top of page
Original.png

నీలవేణి

#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #నీలవేణి, #Neelaveni, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Neelaveni - New Telugu Story Written By Anisa Tabassum Sk

Published in manatelugukathalu.com on 19/02/2026

నీలవేణి - తెలుగు కథ

రచన: అనిసా తబస్సుమ్ SK


రంగు పేరుతో సమాజం చేసే వివక్ష, అన్యాయాలకు బలైన ఒక ఆడపిల్ల జీవిత ప్రయాణమే ఈ కథ.


అందమైన పల్లెటూరు… చల్లని గాలికి ఊగే వరిచేలు… చెట్ల కొమ్మలపై చిలిపిగా కిలకిలలాడే పక్షిపిల్లలు… ఉదయాన్నే పొలాల్లో వరినాట్లకు వెళ్లే కూలీలు. ఆ గ్రామంలో రాజన్న–సోమమ్మలకు ఏకైక సంతానం నీలవేణి.


నీల తన నాన్నమ్మ పోలికలతో నల్లగా పుట్టింది. నలుపే అయినా ఆమె ముఖంలో ప్రత్యేక ఆకర్షణ ఉండేది. వానకుముందు నల్ల మేఘాల్లా ముచ్చటగా, నెమలి పింఛాల్లాంటి పెద్ద కళ్లు, నాగుపాములాంటి వాలుజడ—నీల అందం రంగుతో కొలవలేనిది.


నీల పుట్టినప్పుడు తల్లిదండ్రులు మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారు. రంగు వారికెప్పుడూ లోపంగా అనిపించలేదు. కానీ నీల పెద్దదయ్యేకొద్దీ గ్రామంలో మాటలు పెరిగాయి. ఒకరోజు నీల చిన్నమ్మ, “పాపం… మన నీలకి ఉన్న రంగుతో మంచి సంబంధాలు రావడం కష్టమే కదా” అని అనేసింది. 


ఆ మాటలు నీల తల్లి మనసు గాయపరిచినా, “మన నీలకేం తక్కువ...మనిషి విలువ రంగులో కాదు, మనసులో ఉంటుంది” అని ధైర్యంగా సమాధానమిచ్చింది.


ఆ మాటలు కిటికీ దగ్గర వింటున్న నీల గుండె భారమైంది. రంగు తక్కువని మనిషిని పనికిరాని వస్తువులా చూడటం ఆమెకు అర్థం కాలేదు.


చదువులో నీల చాలా మంచి విద్యార్థిని. కానీ స్కూల్, కాలేజీలో రంగు పేరుతో అపహాస్యం కొత్తేమీ కాదు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఇంకో స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది నీల. తన స్నేహితురాలి తల్లి ఇలా అంటూ, "ఏమే నీల, వచ్చే వారం దీన్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్లు వస్తున్నారు. నువ్వు కొంచెం దీనికి తోడుగా ఉండవే, అది ఇంకా అందంగా కనిపిస్తుంది" అని మొహమాటం లేకుండా, తాను ఎంత బాధపడుతుందో అని కూడా ఆలోచించకుండా నీలతో అంది. తన స్నేహితుల ముందు అవమానపడ్డ నీలవేణి లోలోపల మాత్రం చితికిపోయింది.


ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివిన నీల, సహించలేని అవమానాల కారణంగా చదువు మానేయాల్సి వచ్చింది.


తర్వాత నీలవేణికి సూర్యతో పెళ్లి ఖరారైంది. సూర్య సోషల్ టీచర్. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉన్న కుటుంబమని నీల తల్లిదండ్రులు నమ్మారు. కట్నంగా భూమి, బంగారం ఇచ్చారు. పెళ్లయ్యాక భారమైన గుండెతో నీల అత్తారింటికి అడుగుపెట్టింది.


మొదట్లో అన్నీ బాగానే కనిపించాయి. కానీ నెల తిరగకముందే అసలు ముఖాలు బయటపడ్డాయి. ఇంటి లోన్ పేరుతో నీల దగ్గరున్న బంగారమంతా తీసుకున్నారు. మెల్లగా నీల ఆ ఇంట్లో కోడలు కాదు—పనిమనిషి అయింది.


