'Yanthram' New Telugu Story
Written By Susmitha Ramana Murthy
రచన : సుస్మితా రమణ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా!?…కుళాయి విప్పి అలా వదిలేయొద్దని?" అంది కూతురు.
"బుజ్జి తువ్వాలని కేకేస్తే అలా వెళ్ళాను. ఈలోగా బకెట్ నిండినట్లుంది." చెప్పింది తల్లి.
"స్నానానికి వెళ్ళేటప్పుడు, తువ్వాలు పెట్టుకోడం దానికి తెలీదా?...నీ గారాబం వల్లే అదలా తయారయింది." కూతురి కోపం.
"చిన్నపిల్ల కదా!...నెమ్మదిగా అలవాటు అవుతుందిలే!" సర్ది చెప్పింది తల్లి.
"ప్రతి దానికీ దాన్నలా వెనకేసుకు రావద్దు." అంది కూతురు.
"అలాగే తల్లీ!"
"ఏదో మాడు వాసన వస్తోంది చూడమ్మా!" కూతురి ఆర్డర్..
"అయ్యో!...స్టవ్ మీద పాలు పెట్టాను. నీ మాటల్లో పడి …”
"ఈమధ్య అన్నీ ఇలాగే చేస్తున్నావు. పాలు నాతో మాట్లాడటం వల్లే మాడిపోయాయంటావ్!?..." తల్లిని విమర్శించింది కూతురు.
"అలా నేననలేదే! ఈ మాత్రం దానికే ఇంతలా కేకలు వేయాలా!?..." బాధ పడింది తల్లి.
"నా నోరే వినిపిస్తోంది. నీవు చేస్తోంది ఎవరికీ కనిపించటంలేదు. ఆయనకు ఆఫీసు టైం అవుతోంది. కేరేజ్ కట్టేసావా?"
"అయిపోవస్తోంది… అయిదు నిముషాల్లో!"
"తొందరగా కానీ ! తెల్లారే లేస్తావు. ఏం ప్రయోజనం?...ఆ గిన్నెలు పనిమనిషి తోమి కడుగుతుందిగా ?...ఆ పనులు నీవెందుకు చేయడం?..శుద్ధ దండగ!”
"రాత్రి తిన్న కంచాలలో వదిలేసిన వాటిని మనమే తీసి, చెత్త కవరులో పడేయాలి. కంచాలలో కాసిన్ని నీళ్ళు పోస్తే,అవి ఎండిపోవు.”
"పనిమనిషి ఆపని చేస్తుందిలే!”
"బుజ్జి దాని కేరేజ్, అల్లుడు గారి కేరేజ్ తోమి కడిగాను. పనిమనిషి వచ్చేలోగా అవసరమైనవి మనమే శుభ్రం చేసుకోవాలి కదా ?" చెప్పింది తల్లి.
"అన్ని పనులు ఒకేసారి చేసేద్దామనుకుంటావ్ ! ఏ పనీ సవ్యంగా చేయవు.”
"దానికి టిఫిన్ పెట్టి, కేరేజ్ కడుతున్నాను. అలా నాలుగు మాటలు అనేకంటే ఆయన కేరేజ్ నీవు కట్టేయొచ్చుగా? …”
"స్సరే! రేపటి నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటాలే!"
"అంత నిష్ఠూరం దేనికమ్మా? ఉదయం పూట వంట పనిలో కాస్త సాయం చేస్తే నాకింత హైరాన ఉండదు కదా?" అంది తల్లి.
"ఇకమీదట నీకెలాంటి ఇబ్బంది ఉండదులే! వంట మనిషిని మాట్లాడుతా. అన్నీ తనే చేస్తుంది."
"మంచిదమ్మా! వంటమనిషిని పెట్టగానే సరిపోదు. కూరగాయలు కడిగి, తరిగి, అందించాలి. ఉల్లిపాయలు, పప్పు దినుసులు, బియ్యం…అన్నీ అందిస్తుంటే, వంట చేసి పోతుంది. మన సహాయం లేకుండా అన్నీ తనే చేయాలంటే రెండింతలివ్వాలి. పదిహేను వేలు మనవి కావనుకుంటే రెండు పూటలకు వంట చేసి పెడుతుంది. పూర్తి వివరాలు పక్క వాళ్ళను అడిగి తెలుసుకో!" వివరించింది తల్లి.
"అవన్నీ నేను చేసుకుంటాలే తల్లీ! నువ్వేమీ పట్టించుకోకు" కోపంగా అంటూ తల్లికి వెటకారంగా నమస్కరించింది.
పెద్దలకు చేతులెత్తి నమస్కారం చేయడం మంచిదేనమ్మా! చిరంజీవ! చిరంజీవ! ఎప్సుడూ సుఖ సంతోషాలతో ఉండమ్మా!" అంది తల్లి.
