top of page

నాన్నమ్మ పంచాయితీ తీర్పు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Nannamma Panchayathi Thirpu' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


కనకమ్మ వయసు డెబ్బైఐదు. మనిషి బలంగా ధృడంగా ఉంటుంది, కాస్త అద్దాలొచ్చాయి గాని. అన్ని ముచ్చట్లు తీరాయిగానీ ఓ కోరిక మాత్రం మిగిలి ఉంది. నడుముకు వడ్డాణం చేయించుకోవాలని బంగారంతో. తీరని కోరిక గా ఉండిపోయింది.


చిన్నప్పుడు అమ్మవారి ఫోటో చూసి అన్నీ నగలని చూసేసరికి బోలెడు ఆశ్చర్యపోయింది. ఆడవాళ్ళకు ఇన్ని నగలుంటాయా అని? తను పుట్టి పెరిగిన ఊళ్ళో బంగారు మంగళసూత్రాలు ఉండటమే మహా గొప్ప. ఇంక వడ్డాణం అన్న మరుక్షణం తిండికి గతిలేదు కానీ అంటూ వాళ్ళ నాన్నపెదవ్విరిచాడు. కూతురుని బాధపెట్టడం ఇష్టం లేక పంట అమ్మిన డబ్బులోంచి తీసి వెండి మువ్వల పట్టీలు చేయించాడు. అదే గొప్ప కానీ వడ్డాణం కోరిక తీరలేదు.


ఈ లోపల ఈడొచ్చిందని పెళ్ళి చేసేశారు. మొగుడు కొనివ్వకపోతాడా అని ఆశపడి మొగుణ్ణి అడిగింది. అతగాడి గుండె ఢమల్‌. చేసే గుమాస్తా గిరికి బంగారం కాదు కదా , వెండితోని కూడా చేయించలేనని చేతులెత్తేశాడు. ఆఖరుకి ఏదో చిన్న ఉంగరం చేయించగలిగాడు. దానికో రెండేళ్ళు పట్టింది.


ఈ లోపల పిల్లలు కలిగారు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక అకస్మాత్తుగా ఆయన కాలం చేశారు. కూతురు పెళ్ళి చేసేసింది. కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. తన కోరిక నెరవేర్చుకోవచ్చు అనుకుని సంబరపడింది.


తల్లి మనసు కనిపెట్టినట్టు తొలిజీతం చేతికందిన రోజున ' అమ్మా!నీ కోరికేమైనా ఉంటే చెప్పుకో! తీరుస్తా! అన్నాడు. పాపం కనకమ్మ సంతోషపడింది. తరువాత చెబుతాలే అంటు దాటవేసి కొడుకు పెళ్ళిముచ్చట్లు తీరిం తరువాత తన కోరిక బయట

పెట్టింది.


కొడుకు చాలా సేపు గింజుకుని “అమ్మా! ఆ కోరిక తప్ప మరేదైనా కోరుకో” అన్నాడు. మళ్ళీ కనకం కోరిక అటకెక్కింది.


తల్లి కోరిక తీర్చడం తనవిధి కనుక సన్నటివి రెండు బంగారు గాజులు చేయిం

చాడు. కాల చక్రం గిర్రున తిరిగింది. ఆ అదృష్టం మనవడి రూపంలో తలుపు తట్టింది. కొత్తగా పెళ్ళయిన మనవడు గోవిందు ఉద్యోగరీత్యా వైజాగ్‌ లో కాపురం పెట్టాడు. కుటుబమంతా సామర్లకోట లో ఉంటోంది. చక్కగా నాన్నమ్మ కి ఫోన్‌ కొట్టి నాన్నమ్మా, అక్కడేం ఉంటావు గానీ ఇటొచ్చి ఉండచ్చు కదా! నీకూ కాలక్షేపం, నా సమస్యా తీరుతుంది కదా! అన్నాడు.


' చిక్కాడు చిట్టి గాడు!' అనుకుంది. ' నా కోరికొకటి తీర్చాలి? ఆశగా అడిగింది.


" చెప్పు. ఏం చెయ్యమన్నా చేస్తా. మంచి కంచి పట్టుచీర కొని పెట్టనా?

