top of page
Original.png

పద్మినీ పరిణయం

#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #PadminiParinayam, #పద్మినీపరిణయం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Padmini Parinayam - New Telugu Story Written By Anisa Tabassum Sk Published in manatelugukathalu.com on 07/03/2026

పద్మినీ పరిణయం - తెలుగు కథ

రచన: అనిసా తబస్సుమ్ SK


సమయం సాయంత్రం నాలుగవుతుంది. సూర్యుడు మబ్బుల వెనుక దాక్కుంటూ ఆకాశాన్ని నారింజ, బంగారు రంగులతో అలంకరించాడు. ఆ అలంకరణకు భంగం పరుస్తున్నట్టు నల్లని మబ్బు పట్టేసింది. చల్లని గాలితో చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారింది వాతావరణం.


పచ్చని చెట్ల ఆకులపై నుంచి జారిపడుతూ నేలను మెల్లగా ముద్దాడుతున్నాయి వర్షపు చినుకులు.


జనసంచారం లేని చోటు, చుట్టూ దట్టమైన చెట్లతో, పొదలతో ఉన్న ఒక పాత కోనేరు ఉంది. ఆ కోనేరు నీటి మీద తేలియాడుతున్న కలువ పువ్వులు. కొన్ని కలువలు విచ్చుకొని వర్షాన్ని ఆహ్వానిస్తుంటే, మరికొన్ని అలకతో ముడుచుకున్నాయి.


ఇంతలో ఆ కోనేటి నీటిలో ఏదో పడ్డట్టు దబ్... అని శబ్దం వచ్చింది. కొన్ని క్షణాలకు పైకి తేలింది తామర పువ్వులాంటి అమ్మాయి. తడిసిన పొడవాటి జుట్టు, కలువ రేకులంటి కళ్లు, మొనతేలిన ముక్కుపై తళుక్కుమని మెరిసే వజ్రపు ముక్కుపుడక. రాణి రంగు రవిక - చిలకపచ్చ పరికిణి, గులాబీ రంగు పెదాలతో నవ్వుతుంటే, అక్కడున్న కొలను అందాలతో పోటీ పడుతుంది ఆమె అందం. ఆ అమ్మాయే పద్మిని. అమాయకురాలు... మంచి మనసున్న అమ్మాయి. ఆ జల్లులో, కోనేటి నీళ్లతో మైమరిచి ఆడుకుంటున్న పద్మినిని. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరడుగుల కుర్రాడు, తన భుజాన ఉన్న సంచిని నేలమీద జారవిడిచి, అతని కుర్తా తీసి తను కూడా కోనేటిలోకి దూకి పద్మినిని ఎంతో ప్రేమగా ఎత్తుకొని బయటికి వచ్చాడు. అతగాడే మురళి. పక్క ఊరిలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. అతని వృత్తికి తగ్గట్టు మురళికి ప్రశ్నించే స్వభావం. తన కళ్ల ముందు అన్యాయం జరిగితే, ఎదురుగా ఎంతటివారు ఉన్నా ఊరుకోడు.


చెట్టు కింద ఉన్న బెంచీపై పద్మిని కూర్చోబెట్టి... "ఎన్నిసార్లు చెప్పాలి ఇలా నీటిలో తడవొద్దు అని!" అంటూ... తన సంచిలో నుంచి, పేపర్‌తో చుట్టి ఉన్నదాన్ని పద్మినికి అందించాడు. తెరిచి చూసి 'నేను అడిగిన నీలం మట్టిగాజులు!!' అంది చిరునవ్వుతో చూస్తూ... పద్మిని పక్కకి కూర్చొని, తన చేతిని అతని చేతిలోకి తీసుకొని, అతి సున్నితంగా ఆ గాజులు తొడుగుతున్నాడు మురళి.


పద్మిని-మురళిది ఈనాటి ప్రేమ కాదు. వీళ్లిద్దరూ వారి 8వ తరగతి నుంచే ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. వీరి మధ్య ప్రేమ కూడా వీరితోపాటే పెరిగింది. కాకపోతే, వీరు ప్రేమించుకుంటున్నట్టు అప్పుడు, ఇప్పుడు మూడో కంటికి తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు కలుసుకునే చోటు ఈ కోలనే. వీరి ప్రేమ, మధుర జ్ఞాపకాలు, అలకలు, బుజ్జగింపులు, బాధలు కేవలం ఈ కోనేరుకీ, ఇక్కడ కాపురం ఉంటున్న పక్షులకే మాత్రమే తెలుసు. ఎన్ని అనుకున్నా, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేరు ఈ మురళి-పద్మిని.