"ఏఁవిటమ్మా!?...ఈ రోజేమైనా మదర్స్ డేనా?...అమ్మకు నమస్కారం చేస్తున్నావు!?...తను దీవిస్తోంది!?..." అన్నాడు తండ్రి.
"డాడీ! మీరు ఏదేదో మాట్లాడి నా బుర్ర తినకండి."
“ఉద్యోగం చేస్తున్నప్పుడే బాగుండేది. రిటైరయింతర్వాత నా మాటలు అందరికీ వెగటై పోయాయి!” అన్నాడు తండ్రి.
"మీరెందుకలా గొణుక్కోవడం?" అంది తల్లి.
"ఏమన్నానని!?...అదలా రుసరుస లాడుతోంది!?... రెండు చేతులెత్తి నమస్కారం చేసిందేఁవిటి!?... నీకేమైనా అర్థం అయిందా?”
"మేము వంటమనిషి గురించి మాట్లాడుకుంటుంటే, మీరు మధ్యలో వచ్చారు. అదొస్తోంది. మాట్లాడకండి.”
"నన్నెప్పుడు మాట్లాడనిచ్చావ్!...చదువుతో బాటు, ఇంటిపని వంటపని కూడా అవసరమేనంటే, అప్పుడు నామాట వినలేదు. ఆటైముకి అదే నేర్చుకుంటుందిలే అన్నావు. ఇప్పుడు చూడు వంటమనిషి కావాల్సొచ్చింది."
"మరీ అలా మాట్లాడకండి. దానికి పంట చేయడం వచ్చు. కాకుంటే, ఇటు ఉద్యోగం, అటు పిల్లల పనుల వల్ల కుదరటం లేదంతే!"
"దానిని ఒకమాట అననీయవు కదా?...”
"అది వచ్చేసింది. ఇక ఊరుకోండి.”
"వంటమనిషికి ఫోన్ చేసాను. ఇక మీదట నీకు ఇబ్బంది ఉండదులే!"
"అలాగే కానీయమ్మా! ఒక్కమాట!...వంట మనిషికి చేసే సాయం నాకు చేస్తే సరిపోతుందిగా?"
"ఎందుకు సరిపోదు?...దివ్యంగా సరిపోతుంది. నేను వంట గదిలో ఉంటే, ఆఫీసుకి వెళ్ళటం ఎలా కుదురుతుంది?... అందుకే ఈ ఏర్పాటు!"
"సరే కానీయమ్మా! ఈ శుక్రవారం మీ ఇద్దరికీ సెలవు కదా?...శని, ఆది వారాలు ఎలానూ సెలవు. మేము మా ఇంటికి వెళ్తాం."
"మాకు సెలవులు వస్తే మీరక్కడకు వెళ్ళి పోవాలా?"
"వచ్చే వారం సంక్రాంతి పండగ కదమ్మా? ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పండగ పూటైనా మా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకోవాలిగా?.... పెద్దలకు బట్టలు పెట్టాలి.”
"సరే! మీ ఇష్టం!"
****
"ఈమధ్య ప్రతి చిన్న విషయంకి కేకలు వేస్తున్నావు. వారు నీ తల్లి తండ్రులన్న సంగతి మరచి ప్రవర్తిస్తున్నావు.” అన్నాడు భర్త.
"మీరు కూడా నన్నే అంటున్నారా !?..” అందామె.
"మీ మమ్మీ, డాడీ మనకు సహాయం చేయడానికి మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. మనం పిలిస్తేనే వచ్చారు”.
"నాకు తెలుసులెండి!"
"నీ అరుపులు భరించలేకనే, ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకనే, అసహనంతో మావయ్య గారు వారి ఇంటికి వెళ్ళి పోతున్నారు. పనిమనిషి ముందే వాళ్ళపై కేకలు వేస్తున్నావు. నీ పద్ధతి మార్చుకుంటే మంచిది."
"మీరీ విషయం పట్టించుకోకండి.”
" పట్టించుకోవటం లేదు కాబట్టే నీ అరుపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రశాంతత కోసమే మావయ్య గారు అక్కడకు వెళ్ళిపోతున్నారు. మీ ఇద్దరి మధ్య వారు నలిగిపోతున్నారు. ఇక్కడ ఉండలేక పోతున్నారు. అక్కడ ఒక్కరూ ఉండలేక పోతున్నారు.”
"నేనేమీ వెళ్ళిపొమ్మని అన్లేదుగా? …వారిష్టం!. వెళ్తున్నారు. వస్తున్నారు.”
"డెబ్భై దాటిన వయసులో మీ డాడీ, అరవైకి పైబడిన మీ మమ్మీ ఇంకా ఓపికగా మనకు సహాయం చేస్తున్నారు. వారు వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు."