' ఒరేయి, నీ కోతలు కట్టిపెట్టు. నన్నీ సమస్య నుంచి గట్టెక్కెంచు. నీ కోరిక తప్పక తీరుస్తా ' - మాట మీద నిలబడాలి సుమా. మెల్లగా తన కోరిక చల్లగా చెప్పేసింది. పది నిమిషాలు మాట లేకుండా ఉండి పోయాడు గోవిందుడు.


" సరేలేకానీ నువ్వు వెంటనే బస్సెక్కి వైజాగ్‌ వచ్చే”యమన్నాడు గోవిందు.

‘తింగరాడు ఒప్పుకున్నాడంటే ఏదో తిరకాసు పెట్టే వుంటాడు. వీడి అబ్బ, తాతల వల్లే కాలేదు' .. మనవడి మీద అనుమానం కలిగింది.


' అదీ చూద్దాం, ఏదో సాయం అడిగాడు కదా ఆ బాధ్యత కూడా నాపైనే ఉంది అనుకుంటూ వైజాగ్‌ కు బయలు దేరింది.

ఇంక అక్కడ భార్యాభర్తలిద్దరూ ఎడమొగం పెడమొగంగా ఉన్నారక్కడ. మాటల్లేవు. పనులు మాత్రం సాగిపోతున్నాయి .


' పాపం మనవరాలు మంచిదే. ఈ తింగరాడు ఏం చేశాడో' అనుకుంది. రెండురోజులు పోయాక నెమ్మదిగా ఆరా తీసింది. మనవరాలు ఓ రవ్వల నెక్లెస్‌ చేయించమందట. మీ వాళ్ళు ఎలానూ చేయించలేదు. నేను కూడా చేయించేది లేదని చెప్పాట్ట.

ఫ్లాట్ కొందామనుకుంటున్నాను. ఇప్పుడు రెండూ వీలుపడవు. నీ నెక్లెస్‌ కాన్సిల్‌ అన్నాడు.


అయినా అమ్మాయి అడక్క అడక్క చిన్న కోరిక కోరింది. ఫ్లాట్‌ తరవాత కొనుక్కోచ్చు కదా, వీడి కిదేం రోగం అనుకుంది.


' తీయిస్తా తీయిస్తా . . . వాడి బ్యాంకు సొమ్మంతా బయటకు తీయిస్తా. . . 'గట్టిగా మనసులో అనుకుంది నాన్నమ్మ.

' అయినా పెళ్ళానికి ఓ నెక్లెస్‌ కొనివ్వలేనివాడు, తనకి వడ్డాణం చేయిస్తానని ఎలా రప్పించాడు?' ఆలోచనల్లో పడింది కనకమ్మ.


మరి మొండి మనవడితో ' ఆట' మొదలెట్టాలంటే ఈ మాత్రం కసరత్తు చేయాలిసిందే. గోవిందు లేనప్పుడు మనవరాలి ముందు తన సందేహం వెలిబుచ్చింది.


" మీ మనవడు మహా ముదురు. బామ్మ! ఏదో తింగరి ప్లాన్‌ వేసుంటాడు' అంది

సత్యభామ.


తెలివా! వాడి మొహం! వాడి తింగరి తెలివి నా ముందా! సన్నాసి గాడికి ఈ

నాన్నమ్మ తడాఖా తెలియదు' నడుముకు కొంగు బిగించింది నాన్నమ్మ.

ఓ సాయంత్రం గోవిందుకు ఇష్టమైన కాప్స్‌కమ్‌ పకోడీలు చేతికిచ్చి కనకమ్మ అంది.


" ఈ వయసులో నాకు వడ్డాణం, వంకీలూ ఎందుకురా?నాతో పాటే నా కోరికకు కాలం చెల్లింది. కనీసం మనవరాలి రవ్వలనెక్లెస్‌ ముచ్చట తీర్చరా గోవిందూ" అని.

కిమ్మనలేదు తను.


" నీ కింకా పిల్లా జెల్లా ? ఇల్లుకేం తొందర. దాని ముచ్చట తీర్చెయ్యి".

కళ్ళు మూసుకుని పకోడీలు కరకర నమిలాడే కాని మాట్లాడలేదు.


" నెక్లెస్‌ బాధ తప్పించవే అంటే, నా పెళ్ళాన్నే నా మీద ఉసిగొలిపి నాకే ఎసరు పెడతావా!" కసిగా అనుకున్నాడు గోవిందు.


