top of page
Original.png

జై హింద్

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

జై హింద్ కథ, తెలుగు ప్రేరణాత్మక కథ, AI స్టార్టప్, Artificial Intelligence, డేటా సెక్యూరిటీ, Cyber Security, స్టార్టప్ ఇండియా, యువ పారిశ్రామికవేత్త, Innovation, Startup Story Telugu, దేశభక్తి కథ, ఉద్యోగం, స్టార్టప్ ఫండింగ్, మేధోసంపత్తి, Intellectual Property, కోర్టు విజయం, తెలుగు కథలు, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ జై హింద్ కథలో  AI ఆధారిత డేటా సెక్యూరిటీ స్టార్టప్‌తో విజయం సాధించిన యువ తెలుగు ఇంజనీర్‌ను ప్రతిబింబించే ప్రేరణాత్మక చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ జై హింద్ కథలో AI ఆధారిత డేటా సెక్యూరిటీ స్టార్టప్‌తో విజయం సాధించిన యువ తెలుగు ఇంజనీర్‌ను ప్రతిబింబించే ప్రేరణాత్మక చిత్రం.

Jaihind - Telugu Emotional Story | Malla Karunya Kumar

జై హింద్ - తెలుగు భావోద్వేగ కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In manatelugukathalu.com On 25/06/2026


దేశం కోసం ఏదైనా గొప్పది చేయాలనే సంకల్పంతో AI ఆధారిత డేటా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన యువ ఇంజనీర్ చంద్ర. అతని ప్రతిభను గుర్తించాల్సిన సంస్థే అతని ఆవిష్కరణను దోచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉద్యోగాన్ని కోల్పోయినా, ఆశను కోల్పోని చంద్ర తన తాత ప్రోత్సాహం, న్యాయవాది తెలివితేటలు, ఒక అమాయక యువకుడి సహాయంతో నిజాన్ని నిరూపించి తన స్టార్టప్ కలను సాకారం చేసుకుంటాడు. దేశభక్తి, ఆవిష్కరణ, నిజాయితీ, న్యాయం, యువతకు స్ఫూర్తినిచ్చే ఈ కథ ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.


ఆఫీస్ బయట అడుగుపెట్టగానే దూరంగా ఏదో గందరగోళ పరిస్థితులు నెలకొనడం నా కంటికి కనిపిస్తూనే ఉంది. 


నాకెందుకులే అనుకొని అక్కడ నుండి కదిలాను. కానీ నా పాదాలు ముందుకు కదలడం మాని, నా కళ్ళు అటువైపు తీక్షణంగా చూడటం మొదలుపెట్టాయి.


'అరే, అతను సందీప్ రూమ్‌లో ఉండే వ్యక్తి కదా!' నా మెమరీ గుర్తు చేసింది.


అతన్ని పట్టుకొని చితకబాదుతున్న ఇన్‌స్పెక్టర్ నాకు బాగా సుపరిచితుడైన రంజిత్ కావడంతో, వేగంగా అటువైపుకు పరుగు తీశాను. కోపంతో ఆ వ్యక్తిని కొడుతున్న రంజిత్‌ను నిలువరిస్తూ, "రంజిత్, అతను మనవాడే. అసలేం జరిగింది?" అని అడిగాను. 


నన్ను చూసి తన ఆవేశాన్ని నిగ్రహించుకొని, "చంద్ర! నువ్వు ఇక్కడ? వీడు నీకు తెలుసా? వీడు ఒక అమ్మాయిని ఫాలో అవుతూ నాకు దొరికాడు." అని చెప్పాడు రంజిత్.


"రంజిత్! అతను నా స్నేహితుడి రూమ్‌మేట్, విలేజ్ నుండి వచ్చాడు. ఇక్కడ వాతావరణం గురించి అతనికి ఏం తెలియదు. అతను ఇలా ప్రవర్తించడానికి కారణం అతని స్నేహితులు. మంచి ఉద్యోగం చేసే అమ్మాయిని ప్రేమిస్తే లైఫ్ సెటిల్ అవుతుందని ఇతనితో పరిహాసమాడితే, ఇతను నిజమే అనుకొని ఇలా మీదకు తెచ్చుకున్నాడు. ఇతను ఇన్నోసెంట్." అని జరిగింది చెప్పాను.


"అలాగా! ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇతని రూమ్‌మేట్ ఎందుకు ఇతన్ని ఇలా వదిలేశాడన్నది. ఇతను నంబర్ చెబితే ఇతని స్నేహితుడికి ఫోన్ చేశాను. ఇతనితో ఎటువంటి సంబంధం లేదు అని కాల్ కట్ చేశాడు. బహుశా ఇలా జరుగుతుందని ఊహించుకోకపోయి ఉంటాడు. నేను కాల్ చేసేసరికి బెదిరిపోయి ఇతనికి తనకి సంబంధం లేదని చెప్పాడు." అని జరిగింది చెప్పాడు రంజిత్.