“ఏఁవిటో నా మాటలు ఎవరికీ నచ్చటం లేదు!”
"నీలో నీవే గొణుక్కోవటం దేనికి?.. వినపడేటట్లు మాట్లాడు!”
"మీరన్న విషయం గురించే ఆలోచిస్తున్నాను.. డాడీకి, మమ్మీకి నేనంటే ఎంతో ప్రేమ! నామాటల్ని వారు పట్టించుకోరు.”
"ఏది ఏమైనా నోరు తగ్గించుకుంటేనే మంచిది!"
****
"కాలింగ్ బెల్ మోగుతోంది. లేచి చూడు."
"ఇంత పొద్దున్నే ఎవరండీ?!...మమ్మీ లేస్తుంది లెండి."
"అయిదవుతోంది.. లేచి తలుపు తీయ్! చెత్తలు తీసే వాడయ్యుంటాడు. చెత్త కవరు బయట పెట్టు.”
"అమ్మ చూసుకుంటుంది. పడుకోండి. నిదానంగా లేద్దాం."
"పడుకో! పడుకో! తలుపు తీయకపోతే, చూసి చూసి వాడు వెళ్ళి పోతాడు. రేపటి దాకా ఆ చెత్త మనింట్లోనే ఉంటుంది."
"అమ్మా! చెత్త కవరు బయట పడేయ్ !”
"నీ ఆర్డర్లు అమలు చేయడానికి అత్తయ్య గారు లేరిక్కడ!”
‘ మమ్మీ లేదు కదూ!...లేవక తప్పదు.” అంటూ లేచింది.
" అమ్మ గారూ! తలుపేసేకండి. మీ పనిమనిషి ఊరెల్లిందండీ! ఆలమ్మకు బాగోలేదట. నాల్రోజులు రానని చెప్పమంది.”
"అలాగా!...తను వచ్చేదాకా నీవు పన్జేస్తావా?"
"కుదరదండి! చాలా ఇల్లున్నాయి నాకు.”
"పోనీ, మీవాళ్ళకు ఎవరికైనా చెప్పు."
"ఎవరూ రారండి. నెలంతా అయితేనే వస్తారు."
"నీ కష్టం ఉంచుకోనులే! నాలుగు రోజులకు అయిదొందలు
ఇస్తాను చేసిపెట్టు."
"అవదండీ!”
“పని మనుషులకు కూడా ఇంత టెక్కా!?...తల పొగరు!”
"ఏటండీ! అంటున్నారు?"
"ఏమీ లేదులే! తను వచ్చింతర్వాత వెంటనే రమ్మని చెప్పు.”
"అలాగేనండీ.!"
‘అమ్ముంటే పొద్దున్నే లేచేది. పనిమనిషి రానప్పుడు, ఇల్లు తుడిచేది. తడిబట్ట పెట్టేది..అంట్లు తోమేది. ప్చ్!...టిఫిన్ లు, కాఫీలు, చంటాడి పని …అన్నీ చేసుకోవాలి. ఎన్ని పనులో?...వంటావిడ చాలా ఎక్కువ అడుగుతోంది. మరొకరితో మాట్లాడాలి. అమ్మ లేకపోతే ఎన్ని ఇబ్బందులో!...అమ్మ, నాన్న ఎప్పుడొస్తారో ? ఆయన అన్నట్లు నోరు తగ్గించు కోవాలి. అమ్మపై కేకలు వేయకూడదు….’
********
“అక్కడ దాని అరుపులు ఎలా భరిస్తున్నావో గాని, నాకు మాత్రం రోజు రోజుకి బి.పి పెరిగిపోతోంది. ఎన్నాళ్ళీ. బందిఖాన బతుకు!?"
"మీరలా అనుకుని బాధ పడకండి. మన దగ్గరున్న చనువు, ప్రేమాభిమానాలతోనే అదలా మాట్లాడుతోంది. దాని మాటలు పట్టించుకోకండి. పిల్లలతో, ఉద్యోగంతో అది సతమతమవుతోంది. లేక లేక పుట్టిన పిల్లండీ!...ఎంతో గారాభంగా పెంచుకున్నాం దాన్ని!"
"అయితే మాత్రం, ప్రతి చిన్న విషయానికి మనపై, ముఖ్యంగా నీమీద కేకలు వేయడం నాకు నచ్చలేదు. మనకు జరుగుబాటు లేక, దాని దగ్గర ఉంటున్నట్లు హీనంగా మాట్లాడుతోంది.. తప్పంతా నీదే!... చిన్నప్పటినుంచీ దానికి మరీ గారాబం చేసావు. ఇంటి పనులు, వంటపనులు నేర్పించక ముద్దు చేసావు. ఇప్పుడేమో దానికి పనిమనిషిగా, వంటలక్కగా మారిపోయావు. ఈ వయసులో పనిచేస్తూ కూడా చీవాట్లు తింటున్నావు. మనమక్కడ ఓ నెలరోజులు లేకపోతే మన విలువ తెలుస్తుంది దానికి. పెన్షన్ డబ్బులతో మనం బతగ్గలం.”