మరునాడు ప్రొద్దున్నే -" నాన్నమ్మా! ఊరెళ్ళడానికి టికెట్లు తెచ్చాను. ఇవిగో తీసుకుని నీ సామాను తో బయలుదేరు" అన్నాడు. ఇంక విషయం విషమించక ముందే ఈవిడని సాగనంపాలని అతడి పథకం.


'ఒరేయి, నీ పిచ్చివేషాలు నా దగ్గర సాగవు. మనవరాలి మెడలో రవ్వల నెక్లెస్‌ చూడందే నేనిక్కడ నుంచి కదలను. ' మొండికేసింది.


గతుక్కుమన్నాడు.

' నీ ఇష్టం రా మనవడా! ఈ రాత్రి నా పడక నీ పడగ్గదిలోనే' గురి తప్పని బాణం విసిరింది.


అదిగో అప్పుడు గోవిందుడి తల గిర్రున తిరిగింది.

మధుమాసం మదనతాపంతో మంచమెక్కితే ముసలిది మూడంకె వేయించింది.


మహా మొండి ఘటం. నచ్చని పని చేస్తే , తాత లాంటోడు తన్నుకున్నాడు. ' ఎరక్కపోయి ఇరుక్కుపోయానే' ! అనుకుంటూ నాన్నమ్మ టికెట్స్‌ చించేసి రుసరుస వెళ్ళి పోయాడక్కడనుంచి. కనకమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది.


' ఇక చూపిస్తా నా తడాఖా!' అంటూ గట్టిగా నిర్ణయం తీసుకుంది.

రాత్రి అన్నంత పనీ చేసింది. గోవిందు శివజపం చేసుకుంటూ పడుకున్నాడు. ' పోన్లే వెదవకి పుణ్యమైనా దక్కుతుంది' అనుకుంది నాన్నమ్మ.

' మంటలు రేపే నాన్నమ్మ, ఈ తుంటరి పనులు నీ కేలనే' అనుకుంటూ మూడంకె వేసి పడుకున్నాడు.


విధి లేక తెల్లారేసరికి కాళ్ళబేరానికి వచ్చాడు. నాన్నమ్మ మజాకా!


" మరైతే , ఇదిగో ఈ కాగితాల మీద వేలిముద్రలు పెట్టు, " అంటూ ఆవిడ చేతికి

కొన్ని కాగితాలందించాడు.

" ఎందుకిదంతా?"

" మరి నీ మనవరాలికి రవ్వల నెక్లెస్‌ చేయించాలంటే ఎంతలేదన్నా ఆరు లక్షలు కావాలి. బ్యాంక్ లో అప్పు కోసం అప్లికేషన్‌"

" మరి నా. వేలి ముద్రలు ఎందుకురా?

" ఏదైనా ఆస్తి ఉన్నవాళ్ళు హామీ ఇవ్వాలి. ! మరి తాతయ్య కొన్న ఫ్లాట్‌ నీ పేరు మీదఉంది కదా" అని విషయం విశదీకరించాడు.


" అలాగా" అనేసి అమాయకంగా సంతకం పెట్టేసింది.

ఆ కాగితాలు చేతిలో పడగానే ' గెలిచానోచ్' అంటూ గంతులు వేశాడు.

' ఏమైందిరా గోవిందూ? నీ కేమైనా పైత్యం తలకెక్కిందా?


' కాదే నాన్నమ్మా, నీ రోగం కుదిరింది. నీ పేరు మీదున్న ఫ్లాట్‌ ని నా పేరుమీద

చేసుకున్నా. ఈ కాగితాలివే!" గోవిందు మొహం వెలిగిపోయింది.

“ఇదా నీ చచ్చు ప్లాన్‌. అయినా ఈ ఫ్లాట్‌ ఎప్పటికైనా నీదే కదరా!”

“నీ తదనంతరం అని మెలిక ఉందిగా వీలునామాలో. అంతవరకు ఉండలేక”

“అయినా ఇప్పుడు ఇళ్ళెందుకు రా. నీ భార్య గురించి ఆమె చిన్న చిన్న ఆశలగురించి ముందు నీ గుండెలో ఆ అమ్మాయికో మురిపాల గూడు కట్టివ్వు. ఆ పైన. . . . . " చెప్పబోయింది.

గోవిందు అడ్డుపడి " నీ సోది ఆపు నాన్నమ్మ. నువ్వెన్ని సార్లు పొడిచినా నా

మనసు మారదు" అన్నాడు.