"ఒకే రంజిత్, నేను అతని సంగతి చూసుకుంటాను. నువ్వు ఈసారికి అతన్ని క్షమించు." అని కాస్త బతిమలాడితే, నా ముఖం చూసి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రంజిత్. 


అతని దగ్గరకు చేరుకొని, "చూడు బ్రదర్! ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తేడా వస్తే జైల్లో గడపాల్సి వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. నీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను పదా." అని అన్నాను. 


"అన్నా! ఆ ఆదర్శ్‌ను నమ్మి పని కోసం వచ్చాను. పని ఇక్కడ దొరకడం కష్టమని ఏవేవో మాటలు చెప్పాడు. నాలో ఉన్న అజ్ఞానం, అమ్మాయిలను మొదటి నుండి ఆటపట్టించే స్వభావం కారణంగా ఇలా చేశాను. నేను మా ఊరు వెళ్ళిపోతానన్నా, ఆకలితో అయినా అక్కడే పడి ఉంటాను." అని చెమర్చిన కళ్ళతో అన్నాడు.


ఎందుకో అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. అతనికి సరైన మార్గం చూపిస్తే మారుతాడనిపించింది. 

"ఇంతకీ నీ పేరేమిటి?" 


"లింగడు అన్నా!" 


"సరే నీకు పని ఇప్పించే బాధ్యత నాది, మరి సరిగ్గా ఉంటావా?" అని అడిగాను.

"ఉంటానన్నా" అని సమాధానం ఇచ్చాడు.


 వెంటనే బైక్ పై ఎక్కించుకొని ఇంటికి చేరుకున్నాను. తాత అప్పుడే నర్సరీ నుండి వచ్చి ఆరుబయట కూర్చొని ఉన్నారు. నన్ను చూసి పక్కన ఉన్న వ్యక్తి ఎవరా అని కళ్లతోనే సైగ చేస్తూ అడిగారు. జరిగిందంతా చెప్పాను.


కొంత సమయం ఆలోచించి, లింగడితో మాట్లాడి... 

"చంద్ర! మన నర్సరీ నుండి మొక్కలు డెలివరీ చేయడానికి డ్రైవర్ అవసరం. ఆ కొరత ఇతనితో తీరిపోతుందిలే, ఇతన్ని ఇక్కడే పనిలో పెడదాం, డ్రైవింగ్ నేను నేర్పిస్తాను.” అని లింగడికి అక్కడే పని ఇచ్చారు తాత. 


తాత మాటలు విని చాలా సంతోషించాడు లింగడు. 


తర్వాత నా వైపు చూస్తూ, “చంద్ర! నీ స్టార్టప్ సంగతి ఏమైంది? ఏమైనా ఆదేశాలు వచ్చాయా?" అని అడిగారు.


"లేదు తాతయ్య! బోర్డు మెంబర్ ముందు ప్రెజెంటేషన్ ఇచ్చి వారం అవుతుంది. కానీ ఎటువంటి సమాచారం లేదు." అని కాస్త నిట్టూర్చుతూ సమాధానం ఇచ్చాను.


"చంద్ర! ఇలాంటి విషయాల్లో చాలా ఓర్పు అవసరం. తప్పకుండా నీకు అవకాశం కల్పిస్తారు." అని భరోసాగా అన్నారు.


ఏం మాట్లాడకుండా తాతయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఆరోజుటి పేపర్ ఇచ్చి ఆర్థిక రంగం గురించి వివరాలు చదువమన్నారు.


"మళ్ళీ రూపాయి పతనం." అని హెడ్డింగ్ చదువుతూ, "ప్రజలపై ద్రవ్యోల్బణ పిడుగు." అని మరో హెడ్డింగ్ చదువుతూ ఆ వివరాలు చదివాను. మొత్తం ఆర్థిక స్థితిగతుల గురించి వివరాలు చదివిన తర్వాత పేపర్‌ను టేబుల్ పై పెట్టాను. చిన్నప్పటి నుండి పేపర్ ఇచ్చి ఆర్థిక స్థితిగతుల గురించి చదవమనేవారు. 


ద్రవ్యోల్బణం, రూపాయి మారకం, ఇలా వాటి గురించి అర్థం తెలుసుకోవాలని ఆరాటంతో తాతయ్యను అడిగేవాడిని. తాతయ్య ఏ మాత్రం విసుగు లేకుండా సమాధానం ఇచ్చేవాడు. 


