top of page
Original.png

సమతుల్యం


Samathulyam- Telugu Family Story | Dr. Lakshmi Raghava Kamakoti

సమతుల్యం - తెలుగు కుటుంబ కథ | డా. లక్ష్మీ రాఘవ కామకోటి

Published In manatelugukathalu.com On 25/04/2026

ఒక చిన్న మాట… ఒక చిన్న అభిప్రాయం… అవి కలిసి పెద్ద గోడగా మారితే?

“సమతుల్యం” కథలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఉన్నప్పటికీ, అహంకారం మరియు అపార్థం ఎలా దూరాన్ని పెంచుతాయో చూపిస్తుంది. కానీ ఒక సారి మాట్లాడుకుంటే… అదే బంధం మరింత బలపడుతుంది.


గోడపై ఆరు అంగుళాల ఫోటో ఫ్రేమ్.అందులో రేవంత్, జలజ చేతులు పెనవేసుకుని ఉన్నాయి... అగ్నీ, హిమం కలిసిన చోట పుట్టే ఆవిరిలా..వేళ్లు విడిపోనని మాటిచ్చుకున్నట్టుగా..


కానీ, అదే ఫోటో కింద సోఫాలో కూర్చున్న రేవంత్‌కు మాత్రం ఆ వేళ్లు జారిపోతే ఎలా అని పట్టుకున్నట్టు అనిపిస్తోంది. అసలు ఈ రోజు క్యాంప్ నుండి రాగానే తలుపు తీసిన జలజ ముఖంలో నవ్వులేదు సరిగదా, తీరిక లేనట్లు వెనుదిరిగి వెళ్ళిపోవడం నచ్చలేదు.


రేవంత్ నిట్టూర్చాడు. ఆఫీసులో తన కింద పనిచేసే వంద మందికి తను బాస్. కానీ, ఇంట్లో భార్య జలజ వ్యక్తిత్వం ముందు తన ఉనికి ఏదో చిన్నబోతున్నట్లు అనిపిస్తుంది. ఆ అభద్రతను భార్యతో పంచుకునే ధైర్యం లేకపోయింది.


అటు బాత్రూంలో షవర్ కింద నిలబడ్డ జలజ మనసులో సుడిగుండం... మొన్న మాలతి ఫోను చేసి చెప్పిన విషయం తనను ఎంత బాధపెడుతోంది...


వెనక్కి ఒకసారి చూసుకుంటే తామిద్దరూ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లలో ఎంత మార్పు వచ్చింది.. తన అందమూ, ఉద్యోగమూ, మంచి నడవడీ ఏమిచ్చింది? తను ఆఫీసులో నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనే కదా వర్క్ బాగా నడుస్తుంది. ఆఫీసులో తను తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్ అయినప్పుడు జీవితంలో... రేవంత్‌కు అసంతృప్తి ఎందుకు? ఎటు వెడుతోంది జీవితం...


మనసు గందరగోళం భరించలేక ఈ రోజు సెలవు పెట్టి అత్తయ్య సుశీలమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆప్యాయంగా పలకరిస్తున్న ఆమెతో, “అత్తయ్యా ఈ రోజు మీతో మాట్లాడ్డానికే వచ్చాను..” అంటూ విషయం డైరెక్ట్‌గా చెప్పింది. అంతా విన్న సుశీలమ్మ, “ఒకసారి రేవంత్‌ని తీసుకురా.. అతనితో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిద్దాం” అంది.


“రేవంత్ ఇవ్వాళే క్యాంప్ నుండీ వెనక్కి వస్తాడు. ఈ రోజే సాయంకాలానికి తీసుకువస్తాను..” అని చెప్పి వచ్చింది.


జలజ చెప్పిన తర్వాత రేవంత్‌తో మాట్లాడాలని ఉంది సుశీలమ్మకు. ఎప్పుడూ ఏదైనా సమస్య పరిష్కారానికి ఇరువైపు వాదనలు వినాలి అని నమ్మిన మనిషి ఆమె. కాలేజీ ప్రిన్సిపాల్‌గా సర్వీసులో ఉన్నప్పుడు చాలా సమస్యలు చూసిన అనుభవం ఉంది.

****

ఇంట్లో రేవంత్ అలసటగా పడుకున్నా ఆలోచనలు లైను కట్టాయి. ఒకప్పుడు జలజ అందం, స్మార్ట్‌నెస్ చూస్తే మైమరుపు! పెళ్లి అయ్యాక గానీ జలజ మనస్తత్వం అర్థం కాలేదు.. ఇంట్లో ఏమి కొనాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనదే పై చేయి.. ఆఖరికి తనను దగ్గర తీసుకోవాలన్నా ఏదో బెరుకు అనిపిస్తుంది. తన మనసుకు నచ్చిన విధంగా భార్య ఉండాలని ఆలోచన వస్తే తప్పేంటి? తనతో ఏమి చెప్పాలన్నా ముందుగా ఒక నిశ్శబ్ద అధికారం కనిపించి గొంతు పెగలదు. పోయిన వారం తన అసిస్టెంట్ మాలతి

“ఎందుకు సార్, అదోలా ఉన్నారు?” అనగానే అప్రయత్నంగా “ఫ్యామిలీ లైఫ్ సరిగా ఉంటే కదా” అన్నాడు.


“అలాగా..” అన్న మాలతితో విషయం పొడిగించకుండా పని గురించి మాట్లాడాడు. కానీ మనసులో మాట బయటకు చెప్పగలిగానని సంతోషపడ్డాడు. జలజతో అలా మాట్లాడడానికి ధైర్యం చాలటం లేదు.


ఇంతలో జలజ లోపలికి రావడంతో అతని ఆలోచనలు ఆగాయి.


“ఇంకాసేపట్లో మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళాలి” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆ మాటతో మూడు రోజుల హుషారంతా తగ్గిపోయింది. ఈ రోజే అత్తయ్య వాళ్ళింటికి ఎందుకో... అడగాలనిపించలేదు.

*********

అత్తయ్య నవ్వుతూ రేవంత్‌ని పలకరించింది. పెళ్లయిన తరువాత రెండు మూడు సార్లు వెళ్ళినా ఈ రోజు అదేపనిగా కలవటం ఎందుకో అర్థం కాలేదతనికి. పలకరింపులయ్యాక జలజ, అత్తయ్య కోడలు ప్రణతి షాపింగ్ అని బయటకు వెళ్లారు.


రేవంత్ ఆఫీసు విషయాలు అడుగుతూ ఎదురుగా కూర్చుంది సుశీలమ్మ. ఆఫీసు గురించి ఆసక్తికరంగా చెప్పాడు. ఉన్నట్టుండి “నీకు జలజ అంటే ఇష్టం లేదా?” అనడిగింది ఆమె.

ఆ మాటకు తడబాటు అయ్యింది రేవంత్‌కు.


“అలా ఎందుకు అనుకుంటారు? జలజను కోరి చేసుకున్నా” బెట్టుగానే అన్నాడు.


“అందుకే అడుగుతున్నా రేవంత్. హఠాత్తుగా ఫ్యామిలీ లైఫ్ బాగాలేదని ఎందుకనిపిస్తోంది?”

అన్న మాటలకు రేవంత్ ఆమె వైపు అనుమానంగా చూసి రెండు క్షణాలు తలవంచుకున్నాడు.


“ఇది అడగాలనే పిలిచాను. ఆఫీసులో ఫ్యామిలీ గురించి ప్రస్తావించావంటే ఎందుకని తెలుసుకోవాలి కదా. నీవీ మధ్య ఆఫీసులో ఎక్కువ గడపడం, క్యాంప్ అని వెళ్ళటం అంతా జలజకు దూరంగా ఉండాలనేనా? ఇష్టం లేకపోతే తనతోనే మాట్లాడవచ్చు, ఇతరులతో ఇంటి విషయాలు ఎందుకు?”


ఆమె సూటి ప్రశ్నకు ఒక క్షణం మౌనం వహించి,

“నిజం చెప్పమంటారా?” అంటూ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు రేవంత్.


“మాది లవ్ మ్యారేజ్. కానీ సంసారం నడవటంలో కాస్త తేడా.. ఇది తెలిసింది పెళ్లయిన తర్వాతే... ఇంట్లో ఏ నిర్ణయాలైనా తనవే కరెక్ట్ అంటుంది. అందుకే నేను ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నానేమో. నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో బాగుంటుంది అనిపిస్తుంది నాకు... ఇలాంటి ఆలోచనలు మార్చుకోవాలని, కౌన్సెలింగ్‌కి వెళ్ళాలా అని కూడా చాలా రోజులు ఆలోచించాను. కుదరటం లేదు... ఒక సందర్భంలో ఫ్యామిలీ లైఫ్ విసుగొస్తోందని చెప్పింది నిజమే. ఇది తప్పే కావచ్చు, మీదాకా వచ్చింది కనుక నా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోండి. భర్తగా నాకూ కొన్ని కోరికలు ఉంటాయి... భార్యను దగ్గరకు తీసుకోవాలని ఉన్నా తను రెస్పాండ్ అవుతేనే కదా... కలిసి ఉండటానికి ఇద్దరి సహకారమూ అవసరం కదా”


నెమ్మదిగా విడమరుస్తున్న అతన్ని ఆపుతూ,

‘నీ మనసులో మాట చెప్పు రేవంత్’ అన్న సుశీలమ్మతో కొన్ని విషయాలు ఇబ్బందిగా చెప్పాడు. అతని మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపించింది సుశీలమ్మకు.

“నేను జలజతో మాట్లాడతాను” అందామె.


ఒకప్పుడు భార్యను కట్నాల కోసం వేధించడం, భార్యను అలుసుగా చూస్తూ గృహహింసలు ఉండేవి. ఇప్పుడు ఆడవారు సమానంగా ఉద్యోగం చేయడంతో అవి తగ్గాయి. మరి రివర్స్‌లో మగవారు ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చి విడిపోదామనుకునే రోజులు వచ్చాయా అని ఆశ్చర్యపోయింది సుశీలమ్మ.


ఇంతలో జలజ వాళ్ళు వచ్చారు.

వారు మాట్లాడుకోవడానికి వెసులుబాటుగా రేవంత్ ‘ఇప్పుడే వస్తా’ అంటూ బయటకు నడిచాడు.

జలజ వచ్చి అత్త దగ్గర కూర్చుంది ‘ఏమైంది’ అన్నట్టుగా.


“అతని మాటలు విన్నాక నాకు అర్థమయిన విధానం చెబుతాను జలజా, తెలివైనదానివి ఆలోచించు. చివరకి నిర్ణయం పూర్తిగా నీదే.. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాపురంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? అని ప్రశ్నించుకోవాలి ఇప్పుడు. పెళ్లి అంటే ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండే జీవితం. అంటే ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. ప్రేమ చూపడంలోనైనా, గొడవలలో అయినా పరిష్కరించుకోవడానికి మాటల స్వేచ్ఛ కావాలి.. పెళ్లి తర్వాత అడ్జస్ట్‌మెంట్, రాజీ పడటం చాలా ఉంటుంది. అలవాట్లు మార్చుకోవాలి. ఒకరు గొప్ప, ఇంకొకరు తక్కువ అన్న ఫీలింగ్ రాకూడదు. చులకన భావం అస్సలు కలగకూడదు.”


ఆపి ఒకసారి జలజ వైపు చూసింది. మళ్ళీ,

“ఒక్కసారి గుర్తు చేసుకో, రేవంత్ తీసుకునే అన్ని నిర్ణయాలకి నీవు ‘అలా కాదు, ఇలా అయితే బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి’ అని పదే పదే చెప్పావా? అందుకే కాబోలు తనకి అంత ఆలోచనలు లేవని, తను నీకంటే తక్కువ అన్న భావం ఏర్పడింది. తన ఇబ్బందిని బయట వారికి చెప్పాడు అంటే నీ దగ్గర చనువు తక్కువైనట్టే కదా? అలా చెప్పడం తప్పే అయినా ఈ ప్రవర్తనకి కారణం వెదికితే నీతో వాదించి గెలవలేకపోవడంతో బయట హాయిగా ఉంది అనిపించడం. ఇప్పుడు నాకు ఇది సమస్యే కాదనిపిస్తోంది. ఒక్కసారి అతని ఇగో దెబ్బతినకుండా నీ వైపుకు తిప్పి ప్రేమతో దీనికి పరిష్కారం ఎందుకు చేసుకోకూడదు?

ఆలోచించు జలజా, వివాహం సంకెళ్లు అని అనుకోకూడదు ఎప్పుడూ. ప్రేమతో కూడిన ఆ బంధం ఒక శక్తి. అతని అసంతృప్తిని తృప్తిగా మార్చి సంసారం ఒక ఆనందం అన్నది నిరూపించు..” ఆపింది ఆమె.


కొంచెంసేపు తల వంచుకుని కూర్చుంది జలజ. పదిహేను నిమిషాల తర్వాత మెల్లిగా,

“అత్తయ్యా, మాలతి ఫోను చేసి మాట్లాడినప్పుడు కూడా ఏమి తక్కువైంది? అనుకున్నానే కానీ అతనికి నేను చెప్పేంత చనువియ్యలేదని తెలుసుకోలేకపోయాను.. అసలు ఈ కోణంలో ఆలోచించనే లేదు.. దిద్దుకోవడం నావంతు. సరిచేసుకుంటాను.. థాంక్స్ అత్తయ్యా” అంటూ వంగి సుశీలమ్మ కాళ్ళు తాకింది.


“నాకు తెలుసు జలజా, నీవు సరిజేసుకోగలవని” అని భుజం తడుతున్నప్పుడు లోపలికి వచ్చాడు రేవంత్.

*****

ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు.ఆ మౌనం ఇప్పుడు భారంగా అనిపించలేదు... మాట్లాడాలని కోరుతున్నట్టుగా ఉంది.


జలజ మెల్లిగా “రేవంత్... నన్ను చూసి నీకు ఇన్ఫీరియర్ ఫీలింగ్ వస్తుందనుకోలేదు. నిజమే! ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే స్వభావం నాది. మన జీవితం బాగుండాలని తపనతో కచ్చితంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ అదే నీకు మాట్లాడడానికి కూడా చనువు ఇవ్వలేదనుకుంటే క్షమించు” అని,

కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని... అన్నిటికీ తను ఏ విధంగా ఆలోచిస్తుందో విడమరిచి చెప్పింది.


అప్పుడు రేవంత్‌లో ఎప్పటినుంచో బిగుసుకున్న మాటలు బయటకు వచ్చాయి. తన మనసును ఆమె ముందు ఉంచాడు..


చివరగా రేవంత్,

“జలజా... నీవు తప్పు చేయలేదు. నీ మనస్తత్వం అలాంటిది అన్నది నేనే గుర్తించలేదేమో.. కానీ ప్రతి నిర్ణయం నీదే కరెక్ట్ అనిపించినప్పుడు... నేను అవసరం లేనివాడిననిపించింది. ఆఫీసులో నేను బాస్. ఇంట్లో మాత్రం... నా మాటకు బరువు లేదనిపించింది.” అంటున్న రేవంత్ చేయి పట్టుకుని నెమ్మదిగా అంది,“అయితే ఇక మీదట ఎప్పుడూ నిర్ణయాలు ‘మనవి’ అవుతాయి. అన్ని అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పుకుందాం. అంతే కానీ నీవు ‘మన’ గురించి బయటవారితో మాట్లాడే పరిస్థితి రాకూడదు.” అని ఆపి,


చేయి థమ్స్అప్ అని చూపితే, ఆమె చేతిలో చేయి వేసి భుజం మీద తల వాల్చాడు ప్రేమగా..

ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న చేతుల కలయికలో... అగ్ని, హిమం లా కాకుండాప్రేమతో కలిసిన ఉష్ణంగా మారిన ప్రియమైన వెచ్చదనం కనిపించింది.


ఆ క్షణంలో అపోహల గోడ కూలింది... అవగాహన అనే తలుపు తెరచుకుంది.

ఆ రాత్రి వాళ్ళిద్దరూ సమస్యను గెలవలేదు. ఒకరిని ఒకరు గెలుచుకున్నారు.

సంసారం పడిపోవడం సులువు... పునర్నిర్మించుకోవడం ప్రేమ ఉన్నవారికే సాధ్యం.


*****$****


డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page