" సరేలే" అంటు కనకం తల పంకించింది.

" అమ్మో। ఏమిటీ ఈ ముసల్ది అస్సలు బెదరటం లేదు. ఏదో పీటముడే వేసుం

టుంది. పైకి మాత్రం బింకంగా ‘ఇక తమరు దయచేయవచ్చు' అన్నాడు.

' ఓరి నా తింగరి మనవడా! నువ్విలాంటి మెలికేదో పెడతావని నేను కాగితాల మీద వేలిముద్ర వేశాను. నీ కో విషయం తెలీదురా డింగరీ! నేనా కాలంలో సామర్లకోట మునిసిపల్‌ స్కూల్లో ఫస్ట్‌ ఫామ్‌(6వ తరగతి) పాసయ్యాను. నేను స్వయంగా సంతకాలు చేయందే ఆ కాగితాలు చెల్లవురా మనవడా! " అంటూ తన నాటకానికి ముగింపు పలికింది.

" అమ్మ నా నాన్నమ్మ!" అంటూ గొల్లుమన్నాడు.


" నీ పెళ్ళికి కంచిపట్టుచీర కొనిస్తానని చెప్పి రెండు ముతక చీరలు నామెహాన పడేశావు. నీ సంగతి నాకు తెలీదా? నా మనవరాలికి? ఏం నువ్వు చేయించేదేమిట్రా రవ్వలనెక్లెస్‌? ఏం ఆ మాత్రం నేను చేయించలేనా?" అని సవాలు విసిరి ప్రక్కనే ఉన్న సత్యభామ ని పిలిచింది.


తాను దాచుకున్న నగలు వంటిమీదవి మొత్తం తీసి సత్యభామకు ఇచ్చేసింది.

భామ వద్దన్నా వినకుండా. భామ కాళ్ళకు దండం పెట్టింది.

" అభీష్టసిద్దిరస్తూ" అని దీవించింది. గోవిందుడు ఒకింత కదిలిపోయి నాన్నమ్మ కాళ్ళకి దండం పెట్టాడు.


' ఒరే తింగరోడా, నీ విషయం అంతా భామ చెప్పింది. ఆ ఫ్లాట్‌ని నీ పేరుమీద చేయించుకునే వచ్చాను. ముందస్తుగా ఆ కాగితాలు భామ దగ్గరుంచాను. సరేనా!” అంటూ మనవణ్ణి కూడా ఆశీర్వదించింది.


గోవిందు ఖంగు తిన్నాడు. మొగుడూ పెళ్ళాలిద్దరూ నాన్నమ్మ ప్రక్కన కూర్చున్నారు.

నాన్నమ్మ చేతిని దగ్గరకు తీసుకుని " ఆ కాగితాలను నేను తీసుకోవాలంటే నేను ఇచ్చేది కూడా తీసుకోవాలి. ఇది నా కోరిక” అన్నాడు.


" మళ్ళీ ఏదైనా మెలిక పెట్టావంటే తంతానురోయ్‌, తింగరోడా! " అంటూ సరదాగా మందలించింది.

"అదేం లేదు లేవే! గృహప్రవేశం రోజున ఉడతాభక్తిగా నేను చేయించే వడ్డాణం వేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలి"


"ఓస్‌ అంతేగా! బంగారు వడ్డాణమేగా. . . . ఇందులో తిరకాసు ఏమి లేదుగా?"


" తిరకాసంటే . . . . అంత బంగారు వడ్డాణం నా వల్ల ఎలా అవుతుంది. ఏదో సన్నటి తీగలా సాగదీయించి నీ నడుం చుట్టూ చుడతాలే .


" ఓరి నా తింగరి మనవడా! ఇదో మెలికా!" కనకం ముసిముసి నవ్వులు నవ్వింది.

" సర్సర్లేరా! నీవైనా అది చేయించావు. అదే గొప్ప. " ఇష్టకామ్యాఫలసిద్దిరస్తు" అని దీవించింది ఆ దంపతులని. నవ్వులతో ప్రతిధ్వనించింది ఆ ఇల్లు.


కొసమెరుపు ఏంటంటే మనవడి గృహప్రవేశానికి , నాన్నమ్మ సన్నటి తీగలాంటి వడ్డాణము ధరించుట.


--------------------శుభంభూయాత్‌-------------------------------------

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


181 views0 comments

Comentários


bottom of page