వీభోవరా - పార్ట్ 1
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Jun 2
- 4 min read
Updated: Jun 8
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #వీభోవరా, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

వీభోవరా ధారావాహిక ప్రారంభం
Veebhovara - Part 1 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 02/06/2025
వీభోవరా - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఓంనమో భగవాన్ శ్రీరామణేశ్వరాయ
అరుణోదయ సమయం.....
అది వారణాసి మహాక్షేత్రం....
మహాపవిత్ర గంగామాత తీరం....
ఎందరో మహనీయులు గంగామాయిలో మునిగి, దుస్తులు మార్చుకొని జగత్‍రక్షకులు శ్రీ కాశీవిశ్వేరుల మాతా అన్నపూర్ణమ్మల వారి దర్శనానికి ఆలయంలో ప్రవేశిస్తున్నారు.
జగత్‍పిత సర్వేశ్వరులను జగన్‍మాత అన్నపూర్ణమ్మను దర్శించి, తమ విన్నపాలను తెలిపి, వేడుకొని కొందరు ఆలయం నుండి బయటికి వెళుతున్నారు.
కాశ్యపశర్మ రిటైర్డ్ డి.ఐ.జి ఆఫ్ పోలీస్. ఆస్థికులు. ఎంతో భక్తి పరాయణులు. కాశీ క్షేత్ర దర్శనానికి వచ్చారు.
ఆ సమయంలో.... విజయేంద్రస్వామీజీ, వారి ఇరువురు శిష్యులు శివానంద, కేశవానంద కాశ్యపశర్మకు కొంతదూరంలో గంగాస్నానం చేస్తున్నారు. స్వామివారు వారి శిష్యులు కాశ్యపశర్మ ప్రక్కప్రక్కన విడిది గృహల్లో వుండటం జరిగింది. శిష్యులకు కాశ్యపశర్మ పరిచయం ఏర్పడింది. విజయేంద్రస్వాములు వారిని కాశ్యపశర్మ గారు విడిదిలో కలవలేదు. స్వామీజీ వారికి ఎడమకాలున మోకాలి క్రింది భాగము లేదు!...
"అమ్మా!....." అని అరిచి నీళ్ళపై పడిపోయాడు కాశ్యపశర్మ.
అతని ఎడమఛాతికి తుపాకి గుండ్లు రెండు తగిలాయి.
కొంతదూరంగా వుండి వారిని కాల్చిన వారు పారిపోయారు.
కాశ్యపశర్మ అరుపుకు విజయేంద్రస్వామీజీ, వారి ఇరువురు శిష్యులు, గంగాస్నానం చేయు కొందరు విని వులిక్కిపడ్డారు.
నీటిపై పడిన కాశ్యపశర్మ శరీరం నుండి కారిన రక్తం గంగలో కలిసి ప్రవాహంలో ముందుకు సాగిపోతూ వుంది.
కొన్ని నిముషాలు ఆ ప్రాంతంలో ఎక్కడివారు అక్కడే చిత్తరువుల వలే అచేతనంగా నిలబడ్డారు.
కాశ్యపశర్మ జీవుడు వారి తనువును వీడి గాల్లో కలిసిపోయాడు. అందరూ విచిత్రంగా కాశ్యపశర్మను చూస్తున్నారు.
విజయేంద్రస్వామీజీ వారిని సమీపించారు. వారికి ఎంతో ఆశ్చర్యం. శిష్యుల చేత కాశ్యపశర్మ జీవరహిత శరీరాన్ని నది దరిపైకి చేర్చారు.
విజయేంద్రస్వామీజీ వారు కాశ్యపశర్మను తాకి చూచారు. పెదవి విరిచారు. వారి ఎర్రని కండ్లలో కన్నీటి జీరలు. మనస్సున ఎంతో ఆవేదన.... జనం.... కాశ్యపశర్మ శవం చుట్టూ చేరారు.
’మహా పుణ్యమూర్తి, కాశీలో గంగలో చనిపోయాడు’.... ఒకరు....
’కాదుకాదు... ఎవరికి ఏఏ రితిగా కష్టం కలిగించాడో... పగబట్టిన వారు ఫాలో చేసి కాల్చు చంపేశారు’.... మరొకరు....
’పోలీస్ అట కదా, ఎవరెవరితో ఎలాంటి పేచీలు పెట్టుకొన్నాడో, ఏకాకిగా వున్న తరుణంలో మొక్కను తృంచినట్లు తుంచి పారేశారు విరోధులు.... మూడవవ్యక్తి.
అలా జనం.... ఎవరికి తోచినట్లు వారు వాగసాగారు.
విజయేంద్రస్వామీజీ, వారి ఇరువురు శిష్యులు అందరి మాటలను విన్నారు.
"శివా..!" గురువుగారి పిలుపు.
"గురూజీ!...." శిష్యుడు శివానంద మెల్లగా స్వామివారిని పలకరించాడు.
స్వామీజీ శిష్యుని ముఖంలోకి చూచాడు.
"గురుదేవా!...." అతను పూర్తి చేయకముందే.....
"వీరిని మనతో మన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాలి శివా!...."
తన నిర్ణయాన్ని తెలిపారు స్వామీజీ.
శివ తలాడించాడు.....
పోలీసు వచ్చారు.....
"ఏం జరిగింది?....." అడిగారు.
శివానంద జరిగిన విషయాన్ని వారికి తెలియజేశాడు.
ఆ ప్రశ్న అడిగిన పోలీస్‍ను చూచి విజయేంద్ర స్వామీజీ....
"బాబూ!... తమరి పేరు?...."
"నిర్మల్ శర్మ.... పోలీస్ హెడ్ కానిస్టేబుల్‍ని స్వామి."
వినయంగా జవాబు చెప్పాడు నిర్మల్ శర్మ.
"బాబూ నిర్మల్!.... నీవు చాలా మంచివాడివి..." చెప్పారు విజయేంద్రస్వామీజి.
నిర్మల్ ఆనందంగా నవ్వాడు.
"మీరు మాకు ఒక సాయం చేయాలి!...." అడిగారు స్వామీజీ.
"అదేమిటో చెప్పండి స్వామి!..."
పోలీస్ రాకతో కాశ్యప్‍శర్మ కళేబరం చుట్టూ వున్న జనం.... ఆ పోలీసులు వారిని ఏ రీతిగా విచారణ చేస్తారో అనే భయంతో ఒక్కొక్కరు మెల్లగా జారుకున్నారు.
"వీరిని జాగ్రత్తగా ఐస్‍బాక్సులో వుంచి మాతో పంపాలి!.... చేయగలరా!" అడిగాడు స్వామీజీ.
అతనూ బ్రాహ్మణుడు. గతించిన వ్యక్తి బ్రాహ్మణుడు. పైన కాశ్యప్ శర్మ పోలీస్ అధికారి కదా!.....
"మా ఎస్.ఐ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాను స్వామీజీ!...." వినయంగా చెప్పాడు నిర్మల్.
అతను అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. వచ్చింది. స్ట్రెచ్చర్‍పై కాశ్యపశర్మను చేర్చి.... అంబులెన్స్ లో ఉంచారు. నిర్మల్ ఆదేశం ప్రకారం పోలీసులు అంబులెన్స్ ఎక్కారు.
అంబులెన్స్ వెళ్ళిపోయింది.
విజయేంద్రస్వామీజీ వారి శిష్యులు నిర్మల్ టాంగాలో పోలీస్ స్టేషన్ చేరారు. నిర్మల్ ఆ ముగ్గురుకి ఆసనాలను చూపించాడు. గురూజీ కూర్చున్నారు. శిష్యులు ప్రక్కన నిలబడ్డారు.
పావుగంట తరువాత ఎస్.ఐ త్రిపాఠి గారు వచ్చారు.
స్వామీజీని చూచి నమస్కరించారు.
"ఆయుష్‍మాన్ భవ, సంతాన ప్రాప్తిరస్తు" కుడిచేతిని పైకెత్తి దీవించాడు విజయేంద్ర స్వామీజీ.
ఎస్.ఐ త్రిపాఠి గారికి జరిగిన విషయాన్ని వివరించారు స్వామీజీగారు.
చివరగా....
"ఆవ్యక్తిని మీరు మా ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లు చేయాలి." అన్నారు విచారంగా.
పెద్దగడ్డం, మీసాలు, బాగా ఎదిగిన శిఖ, ముఖంలో ఏదో గొప్ప తేజస్సు. స్వామీజీ వారిని పరీక్షగా చూచిన త్రిపాఠి....
"స్వామీజీ!.... తమరి స్థావరం?...."
"ఉత్తరాఖండ్ ధన్‍బాద్ దగ్గరలోని భాక్రా నది ఒడ్డున వుంది మా ఆశ్రమం."
"మీ ఆదేశాన్ని నేను నెరవేరుస్తాను స్వామీజీ" ఎంతో వినయంగా చెప్పాడు త్రిపాఠి సాలోచనగా.
కొన్నినిముషాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి.
"స్వామీజీ!...." త్రిపాఠి పలకరింపు.
"చనిపోయిన వారు మీ ఆశ్రమవాసులా!....."
"కాదు!..."
"అయితే.... వారికి మీకు ఏమిటి సంబంధం?..."
విజయేంద్రస్వామీజీ చిరుమందహాసం చేశారు. ఆ సమయంలో వారి కళ్ళల్లో కన్నీరు....
"వత్సా!.... ఋణానుబంధం...." చెప్పి కళ్ళు మూసుకొన్నారు.
కన్నీళ్ళు క్రిందికి జారాయి.
వారి వాలకాన్ని చూచిన త్రిపాఠి....
’వారు ఎంతో బాధలో వున్నారు. అందరినీ అడిగినట్లు వారిని ప్రశ్నించడం తప్పు. పెద్దవారు. జ్ఞానసంపన్నులు. ఆశ్రమవాసి. సర్వసంఘ పరిత్యాగులు. వారిని ఇక ఏ ప్రశ్న వేయకూడదు. వారి కోరికను తీర్చాలి. అదే నా ప్రస్తుత ధర్మం’ అనుకొన్నాడు త్రిపాఠి.
త్రిపాఠికి వివాహం జరిగి ఆరు సంవత్సరాలు. ఇంతవరకూ వారికి సంతానం లేదు. వారి భార్య వారి మేనమామ కూతురే. పేరు వింధ్య.
విజయేంద్రస్వామీజీ గారి ఆశీర్వచనాన్ని తలుచుకొన్నాడు త్రిపాఠి. అతని మనస్సుకు ఆనందం. ఏదో ఆశ.....
’ఈ స్వామీజీ గారి ఆశీర్వాదం ఫలించి నాకు త్వరలో సంతతి కలుగుతుందేమో!....’ మనస్సున అనుకొన్నాడు త్రిపాఠి.
"స్వామీజీ!... మనం తమరు బస చేసిన తావుకు వెళదాం పదండి. నేను హాస్పిటల్‍కు వెళ్ళి పోస్టుమార్టమ్ రిపోర్టును, వారిని సురక్షితంగా మీ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లను, చేసి వచ్చి మిమ్ములను కలుస్తాను. రండి మిమ్ములను దింపి నేను హాస్పిటల్‍కు వెళ్ళి వస్తాను" సవినయంగా చెప్పాడు త్రిపాఠి.
నలుగురూ జీప్‍ను సమీపించారు. వారి వెనకాలే నిర్మల్‍శర్మ వచ్చాడు.
జీప్ ముందు సీట్‍ను చూపి....
"కూర్చోండి స్వామీజీ!..." చెప్పాడు త్రిపాఠి.
శిష్యుల వైపు చూచి... "మీరు వెనుక సీట్లో కూర్చోండి."
నలుగురూ కూర్చున్నారు. త్రిపాఠి జీప్‍ను స్టార్ట్ చేశాడు.
నిర్మల్ స్వామీజీని సమీపించి చేతులు జోడించి....
"స్వామీజీ నన్ను ఆశీర్వదించండి!...." దీనంగా కోరాడు.
విజయేంద్రస్వామీజీ అతన్ని చూచి చిరునవ్వుతో "నిర్మల్! నీవు చాలా మంచివాడివి. త్వరలో నీవు కోరుకొన్న అమ్మాయితో నీ వివాహం జరుగుతుంది. మీరు ఎంతో ఆనందంగా వుంటారు." చిరునవ్వుతో చెప్పారు స్వామీజీ.
త్రిపాఠి జీప్‍ను స్టార్ట్ చేశాడు. నిర్మల్ మనస్సున ఎంతో సంతోషం. అరగంటలో త్రిపాఠి స్వామీజీ బసను సమీపించాడు. గురు శిష్యులు దిగారు.
త్రిపాఠి హాస్పిటల్‍కు బయలుదేరాడు.
వారు వుంటున్న గృహంలో ప్రవేశించారు.
స్వామీజీ ముందు తరువాత శిష్యులు స్నానం చేశారు.
విజయేంద్ర స్వామీజీ పద్మాసనంతో తూర్పు దిశ ముఖులై దైవధ్యానాన్ని ప్రారంభించారు.
శిష్యులు శివకేశవానందులు, వంట (స్వపాకం)ను ప్రారంభించారు.
రెండుగంటలు గడిచాయి. విజయేంద్రస్వామీజీ వారి ధ్యానం ముగిసింది. కళ్ళు తెరిచారు.
త్రిపాఠి వారిని సమీపించారు. చిరునవ్వుతో స్వామీజీ వారి ముఖంలోకి చూచారు.
"స్వామీజీ! పోస్ట్ మార్టమ్ రిపోర్టును తీసుకొన్నాను. మీరు కోరిన విధంగా వారిని మీ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లను చేశాను. వారితో నిర్మల్, మరో పోలీస్ వస్తారు. తమరి తిరుగు పయనం ఎప్పుడు స్వామీజీ!..." ఎంతో వినయంగా అడిగాడు త్రిపాఠి.
"రేపు ఉదయం!...."
"మంచిది స్వామి ఉదయాన్నే మిమ్ములను కలుస్తాను. శలవు." చేతులను జోడించాడు త్రిపాఠి.
"మంచిది వత్సా!...."
త్రిపాఠి వెళ్ళిపోయాడు.
శిష్యులు గురువుగారికి భోజనాన్ని వడ్డించారు.
పావుగంటలో విజయేంద్రస్వామీజీ భోజనాన్ని ఆరగించారు. భోజనానంతరం ఒక అరగంట నడక వారికి అలవాటు. ఆ ప్రాంతంలోనే చంక క్రింద కర్ర సాయంతో నడకను ప్రారంభించారు.
హరి హరులు భోజనానికి కూర్చున్నారు. వారిరువురూ మౌనంగా భోంచేశారు. భోజన సమయంలో ఎలాంటి ప్రసంగం చేయకుండా భోంచేయడం ఆ ఆశ్రమవాసుల నియమం. ఆ సమయంలో కూడా వారు చేసేది దైవధ్యానం. వారే కాదు మామూలు మనుషులు కూడా ఆ విధానాన్ని అవలంభించడం ఆరోగ్యకరం, ఆనందకరం.
శిష్యులు స్వామీజీ శయ్యను అమర్చారు.
విజయేంద్రస్వామీజీ వారు శయనించారు. శిష్యులు వారి వద్ద శలవు తీసుకొని నమస్కరించి వారి పడకలను చేరారు.
స్వామీజీ వారి మనస్సున ఎంతో అప్రసన్నత. మదిలో వేదన, గంగానదిలో దుండగుల కాల్పులకు గురైన కాశ్యపశర్మ డి.ఐ.జి గారు, వారి మనోఫలకమున నిలిచాడు.
స్వామీజీ వారి మనస్సు అరవై సంవత్సరాల గతం వైపుకు పరుగుతీసింది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios