కథ షరా మామూలే

Katha Shara Mamule - Telugu Family Story | Chilakamarri Rajeswari
కథ షరా మామూలే - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి రాజేశ్వరి
Published in manatelugukathalu.com on 28/09/2026
“కథ షరా మామూలే” కథలో నల్లమల అడవులకు వెళ్లిన రెండు కుటుంబాలు ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో ప్రకృతిని, కుటుంబ అనుబంధాన్ని ఆస్వాదిస్తాయి. తిరిగి సిగ్నల్ అందగానే వారు మళ్లీ ఫోన్లలో మునిగిపోవడం ద్వారా మొబైల్ వినియోగంపై కథ ఒక ఆలోచింపజేసే సందేశాన్ని అందిస్తుంది.
రవి, సుజాతల పాప, సురేష్, జయల పాప ఒకే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు.
ఒకసారి జరిగిన తల్లిదండ్రుల - ఉపాధ్యాయుల సమావేశంలో రవి, సుజాతలు, సురేష్, జయలను కలిశారు. ఇద్దరు పిల్లలు ఒకే తరగతి కావడం వల్ల తర్వాత ఆ పరిచయం అలా పెరిగి మంచి స్నేహితులుగా మారారు.
రెండు కుటుంబాలు కలిసి మూడు రోజులు నల్లమల అడవులకు వెళ్ళి, ఆ అడవులలోని వసతిగృహంలో బస చేస్తూ సరదాగా, ఆ అడవిలో దాగి ఉన్న ప్రకృతి అందాలు, పులి సఫారీ అన్నీ తీరికగా చూస్తూ హాయిగా గడపాలని రవి, సురేష్ చాలా నెలల నుంచి అనుకుంటున్నారు. ఇ
న్నాళ్లకు రెండు కుటుంబాలు కలిసి అలా వెళ్లడానికి కుదిరింది.
"సురేష్ వాళ్లు, మనం ఎల్లుండి బయలుదేరి నల్లమల జంగిల్ క్యాంప్‌కి వెళుతున్నాము.
అక్కడ రెండు రోజులు హాయిగా, సరదాగా గడిపి వద్దాం. అక్కడ వసతిగృహం, పులి సఫారీకి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసేసాం, సరేనా?" అన్నాడు రవి.
"భలే, భలే! మనం ఊరు వెళుతున్నామన్నమాట. ఎంచక్కా, నేను, నవ్య హాయిగా ఆడుకోవచ్చు" అంటూ ఎగిరిగంతేసింది వన్య.
అనుకున్న రోజున బయలుదేరి నల్లమల జంగిల్ రిసార్టులో తమకు కేటాయించిన పక్కపక్కనే ఉన్న వసతిగృహాలకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు.
తయారయి, "అమ్మా, నేను నవ్యతో ఆడుకుంటాను" అని బయటకు పరుగు తీసింది వన్య.
రవి, సుజాతలు తమ ఫోనులను తీశారు. ప్రయాణం హడావుడిలో ఎవరికీ 'శుభోదయం' కూడా పెట్టలేదు అనుకుంటూ తీరా చూస్తే నెట్‌వర్క్ సిగ్నల్ లేదు.
ఈలోపల గదిలో ఉన్న ఫోను మోగింది, సుజాత ఎత్తి "హలో" అంది.
"సుజాత, నేను జయను మాట్లాడుతున్నాను. మీరు తయారయితే పలహారం చేయడానికి వెళదామా అని అడగడానికే చేశాను" అంది జయ.
"మేము తయారుగానే ఉన్నాము, వెళదాం. ఉదయం ఎవరికీ శుభోదయం పెట్టలేదు, ఇప్పుడు పెడదామంటే సిగ్నల్ లేదు, మీ ఫోన్లో సిగ్నల్ వస్తోందా?" అని అడిగింది సుజాత.
"లేదు, మా ఇద్దరి ఫోన్లలో సిగ్నల్ లేదు, మేం కూడా అదే పనిలో ఉన్నాం" అంది జయ.
అందరూ కలిసి ఆ రిసార్టులో ఉన్న ఫలహారశాలకు వచ్చారు. పలహారం చేసిన తరువాత బయట రిసెప్షన్ వేదికకు వచ్చారు. అడిగితే, "కాసేపటిలో ఒకరు వచ్చి మిమ్ములను ఈ అడవిలోని జలపాతం దగ్గరకు తీసుకువెళతారు" అని చెప్పారు.
అక్కడ సోఫాలలో కూర్చున్నారు. "ఏమిటో ఇక్కడ సిగ్నల్ లేదు, ఇవాళ ఎవరికీ శుభోదయం సందేశాలు కూడా పంపించడం అవ్వడం లేదు" అని అనుకుంటున్న వాళ్ల మాటలు విని, అక్కడ ఉన్న రిసార్టు కార్యదర్శి, "సర్, ఇక్కడ ఉన్న రెండు రోజులు మీరు మీ చరవాణి గురించి మరచిపోవాల్సిందే. సిగ్నల్స్ ఉండవు, ప్రకృతి అందాలు ఆస్వాదించండి" అని చెప్పాడు.
ఆ మాటలు విని, "ఐతే అమ్మ, నాన్న ఇంక ఫోను తీయకుండా మాతోనే ఉంటారు. ఎంచక్కా అందరం కలిసి ఆడుకుందాం.
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత కూడా మేం చెప్పేది వినకుండా ఎంతసేపూ ఆ ఫోను పట్టుకుని కూర్చుంటారు. మాకు ఇవ్వమంటే మాత్రం మీ కళ్లు పాడు అయిపోతాయి అని చెపుతారు" అంటూ ఎంతో సంతోషంగా నవ్య, వన్యలు చప్పట్లు కొట్టారు.
"ఇంత బాధపడుతున్నారా వాళ్లు, తమతో మేం ఎక్కువ సమయం గడపలేకపోతున్నామని! మనం ఇంటిలో కూడా ఫోను వాడకం తగ్గించి, పిల్లలతో వారు మెలకువగా ఉన్నంతసేపు వారితోనే సమయం గడుపుదాం" అని తమలో తామే అనుకున్నారు ఆ నలుగురూ.
సిగ్నల్ లేకపోవడం వల్ల ఆ రెండు రోజులు ఫోను కేవలం ఛాయాచిత్రం (ఫోటో) తీయడానికి మాత్రమే ఉపయోగించి, ఆ అడవిలోని అందాలను తనివితీరా ఆస్వాదించారు. పిల్లలతో మొత్తం సమయం గడిపారు.
"అవును కదా, ఫోన్లు పక్కన పెట్టి ఇలా గడిపితే ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉందో! ఇంటికి వెళ్లాక కూడా ఫోను పరిమితంగా వాడాలి" అని అనుకున్నారు ఆ నలుగురూ. వాళ్లను గమనించిన నవ్య, వన్యలు ఎంతో సంతోషించారు.
మూడో రోజు ఉదయం వసతిగృహాలను ఖాళీ చేసి తాము ముందే ఏర్పాటు చేసుకున్న వాహనం ఎక్కారు.
ఆ అడవి బయటికి వచ్చే గేటు దాటగానే, నలుగురి ఫోన్లు మోగడం మొదలుపెట్టాయి. ఆ నలుగురూ తమ తమ ఫోన్లు మాట్లాడుకోవడంలో మునిగిపోయారు.
నవ్య, వన్య ఎన్నిసార్లు పిలిచినా అమ్మ, నాన్న పలకకుండా ఫోనులలో వారి ముచ్చట్లలో మునిగిపోయారు. అది చూసి నవ్య, వన్య, "అదేంటి! మనతో అన్ని మాటలు చెప్పారు, మీతో ఉన్నంతసేపు ఫోన్ అత్యవసరమైతే తప్ప ముట్టుకోమన్నారు.
ఇప్పుడు మా మాట కూడా వినిపించుకోకుండా ఫోనులో మునిగిపోయారు, వీళ్లింతే ఇంక మారరు" అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
వీరిద్దరినీ గమనించిన వ్యాన్ డ్రైవర్, "ఈ గేటు లోపలికి ఉన్నప్పుడు అందరూ చరవాణి లేకపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. గేటు బయటికి రాగానే ఫోను లేకపోతే బతకలేం అనుకుంటారు.
ఈ కథ కూడా షరా మామూలే!" అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచాడు ఎంతో మందిని చూసిన అనుభవంతో.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
చిలకమర్రి రాజేశ్వరి గారి కొన్ని ఇతర రచనలు:
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.










Comments