోనే తల్లికి భారం కాకుండా ఒక గది తీసుకుని ఉంటూ కాలేజీకి వెళ్ళేది. ఉదయం, సాయంత్రం చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్ లు చెబుతూ తన ఖర్చులకు సంపాదించుకునేది. అలా చదువు పూర్తయ్యాక తల్లి కోరిర మేరకు కానిస్టేబుల్ పోస్ట్ కి అప్లై చేసింది.
ఎందుకంటే అప్పటి వరకూ వాళ్ళ ఊరు నుండి పోలీస్ ఉద్యోగానికి ఎవరూ వెళ్ళ లేదు. చదువుకోక పోవడం వల్లనే అక్కడందరూ పోలీసులంటే చాలా భయపడతారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోలీస్‌స్టేషన్ కెళ్ళి ఫిర్యాదు చేయాలంటే కూడా చాలా భయపడేవారు. అందుకే 'నువ్వు పోలీస్ అయితే బాగుంటుంది' అని అంది వాళ్ళ అమ్మ. అందుకే చదువయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసింది శివాణీ. రాత పరీక్ష, పరుగు పందాల్లో ఎంపికై కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించుకుంది. కానీ ఆ ఊళ్ళో ఆడపిల్లల పట్ల వివక్ష చాలా ఎక్కువ. ' ఇప్పడు మీ అమ్మాయికి ఉద్యోగం అవసరమా' అంటూ ఎంతో మంది వాళ్ళ అమ్మని నానా రకాలుగా మాట్లాడారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా శివాణీని ప్రోత్సహిస్తుండేది. శివాణీ కూడా కానిస్టేబుల్ ఉద్యోగంతో ఆగిపోకుండా, ఎస్‌ఐ. పోస్ట్ కి దరఖాస్తు చేసి ఆ ఉద్యోగం తెచ్చుకుంది.
అసలు విషయానికొస్తే... గతేడాది శివాణీ పని చేస్తున్న స్టేషన్ పరిధి లో ఓ బడా వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ కేసును లోతుగా పరిశీలించిన శివాణీకి, అది హత్యయని అర్థమైంది. దాంతో దర్యాప్తును ముమ్మురం చేయడంతో ‘ఆ హత్య చేసింది మరెవరో కాదు, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏళ్ళ తరబడి వెతుకుతున్న బలదేవ్’ అని తెలిసింది. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొదట అతని అనుచరులు కొందరిని అరెస్టు చేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బలదేవ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. దాంతో మిగతా విషయాలన్నీ పక్కనబెట్టి అతడి కోసమే వెతకడం ప్రారంభించింది.
దాంతో చాలా మంది, 'ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావ్? వాడు దొరకడు... దొరికేవాడైతే ఎప్పుడో పై అధికారులకే దొరికేవాడు' అంటూ నిరాశ పరిచేవారు. ఆ మాటలకి, 'ఎన్నో కుటుంబాలని బాధ పెట్టాడు వాడు... ఎంతో మందికి తండ్రులని, భర్తలనీ దూరం చేశాడు వాడు. ఆ కుటుంబాల బాధేంటో నాకు తెలుసు. తండ్రి లేని కూతురుగా తల్లి కష్టంతో పెరిగిన నాకు తెలుసు' అని కసిగా మనసులో అనుకుంది. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది.
బలదేవ్ మూడు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నఓ కరుడుగట్టిన నేరస్తుడు. హత్యలూ, అత్యాచారాలూ, దారిదోపిడీలూ , పిల్లల కిడ్నాపులవంటి ఎన్నో నేరాలకు పాల్పడి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పదేళ్ళుగా ఖాకీలతో దోబూచులాడుతున్న బలదేవ్ కోసం మహామహులే రంగంలోకి దిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కినట్టే చిక్కి చేజారిపోయేవాడు. ముప్పుతిప్పలు పెట్టి పోలీసులకు మూడు చెరువుల నీళ్ళు తాగిస్తూ తలనొప్పిగా మారిన బలదేవ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. దాంతో ఎలాగైనా పట్టుకు తీరాలనే కసి పోలీస్ శాఖ లో బాగాపెరిగింది. అతడిని పట్టుకుంటే పదిలక్షల రూపాయలు బహుమతి, మరియూ ప్రమోషన్ కూడా ఇస్తామని ప్రకటించింది పోలీస్ శాఖ.
నాలుగు నెలలక్రితం... ' లేడీ సింగం' లేక 'పోలీస్ శివంగి' అని ఉన్నతాధికారులంతా పిలుచుకునే శివాణీ చేతికొచ్చింది ఆ కేసు. ‘అసలేం జరిగింది…? ఉన్నతాధికారులే తలలు పట్టుకున్న కేసును ఓ ముప్పై ఏళ్ళ మహిళ ఎలా ఛేదించింది? ఏమిచేసి అతడిని రెడ్‌హాండడ్ గా చట్టానికి పట్టించింది’ అనే సందేహాలు కలుగుతున్నాయి కదూ... మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే శివాణీ గురించి తెలుసుకుని తీరాలిసిందే.
సరిగ్గా అప్పుడే మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు బలదేవ్ ను పట్టుకోవడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇన్‌చార్జ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందా అని చూస్తున్నప్పుడే అధికారులకు శివాణీ గురించి తెలిసింది. ఆమె ట్రాక్ రికార్డ్, కేసులు పరిష్కరించిన తీరూ నచ్చడంతో పాటూ ఎలాగైనా బలదేవ్ ను పట్టుకోవాలని శివాణీ పడుతున్న తపనకు ఇంప్రెస్ అయి, ఆ బృందానికి ఇన్‌చార్జ్ గా నియమించారు.
తాను తలచిందే దైవము కూడా తలచినట్లు అధికారులు తనని నమ్మి... మూడు రాష్ట్రాల పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న నేరస్తుణ్ణి పట్టుకునే బాధ్యతను తనపై పెట్టినందుకు రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగింది శివాణీ.
ఆడవాళ్ళు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఆ కేసు ద్వారా నిరూపించాలనుకుంది. అందుకని ఆ కేసు ఛేదించే పనిలో నిమగ్నమైంది. నిద్రాహారాలు మాని బలదేవ్ వ్యక్తిగత జీవితం, చేసిన నేరాలు, అతని బలాలు, బలహీనతలవంటి వాటిని సేకరంచడం మొదలు పెట్టింది. ఆ సమాచారంతో ఓ పుస్తకాన్నే తయారు చేసుకుంది.
అప్పుడు తెలిసిన ఓ విషయమే శివాణీ అనుకున్నది సాధించడానికి కారణమైంది. అదేంటంటే బలదేవ్ బలహీనత.. ఆడవాళ్ళ పొందుకోసం అతడేమైనా చేస్తాడు. అందుకు ఛమేళి అనే మహిళ అతడికి సహకరిస్తుండేది. కానీ ఛమేళికి బలదేవ్ ఎక్కడుంటాడు అనేది మాత్రం తెలియదు. కేవలం డబ్బు కోసమే అదంతా చేస్తుంటుంది. ఆ ఒక్క క్లూ తోనే శివాణీ పది అడుగులు ముందు కేసింది.
‘షాలినీ’ అనే పేరుతో తన ఫోటోల్ని ఛమేళి కి పంపింది. ఆసక్తి ఉన్న అబ్బాయిలను తనకి పరిచయం చేయమని చెప్పింది. తరచూ ఛమేళీ కి ఫోన్ చేస్తూ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుంది. కొన్ని రోజులకు శివాణీ కి ఓ ప్రయివేట్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అది ఖచ్చితంగా బలదేవ్ ఫోనే అని శివాణీ అనుమానించింది. అయితే అతడు పేరు మాత్రం చెప్పకుండా రోజూ గంటల కొద్దీ మాట్లాడుతుండేవాడు.
అతడు మాట్లాడుతున్న ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి దాడి చెయ్యొచ్చు. కానీ పొరబాటున అతడు తప్పించుకుంటే మళ్ళీ నమ్మించడం కష్టమవుతుందని ఆ దిశగా ప్రయత్నించకుండా ఓపిక పట్టింది. తనకు ఫోన్ చేస్తున్నది బలదేవ్ అవునో , కాదో మాత్రం నిర్ధారించుకోలేక చాలా సతమతమయ్యేది.
ఇదిలా ఉంటే... శివాణీ ఫోటోలు నచ్చిన బలదేవ్ ఆమెని టెస్ట్ చేయడానికి, అడిగిన ప్రశ్నలే అడుగుతుండేవాడు. అసభ్యకరమైన మాటలు మాట్లాతుండేవాడు. ఏ సమయంలో పడితే ఆ సమయం లో ఫోన్ చేసేవాడు. ఏం మాట్లాడినా, ఎప్పడు మాట్లాడినా, ఎప్పుడు ఫోన్ చేసినా విసుక్కోకుండా ఓపిగ్గా సమాధానాలు చెప్పేది. దాంతో కొన్నాళ్ళకి ఆమెపై నమ్మకం కలగడంతో తన పేరు చెప్పాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న శివాణీ ఆ మరునాడు తనని ప్రేమిస్తున్నాననీ , పెళ్ళి చేసుకుందామనీ అడిగింది. అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్న బలదేవ్ వయసులో ఉన్న అమ్మాయి అడగడంతో కాదనలేక పెళ్ళికి సిద్దమయ్యాడు.
దాంతో ఆ మరునాటి ఉదయాన్నే పెళ్ళి బట్టలతో యూపీ- ఎం. పీ సరిహద్దు లోని ఓ ఊళ్ళో ఉన్న గుడికి రమ్మని చెప్పింది శివాణీ. ఆ విషయం తన బృందంలోని సభ్యులకు తప్ప మరెవరికీ తెలియకుండా చుట్టుపక్కల సివిల్ డ్రెస్ లో పోలీసులను ఉంచింది. తనుకూడా అతను చెప్పినట్లు ఆకుపచ్చరంగు చీర కట్టుకుని పెళ్ళి కూతురులా తయారై హ్యాండ్‌బాగ్ లో ఫోన్‌గన్ తో వెళ్ళింది.
కాసేపటికి బలదేవ్ పెళ్ళి బట్టలతో వచ్చాడు. ఆమెను చూసి దగ్గరకు వెళ్ళగానే 'హాండ్సప్' అంటూ ఒక్క సారిగా తలకి గన్ను గురిపెట్టింది. ఈ లోపులో చుట్టుపక్కల ఉన్న పోలీసులు వచ్చి అతడికి బేడీలు వేశారు. అలా నెల తిరిగేసరికి అతడిని చట్టానికి అప్పగించి రివార్డ్‌లూ, అవార్డ్‌లూ అందుకుంది.
కరడు గట్టిన ఓ నేరస్తుడికి పెళ్ళి వల వేసి... నెల రోజుల్లోనే పట్టించి ధైర్యసాహసాలకు నిదర్శనంగా నిలవడం, తనని తాను ఫణంగా పెట్టుకుని కేసుని ఛేదించిన ఈ సాహసికి మనమూ హాట్సాఫ్ చెబుదాము. ఇదంతా ఒక మెరుపు సంఘటన మాదిరిగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కథలుగా చెప్పుకున్నారు.
"శుభం భూయాత్"
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Good story