నీలని ఆ ఇంట్లో పనిమనిషిగా మాత్రమే చూస్తారు. ఇంటి పనితోపాటు అత్త తిట్లు, తన రంగు మీద సూటిపోటి మాటలు కూడా పడాల్సి వస్తుంది.


ఒకరోజు నీల అత్త ఇలా అంది, “అత్త వట్టిచేతులతో తిరుగుతుందని కూడా లేకుండా, బంగారు గాజులు వేసుకొని తిరిగేది ఈవిడ. అయినా ఆ నల్ల చేతులకు ఆ బంగారు గాజులు ఎందుకో, ఎవరికి చూపించుకోవడానికో ఆ సోకులు” అని.


ఆ మాటలకు నీల మనసు నొచ్చుకున్నా, ఏమి మాట్లాడకుండా అత్త మీద ఉన్న గౌరవంతో గాజులు కూడా ఇచ్చేసింది.


భర్త ఏమన్నా మంచోడా అంటే అది లేదు, తల్లి ఎంత చెప్తే అంత అతగాడికి. తన తల్లి చెప్తుంది సరైందేనా, కాదా? అని ఆలోచించడు, గుడ్డిగా అనుసరించడం తప్ప!


రంగు పేరుతో అగౌరవం చేయడంలో అత్తతో కలిసిపోయాడు.


ఒకరోజు వాకిలి తుడుస్తున్న నీలను చూసి వచ్చిన ఓ ఆవిడ, “ఎవరాపిల్ల?” అని అడిగితే, అత్త “మా పనిపిల్ల” అని చెప్పింది. ఆ మాట నీల గుండెను ముక్కలు చేసింది.


తన గుండెలు పగిలేలా ఏడ్చింది నీల. ఉలి దెబ్బలను తట్టుకొని అందమైన శిల్పంగా మారినట్టు, ఇన్ని అవమానాలు పడ్డ నీలలో ఒక్క కాంతి నాంది పలికింది. మనిషి మనసు పూర్తిగా ముక్కలైనప్పుడే తనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పుడతాయన్నట్టు. నీలలో ధైర్యంతో కూడిన కొత్త ఆలోచనలు.


ఈ సమాజంలో ఉండే తన భర్త, అత్తలాంటి చీడపురుగులపై విరక్తి వచ్చింది. వీళ్ళకోసమా నా జీవితాన్ని ముగించుకోవాలనుకుంది? నేను చస్తే నా స్థానంలో మరో అమ్మాయి ఈ బాధలు అనుభవిస్తుంది అంతేగాని ఏమీ మారదు. వీళ్ళవల్ల నేను చస్తే, నామీదే ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి. తనలో తను ధైర్యం నింపుకొని, "ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు" అని


ఆ రాత్రే నీల నిర్ణయం తీసుకుంది. తన బట్టలు సర్దుకొని హాల్‌లోకి వచ్చింది. ఎదురొచ్చిన తన భర్త చెంప ఛెళ్లుమనిపించి, తన అత్త చేతుల్లో ఉన్న తన బంగారపు గాజుల్ని లాక్కొని ఆ ఇంట్లో (నరకం) నుంచి బయటపడింది.


పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది. చట్టం తనవైపు నిలిచింది. గుండెనిండా ధైర్యంతో నీల పుట్టింటికి చేరింది.


జరిగింది తెలిసిన తల్లిదండ్రులు బాధపడ్డారు గానీ, “తప్పు చేసిన వాళ్లకు లేని సిగ్గు మనకెందుకు?” అంటూ నీలను ప్రేమగా ఆదుకున్నారు.


కాలక్రమంలో నీల పొలాల లెక్కలు చూసుకుంటూ, తల్లిదండ్రులకి తోడుగా నిలిచింది. తనను మనస్ఫూర్తిగా గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోంది.


అందం అంటే కేవలం శరీరం మీద ఉండే రంగు ఒక్కటే కాదు. అందం అంటే స్వచ్ఛమైన మనసు, మంచి వ్యక్తిత్వం, సహాయగుణం, మానవత్వం, ఎదుటివారిని గౌరవించడం. ఇతరులతో మంచిగా మెలగడం, కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతతో ఉండడం. కల్మషం లేని నవ్వు అందం అంటే.

అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Shaik Anu
Shaik Anu
21 minutes ago
Rated 5 out of 5 stars.

Good❤👍

Like
bottom of page