ఎవరికి వాళ్ళు మంచివాళ్ళే..
- Srinivasarao Jeedigunta

- 2 hours ago
- 5 min read

Evariki Vallu Manchivalle - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao
ఎవరికి వాళ్ళు మంచివాళ్ళే.. - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 29/08/2026
మంచివాడెవరు? మోసగాడెవరు? అనే ఆలోచనలో పడేసే ఆసక్తికరమైన తెలుగు కథ ఎవరికి వాళ్ళు మంచివాళ్ళే.. రియల్ ఎస్టేట్, నమ్మకం, మానవత్వం, స్వార్థం చుట్టూ తిరిగే కథను చదవండి.
శ్రీధర్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు సంతానం. ఆడపిల్ల లండన్‌లో, మగపిల్లాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్నా, విశాఖపట్నంలోనే తల్లిదండ్రులున్న చోట ఆస్తులు కొనుక్కోవాలనుకునేవారు.
కొందరు అనుకున్నట్లు ఇతర దేశాల్లో ఉద్యోగం చేసి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారనే అభిప్రాయం తప్పు. ఒకసారి పెళ్ళై సంసారం ఉన్న తర్వాత ఖర్చులు అన్నీ పోను మిగిలేది తక్కువ.
అందుకే తండ్రి శ్రీధర్‌కు చెప్పి, 'నాన్నా, విశాఖపట్నంలో ఏదైనా స్థలం దొరికితే చూడండి, నేను అక్కడ కొనుకుంటాను' అని చెప్పడంతో, శ్రీధర్ తన స్నేహితులకు ఏదైనా మంచి హౌస్ కట్టుకోవడానికి స్థలాలు ఉంటే చూడమని చెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ స్నేహితుడు ఫోన్ చేసి, 'అరేయ్ శ్రీధర్, అదివరకు మీ పిల్లల కోసం ప్లాట్స్ కావాలన్నావు కదా! గుడివాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో భూషంగుళ్ళ అనే ఊరు ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతోందట, మా బావమరిది రాజుకి తెలిసినవాళ్ళు వెంచర్ వేశారు. రెండు వందల గజాలు ముప్పై లక్షలు, మూడు సంవత్సరాలలో డబుల్ అవుతుంది' అని తను ఒక ప్లాట్ కొనుకున్నాడు. 'మా ఆవిడ పోరు పడలేక నేను కూడా ఒక ప్లాట్ తీసుకున్నాను, మా పక్కన ఉన్న రెండు ప్లాట్స్ నీ కోసం ఆపమని ల్యాండ్ లార్డ్ సుకుమార్‌కి చెప్పాను.
నీకు డీటెయిల్స్ వాట్సాప్‌కి పంపించాను, ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకో, తర్వాత రేట్స్ పెరిగితే ఈ రేటుకి దొరకదు' అన్నాడు శ్రీధర్ స్నేహితుడు కామేష్.
ఫోటోస్ చూస్తే బాగానే ఉన్నాయి. గుడివాడ అనగానే అది మా తాతగారి తాతగారి ఊరు. మా తాతగారి నాన్న మా తాతగారికి ఏ ఆస్తి కొనలేదు, అలాగే మా తాత మా నాన్నకి, మా నాన్న మాకు ఏ ఆస్తి కొనలేదు. అందుకే గుడివాడతో పెద్ద సంబంధం లేదు. ప్రాప్తం అన్నట్టు ఇప్పుడు నా పిల్లల కోసం గుడివాడకి దగ్గరలో ఇంటి స్థలం కొంటున్నాను అనుకున్నాడు.
'మీకు నచ్చితే మాకు ఓకే కానీ, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ గుడివాడ నాన్నా? అక్కడ స్థలం కొంటే ఉందో లేదో తెలియదు కూడా' అంది కూతురు. 'నిజమేనే! విశాఖపట్నంలో కొనాలంటే సముద్రం దాటి ఏమైనా స్థలాలు ఉంటే కొనాలి, అంత డెవలప్ అయ్యింది. మనం లాభం రాగానే అమ్మేసే దానికి ఎక్కడైతే ఏమిటి? రేపు ఆదివారం నేను, మా ఫ్రెండ్ కామేష్ అంకుల్ వెళ్లి చూసి వచ్చి మీకు మళ్ళీ చెప్తా. ఏమిటో మా తాతలు పుట్టిన ఊరు వెళ్తున్నాను అంటే ఆనందంగా ఉంది' అన్నాడు శ్రీధర్.
'సరే, అమ్మని కూడా తీసుకుని వెళ్ళండి' అన్నాడు కొడుకు. 'అమ్మకి అత్తారింటికి రాదు రా! అయినా నేను మా ఫ్రెండ్‌తో వెళ్తున్నాను' అన్నాడు.
అనుకున్న ప్రకారం శనివారం సాయంత్రం నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు శ్రీధర్, అతని స్నేహితుడు కామేష్. కామేష్‌కి తను బుక్ చేసుకున్న స్థలం చూస్తున్నానని సంతోషం, శ్రీధర్‌కి అసలు గుడివాడ ఎలా ఉంటుందో, తను పుట్టిన ఇల్లు ఉందో లేదో అనే ఆలోచనతో తెల్లవారుజామున గుడివాడ చేరుకున్నారు.
ముందుగానే చెప్పడం వలన స్థలం అమ్మే యజమాని సుకుమార్ స్టేషన్కి వచ్చి కామేష్‌ని అదివరకు చూడటంతో గుర్తుపట్టి, తనని శ్రీధర్‌కి పరిచయం చేసుకుని తన కారులో ఒక హోటల్‌కి తీసుకుని వెళ్లి, 'మీకోసం గది బుక్ చేశాను, మీరు రెడీ అయ్యి ఉంటే నేను పది గంటలకు వచ్చి స్థలం దగ్గరికి తీసుకుని వెళ్తాను' అని ఈ రోజు పదిమందికి స్థలం చూపించాలని వెళ్ళిపోయాడు.
'ఇతను కొద్దిగా వెర్రిబాగులవాడిలా ఉన్నాడే' అన్నాడు శ్రీధర్ ప్లాట్స్ అమ్మే అతని వాలకం చూసి. 'మన ఊరిలోలా డబుల్ రిజిస్ట్రేషన్ చేసే గుండెలుతీసే బంట్లు కాదురా! ఈ విలేజ్ వాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు' అన్నాడు కామేష్.
అనుకున్న ప్రకారం శ్రీధర్‌ని, కామేష్‌ని స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. కారులో కూర్చున్న దగ్గర నుండి సుకుమార్ ఏదో ఒకటి మాట్లాడుతోనే ఉన్నాడు, దానితో అసలు స్థలం ఎంత దూరం ఉందో కూడా తెలియలేదు శ్రీధర్‌కి.
'ఇదే మన వెంచర్! ఇదిగో మీ స్నేహితుడు కొనుక్కున్న ప్లాట్, దీని పక్కన ఉన్న స్థలం మీకోసం ఉంచాను, బాగా చూసుకోండి సార్' అన్నాడు ప్లాట్ ఓనర్ సుకుమార్. 'ప్లాట్ బాగానే ఉంది, చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నట్టు లేవే' అన్నాడు శ్రీధర్.
'ఇళ్ళది ఏముంది అండీ! వచ్చే నెల ఈ వెంచర్లో ముప్పై ఇళ్ళు కట్టడం మొదలవుతాయి. అటు చూడండి, ఆలా దూరంగా కనిపిస్తున్న పొలాలలో మెడికల్ కాలేజీ, ఆ ఆ పక్కన హాస్పిటల్ సాంక్షన్ అయ్యింది. శ్రావణమాసంలో మొదలుపెడతారుట' అన్నాడు. 'అబ్బో! మీరు చెప్పినవి అన్నీ వస్తే ఈ స్థలాలు రేటు బాగా పెరుగుతుంది అనుకుంటాను' అన్నాడు శ్రీధర్.
'అందుకే సార్, మీకు ఇస్తానన్న ప్లాట్‌కి అవతల సినిమా హాలు వస్తోంది కాబట్టి బాగా పోటీ ఉంది. అయినా మీ స్నేహితుడు కామేష్ గారు చెప్పడం వలన మీకే అమ్మాలని నిర్ణయం తీసుకున్నాను. మీరు రెండు ప్లాట్లకి అడ్వాన్స్ రెండు లక్షలు ఇస్తే మీ అమ్మాయి, అబ్బాయి పేరున రిజర్వ్ చేస్తాను' అన్నాడు.
'అదేమిటి, అటువైపు నుండి పొగ వస్తోంది?' అన్నాడు కామేష్‌తో. 'ప్లాట్స్ క్లీన్ చేస్తున్నప్పుడు అలాగే ఉంటుంది' అన్నాడు కామేష్. 'సరే సుకుమార్ గారు, మీరు సాయంత్రం ఐదు గంటలకు హోటల్‌కి రండి, ఈలోపు మా అబ్బాయితో మాట్లాడి మీకు అడ్వాన్స్ ఇస్తాను' అన్నాడు శ్రీధర్.
కొడుకుతో విషయం చెప్పి, రెండు లక్షలకు చెక్కు ఇచ్చి ట్రైన్ ఎక్కారు స్నేహితులిద్దరూ.
'ఏమిటోయ్, మీ తమ్ముడు దారి తప్పి వచ్చినట్టున్నాడు, ఇప్పుడు గుర్తుకు వచ్చావా?' అన్నాడు శ్రీధర్ తన భార్యతో. 'లేదు బావగారు, కోర్టు పక్షులం! ఒక్కరోజు కోర్టుకి వెళ్ళకపోయినా క్లయింట్స్ గొడవపెడతారు. ఇప్పుడు కూడా మీ దగ్గరికి రావడానికి కారణం, అక్కా మీరు కొనబోయే స్థలాల గురించి చెప్పింది. నా క్లయింట్ ఒకతను గుడివాడ వాడే, అతను చెప్పాడు బావగారు చూసిన స్థలాలు ఇంకో పది సంవత్సరాలైనా డెవలప్ కావు అని. అయినా అసలు ఆ ఊరిలో కొనమని ఎవ్వరు చెప్పారు? అని అడిగాడు.
ఈ విషయం మీకు చెప్పాలని వచ్చాను' అన్న బావమరిది మాటలతో శ్రీధర్ గుండెల్లో రాయి పడింది. కొడుకు, కూతురు తనని నమ్మి ఈ రొంపిలోకి దిగారు. పది సంవత్సరాల తర్వాత వాళ్ళ స్థలాలు గుర్తుపట్టగలరా? 'ఇలా మోసపోయాను ఏమిటి సూర్యం? ఇప్పుడు ఏం చేయాలి?' అని బావమరిదిని అడిగాడు.
'నేను అంటే ఎప్పుడు మీకు లోకువే బావగారు! స్థలం కొనే ముందు నన్ను ఒకసారి అడగాలని అనిపించలేదా? ఎంతైనా నేను అడ్వకేట్‌ని కదా! ఇప్పుడు చేసేది ఏముంది? ఏదో విధంగా మోసంతో స్థలం అమ్మేయటానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే కాబట్టి, ఇంతటితో ఆ ప్లాట్స్ కొనే ప్రయత్నం మానేయండి. అడ్వాన్స్ సహజంగా తిరిగి ఇవ్వరు, ఇస్తే మీ అదృష్టం' అన్నాడు సూర్యం.
శ్రీధర్‌కి కంటిమీద నిద్రలేకుండా పోయింది. 'మంచిగా మాట్లాడి సుకుమార్ స్థలాలు అంటగట్టాడు, అనవసరంగా ఎక్కువ రేటు పెట్టి కొనడానికి అగ్రిమెంట్ అయ్యాను' అని తెగ బాధపడుతున్న భర్తతో, 'ఒకసారి ఆ స్థలం అమ్మిన అతనితో మాట్లాడి చూడండి' అంది శ్రీదేవి.
పూజ అయిన తర్వాత స్థలం సుకుమార్‌కి ఫోన్ చేశాడు శ్రీధర్. 'నమస్కారం సార్! ఎలా ఉన్నారు? మీరు నా దగ్గర స్థలాలు కొనటానికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు ఇరవై ప్లాట్స్ ఒక్కరోజులో అమ్ముడయ్యాయి. మీ చెయ్యి మంచిది సార్' అన్నాడు.
'అది సరే సుకుమార్, నేనే పెద్ద ప్రాబ్లెమ్ లో పడ్డాను. మా బావమరిది నిన్న వచ్చి, కూతురు పెళ్ళి కుదిరింది అని, ఒక యాభై లక్షలు ఇస్తే ఆరు నెలల్లో ఇస్తాను, మీ పిల్లలు ఫారిన్ లో ఉన్నారు కదా! మీరే ఈ సహాయం చేయగలరు అని అన్నాడు.
మీ దగ్గర రెండు స్థలాలు కొనడానికి అరవై లక్షలు సిద్ధం చేసుకున్నాను, యిప్పుడు స్థలం కొనడమా లేకపోతే మా బావమరిది కూతురు పెళ్ళికి డబ్బులు ఇవ్వడమా ఎటూ తేల్చుకోలేక మీకు ఫోన్ చేసాను, మీ సలహా ఏమిటి అని అడిగాడు శ్రీధర్.
'సార్, ఆడపిల్ల పెళ్ళి ముఖ్యం సార్! స్థలం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అయితే మీరు ఇచ్చే డబ్బులు తిరిగి ఇస్తారు అని నమ్మకం ఉంటే మీ బావమరిది కూతురి పెళ్ళికి సహాయం చేయండి. నా దగ్గర స్థలం కొనకపోయినా పరవాలేదు' అన్నాడు సుకుమార్.
అతని మాటలకి ఆశ్చర్యంతో, 'అలాగే చేస్తాను సుకుమార్. ఇప్పుడు మీ దగ్గర స్థలం కొనలేకపోయినా, అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాను. మరి మీకు ఇచ్చిన అడ్వాన్స్?' అని అడిగాడు. 'దానిదేముంది? ఇప్పుడే గూగుల్ పే చేస్తాను' అని ఫోన్ పెట్టేశాడు.
'అమ్మయ్య! పెద్ద గండం గడిచింది! మోసగాడు అనుకున్నాను కానీ మంచివాడే, అడ్వాన్స్ కూడా పంపేశాడు' అని ఈ విషయం తన స్నేహితుడు కామేష్‌కి చెప్పాలి అనుకుంటున్న భర్తతో, 'ఆగండి! మీ స్నేహితుడు ముందే ప్లాట్ కొనుకున్నాడు, ఇప్పుడు అతనికి చెప్పి బాధపెట్టడం ఎందుకు? అధికాక మనకి డబ్బులు రిటర్న్ ఇచ్చిన అతనికి ద్రోహం చేసినట్టు అవుతుంది' అని శ్రీధర్ ప్రయత్నం ఆపేసింది శ్రీదేవి.
ఇంతకి మోసగాళ్లు ఎవ్వరు? పెళ్ళి అని అబద్దం చెప్పిన నేనా? లేకపోతే అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన రియల్ ఎస్టేట్ అతనా? అని ఆలోచనలో పడ్డాడు శ్రీధర్.
శుభం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.















Comments