మార్పు కావాలి
- Chilakamarri Rajeswari
- 5 days ago
- 4 min read
#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #MarpuKavali, #మార్పుకావాలి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Marpu Kavali - New Telugu Story Written By - Chilakamarri Rajeswari
Published in manatelugukathalu.com on 05/10/2025
మార్పు కావాలి - తెలుగు కథ
రచన: చిలకమర్రి రాజేశ్వరి
రైలు లో ప్రయాణం చేయడం నాకు కొత్త కాదు. తరచూ రైలు ప్రయాణాలు చేస్తూనే ఉంటాను. ఇంకా రైలు ప్రయాణంలో కిటికీ ప్రక్కన కూర్చుని ప్రకృతి ని ఆస్వాదంచడం, నా గమ్యం చేరుకొనే మార్గంలో ఏ ఏ స్టేషన్లు వస్తాయో, వాటి పేర్లు గమనించడం, ఇలా కాలాన్ని గడుపుతూ ఆనందిస్తాను.
ఈసారి నా రైలు ప్రయాణం, నాకు ఒక మరపురాని జ్ఞాపకాన్ని ఇచ్చింది. మేము వారణాసి యాత్ర ముగించుకొని, 24 గంటలు ప్రయాణం చేసి, విజయవాడకు తెల్లారగట్ట చేరాం. మాకు విశాఖపట్నం వెళ్లడానికి, మేము బయలుదేరిన రోజున నేరుగా వెళ్లే రైలు లేకపోవడంతో, విజయవాడ నుంచి వేరే రైలు ఎక్కాల్సివచ్చింది.
ప్రశాంతి రైలు ఉదయం 5. 30 గంటలకు మూడవతరగతి ఏసీ కూపేలో ఎక్కాము. అంత ఉదయమే ఎవరు లేస్తారు? అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మేము కూడా అలిసిపోయి ఉండటంతో పడుకని నిద్ర పోయాము.
7 30 అవుతూండగా మెలకువ వచ్చింది. చూస్తే, నా పై బెర్త్ అబ్బాయి లేచి క్రిందటి దిగాడు. అమ్మయ్య, అనుకొని, ఆ ఆబ్బాయిని అడిగి మిడిల్ బెర్త్ తీసేసి, ఇద్దరం కూర్చున్నాం.
ఇంతలో ఆ ఆబ్బాయి మీరు విజయవాడలో ఎక్కారు అని హిందీలో అడిగాడు. ఆ అబ్బాయికి తెలుగు రాదని కూడా అర్థమైంది. మా సంభాషణ అంతా హిందీ, ఇంగ్లీషు భాషలలోనే జరిగింది. అవును, అని చెప్పాను.
‘ఎక్కడి నుంచి వస్తున్నారు’ అని అడిగాడు.
‘కాశి నుంచి వస్తున్నాం’ అని చెప్పాను.
సాథారణంగా, నేను క్రొత్త వ్యక్తులతో సంభాషణ పెంచను. కానీ ఆ ఆబ్బాయి మేము కాశీ నుంచి వస్తున్నాం అనగానే, ఎంతో ఉత్సాహంగా, “కాశీ విశ్వనాధుని మందిరం చాలా బాగుంటుంది కదా”, అని అన్నాడు.
ఇంకా ప్రయాగ రాజ్, అయోధ్య ల గురించి కూడా మాట్లాడాడు.
“మీరు కూడా మాకులాగానే ఏమన్నా యాత్రలకు వెళ్ళారా, మీ కుటుంబంతో” అని అడిగాను.
“లేదు. మా కాలేజి పని మీద వెళ్ళినపుడు చూసాను. చాలా బాగున్నాయి ఆ దేవాలయాలు అన్నీ” అని చాలా సంతోషంగా చెప్పాడు.
అపుడు నాకు ఆ ఆబ్బాయి ఏం చదువుతున్నాడా అని కుతూహలంగా అనిపించి, ఆ విషయమే అడిగాను.
“నేను బెంగళూరు కాలేజిలో అగ్రికల్చరల్ బిఎస్సిసి చదువుతున్నాను. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్నాను.” అని చెప్పాడు .
అగ్రికల్చరల్ బిఎస్సిసి కి, దేవాలయాలకి సంబంధం నాకు అర్థం కాలేదు, అదే అడిగితే ఆ ఆబ్బాయి చాలా వివరంగా చెప్పాడు. చివరి సంవత్సరం, విద్యార్థులను పదిమంది గుంపుగా విడగొడతారు . ఆ పదిమందికి ఒక ఉపాథ్యాయుడిని వారి రోజువారి కార్యకలాపాలను సమీక్షించడానికి నియమిస్తారు. విద్యార్థులు, వారు గమనించిన విషయాలను క్రోడీకరించి, తమకు నిర్ధేశించిన ఉపాధ్యాయునికి ప్రతివారం అందజేయాలి.
ఆయన వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు, విద్యార్థులకు తగిన సూచనలు ఇస్తారు. వారందరూ ప్రతి మూడు నెలలకు ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆచుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని రైతులతో పాటు ఆక్కడే ఉండి, వారు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, వారు ఎదుర్కొంటున్న సాథకబాథలను తెలిసికోవాలి.
వారికి తమ చదువు నేర్పిన పరిజ్ఞానంతో, సూచనలు, సలహాలు ఇవ్వాలి. అలా ఉత్తరప్రదేశ్ వైపుకు వచ్చినపుడు, ఎలాగో ఖాళీ చేసుకుని, ఈ దేవాలయాలు చూడటం జరిగింది” అని చెప్పాడు.
నేను "మరి రైతులతో, గడిపినపుడు ఎలా అనుభూతి చెందారు" అని అడిగాను.
ఆ ఆబ్బాయి "మేడమ్, మా పుస్తక పరిజ్ఞానం కన్నా, వారికి ఎంతో తెలుసు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు, వారంతటవారే కనుగొన్న పరిష్కారాలతో, మాకు తెలిసింది చాలా తక్కువ అని మేం తెలుసుకున్నాం. మేము పుస్తకాలలో సమస్యలకు పరిష్కారం వెతుకుతాం,, వారు తమ అనుభవాలతో, వాస్తవ ప్రపంచంలో ఆచరణాత్మకమైన పరిష్కారాలు కనుగొంటారు.
మేం వారితో గడిపినప్పుడుగానీ తెలియలేదు ఆ విషయం. వ్యవసాయం గురించి అంతా తెలుసుకున్నాం మేం చదివిన చదువుతో అనే మా అహంకారం పటాపంచలై పోయింది, వాళ్ళకున్న పరిజ్ఞానం చూసాక. వాళ్ల దగ్గర నుంచి మేం నేర్చుకోవలసినది చాలా ఉంది. చివరి సంవత్సరం ఒక్కటే వాస్తవ ప్రపంచంలో పని చేసే అనుభవానికి కేటాయిస్తే, సమయం సరిపోదు మాకు నేర్చుకోవడానికి.
రెండో సంవత్సరం నుంచి మొదలెడితే కానీ, మా పుస్తక పరిజ్ఞానానికి తోడు, మన రైతుల కున్న అనుభవాలను సమన్వయపరుచుకుంటూ మరింత క్రొత్త పద్థతులను కనుగొనడానికి ఉపయోగపడుతుంది" అంటూ చాలా ఆవేశంగా చెప్పాడు.
అతను చెప్పిన విషయాలు నన్ను ఆలోచనలో పడేసాయి. అవును కదా, ప్రస్తుత విద్యారంగంలో పోటీ తత్వం పెరిగిపోయి, రాంకుల సంపాదన ప్రథమ లక్ష్యంగా, ఎంతసేపూ కాలేజీలో కూర్చోబెట్టి, ఆ పుస్తకాలను విద్యార్థుల చే రుబ్బించడం తప్ప, వారికి ఎలాంటి ఆచరణాత్మక అనుభవాలను కల్పించడం లేదు.
కాలేజి నుంచి బయట పడిన తరువాత, చెరువులోకి బయటపడ్డ చేపలలాగా విలవిలలాడుతున్నారు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఆత్మ హత్యలకు పాలుపడుతున్నారు. ఒక విద్యార్థికి ఉన్నంత ఆలోచనా శక్తి కూడా, విద్యారంగంలో నిష్ణాతులైనవారికి లోపించింది.
మన విద్యారంగంలో మార్పు రావాలి. నిజానికి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందనే భావనతో తో కాకుండా చదివి మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటే జీవితంలో మంచిగా బతుకుతాం అనేది నేర్పించాలి. కానీ ప్రస్తుతం అమలవుతున్న విద్యావిధానం వల్ల అందరూ భయస్థులుగా మారుతున్నారు.
భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చదువు కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదు, చదువు తరువాత ఏ రంగం ఎంచుకున్నా సరే అందులో ఎలా గెలవాలి అని పద్దతి ప్రవేశపెట్టాలి.
రెగ్యులర్గా విద్యార్ధులకు,పేరెంట్స్ కు,అధ్యాపకులకు కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉండాలి. ఇది ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. విద్య, మనిషి కి, విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా నేర్పి, తమ భావిజీవితంలో నైతిక విలువలను పాటించేలా చేయగలిగినపుడే దానికి సార్థకత చేకూరుతుంది. అలా తీర్చిదిద్దగలిగితే ఎంత బాగుంటుంది".
"మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తోంది. ఇకనైనా నీ ఆలోచనల్లోంచి బయటికి వస్తావా" అన్న శ్రీవారి మాటలకు ఉలికిపడి లేచాను, మన భావితరాలవారికి అయినా మంచి విలువలతో కూడిన విద్య లభిస్తుందని ఆశిస్తూ.
***
చిలకమర్రి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి
నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.
మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.
నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.
పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని, నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.
మార్పుకావాలి కథ చాలా బాగుంది . ఆలోచింపచేసేలా ఉంది . రచయిత్రికి అభినందనలు