ఇలా.. మారింది
- Dr. Lakshmi Raghava Kamakoti
- Jun 2
- 4 min read
#IlaMarindi, #ఇలామారింది, #LakshmiRaghavaKamakoti, #లక్ష్మీరాఘవకామకోటి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ila Marindi - New Telugu Story Written By Dr. Lakshmi Raghava Kamakoti
Published In manatelugukathalu.com On 02/06/2025 ఇలా మారింది - తెలుగు కథ
రచన: డా. లక్ష్మీ రాఘవ కామకోటి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఆటో దిగుతున్న మేనత్త సుమిత్రమ్మను చూసి సంబరపడింది నీల.
“రా అత్తయ్యా, ఈ రోజు వస్తున్నానని చెబితే వచ్చి ఇంటికి తీసుకు వచ్చేదాన్ని” అంది నిష్టూరంగా.
“తెలిసిన ఊరు, పైగా ఆయన ఉన్నప్పుడు వచ్చే వాళ్ళం కదా.. ఇప్పుడు ఒంటరి అయ్యాను కానీ.. ” అంది కంట నీరు పెట్టుకుంటూ.
“ఇన్నేళ్లయినా ఏమిటి అత్తయ్యా. మేమంతా లేమా” అంటూ ఆమె బ్యాగ్ తీసుకుని లోనికి నడిచింది నీల. కుడి పక్కగా చిన్న గెస్ట్ రూమ్. దానికి బాత్రూమ్ కలిసి ఉంది. “నీవు స్నానం చేసిరా ముందు.. ”అని సుమిత్రమ్మని లోనికి పంపింది.
పది నిముషాల్లో తయారై వచ్చిన సుమిత్రమ్మకు నీల మొబైల్ లో మాట్లాడుతూ కనిపించింది..
“అలాగే అక్కా, మూడు గంటలకి తయారుగా ఉంటాను. నాలుగైతే పిల్లలు వచ్చేస్తారు.. ’’ అంటూ మొబైల్ ఆఫ్ చేసి సుమిత్రమ్మను డైనింగ్ టేబల్ దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ వంటకాలన్నీనీట్ గా సర్ది ఉన్నాయి.
“ఉద్యోగo మానేసావుట. ఎందుకూ?” అంది సుమిత్రమ్మ.
“మానలేదు అత్తా. మా ఆయన ఆరు నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది.. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలి కదా అని ఉద్యోగానికి సెలవు పెట్టుకున్నా.. పైగా పెద్దవాడు రంజీత్ టెన్త్ కు వచ్చాడు. చిన్నవాడు రామ్ ఎనిమిది. ఇటువంటి సమయంలోనే పిల్లలకు అవసరం కద అత్తా. “
“ఏమోనే.. ఈ కాలంలో ఉద్యోగాలు ఎవరూ మానరు కదా. పిల్లకు ఏదో ఏర్పాట్లు చేసేస్తారు అని విన్నాను”
“మేము అలా అనుకోలేదు. మనమే ఇంట్లో ఉండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాం అత్తా” అని వెంటనే
“అన్నట్టు నీకు పెద్దక్క ఫ్రెండ్ శోభన గుర్తుందా. వాళ్ళ అద్దె ఇల్లు ఖాళీ చేయించాలిట. అద్దె సరిగా చెల్లించడం లేదని.. మాట్లాడడానికి తనకు తోడుగా వెళ్ళాలి. ఒక గంటలో వచ్చేస్తా. నీవు రెస్ట్ తీసుకో.. ”
“నీవెందుకు వెళ్ళాలి. తనూ, వాళ్ళ ఆయనా వెళ్లాలి గానీ.. ” అంది సుమిత్రమ్మ.
“వాళ్ళాయన చనిపోయి ఆరునెలవుతూంది. అన్నీ తనే చూసుకోవాలి..”
“అయ్యో పాపం అలాగా? సరే మీరు వెళ్ళండి. ” అని గెస్ట్ రూమ్ లోకి వెళ్ళింది.
పది నిముషాలలో శోభన వచ్చిన సందడి వినిపించి రూమ్ నుండీ బయటకు వచ్చిందామె శోభన ను చూద్దామని.
హాలులో కూర్చున్న శోభన లేచి నుంచుంది. ఇంతలో నీల వస్తూ “మా అత్తయ్య, ఈ రోజే వచ్చింది.. అత్తయ్యా శోభన” అని చెప్పింది సుమిత్రమ్మకు. ఆమాటకు చిన్నగా నవ్వింది ఆమె.
“పద, లేట్ చేస్తే కష్టం” అని శోభన తో కలిసి బయట ఉన్న కారులో వెళ్ళి పోయారు.
ఒక నిముషం సోఫాలో కూర్చుండి పోయింది సుమిత్రమ్మ. శోభన బొట్టు పెట్టుకుంది. మంచి చీర కట్టుకుంది. చేతినిండా ఉన్న బంగారు గాజులు, మెడలో ఉన్న దళసరి చెయిన్.. భర్త పోయిన ఛాయలు అలంకరణ లో కానీ ముఖo లో గానీ లేవు.
తనకు భర్త పోయినప్పుడు ఎన్ని ఆoక్షలు.. ముఖాన విభూతి, పాత చీరలూ.. ఎవరికి ఎదురొచ్చినా అపశకునం. ఆరు నెలలు ఇంట్లోనుండీ బయటకు కూడా రాలేదు. సంవత్సర కాలం ఎవరింటికీ వెళ్లకూడదు.. మరి ఇప్పుడు చూస్తున్నదేమిటి? శోభన ఇంట్లోకి కూడా వచ్చింది. ఏమైనా ఒకసారి నీలకు చెప్పాలి ఇది మంచిది కాదని.. అనుకుంటూ పడుకుంది.
పిల్లలిద్దరూ స్కూల్ నుండీ వచ్చేసరికి నీల వచ్చేసింది. పిల్లల పని అయ్యి, వంటింటి పనులూ చేసుకుని నీలకు తీరిక అయ్యాక సుమిత్రమ్మ నీలతో “ నీలా, నేనొకటి చెబుతాను వింటావా?” అంది.
“చెప్పు అత్తయ్యా” వెంటనే అంది నీల.
“శోభన మొగుడు పొయ్యాక కూడా ముందులాగే ఉండటమూ, ఇలా సoవత్సరం లోపు అందరి ఇళ్లకు రావటమూ మంచిది కాదే.. రానివ్వకు”
“అత్తయ్యా, ముందిటి కాలం కాదు ఇప్పుడు. నీకు తెలియదు రెండేళ్లగా శోభన భర్త శేఖర్ కు ఆరోగ్యం పాడై ఎన్ని రోజులు హాస్పిటల్ లో ఉన్నాడో.. కొడుకు అప్పుడప్పుడూ వచ్చిపోయినా అన్నీ చూసుకుంది శోభననే. చివరికి తన ఆరోగ్యం కూడా దెబ్బతినింది. తనకెంత చేతకాక పోయినా ఎవరికీ చెప్పేది కాదు. చనిపోయే ముందు శోభనతో శేఖర్ చెప్పిన మాటల బట్టే తాను ఇలా ఉంటోంది. కొడుకు డిల్లీలో ఉండటం వలన ఇక్కడ ఆస్తి విషయాలలో ప్రతి ఒక్కటీ తనే చేసుకోవాల్సి రావటం తో క్రమంగా అలవాటు పడింది.
శేఖర్ పోయిన మూడు నెలల లోపే పెన్షన్ సంగతులు, వారికున్న రెండు ఫ్లాట్స్ లో అద్దెకున్న వాళ్ళతో మాట్లాడడం, శేఖర్ కొన్న ఒక స్థలం ఆక్రమణ జరిగితే పోలీసుల చుట్టూ తిరగటం ఇవన్నీ స్వయానా చూసుకోక పోతే ఎవరు సాయం చేస్తారు? కొడుకు రాలేక పోతున్నాడు కాబట్టి అన్నీ తానే చూసుకుంది. అంతే కాదు అందర్లో ఉండాలని దగ్గరవాళ్ళ ప్రతి ఫంక్షను కీ వెడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడింది.
శేఖర్ ఉన్నన్నిరోజులూ నిద్ర కూడా సరిగా ఉండేది కాదు. తనకు తోడుగా ఒక ముసలావిడ ని ఇంట్లోనే ఉంచుకుంది. ఆవిడ వంట చేస్తుంది. పిలిచినప్పుడు పలికే పాత డ్రైవర్ అలవాటుగా పిలుస్తుంది. కారులో వెళ్ళి ప్రతి పనీ స్వయంగా చేసుకుంటుంది. కష్టాలు ఎవరికీ చెప్పుకునే రోజులు కావు ఇవి.
మొగుడు పోయిన వాళ్ళు ఇంట్లోనుండీ కదలకూడదు. ఎదురు పడకూడదు అంటే ఏమిజరిగేది.. కాలంతో బాటు మారి బతకాలి. ఇలా ఉంది కాబట్టి శోభన ఇప్పుడు బహు సంతోషంగా ఉన్నట్టు కాదు. శేఖర్ లేని లోటు గురించి నాతో చెప్పి బాధ పడుతుంది. ఇది మీ కాలం కాదు అత్తయ్యా.. అర్థం చేసుకో. “ ఏకదాటిగా చెప్పి అత్తయ్య ముఖo చూసింది.
సుమిత్రమ్మ తల దించుకుని మౌనంగా రెండు నిముషాలు ఉన్నాక “నిజమేనే నీలా.. అప్పుడు నాకు ఇలా అవకాశం ఇవ్వలేదు కనుక ఎన్నో పోగొట్టుకున్నాను. ఆస్తి లో మరిది మోసం చేసినా మాట్లాడలేక పోయాను.. ఆలోచిస్తే శోభన మంచి పని చేస్తోంది. ”అంది మెల్లిగా.
అత్తయ్య ఇంత త్వరగా అర్థం చేసుకుని ఇలా స్పందించిందని సంతోషంతో సుమిత్రమ్మని కౌగలించుకుంది నీల తృప్తిగా.
కాలo తో బాటు కొన్ని మార్పులు తప్పని సరి అవుతాయి మరి..
******సమాప్తం *****
డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు
సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.
ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.
గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.
కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .
అనేక సంకలనాలలో కథలు.
కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.
రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ
@dineshkumargundamraj4752
• 1 hour ago
ఒక మంచి కథ కు, వినసొంపైన కథానిక