శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 3
- Ayyala Somayajula Subramanyam

- May 6
- 9 min read

Srikrishna Rayabharam - Part 3/3 - Telugu Mythological Story | Ayyala Somayajula Subrahmanyam
శ్రీకృష్ణ రాయభారం - పార్ట్ 3/3 - తెలుగు పౌరాణిక కథ | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 06/05/2026
కురుసభలో శాంతి కోసం శ్రీకృష్ణుడు చేసిన రాయభారం మహాభారతంలో అత్యంత కీలక ఘట్టం. ధర్మాన్ని కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, దుర్యోధనుడి అహంకారం, చివరకు జరిగిన విశ్వరూప దర్శనం ఈ భాగాన్ని మరింత మహోన్నతంగా నిలబెడతాయి.
మరుసటి రోజు ఉదయముననే స్నానాదులు, నిత్యారాధన విధులను ముగించుకుని, రాజభవనమునకు చేరుకొనెను. హస్తినకు ప్రయాణించు సమయములో దారిలో తాను
కలిసిన ఋషివర్యులు నారదుని ఆధ్వర్యంలో ఆకాశము నుండి సభలో జరుగుతున్న చారిత్రాత్మక ఘటనను వీక్షిస్తుండుటను శ్రీకృష్ణుడు గమనించెను. వారందరునూ పిదప సభలోనికి విచ్చేసిరి.
శ్రీకృష్ణుడు గంభీర స్వరంతో ధృతరాష్ట్రుని ఇటుల సంబోధించెను.
“మామా, సత్యవతీ పౌత్రా ; నేను పాండవుల మరియు కౌరవుల నడుమ సంధి చేకూర్చుట కొరకు మాత్రమే హస్తినకు వచ్చితిని. ఇతర కారణాలేమీ లేవు. కురువంశము మచ్చలేని కీర్తి కలిగినది. దాని వారసులందరూ ఆ వంశచరిత్రను తమ కీర్తితో మరింతగా ఇనుమడింపజేసిన రాజర్షులు.
ఇప్పుడు, మీరు మీ వంశప్రతిష్టకు భంగము కలిగించే ఏ కార్యమునందైనా నెలకొనినచో అది సిగ్గుచేటు.
ఓ ధృతరాష్ట్ర మహారాజా; తన జ్ఞాతుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్న నీ దుర్మార్గపు పుత్రుని నీవు నియంత్రించుము. ఈ ప్రస్తుత ప్రమాదమునకు సంబంధించిన నింద పూర్తిగా నీ భుజాలపై మోపబడును. నీవు శాంతి ఒప్పందమునకు అంగీకరింపకున్నచో, అది ఘోరమైన నరమేధమునకు దారితీయును. పరిస్థితిని చక్కదిద్దుటకు ఇంకనూ అవకాశము కలదు.
నీవు నీ కుమారులను ఒప్పించ గలిగితే నేను పాండవులను శాంతింపజేసెదను. రాజా; నీవు ఒక ప్రక్క నీ కుమారులు, మరో ప్రక్క పాండు తనయులు ఉన్నచో కలిగే నీ
వైభవమును నీవు చూడలేకున్నావా? భూలోకమంతటినీ ఒకే రాజ్యముగా నీవు సురక్షితముగా నియంత్రిస్తూ, నీ జీవితమును శాంతితో, ఆనందముగా ఆందోళన లేకుండ గడపగలవు.
అలాకాకుండా యుద్ధములో నీ కుమారులు పాండవుల చేతిలో నిహతులయ్యేందుకు అనుమతించి ఏ విధముగా సంతోషముగా ఉండగలవు? పాండుపుత్రులతో శాంతిసంబంధాలను నెలకొల్పి సామూహిక విధ్వంసమును నివారించవలెను.
“ఇప్పుడు నేను పాండవులు పంపిన సందేశమును వినిపించెదను.
పూజ్యులైన పెదతండ్రిగారికి, మీ ఆజ్ఞానుసారము మేము అరణ్యవాసమును విజయవంతముగా పూర్తి చేసుకొంటిమి. ఇప్పుడు ఒప్పందం ప్రకారం మా రాజ్యమును మాకు తిరిగి ఇవ్వగలరు. అట్లు చేసినచో మేము సదా కృతజ్ఞులమై, విధేయత కలిగి ఉండగలమని హామీనిస్తున్నాము. ”
“చెల్లియో చెల్లకో తమకు చేసిన యొగ్గులు సైచి రందరన్
తొల్లి గతించె నేడు నను దూతగా పంపిరి సంధి సేయ నీ
పిల్లలు పాపలున్ పెంపు వహింపగ సంధి సేసెదో
యెల్లి రణంబు గూర్చదవో ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!”
పిమ్మట ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో ఇటుల పలికెను. హే కృష్ణా; పరంధామా; జ్ఞానము మరియు ధర్మబద్ధమైన సలహాను మాకు సూచించుట కొరకే నీవు ఇక్కడకు వచ్చితివి.
ఖచ్చితంగా నీ ఉద్దేశ్యమును నా కుమారులు మరియు పాండుకుమారులు ఇరువురికి ప్రయోజనకరమైన భావనతో కూడినట్టిది. ఏమైనను నా కుమారుడు దుర్యోధనుడు
నాతో సహకరింపనందున నేను నీ ప్రతిపాదనను అమలుపరచుటకు స్వేచ్ఛ లేనివాడను.
కనుక నా ఆజ్ఞను పాటించుటకు మరియు విదురుడు, భీష్ముడు, గాంధారి వంటి వారి సలహాలు వినునట్లుగా దయచేసి నా కుమారుని మందలించి ఒప్పించుటకు ప్రయత్నింపుము.
ఓ దుర్యోధనా; ఈ అవకాశమును సద్వినియోగపరచుకుని, నీవు ధర్మ మార్గమును అనుసరిస్తూ పాండవులతో సంధి చేసుకొనవలెను. సత్ప్రవర్తన మరియు దుష్ట ప్రవర్తనల నడుమ వ్యత్యాసమును నీవు ఎరుగుదువని నేనెరుగుదును. నీ ఆలోచనలన్నీ వికృతులు. అవి నిన్నువినాశనమునకు తీసుకువెళుతాయని నిన్ను హెచ్చరించు బాధ్యత నాకు కలదు.
నీవు విజ్ఞులైన పెద్దల సలహాలను మూర్ఖంగా నిర్లక్ష్యపరుస్తూ, దుర్మార్గులు, దుష్టుల నుండి సలహాలను పొందుతుంటివని నేనెరుంగుదును.
ఓ బావా దుర్యోధనా; నిజమునకు ధర్మమే అర్థకామములకు మూలము. కనుక అధర్మము యొక్క నిరర్థకతను అర్థం చేసుకొని నీవు దానిని నివారించవచ్చును. ఒక్కసారి విరాటుని రాజ్యంపై దాడి చేసినప్పుడు కౌరవుల పరిస్థితిని స్మరింపుము.
అర్జునుడు కౌరవులనందరినీ జయింపగలడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీవు కేవలము విజయము కొరకు అర్థరహితమైన ఆశను కలిగి ఉంటివి. నీవు ఆశించు సమృద్ధి పాండవులతో సంధి చేసుకొనుట ద్వారానే సాధ్యపడదు. ఒకవేళ నీవు పాండవులతో యుద్ధము చేసినచో కురువంశ నాశకుడవనే అపఖ్యాతికి గురగుదువు.
భీష్ముడు ఈవిధంగా పలికెను: “దుర్యోధనా; భగవానుని మాట ననుసరించి నీవు క్రోధము, దుష్టస్వభావము విడనాడుము. అటుల చేసినచో, నీవు నీ వంశనాశనమును తప్పించిన
వాడవగుదువు. ”
ద్రోణుడు ఈవిధంగా పలికెను: “దుర్యోధనా; మేము నీ గురించి కాదు, వృద్ధులైన నీ తల్లిదండ్రుల గురించి చింతించుచుంటిమి. మూర్ఖత్వం విడనాడి పెద్దల మాటలను పాలింపుము. ”
సభలోని పెద్దలందరూ హితోపదేశాలు చేసిరి.
భీష్మ ద్రోణాదులు మరోసారి యుధిష్ఠిరునితో మైత్రిని పెంచుకోమని కోరిరి. ఇంకను సమయం మించిపోలేదని కోరిరి. ఏది ఏమైనను దుర్యోధనునకు ఈ పలుకులన్నీ మిక్కిలి ప్రతికూలముగా తోచెను. దానితో అతడు ఇలా బదులిచ్చెను.
“ఓ కృష్ణా, గోపాలా; నీవు అనవసరంగా నాలోని దోషములను ఎత్తి చూపుచుంటివి. నేనెన్నడునూ ఎటువంటి తప్పులు, దుర్మార్గపు పనులు చేయలేదు. పాండవులు తమ ఇచ్ఛ
అనుసారము పాచికలాడలేదా? ఇప్పుడు వారికి బంధు మిత్రాదులు లేనందున బలహీనులయి, కేవలము బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావున నేను యుధిష్ఠిరునికి తలవంచను. నా బలమైన సైన్యములో భీష్మ, ద్రోణ, కృప మరియు కర్ణుడు తదితర మహా
యోధానుయోధులు కలరు. వారిని ఈ విశ్వంలో ఎవ్వరూ ఓడించలేరు..
‘ఒకవేళ కౌరవులందరూ విగతజీవులైననూ అది కీర్తికరమే. యుద్ధభూమిలో వీరమరణం శాశ్వత అమరలోకప్రాప్తి కలిగించును. క్షత్రియులు శత్రువులకు లొంగుట కంటెను యుద్ధభూమిలో ప్రాణాత్యాగము చేయవలెను. నేను ఇప్పడు పాండవులకు సూదిమొన మోపినంత భూమిని కూడా ఇవ్వదలచుకోలేదు. ’
ఇట్టి అహంకారపూరిత మాటలతో సభయంతయూ ఉత్కంఠతో కూడిన నిశ్శబ్దం నెలకొనెను. క్రోధముతో కూడిన ఎరుపెక్కిన కళ్ళతో శ్రీకృష్ణ భగవానుడు ఇటుల బదులిచ్చెను.
సంతోషంబున సంధి చేయుదురే; వస్త్రం బూడ్చుచే ద్రౌపదీ
కాంతం జూచిననాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
సొంత నీ సహజన్ము ఱొమ్ము రుధిరమ్ము న్ద్రావునాడైన ని
శ్చింత ద్వద్గదయుం ద్వదూరుయుగమున్ ఛేదింపునాడేనియున్.
జెండాపై కపిరాజు ముందు సిత వాజిశ్రేణియుం గూర్చి నే
దండంబు గొనినతేలుస్యందనము న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గునుడు మూకం జెండుచున్నప్పుడొ
క్కండున్నీ మొర యాలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్.
అలుగుటయే యెఱుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
యలిగిననాడు సాగరము లన్నియు నొకటయ్యు గాకపోవు క
ర్ణులు పదివేవురైన నని నెత్తురు చత్తురు రాజరాజ; నా
పలుకులు విశ్వసించము విపన్నుల లోకుల గావు మెల్లరన్.
దుర్యోధనుడు అదివరకే క్రోధమును అణచుకుని భారీగా శ్వాస వదులుతూ తీస్తుండెను. ఇట్టి పలుకులతో అతడు ఒక్కసారిగా తన ఆసనముపై నుండి లేచి విసురుగా
సభనుండి వెళ్ళిపోయెను. అతడిని అనుసరించుచూ దుశ్శాసనుడు మరియు మిగిలిన సోదరులు కర్ణ, శకునిలతో సహా అనేకమంది సభా బహిష్కరణ చేస్తూ బయటకు వెళ్ళిరి.
ఆ సమయములో భీష్ముడు శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను: ‘దేవాదిదేవా; పెడదారి పట్టిన వీరందరూ ‘వినాశకాలే విపరీత బుద్ధిః’.. కావున నీవు చింతించవలదు.
వీరి వాక్యములను వినిన ధృతరాష్ట్రుడు తన పుత్రుడికి నచ్చజెప్పదలచి ఆశతో గాంధారిని సభకు రమ్మని కబురు పంపెను. విదురుడు ముందు నడువగా ఆమె సభలో ప్రవేశించెను.
‘గాంధారి; మన పుత్రుడు నా ఆజ్ఞలను నిర్లక్ష్య పరచుచుండెను. లోభక్రోధముల చేత అతడు ఆతని సహోదరుల మరియు బంధువుల, స్నేహితుల, జ్ఞాతుల జీవితములను అగ్నిదేవునకు హవిస్సుగా అర్పించుటకు సిద్ధముగా నుండెను. పెద్దలు అతని మేలు కోరి మంచి సలహాలిచ్చుచున్నను, అతడు క్రోధముతో సభను విడిచి బయటకు విసురుగా వెళ్ళిపోయెను.
గాంధారి ఇటుల పలికెను: “మహారాజా; మన పుత్రుని పిలిపించుము. ఏది ఏమైనను ప్రస్తుత సంక్షోభ కారణమునకు మీరే నింద మోయవలసి యుండును. మీరు ఎల్లప్పుడూ మోసపూరితములైన పుత్రుని కోరికలను ఆమోదించితిరి. దాని దుష్పరిణామాలు ఇప్పుడు అనుభవిస్తున్నాము.”
పిమ్మట విదురునితో దుర్యోధనుడు క్రోధముతో నిండిన కనులతో సభలో ప్రవేశించెను.
దుర్యోధనుడు తన ఎదుటకు వచ్చిన విషయమును గ్రహించిన గాంధారి పరుష వాక్యము
లతో ఆతడిని మందలించినది. మరల పుత్రుడితో అనునయముగా ఈ విధముగా పలికినది: “కుమారా; నీవు పెద్దల ఆజ్ఞలు పాటించి, పాండవులతో సంధి చేసుకొనుము.
మొదట నీలో పెనవేసుకొని యున్న కామక్రోధాలను జయించి ఆ పిదప ఆలోచించుము. తృప్తిలేని లోభమును విడిచి, ఎందుకు నీవు సగరాజ్యముతో తృప్తి చెందలేవు.”
దుర్యోధనుడు తల్లి హితకరమైన మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా, కనీసము జవాబును కూడా ఇవ్వకుండా కర్ణుడు, దుశ్శాసనుడు మరియు శకునితో కలిసి మరల
సభను విడిచి వెళ్ళిపోయిరి. ఒకరితోనొకరు సంప్రదించుకొనిరి. మనమందరమూ కలిసి శ్రీకృష్ణుని బంధించెదమని నిర్ధారించుకొనిరి.
అట్లు జరిగితే, పాండవులు ఉత్సాహము చెదిరి సంధిగ్ధతలో చిక్కుకుందురు. బాహ్యసంకేతాల ఆధారంగా ఇతరుల హృదయాలలోని భావాలను తెలుసుకోగల శక్తి కలిగిన సాత్యకి వారి పన్నాగమును వెంటనే గ్రహించెను.
అతడు రాజభవనము నుంచి బయటకు వచ్చి, కృతవర్మతో యదుసైన్యమును ప్రవేశద్వారము వద్ద వేచి ఉండమని
ఆజ్ఞాపించెను. ఆ తరువాత సాత్యకి తిరిగి సభలోకి ప్రవేశించి, వేచి యుండెను.
శ్రీకృష్ణుడు తనను బంధించవలెనను దుర్యోధనుని మూర్ఖపు ఆలోచనలు తెలుసుకుని,
“ఒక్కనిజేసి నన్నిచట నుక్కడగింప దలంచినావే; నే
నెక్కడ పో గలాడ?నిక నిక్కడ జిక్కితి బక్కి కైవడిన్
దక్కింది నీకు బట్టు మొగి దక్కకు మిట్టిటు చేర రమ్ము జల్
చక్కనియూహ పుట్టెననుజన్ములతో నరుదెమ్ము పార్థివా.
ఓ మామా, సత్యవతీ పౌత్రా; నీ పుత్రులు నన్ను బంధించుటకు చేసే ప్రయత్నమును నీవు
అనుమతింపవచ్చును. కానీ నేను వారినందరినీ తృటిలో నాశనము చేసెదను.”
మరల శ్రీకృష్ణుడు ఇటుల పలికెను: “ఓ బావా, దుర్యోధనా; నీవు అజ్ఞానము చేత నేను ఒంటరివాడనని భ్రమలో భావించి నన్ను బంధింప యోచిస్తుంటివి.
“నేను సంపూర్ణుడను. నా అంశములోని వారే ఈ సకల దేవతలు, ఋషులు, సకల జీవురాశులునూ. సకల చరాచర జగత్తు నందుగల వారందరునూ కూడా నా విభిన్నాంశలే.”
ఆయన ఆ విధంగా మాట్లాడుతూ హఠాత్తుగా, ఆయన దివ్య శరీరము నుండి అనేక రాశులునూ అగ్ని మరియు అసంఖ్యాకంగా వసువులు, ఆదిత్యులు, సాధ్యులు, మరుత్తులు, అశ్వినులు, యక్షులు, గంధర్వులు మరియు అనేక విధములైన వారు వెలువడిరి.
అనేకములైన ఈ రూపములన్నీ వివిధ రంగులతో శోభాయమానంగా ఉండెను. వారందరూ దివ్యమైన
వస్త్రాభరణములు ధరించి మరియు పూలమాలలతో అలంకరింపబడి ఉండిరి. శ్రీకృష్ణభగవానుడు అనేక హస్తములతో భిన్న ఆయుధములను ధరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును చూచి భయముతో కళ్ళు మూసుకొనిరి. భీష్మ, ద్రోణ, విధురాదులు తక్కుంగల విష్ణుభక్తులు చూడగలిగిరి. ధృతరాష్ట్రుడు గుడ్డివాడగుటచే ఆతనికి దివ్య చక్షువులను ప్రసాదించెను. ఆ ప్రకాశవంతమైన దివ్యరూప సందర్శన సమయమున స్వర్గములో మంగళవాయిద్యములు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపమును ఉపసంహరించుకొనెను.
ధర్మసూక్ష్మ వివరణ - వ్యాసులవారు
——————————————————
వ్యాసుల వారి బాధ అంతా దుర్యోధనుడి గురించే. అతను కోపమనే మహావృక్షమట. కర్ణుడు స్కంధం (అంటే బోదె) అట. శకుని ఆ చెట్టు యొక్కశాఖయట. దుశ్శాసనుడు పూలు పండ్లు యట. ఇంతకూ ఆ కోపమనే చెట్టుకు మూలం
ధృతరాష్ట్రుడు. అతడెటువంటి వాడు అంటే మనీషి-బుద్ధిలేనివాడు. ఆ బుద్ధి లేని వాడి
కొడుకులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వందమంది; అంటే వందమంది బుద్ధులు వ్యాసుల వారి కాళ్ళకి అడ్డంగా..
(దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః; స్కంధః కర్ణః శకునిస్తస్య శాఖాః; దుశ్శాసనః పుష్ఫఫలే సమృద్దే; మూలం రాజా దృతరాష్ట్రో మనిషీ;’
ఇంకో మహావృక్షాన్ని కూడా చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్లుగా.
ధర్మరాజు (యుధిష్ఠిరః యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. అంతర్యుద్ధమైనా బహిర్యుద్ధమైనా) ధర్మమయమైన మహావృక్షమట. అర్జునుడు ఆ చెట్టు బోదె. భీముడు శాఖలు.
మాద్రిపుత్రులు నకులసహదేవులు ఆ చెట్టు యొక్క పూలు, పండ్లు. ఇక మూలం చెప్పక్కర్లేదు. మహామూలం. ఒకరు కాదు ముప్పేటగా కృష్ణుడు, బ్రహ్మ (అంటే వేదములు) మరియు బ్రాహ్మణులు.
(యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః; స్కంధోఽర్జునో భీమసేనోఽస్య శాఖాః;
మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే; మూలం కృష్ణా బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ. )
ఈ ధర్మవృక్షానికి మూలమైన ఈ ముగ్గురూ సత్త్వగుణ సంపన్నులు కూడా. ఈనాడు ఉనికి ప్రశ్నార్థకమవుతోంది.
ఇద్దరికీ చెట్లతోతోనే పోలిక. - ఒకరు విషవృక్షం, మరొకరు ధర్మవృక్షం.
చూపుకింపైన, ఎవరికీ ఉపయోగం లేని వృక్షాలే పుష్టిగా, అన్ని విధాలుగా ఇప్పుడు చుట్టూ. వ్యాసమహర్షికి ఎంత ఓపిక. ఈ ధర్మాన్ని నిలబెట్టేందుకు ఈ ఇద్దరిదీ కథ నడిపిస్తూ ఒక లక్ష శ్లోకాలు మనకోసం, ముప్పయి లక్షల శ్లోకాలు దేవలోకం, పదిహేను లక్షల శ్లోకాలు పితృలోకం కోసం, ఇంకో అరవై లక్షల శ్లోకాలు ఇంకొందరి తన శిష్యులకు వ్రాసి ఇచ్చాడట. ఇంత సహనశీలిగా, ఇంత ఓర్పు నేర్పూ ఉన్నా కూడా
“ఊర్థ్వబాహుర్విరౌమ్యేష న చ కశ్చిచ్ఛృణోతి మే
ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే!”
అని చేతులెత్తి మొత్తుకోవలసి రావడం తప్పు లేదంటే..
కారణం ఎంత విసుగు తెప్పించారో అంతా తెప్పించగలరని, దేవతలే కానీ, పితృదేవతలే కానీ, మానవులే కానీ తమ అధర్మ వర్తనంతో ఇవేవీ పట్టనట్లు కనిపిస్తూనే పోతన, మనల్ని నిజంగానే, భాగవతానికి ఏదో ఒక చెట్టు
పోలిక తెచ్చి చెబుతున్నట్లు, వ్యాసుడి వలెనే తనూ చెబుతున్నట్టు, చెప్పి ఎంత బోల్తాకొట్టించాడు..
‘లలితస్కంధము, కృష్ణమూలము- శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్,
సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరోజ్జ్వలవృత్తంబు, మహాఫలంబు,
విమలవ్యాసాలవాలంబునై, వెలయున్ భాగవతాఖ్యకల్పతరువుర్విన్
సద్ద్విజశ్రేయమై” అంటూ..
ఎంత గడుసు కాకపోతే ఇటు అమ్మవారిని (లలితస్కంధము), అటు ఆమె అన్నగారిని
( కృష్ణమూలము) కలిపే తలచుకున్నారు. ఇద్దరూ అవసరమే అని.
సమవాయేతతోరాజ్ఞాం కన్యాం భర్తృహరి స్వయంవరామ్ ;
ప్రాప్తవానార్జునః కృష్ణామ్- కృష్ణను (కృష్ణ అంటే ద్రౌపదిని) పొందాడు. అంటూ వ్యాసుల వారు అపరోక్షంగా చేసిన సూచన గమనించే కదూ;
మహాభారతంలో కృష్ణ అన్న పేరుతో పిలవబడేది (సంబోధింపబడేది) ఒక్క ద్రౌపదే. మన
ఈ కృష్ణ పరమాత్మ గాక, ఆ పేరు ఇంక మరెవరికీ లేదు.
ఎక్కడ ధర్మసంస్థాపన చేయాలన్నా ఈ అన్నచెళ్ళెళ్ళు రంగంలోకి దిగాల్సిందే. హరిహర కష్టాలు పడాల్సిందే. అందర్నీ గట్టెక్కించాల్సిందే చేయందుకుని.
ద్రౌపది మహాశక్తి స్వరూపిణి అని తిక్కన వర్ణించడం మహాభారతంలో చాలాసార్లు ఉంది.
అటువంటిది ఇప్పుడు ద్రౌపది పేరు తీయాలంటేనే భయమయిపోయింది. ఎంత తేలిక చేసి
మాట్లాడుతున్నారు. మన ఇతిహాసాల గురించి, ధర్మసూక్ష్మాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే, ప్రతీకాత్మకత చూడకుండానే ఈ జనాలు కారుకూతలు కూస్తున్నారు.
వీళ్ళు అసలు మూలాలు ఎందుకు చదవరు. ఏం అర్హత ఉందని మన సంస్కృతి సంప్రదాయాలను, ఇతిహాస పురాణాలను, మనలను పురుగుల కింద తీసేస్తున్నారు.
మహామహులు మన పురాణాలను, ధర్మ గ్రంథాలలోని విషయాలను ఒక ