top of page

అమ్మ అంబ ఐతే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Amma Amba Aithe' written by Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


పిల్లల కోసం ఎంతో కష్టపడింది అన్నపూర్ణమ్మ.

సర్వస్వం ధారపోసింది.

ఇప్పుడామె భర్తను కోల్పోయి ఒంటరి అయింది.

ఒంటరి ఎలా అవుతుంది? నలుగురు పిల్లలు ఉన్నారుగా అనుకుంటున్నారా?

ఏం జరిగిందో ప్రముఖ రచయిత, కవి అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారి 'అమ్మ అంబ ఐతే' అనే ఈ కథలో తెలుసుకోండి. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.“అమ్మ సంగతి ఏం ఆలోచించారు?”


ఆ నలుగురినీ ఉద్దేశించి అడిగాడు రమణయ్య.


“ఆలోచించేదేముంది బాబాయి? అమ్మ కూడా మాతో పాటే!” చెప్పాడు పెద్దకొడుకు రఘుపతి.


“అన్నయ్య సమాధానమే మాది కూడా !” రాఘవ, రాజా, రాములు.....


“బావుందర్రా! నలుగురూ మీ మీ ఉద్యోగాలరీత్యా పట్నంలో ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఏ ఇద్దరూ ఒక్కచోట ఉండటములేదుగా?”


“అయితే ఏమిటి బాబాయి?” రమణయ్య కేసి చూస్తూ అడిగారు ఆ నలుగురన్నదమ్ములూ!


“అదేనర్రా! అమ్మను ముందుగా ఎవరు తీసుకెళతారు?” సూటిగా ప్రశ్నించాడు రమణయ్య!


ఆమె నలుగురు కొడుకులూ ఏమి చెబుతారా అన్నట్టుగా.... గదిలో నుండి చూస్తూ ఉంది అన్నపూర్ణమ్మ !


తన భర్త బ్రతికే ఉంటే.... తనకీ స్థితి; పరిస్థితి దాపురించేదా? సరిగ్గా పదిరోజుల క్రితం భూషణం గుండెపోటుతో చనిపోయాడు..... భూషణం, అన్నపూర్ణమ్మ లకు నలుగురు కొడుకులు. భూషణం చేసేది తాలూకాఫీసు లో చిన్నపాటి గుమాస్తా ఉద్యోగం... జీతం తక్కువ -ఖర్చులూ, బాధ్యతలూ ఎక్కువే.... అయినా భూషణం ఎప్పుడూ ఎవరినీ చేయి చాచింది లేదు. తనకున్న దాంట్లో సర్దుకుపోయే తత్వం భూషణం ది..


రమణయ్య భూషణం కంటే పై స్థాయిలో ఉన్న ఉద్యోగి... ఆయనకు ఇద్దరే పిల్లలు. అంతో, ఇంతో ఆస్థి కూడా ఉంది. అయినా అప్పులు చేయక తప్పలేదు…


“భూషణం! ‘అప్పు లేనివాడు అధిక సంపన్నుడు’ అన్న పెద్దల మాట నిన్ను చూస్తే నిజమనిపిస్తోంది”

అని అప్పుడప్పడూ రమణయ్య అంటూండేవాడు.


' నాదేముంది సార్‌... అని భూషణం జవాబిచ్చేవాడు.


“ఎవరి పిడికిలి ఎంతో .. అంతే డబ్బు చేతికి దక్కుతుంది.... సంపాదనకు అంతు ఏముంది సార్‌, సంతృప్తి ఉండాలేగానీ!” అనేవాడు భూషణం.


భర్త ఎంత సంపాదించినా , భార్య ఒబ్బిడి చేస్తేనే .... సంసారం సాఫీగా సాగుతుంది... లేకపోతే ఇబ్బందులు తప్పవని భూషణం ఉద్దేశ్యం. అందుకు ఆ క్రెడిట్‌ అంతా అన్నపూర్ణమ్మ దేనని భూషణం ప్రగాఢ విశ్వాసం.


పెద్దాడి పై చదువులకు తన నగలను ఇచ్చింది. రెండోవాడి చదువుకు పుట్టింటి వాళ్ళిచ్చిన పొలం అమ్మిచ్చింది. మిగతా ఇద్దరి చదువులకూ ఆఫీస్‌నుంచి అప్పు తీసుకున్నాడు.... అలా వారి తాహతుకు మించిన చదువులు చదివించారు. ఉన్నత కొలువుల్లోచేరేలా చేశారు. ఉన్నదంతా పిల్లల భవితకై ఊడ్చి .... ఆ దంపతులు అద్దె ఇంట్లో కొలువు దీరారు....


వాళ్ళిద్దరికీ రేపెలా గడుస్తుందని , బ్రతకాలన్న భయం లేదు.... ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీన కొడుకులున్నారన్న భరోసా ఉంది కాబట్టి.... కానీ కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు.. అకాలంగా, అకారణంగా కొన్ని పనులు చేసుకుపోతుంది. అదే భూషణం మరణం. ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఒంటరి.... నలుగురు కొడుకులలో ఎవరో ఒకరి పంచన బతుకు వెళ్ళదీయవలసిన పరిస్థితి.


రమణయ్య గారంటున్నారు.

“చెప్పండి... మీ నలుగురిలో పెద్దకొడుకు రఘుపతి ముందు అమ్మను తీసుకెళతాడా?” పెద్దకొడుకు రఘుపతి మాట్లాడలేదు.

రెండోవాడి వంక చూశారు. వాడూ పెదవి విప్పలేదు. మూడోవాడూ-- నాలుగోవాడూ

కూడా ఉలక లేదు , పలక లేదు.

ఆయన ఆశ్చర్యపోయారు.

“ ఏమర్రా ? .... కూడా ‘అమ్మను తీసుకెళతాం’ అన్నారుగా! ముందెవరంటే, ఎవరూ మాట్లాడరే?”


నలుగురు అన్నదమ్ములూ ఒకరి ముఖం కేసి ఒకరు చూసుకున్నారు...

ముందు నువ్వంటే ... ముందు నువ్వని వాదులాడుకుంటున్నారు.

అన్నపూర్ణమ్మ తన కొడుకుల ధోరణి చూసి నిశ్చష్ఠురాలైంది....

" చిన్నప్పుడు అమ్మ నాదంటే అమ్మ నాదని వాదులాడుకున్న వారే.......... "

ఇప్పుడు," అమ్మ నీదంటే .... నీదని " వాదులాడుకుంటున్నారు.


అప్రయత్నంగా ఆమె కళ్ళు వర్షించసాగాయి. భర్తను తలచుకొని.... ‘ఏమండీ! మీరు

అదృష్టవంతులు.... కొడుకులు గొప్పవాళ్ళని మురిసిపోయేవారు.... వాళ్ళ నిజ స్వరూపము తెలియకుండానే చనిపోయారు.... తెలిస్తే తట్టుకోలేక " పోయేవారు"!’

అన్నపూర్ణమ్మ మనసులో అనుకుంది.


రమణయ్యగారు తుఫాను ముందు ప్రశాంతతలా ఉన్న ఆ నలుగురినీ మళ్ళీ అడిగారు..... ఎవరో ఒకరు ముందుకు రండని .... మళ్ళీ చెప్పారు. ఆ నలుగురూ, వాదనలాపి చర్చించుకున్నారు. కొంతసేపటికి ఇలా అన్నారు.

“బాబాయ్‌... నువ్వంటే... నువ్వు తీసుకెళ్ళమంటూ , వాదులాడితే ఈ సమస్యకు పరి

ష్కారం లభించదు! కనుక ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే!”


“ఏమిటా పరిష్కారం?” రమణయ్య గారడిగారు...

పరిష్కారం ఏమై ఉంటుందన్న ఆతృతగా చూస్తోంది అన్నపూర్ణమ్మ.

ఆ పరిష్కారం ...... " లాటరీ వేయడం " చెప్పారా నలుగురూ!!

రమణయ్యగారు మళ్ళీ ఆశ్చర్యపోయారు. వాళ్ళ విపరీత ధోరణి చూసి!


అన్నపూర్ణమ్మకి తను కూర్చున్న చోట కింద వున్న భూమి రెండుగా చీలిపోయినట్లనిపించింది.


“ బాబాయ్‌ ... నాలుగు చీటీలు వేయండి. ఆ నాలుగింటిలో ఒకదానిపై అమ్మ పేరుంటుంది. మిగతా మూడూ ఖాళీగా ఉంటాయి... అమ్మ పేరున్న చీటీ వచ్చిన వాడు.... ముందుగా అమ్మను వాడి కూడా తీసుకెళతారు. మూడు నెలల తరువాత .... మిగతా ముగ్గురూ , అమ్మ కోసం మళ్ళీ లాటరీ

వేస్తారు. మళ్ళీ " అమ్మ" పేరొచ్చిన వాడు ఈ సారి అమ్మను తీసుకెళతాడు. ఆ పై మరో మూడు నెలలకు మళ్ళీ లాటరీ వేస్తాం... ఈ సారి " అమ్మ" చీటీ వచ్చిన

వాడు...... వాడు కూడా అమ్మను..... తీసు..... “:


“ష్‌!..... చాలు.... ప్రతీసారి లాటరీ అంటూ విడమర్చి చెప్పనవసరం లేదు.... “

రమణయ్య గారు అన్నారు.....

కొడుకుల ఉద్దేశ్యాన్ని బయట నుంచే అన్నపూర్ణమ్మకు చెప్పారు. బాధపడింది..... ఆ పై ఆయనతో ఏదో చెప్పింది. కొంతసేపటికి ..... కొడుకుల ఇష్టప్రకారమే రమణయ్యగారు లాటరీ వేశారు.

" అన్నపూర్ణమ్మ" గమనిస్తోంది.

నలుగురూ.......... చీటీలు తీశారు.

పెద్దకొఢుకు రఘుపతి.... చేతులు వణుకుతూ... చీటీ తీశాడు.....


పెళ్ళాం మాటలు గుర్తుకు వచ్చాయి. " అమ్మ పేరున చీటీ వస్తే ... మిమ్మల్ని వదిలైనా

వెళతాను కానీ,..... ఆవిడను మనతో తీసుకెళ్ళేందుకు ఒప్పుకోను అని ఖరాఖండీగా

చెప్పేసింది.... టెన్షన్‌ తో చీటీ తీశాడు...." అమ్మ" అని లేదు... చీటీ ఖాళీగా ఉంది. ' హమ్మయ్య' అని తేలిగ్గా వూపిరి పీల్చాడు పెళ్ళాం చేతిలో 'సేఫ్‌'అని సంతృప్తి చెందాడు.


రెండో కొడుకు ఆత్రంగా చీటీ తీశాడు. " ఆహా" నేను ' సేఫ్‌' అన్నగారితో మెల్లగా అన్నాడు.


రమణయ్య గారు నలుగురినీ గమనిస్తున్నారు. మూడో వాడు చీటీ తీశాడు......

" అమ్మ " అని వచ్చిందా? అడిగారు సోదరులు.... ఆసక్తిగా ..... !

హా... హా ... నాకు " అమ్మ" చీటీ రాలేదోచ్‌.... ఉండబట్టలేక. పైకి అనేశాడు మూడోవాడు .

ఛీ.... ఛీ...... నా కొడుకులింత నీచులా? అన్నపూర్ణమ్మ ..... గదిలో నుండి గమనిస్తూ అనుకుంది.... , రమణయ్యగారిని ... అమ్మపై వారు చూపుతున్న అనుచిత ప్రవర్తన ఇబ్బంది పెడుతోంది.


నాలుగోవాడు.... అదే మా చివరి తమ్ముడు అమ్మను ముందుగా తీసుకెళతాడు బాబాయి, ........ నాలుగోవాడు చీటీ రాకముందే .... తేల్చి .... చెప్పేశాడు పెద్ద కొడుకు రఘుపతి.


కంగారు పడకు! వాడి చీటీ చూసి మాట్లాడు, చెప్పారు రమణయ్య.


నాకు " అమ్మ" అని రాలేదోచ్‌ ...... నాలుగోవాడు వెర్రి ఆనందంతో అరుస్తూ అన్నాడు.


ఇప్పుడు అన్నదమ్ములు నలగురూ నిశ్చేష్ఠులయ్యారు.

అదేంటి? " అమ్మ" అని ఎవరికీ రాలేదే? అడిగారు ఆ నలగురూ.

రమణయ్యగారు.... " మీ అమ్మ గారినే అడగండి అంటూ లేచి వెళ్ళారు.

నలుగురూ " అమ్మ" వద్దకు వెళ్ళారు.

“ ఎందుకలా చేశావమ్మా?” అడిగారు.....


“ ఈ రేజు అమ్మను ‘లాటరీ’ వేశారు. రేపు ‘వేలం’ వేయరని గ్యారంటీ ఉందా?” అన్నపూర్ణమ్మ అడిగింది......

వాళ్ళు సమాధానం ఇవ్వలేదు.... ఇవ్వలేరు....


ఒరేయి.... పురాణకాలంలో పరశురాముడు, తండ్రి చెప్పాడని.... తల్లిని చంపాడు..... తండ్రి వరం కోరుకోమంటే .... తక్షణం తల్లి కావాలన్నాడు.... ఎందుకో తెలుసా... ?

" అమ్మ" లేని జన్మ.... అర్థం లేదని ... వ్యర్థమని...

" అమ్మే" అన్నీ అని ... పరుశురామునికి తెలుసు కనుక...

ఎవరికైనా దెబ్బ తగిలినా...

బాధ. కలిగినా " అమ్మా" అని అంటారు....

అలా అనే అర్హత కూడా మీకు లేదురా! ఎందుకో తెలుసా? .... ఆ " అమ్మ" నే బాధ పెట్టిన దగుల్భాజీలు మీరు కనుక!


అమ్మను లాటరీ వేసే స్థాయికి ఎ" దిగారు" మీరు . కానీ నేనింకా మీ స్థాయికి దిగజార

లేదు.... దిగజారను కూడా.... మీకు బతుకుపాఠం నేర్పిన అమ్మనురా.... నాకు బత

కటం కష్టం కాదు.... కానీ మీకూ పిల్లలున్నారు... వాళ్ళూ పెద్దవాళ్ళవుతారు.. అప్పుడు

నా దుస్థితే మీకు తప్పక వస్తుంది.


శ్రీరాముడు దేవుడైనా ... చెట్టు చాటుగా నిలుచుని వాలిని చంపినందుకు ........

మరుసటి జన్మలో శ్రీకృష్ణునిగా ఉన్నప్పుడు .... బోయవాని చేతిలో గాయపడ్డాడు.....

దేవునికే శిక్ష తప్పలేదు.... మనుష్యులైన మీకు శిక్ష తప్పక పడుతుంది..... పడితీరు

తుంది... మీ" అమ్మ శాసనం " చేసింది... నేను తలుపులు వేసి పావుగంట తరు

వాత తీస్తాను. అప్పుడు మీలో ఒక్కరున్నా .... ఈ " అమ్మ" లో " అంబ" ను చూస్తారు.


..... అంటూ అన్నపూర్ణమ్మ తలుపులు మూసింది. సరిగ్గా పావుగంటకు తీసింది....

ఏ ఒక్కరూ అక్కడలేరు.

-------------------------శుభంభూయాత్‌---------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
619 views1 comment

1 Comment


balakameshwararao
balakameshwararao
Jan 27, 2022

Good moral embedded in the story

these days lot of such stories are

seen because of the present situation

Like
bottom of page