"అలా బతికే బతుకులో మనకు సంతోషం ఉండదండీ! మనవడు, మనవరాలిని చూసుకుంటూ బతకడంలో ఉండే ఆనందం, సంతృప్తి, అక్కడ ఉంటేనే ఉంటాయండీ! మొదటి పిల్ల మన చేతిలోనే పెరిగింది. ఇప్పుడు చంటాడికి పట్టుమని పది నెలలు కూడా నిండలేదు. వాడిని మనమే చూసుకోవాలి.”
“అంటే!... కొంతకాలం అక్కడ ఉండక తప్పదంటావా?"
"తప్పదండీ! మనకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? …అది అరిచినా, కేకలేసినా, చీదరించుకున్నా భరించక తప్పదు. పిల్లలను చూసుకోడానికి మనిషిని పెట్టుకున్నా, సరిగ్గా చూడరు. మనమే చూసుకోవాలి. వంట మనుషుల వంటలు బాగుండవు. నెలలో అయిదారు రోజులు రారు. నెలయ్యే సరికి వేలకు వేలు జీతం ఇవ్వాలి. అదేదో అరుస్తోందని, మీలా నేను తప్పుకోలేనండీ!"
"ఎంత కాలమని దాని అరుపులు భరించాలి ?"
"ఈ ఊర్లోనే ఉంటున్నాం కనుక, పిల్లలను చూసుకోగలుగుతున్నాం. అది ఉద్యోగం చేయగలుగుతోంది."
"ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు బతగ్గలరు.మనం లేకుంటే, వారికి పనులు చేసుకోడం అలవాటవుతుంది."
"చిన్న పిల్లలతో ఉందండీ అది."
" ఈ వయసులో మనం ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది."
"మీ ఆలోచన అలా ఉంది. నా ఆలోచన మరోలా ఉంది."
"అంటే!?"
"మీ ఆలోచన మంచిదే! కాదనలేను. అలాని ఇక్కడ ఉండిపోలేను. నా బాధ మరో తల్లికి మాత్రమే అర్థం అవుతుంది. తండ్రులకు తల్లుల ప్రేమ, అనుబంధం ఎప్పటికీ అర్ధం కావు."
"ఈరోజు నీ మాటలు వింతగా ఉన్నాయ్! దానిమీద నాకు ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావ్ !?"
"దానికి మనిద్దరి అవసరం ఉందండీ! మీది ప్రేమ బంధం! నాది పేగుబంధం! రేపు మనం అక్కడకు వెళ్దామండీ!...చంటాడి కోసం ఇంకొన్నాళ్ళు మనం సర్దుకు పోవాలండీ!”
"సరే! అలాగే!"
****
"డాడీ! మీరు మధ్యలోకి రాకండి!...మమ్మీ, నేను ఏదేదో
మాట్లాడుకుంటుంటాం. మీరు పట్టించుకుని బి.పి పెంచుకోకండి." అంది కూతురు.
‘ ఇదిక మారదు. దీని తత్వం ఇంతే!... సర్దుకు పోవాలి..
శ్రీమతి గారి సలహా పాటించాలి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, కేకలు వేసుకునేటప్పుడు చెవిలోని వినికిడి యంత్రం తీసేసి పేపరులోకి దూరిపోవడమే ఉత్తమం!'. అనుకున్నాడు తండ్రి.
/ సమాప్తం /
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
Podcast Link
Twitter Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.
Srinivasa Rao • 8 days ago
యింటింటి జరిగేది యిదే. పిల్లలు ఎదిగే దాకా చూడాలి, వాళ్ళ ఉద్యోగాలతో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేరి అన్నీ పనులు చేయాలి, తప్పులేదు కానీ పిల్లలు చేసే అవమానం భరించలేరు
తల్లులను అరిచే చనువు కేవలం పిల్లలకు మాత్రమే వుంటుంది. దాన్ని పనిమనిషిలా చూడటమని అనుకోకూడదనేది కచ్చితంగా నిజం. ఈ విషయాన్ని కథ ద్వారా చాలా బాగా చెప్పారండి. పని వత్తిళ్ళ వల్ల ఇవన్నీ అందరిళ్ళలో జరిగేవే, పెద్దగా పట్టించుకోకుండా వుండటమే ఉత్తమం, ఆరోగ్యం.