పద్మిని, మురళిది ఒకే ఊరు 'హంసలదీవి'. పద్మిని కూడా మురళి పనిచేసే పక్క ఊరిలోనే టీచర్‌గా పనిచేస్తుంది. ఉదయం బస్సులో వెళ్లి, సాయంత్రం మళ్లీ బస్సుకి వస్తారు ఇద్దరూ, కానీ అసలు ఒకరికింకొకరు పరిచయం లేనట్టుగానే ఉంటారు. ఇలా ఉండడానికి గల కారణం, పద్మిని నాన్న భూషణం.


ఆ హంసలదీవి ఊరి జమీందారు మరెవరో కాదు, పద్మిని నాన్న భూషణమే... అహంకారానికి, అన్యాయాలకు, దుర్మార్గానికి నిలువెత్తు రూపం, భూషణం. ఒక్కమాటలో ఆ ఊరికి పట్టిన పీడ అనొచ్చు.


భూషణానికి ఉన్న భూమిలో సగానికి పైగా పేదవారి దగ్గర, అమాయకుల దగ్గర లాక్కున్న భూమే. భూషణానికి ఒక కొడుకు (పేరు సురేంద్ర), ఒక కూతురు (పద్మిని). ఇంకో కవిత అనే కూతురు కూడా ఉండేది... ప్రేమించిన కారణంగా కన్న కూతురని కనికరం లేకుండా భూషణం, అతడి కొడుకు సురేంద్ర కలిసి పాపం విషం పెట్టి చంపేశారు. ఆ తరువాత కవిత ప్రేమించిన అబ్బాయి కూడా కనిపించకుండా పోయాడు. పద్మిని అంత అందంగా ఉన్నా, ఆ భయంతోనే ఊర్లో ఎవరూ పద్మిని వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయరు.


మురళికి తెగింపు ఎక్కువ. ఒకసారి సురేంద్రతో కూడా తగువుకు వెళ్ళాడు... అప్పట్నుంచే, పద్మిని మురళిని ఇష్టపడటం మొదలుపెట్టింది. కష్టాల్లో ఉన్నవారికి తన సొంత డబ్బులు ఖర్చు చేసినా, ఊర్లో చిన్న చిన్న అవసరాలు తీర్చడం, బాలకార్మికులను బడిలో చేర్పించడం చేస్తాడు. ఇందువల్లేనేమో, పద్మినికి మురళి అంటే అంత ఇష్టం ఏర్పడింది.


ఒకరోజు కోనేరు దగ్గర కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, మురళి ఇలా అంటాడు: "పద్దు... మీ ఇంట్లో ఎలాగో మన పెళ్ళికి ఒప్పుకోరు. నువ్వా ఇంకొకరిని పెళ్ళాడలేవు!! నన్ను నమ్మి నాతో వచ్చేయొచ్చు కదా, పద్దు... నా కళ్లలో పెట్టుకొని చూసుకుంటా!" అని ప్రేమగా అడిగాడు. "ఆహా... మా నాన్న నేను చెప్తే, అర్థం చేసుకుంటాడు. నువ్వు అనుకుంటున్నంత చెడ్డవాడు ఏమీ కాదు, మా నాన్న!" అంటూ కొంటెగా... కోనేటి నీళ్లు తన చేతితో మురళి ముఖంపై విసిరింది.


"నా మాట ఎప్పుడు విన్నావని" అంటూ... తన కుర్తా జేబులో నుంచి పట్టీలు తీసి, పద్మిని కాలు తన ఒడిలోకి తీసుకొని, పట్టీలు పెడుతూ: "పద్దు... నేను పనిమీద నాలుగు రోజులు పక్క రాష్ట్రానికి వెళ్లాలి. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను పని పూర్తి చేసుకొని, వెంటనే తిరిగి వస్తాను!" అన్నాడు. ఆ మాటలు విన్న పద్మినికి కలవరం మొదలయింది. వీలైనంత తొందరగా తిరిగి రమ్మని కొంత భయంతోనే పంపించింది, పద్మిని.


నాల్గవ రోజు పద్మిని కోనేరు దగ్గరకు వెళ్ళింది. ఎంత ఎదురుచూసినా, మురళి రాలేదే... మురళికి ఏమైందో ఏంటో అని కంగారు మొదలయింది. మురళి ఎప్పుడూ ఇలా చేయలేదు. ఎప్పుడూ తాను చెప్పిన సమయానికి వచ్చేస్తాడు. ఈసారి మురళి రాకపోయేసరికి, ఇంటికి వెళ్లే సమయానికి మించి, ఎదురుచూసింది, పద్మిని. అయినా నిరాశే మిగిలింది. అదే భయంతో ఇంటికి చేరింది.