 ఒకసారి, “తాతయ్య, రూపాయి పతనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?" అని ప్రశ్న వేశాను. 


నవ్వుతూ, "దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగాలి, మన ఉత్పత్తులకు విలువ పెరిగి, విదేశీ పెట్టుబడులు వస్తే రూపాయి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేవారు. అంతేకాకుండా మన దేశాన్ని మనమే కాపాడుకోవాలని, దాని కోసం వీలైనంత కష్టపడాలని." అని చెప్పేవారు. 


ఆ మాటలు నాలో ప్రేరణ నింపాయి. ఒక ఉద్యోగిలా మిగిలిపోకుండా ఒక సంస్థ పెట్టాలని నిర్ణయం తీసుకుని, జై హింద్ అన్న నినాదాన్ని నాలో నింపుకున్నాను. సీనియర్ డెవలపర్‌గా విధులు నిర్వహిస్తూ, ఖాళీ సమయంలో ప్రాజెక్టు గురించి పరిశోధన చేసి, చాలా సమయం వెచ్చించి చివరికి ఏఐ ఆధారంగా పనిచేసే ఒక విప్లవాత్మక డేటా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాను. దీని ద్వారా సైబర్ దాడులను 99% ముందే గుర్తించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో తక్కువ ఖర్చుతో ఒక స్టార్టప్ పెట్టాలనేది నా కల. 


యథావిధిగా ప్రతిరోజూ గడుస్తూ ఉంది. తాతయ్య ప్రాజెక్టు గురించి అడగడం, నేను నీరసంగా ముఖం పెట్టడం మామూలైపోయింది. 


రెండు నెలలవుతోంది. కానీ, ప్రాజెక్టు విషయం గురించి ఏ పురోగతి లేదు. ఈరోజు విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలని నేరుగా మాధవ్ దగ్గరకు వెళ్ళాను, "సర్, ఇప్పటికే చాలా రోజులైంది. రోజూ మీ సమాధానం ఒకటే. అసలు నా ప్రాజెక్ట్ ఓకే చేస్తారా? లేదా?" అని ఆవేశంతో అడిగాను.


"చంద్ర! నీ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదు. నేను మనవాళ్లతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా మీద కోపం ప్రదర్శించడం నాకు నచ్చలేదు. నీ ప్రాజెక్టుకు ఫండ్ చేసేది లేదు." అని కోపంతో అన్నాడు.

నా ప్రాజెక్ట్ విలువ నాకు తెలుసు. అలాంటి ప్రాజెక్టును పనికిమాలింది అనడం నాకు నచ్చలేదు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఆవేశంతో జాబ్‌కు రిజైన్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేసాను. 


ఇంటికి చేరుకున్న నన్ను చూసి యథావిధిగా ప్రశ్నించారు తాతయ్య. బాధను దాచుకోలేక జరిగింది తాతయ్యతో చెబుతూ భోరున విలపించాను. 


జరిగింది విని నన్ను ఓదార్చుతూ, "తప్పకుండా నీ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. అయితే ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు." అని హితవు పలికారు.

ఆ మరుసటి రోజు నుండి నా ప్రాజెక్టు ఫండింగ్ కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా నా ఐడియాను వివిధ కంపెనీ వాళ్లకు సెండ్ చేశాను.


వాటిలో విదేశాలకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. సరిగ్గా పది రోజుల తర్వాత నాకు ఒక విదేశీ ఇన్వెస్టర్ నుండి కాల్ వచ్చింది. నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరంగా చెప్పాను. నా ఆలోచన నచ్చి నాకు ఫండింగ్ ఇవ్వడానికి అతను ముందుకు వచ్చాడు. అయితే ఒక షరతు పెట్టాడు. రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసి ఇవ్వాలని. ఆనందంతో ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని తాతయ్యకు చెపితే చాలా సంతోషించారు. 


సరిగ్గా ఆరోజు సాయంత్రం మాధవ్ దగ్గర నుండి నాకు కాల్ వచ్చింది. సందిగ్ధంతోనే కాల్ ఆన్సర్ చేశాను, "ఏంటి చంద్ర! మా కంపెనీ ప్రాజెక్టును నీ పేరు మీద చెలామణి చేయాలని చూస్తున్నావా? అది మా కంపెనీ ప్రాజెక్టు. కావాలంటే సాక్ష్యంగా డాక్యుమెంట్స్ అన్నీ కంపెనీ పేరు మీద ఉన్నాయి." అని నవ్వుతూ చెప్పాడు మాధవ్. 

గుండె ఆగినంత పనైంది. ఆవేశంతో తిడుతూ, "అది నా ప్రాజెక్ట్! నువ్వే ఏదో మాయ చేశావు?" అని నిలదీశాను.


 "నువ్వు ఎంత అరిచినా లాభం లేదు. మర్యాదగా వచ్చి ఉద్యోగంలో చేరి, నీ ప్రాజెక్టు నువ్వే పూర్తి చేసి మాకు అప్పగించు. ఎంతో కొంత పడేస్తానులే." అని అన్నాడు. 

"లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను" అని అంటూ ఫోన్ పెట్టేశాను.

 వేగంగా వెళ్ళి తాతయ్య దగ్గర నా గోడు వెళ్ళగక్కాను. 


తాతయ్య కొంత సమయం స్తబ్దుగా ఉండిపోయి, "అంటే ఇన్నాళ్ళు ఆలస్యం చేయడానికి కారణం నీ ప్రాజెక్టును కాజేయడానికి చూడటమే. ఎంత మోసం! వీళ్ళను విడిచిపెట్టకూడదు." అని వెంటనే తనకు తెలిసిన లాయర్ విఘ్నేశ్‌ను పిలిచి వివరాలు మొత్తం చెప్పారు.


 అంతా విని, "భయపడకు చంద్ర! నా దృష్టికి వచ్చింది కదా, మొత్తం నేను చూసుకుంటాను." అని నాకు భరోసా ఇచ్చారు లాయర్ విఘ్నేశ్. కోపంతో నా మీద కేసు వేశాడు మాధవ్. మొదటి వాదనలు అయ్యాయి. ఎటువంటి తేడా లేకుండా ఆ ప్రాజెక్టు తమదే అని డాక్యుమెంట్స్‌ను కోర్టుకు సబ్మిట్ చేశాడు మాధవ్. 


కోర్టు తీర్పు మాధవ్‌కు అనుకూలంగా వస్తుందనుకున్నారు అందరూ. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించి, మాధవ్‌ను ప్రశ్నించి తికమకపెట్టి, ప్రాజెక్టు నాకు చెందినదని వాదనలు చేసి, సాక్ష్యాలు సమర్పించడానికి సమయం అడిగారు విఘ్నేశ్. విఘ్నేశ్ గారి వాదనలు బలంగా ఉండటంతో న్యాయమూర్తి గారు మరొక వారం కేసు వాయిదా వేశారు.


నా ప్రాజెక్టు కోసం చేసిన వర్కింగ్ ఫైల్స్ అన్నీ సేకరించి విఘ్నేశ్ గారికి ఇచ్చాను. ఇచ్చినవి చూసి, "చంద్ర! బలమైన సాక్ష్యం ఉంటే ఈ ప్రాజెక్టు నీది అవుతుంది. లేకుంటే ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను." అని అన్నారు విఘ్నేశ్.


యథావిధిగా కోర్టు వాదనల రోజు వచ్చింది. మాధవ్ తరపు న్యాయవాది వాదనలు ముగించాడు. విఘ్నేశ్ గారు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. ఆ సాక్ష్యాల్లో ఒక వీడియో కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది, నాతో సహా. ఆ వీడియోలో మాధవ్ తన తప్పు ఒప్పుకొని ఆ ప్రాజెక్టు నాదే అని చెప్పడం స్పష్టంగా ఉండటంతో, పైగా ఆరోజు కోర్టుకు మాధవ్ కూడా రాకపోవడంతో న్యాయమూర్తి గారు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.


తర్వాత ఆనందంతో విఘ్నేశ్ గారి దగ్గరకు వెళ్తూ, "అంకుల్! మాధవ్ అంత తేలిగ్గా నిజం ఒప్పుకున్నాడా?" అని అడిగాను.


"లేదు చంద్ర! ఇదంతా లింగడి సహాయంతో నేను అల్లిన ఉచ్చు. దానిలో మాధవ్ సులభంగా ఇరుక్కొని నిజాలు బయటపెట్టాడు. లింగడు దాన్ని వీడియో తీశాడు." 

"అదెలా సాధ్యమైంది?" ఆశ్చర్యంతో అడిగాను.


"మాధవ్ తప్పులే మనకు అవకాశం కల్పించాయి. మాధవ్ తన ఫ్యామిలీకి తెలియకుండా ఒక అమ్మాయితో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఆ గుట్టు మన లింగడు కనిపెట్టాడు. అది నీకు ప్లస్ అయ్యింది. ఈ ప్రాజెక్టు నీది అని మాధవ్ ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించాను. ఇక నీ ప్రాజెక్టుకు ఎటువంటి ఆటంకం ఉండదు." అని నా భుజం తట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు విఘ్నేశ్ అంకుల్.


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మళ్ళ కారుణ్య కుమార్
మళ్ళ కారుణ్య కుమార్

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page