top of page
Original.png

వేద


అమ్మమ్మ సీతమ్మను కౌగిలించుకున్న మనవరాలు వేద, పక్కన పాత ఉత్తరాల పెట్టె మరియు సంప్రదాయ తెలుగు ఇంటి వాతావరణం

Veda - Telugu Family Story | Dr. Lakshmi Raghava Kamakoti

వేద - తెలుగు కుటుంబ కథ | డా. లక్ష్మీ రాఘవ కామకోటి

Published In manatelugukathalu.com On 28/08/2026


‘వేద’ ఒక హృదయస్పర్శి తెలుగు కుటుంబ-సామాజిక నీతి కథ. ఆధునిక జీవనశైలిలో ఫోన్‌లు, పని ఒత్తిడి, సోషల్ మీడియా కారణంగా కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతున్న దూరాన్ని ఈ కథ సున్నితంగా చూపిస్తుంది. పన్నెండేళ్ల క్రితం మనవరాలికి ‘వేద’ అనే పేరు పెట్టాలని కోరుకున్న అమ్మమ్మ సీతమ్మ కోరిక, కాలం గడిచిన తర్వాత మరో రూపంలో ఎలా నెరవేరిందో ఈ కథ మనసును హత్తుకునేలా వివరిస్తుంది.


“వేద అన్న పేరు బాగుంటుంది…” నామకరణం రోజు అమ్మమ్మ సీతమ్మ మాటలో ఒక ఆశ మనమరాలి పేరుపై.


“ఇప్పుడు ఎన్నో కొత్త పేర్లు ఉన్నాయమ్మా… వేద కాలంలోనే ఉండిపోవాలా?” భారతి నవ్వుతూ చెప్పినా… ఆ నవ్వులో కొంచెం నిరసన ఉంది.


“రీనా అన్న పేరు మోడ్రన్‌గా ఉంది” అని తేల్చేసింది భారతి చివరికి.


సీతమ్మ ముఖంలో క్షణం మెరిసిన వెలుగు… నెమ్మదిగా మసకబారింది.

“పేరు ఏదైనా… పిల్ల మంచిగా పెరగాలి చాలు…” అని మృదువుగా చెప్పింది కూతురు నొప్పించుకోకుండా.


పన్నెండు సంవత్సరాల తరువాత…


“రీనా, డిన్నర్ రెడీ!” భారతి పిలిచింది కిచెన్ నుంచీ.


“ఒన్ మినిట్ మమ్మీ…” అంటూ ఫోన్ స్క్రీన్‌కి అతుక్కుపోయింది రీనా. ఆ “ఒక్క నిమిషం” గంటలుగా మారుతోంది.


అక్కడే ఉన్న శేఖర్ ల్యాప్‌టాప్ ముందు నుంచీ తల ఎత్తలేదు. భారతికి ఫోన్ వస్తే పక్కకు వెళ్ళింది. ఇంటిలో ముగ్గురు ఉన్నా… మాటల మధ్య దూరం పెరిగింది. రోజూ అదే తంతు.


కొన్ని రోజులనుండీ శేఖర్‌కి పనితో మనసు బరువెక్కినట్టు అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకు చిరాకుగా వస్తోంది. పోనీ భారతితో మాట్లాడుదామన్నా తను కూడా వర్క్‌తో బిజీ. శేఖర్‌ను రెండు రోజులు గమనించిన భారతి,

“నీకూ నాకూ వర్క్ స్ట్రెయిన్ ఎక్కువవుతోంది. చివరికి మనం మాట్లాడుకోవడమే మర్చిపోతామేమో శేఖర్.”


శేఖర్ కూడా తల ఊపాడు.


“నాకు కూడా ఇదే అనిపిస్తోంది. ఇంట్లో ఉన్నా… లేనట్టుంది.”


ఎందుకో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం గుర్తుకు వచ్చింది ఇద్దరికీ. ఆనాడు ఇంట్లో సందడి గుర్తుకు వచ్చింది. అప్పట్లో కుటుంబంతో కలిసి గడపడం, సంప్రదాయాల విలువ, తరాల మధ్య అనుబంధం ఎలా ఉండేవి? ఇవన్నీ తెలియకుండా రీనాను పెంచుతున్నామా? అని గాఢంగా అనిపించింది.


ఆ రోజు చిన్న నిర్ణయం తీసుకున్నారు. “డిన్నర్ టైమ్ నో స్క్రీన్స్ పెట్టుకుందామా” శేఖర్ అనగానే సరేనంటూ తల ఊపింది భారతి.


మొదటి రోజే… డిన్నర్ చేస్తూ “ఇది చాలా బోర్ డాడీ” రీనా మొహం చిట్లించింది.


"ఇలా అయితే ఎలా?" అని భారతి కూడా కంగారుపడింది.


కానీ శేఖర్ నవ్వుతూ అన్నాడు, “రీనా, మనం ఒకరికొకరం తెలుసుకోవాలి కదా…” అన్నాడు.


ఇదేమిటీ అన్నట్టు చూసింది రీనా అమ్మ వైపు. భారతి ముఖం చాటు చేసుకుంది.

కొన్ని రోజులు అలా గడిచాయి. మాటలు మొదట తడబడాయి… తర్వాత నడవడం నేర్చుకున్నాయి. ఇప్పుడు రీనా ఎన్నో స్కూల్ సంగతులు చెబుతోంది. శేఖర్ కూడా ఆసక్తిగా వింటున్నాడు.


ఒక రోజు “అమ్మమ్మ ఊరికి వెళ్దామా?” అని భారతి అనూహ్యంగా అడిగింది. దాని వెనుక రీనాకు ఆ వాతావరణం అలవాటు చేయాలన్న కోరిక!


రీనా వెంటనే “అక్కడ నెట్ ఉంటుందా?” అంది.


“లేకపోయినా, మనకు అలవాటైంది కదా…” శేఖర్ మెల్లగా అన్నాడు.


“దినమంతా పూర్తిగా నెట్ లేకుండా ఉంటే ఎలా?” రీనా ప్రశ్న.


“మరీ బోర్ కొడితే వచ్చేద్దాంలే...” అన్న శేఖర్ మాటలు నచ్చాయి రీనాకు.

సెలవులు రాగానే కారులో అమ్మమ్మ ఊరికి బయలుదేరారు.


అగ్రహారం చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్ళే దారిలో రోడ్డుకు ఇరువైపులా పక్కనే పచ్చని పొలాలు... ఎంతో బాగుంది చూడడానికి. కారులో కిటికీలు కిందికి దించి చల్ల గాలిని ఆస్వాదించారు ముగ్గురూ.


అగ్రహారంలో ఇంటి ముందే ఆగిన కారు చూసి బయటకు వచ్చిన సీతమ్మ కళ్ళల్లో ఆనందం మెరుస్తోంది.


“రండి, రండి భారతీ. ఎన్ని రోజులకు వచ్చావురా రీనా…” అంటూ ఆమె రీనా వైపు చేతులు చాపింది. రీనా ఆమె వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది.


మొదటి రోజు... రీనాకు బోర్. రెండో రోజు కూడా రీనాకి అలవాటు కాలేదు. మూడో రోజు కొంచెం ఆసక్తి...


“అమ్మమ్మ… ఇది ఏంటి?” అమ్మమ్మ తెరుస్తున్న ట్రంకు పెట్టె చూస్తూ అడిగింది రీనా.


“ఇది నా పర్సనల్...” అంటూ తమాషాగా అంది అమ్మమ్మ.


“పర్సనల్??” ఆశ్చర్యంగా చూసింది రీనా.


“అవున్రా బుజ్జీ. ఇందులో తాతయ్య రాసిన ఉత్తరాలు అంటే లెటర్స్ దాచుకున్నా. రోజూ ఒకసారి ఒక ఉత్తరం చదువుతా.”


పాత పెట్టెలో ఉన్న ఉత్తరాల కట్ట చూస్తూ, “ఉత్తరాలా? సో మెనీ?” అంది రీనా ఆశ్చర్యంగా.


“అవును, తాతయ్య మనసు నుంచి వచ్చిన మాటలు… ఇలా పేపర్ పై రాసేవాడు” అని చెబుతూ సీతమ్మ, “నీకు తెలుగు రాదుగా? పోనీ చదివి వినిపించనా?” అడిగింది.


“నీ పర్సనల్ కదా... చదువుతావా?” అంది రీనా కళ్ళు పెద్దవి చేసుకుని.


“చదువుతాను పరవాలేదు. మా కాలంలో మీలాగా రోజూ ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం లేదు. ఒక ఉత్తరం రావడానికి వారాలు పట్టేది. అందుకే మనసులో మాట, ప్రేమ ఉత్తరాల రూపంగా మారేవి. మనుషులను కోల్పోకముందే విలువ తెలుసుకునేవాళ్ళం.”


రీనా ఆశ్చర్యంగా చూస్తుండగానే సీతమ్మ మెల్లగా చదవడం మొదలుపెట్టింది...

'సీతా... నువ్వు పంపిన ఉత్తరం ఈరోజే వచ్చింది. నీ అక్షరాలు చదువుతుంటే నువ్వే నా ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టు అనిపించింది...'


అంతే... రీనా మొదటిసారి కాగితంలో కూడా మనుషులు బతుకుతారని అర్థం చేసుకుంటూ నిశ్శబ్దంగా విన్నది.


ఆ రోజు సాయంకాలం... అమ్మమ్మతో వామనగుంతలు ఆట ఆడింది కానీ రీనా మొదట ఓడిపోయింది. నాలుగు రోజుల్లో క్రమంగా గెలవడం నేర్చుకుంది.


తర్వాత అమ్మమ్మ పాటలు… రామాయణంలో చిన్న కథలు, కృష్ణుడి చిన్నతనం... ఒక్కోటి ఒక్కో ప్రపంచంలా తెరుచుకున్నాయి.


"అమ్మమ్మా, నువ్వు ఒంటరిగా ఉంటావు. బోర్ కొట్టదా?" తన సందేహం వెలిబుచ్చింది రీనా.


అప్పుడు సీతమ్మ నవ్వుతూ, ”జ్ఞాపకాలు తోడుంటే మనిషి ఎప్పుడూ ఒంటరివాడు కాదు. కానీ మనుషులు దగ్గరుండి మాట్లాడకపోతే అదే నిజమైన ఒంటరితనం."


ఒక సాయంకాలం రీనాతో ”ఈ రోజు ఇంకా ఫోన్ తీసుకోలేదా?” అని భారతి అడిగింది.


“ఫోన్ కన్నా అమ్మమ్మతో మాట్లాడడం బాగుంటుంది.” రీనా చిరునవ్వుతో చెప్పింది.


శేఖర్, భారతి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో ఉపశమనం ఉంది.

ఆ రాత్రి పెరట్లో ఆరుబయట పడుకుంది అమ్మమ్మతో రీనా… ఆకాశం నిండా నక్షత్రాలు. “అమ్మమ్మా” రీనా మెల్లగా పిలిచింది.


"చెప్పురా బుజ్జీ?" ప్రేమగా అడిగింది అమ్మమ్మ.


"నీవు నాకు “వేద” అని పేరు పెట్టాలనుకున్నావని అమ్మ చెప్పింది. ఇక మీదట నన్ను వేద అని పిలుస్తావా?"


సీతమ్మ క్షణం మాట్లాడలేకపోయింది.


ఆ పేరు పెట్టాలని పన్నెండేళ్ల క్రితం చేసిన చిన్న కోరిక... ఈ రోజు మనమరాలి ద్వారానే నెరవేరబోతోందా?? ఆమె రీనాను దగ్గరకు తీసుకుని, "వేదా..." అని ఒక్కసారి పిలిచింది.


ఆ ఒక్క పిలుపులో... పన్నెండేళ్ల నిరీక్షణ ఉంది. ఒక తరం మరో తరాన్ని చేరుకున్న ఆనందం ఉంది.


ఆ రాత్రి… ఫోన్లు మౌనంగా ఉన్నాయి. కానీ హృదయాలు మాట్లాడుతున్నట్లున్నాయి.

ఆ రోజు రీనా పేరు మాత్రమే కాదు... ఆమె ప్రపంచాన్ని చూసే చూపు కూడా మారింది. అందుకే ఆమె వేద అయింది. శేఖర్, భారతి కోరుకున్న మార్పు ఇదే!


సాంకేతికత మన జీవితాన్ని సులభం చేస్తుంది. కానీ కుటుంబాన్ని నిలబెట్టేది మాత్రం ప్రేమ, సంభాషణ, కలిసి గడిపిన క్షణాలే. తరాలను కలిపేది రక్తసంబంధం కాదు... హృదయసంబంధం!


వేదకు ఆ బంధం అమ్మమ్మ దగ్గర దొరికింది.


డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి కొన్ని ఇతర రచనలు:




డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

డా. లక్ష్మీ రాఘవ కామకోటి

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page