ఇంట్లో అడుగు పెట్టగానే, పద్మిని చెంప ఛెళ్ళు మనిపించాడు, భూషణం. చెంపల మీదగా జారుతున్న కన్నీళ్లతో, తలదించుకుని మౌనంగా నిలుచుంది పద్మిని. "ముప్పై నిముషాలు ఎందుకు ఆలస్యం అయింది? ఎక్కడ తిరిగి వస్తున్నావే!!..." అని ఆవేశంతో అరిచాడు, భూషణం.


"రేపటి నుంచి బడిలో పరీక్షలు నాన్న. ఆ పనిలో ఆలస్యం అయింది," అని భయపడుతూనే బదులిచ్చింది, పద్మిని. "ఊర్లో చేసిన సేవలు చాలు. ఇంకా నువ్వేమీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. పో లోపలికి!" అన్నాడు కోపంగా. వడివడిగా తన గదిలోకి వెళ్తున్న పద్మిని వైపు చూస్తూ: "ఆగవే!! రేపు నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు!" అని కాస్త చిరాకుగానే అన్నాడు.


ఎదురు మాట్లాడితే, ఇంకేం అంటాడోనని, ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఆడవారు, పద్మినిని ఓదార్చడానికి ఆమె వెంటనే వెళ్లారు. భూషణానికి ఎదురు చెప్పే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. పద్మిని అంత చదువుకొని, ఉద్యోగం చేయడం కూడా అతనికి ఇష్టం లేదు. భూషణం తల్లి, భూషణం తోబుట్టువులు: "మన అమ్మాయిని ఎవరు కన్నెత్తి చూస్తాడ్రా? అదేదో చేద్దాం అనుకుంటుందిగా, చేయని. మళ్లీ పెళ్ళైతే, ఇంటిని, సంసారాన్ని చూసుకోవడంలో పడుతుంది!" అని చెప్తేగానీ ఒప్పుకోలేదు, భూషణం.


ఉదయం కాకూడదు అని కోరుకున్న, సూర్యుడు ఉదయించాడు. ఇష్టం లేకపోయినా వేరే దారే లేక, తల వంచింది పద్మిని. భూషణానికి తగ్గ సంబంధం కుదుర్చుకున్నాడు. నేరేడుపండు రంగు చీరలో, నాగుపాము లాంటి జడలో, కనకాంబరం పూల మాల పెట్టుకొని, అరవంకీలు, వడ్డాణం పెట్టుకొని కలకళలాడుతున్న పద్మినిని ఎవరు కాదంటారు? ఆ అబ్బాయి వాళ్ళకి నచ్చి, ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు.


ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది, పద్మిని. అలాగని మురళిని కాదని మరొకరితో పెళ్ళాడలేదు. ఈ రోజు ఎలాగైనా మురళిని కలిసి జరిగింది చెప్పాలి అనుకుంది. కానీ, ఈ పరిస్థితుల్లో కోనేరు దగ్గరకు వెళ్లేదెలా? కాసేపటికి తన తల్లి దగ్గరకు వెళ్లి: "అమ్మా, మనసేం బాగోలేదే... నేను గుడికి వెళ్లొస్తాను!" అని చెప్పి బయలుదేరింది. వడివడిగా కోనేరు దగ్గరకు చేరుకుంది. ఈ రోజు మురళి ఎలాగైనా వస్తాడని తెలుసు. తాను కోనేరు దగ్గరకు రోజు కంటే ఆలస్యంగానే వెళ్ళింది. చుట్టూ చూసినా, మురళి కనిపించలేదు. ఇంకాసేపు చూద్దాం అనుకుంది. ఎంత ఎదురుచూసినా, పద్మినికి నిరాశే మిగిలింది. ఆ దిగులుతోనే ఇంటికి చేరుకుంది. తన గదిలోకి వెళ్లి తలుపు మూసేసింది. మనసులో భారంగా ఉన్న, తన బాధ కన్నీళ్ల రూపంలో ధారలై వస్తుంది.


మదిలో ఏవేవో ఆలోచనలు. వాటితో పాటు మురళి ఆమెను ఎక్కడ మోసం చేసి వెళ్తాడోనన్న భయం. ఇంకొకరిని పెళ్ళాడి, తాను బ్రతికేదెలా? మురళి లాంటి అబ్బాయి దూరమైపోతే? తన ఇల్లే తనకు నరకం అనుకుంటే, ఆ కుదుర్చుకున్న సంబంధం కూడా దానికి అలాంటిదే. ఎన్నో ఆలోచనలతో, భయంతో నలిగిపోతుంది, పద్మిని.


మరుసటి రోజు, ఎప్పటిలానే బడికి వెళ్లబోతుంటే, భూషణం ఆపేశాడు: "నీకు మొన్నే కదా చెప్పింది, సంఘ సేవలు చాలు అని. మళ్లీ ఎక్కడికి బయలుదేరావు?"


"మానేసే ముందు కొన్ని సంతకాలు చేయాల్సి ఉంది నాన్న. ఇవాళ ఒక్క రోజు వెళ్లి వస్తా!" అంది. కాసేపు మౌనంగా ఉండి... "సరే, తొందరగా వచ్చేయ్," అని చెప్పి, లోపలికి వెళ్లిపోయాడు.


పద్మిని తొందరతొందరగా బడిలో పనులు పూర్తిచేసుకొని, కోనేరు దగ్గరకు వెళ్ళింది.


కోనేరు మెట్లపై కూర్చుని, దీర్ఘంగా ఆలోచిస్తూ... ఒక నిర్ణయానికి వచ్చింది. "ఈ రోజు మురళి రాకపోతే, అదే కోనేట్లో మునిగి చనిపోవాలి," అనుకుంది. ఎందుకంటే, ఇష్టంలేని పెళ్లి చేసుకొని, ప్రతిరోజు నరకంలో బ్రతకడం కన్నా, చావడం మంచిది అనుకుంది. మెల్లగా కదులుతున్న కోనేటి నీళ్లను చూస్తూ, ఆలోచనలో పడింది.


ఇంతలో ఎవరో, పద్మిని వెనుక నుంచి చేతులతో ఆమె కళ్లను మూసి పట్టుకున్నారు. "ఎవరు... ఎవరది..." అంటూ అరుస్తూ ఆమె బలమంతా ఉపయోగించి, ఆ చేతులను పక్కకు తోసేసింది.


తిరిగి చూస్తే, అది మరెవరో కాదు, పద్మిని మనసారా ప్రేమించిన మురళి.


మురళిని తన కళ్ల ఎదుట చూడగానే, కోపం, బాధతో కన్నీళ్లు ఆగలేదు. వెంటనే మురళిని కౌగిలించుకొని, తన బాధను కన్నీళ్ల రూపంలో చెప్తూ, ఏడవడం మొదలుపెట్టింది.


మురళి ఎంత ఓదార్చడానికి ప్రయత్నించినా, లాభం లేకుండా పోయింది. "నన్ను క్షమించు, పద్దు. వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో, మరికొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది... మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా!" అని చెప్పగా, కొంచెం ఊరుకుంది.


కన్నీళ్లను తుడుచుకుంటూ, మురళి ఊర్లో లేనప్పుడు జరిగిన సంగతులు చెప్పింది.


"తాను ఈ రోజు తిరిగి రావడం మంచిదైందని" అనుకున్నాడు.


"పద్దు, నువ్వు మరొకరిని పెళ్ళాడి ఉండగలవా?" అన్నాడు. "నీకు తెలియదా మురళి? నేను ఉండలేనని," అంటూ కోపంగా బదులిచ్చింది.


"పోనీ, మన ప్రేమ విషయం మీ నాన్నకి చెప్తే, మన పెళ్ళికి ఒప్పుకుంటాడా?..." "ఊహుం..." అని బదులిచ్చింది, ముఖం పక్కకు తిప్పుకుంటూ.


"మరి మనం ఏం చేద్దాం!! నన్ను నమ్మి నాతో రాగలవా?" అని అడిగాడు. అందుకు అవునన్నట్టు తల ఆడించింది పద్మిని.


"సరే, ఇప్పుడే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం. ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించా. మొన్న పని మీద వీలు చూసుకుంది కూడా అందుకే. మనకి ఇబ్బంది కాకూడదని, ఆ ఊర్లోనే ఇల్లు తీసుకున్నా. నిన్ను కలిసి ఈ విషయం చెప్దామని ఆగాను." పద్మిని ఆశ్చర్యపోయి వింటుంది, మురళి మాటల్ని. "మరి ఉద్యోగం?" అని అడిగింది. "ఆ ఊర్లోనే ఉద్యోగం చూసుకుంటా. అంతదాకా ఖర్చులకు నేను దాచిన డబ్బులు ఉన్నాయి. వాటితో సరిపెట్టుకుందాం," అని బదులిచ్చాడు.


కొత్త ఆశలతో, కొత్త జీవితం మొదలు పెట్టాలని, ఆ కోనేరుకు ఇక సెలవు చెప్పి బయలుదేరారు, మురళి-పద్మిని.


ఈ విషయం తెలుసుకున్న భూషణం, కోపంతో అలానే కూర్చుండిపోయాడు. ఇంట్లో ఆడవారు: "పోనీలే, ఈ నరకం నుంచి బయటపడి తానైనా సంతోషంగా ఉంటుంది," అనుకున్నారు.


కథ సమాప్తం


-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
life_explorer
life_explorer
5 hours ago
Rated 5 out of 5 stars.

Good love story 🥰. Anisa garu is there any part 2 for this story.

Like
bottom of page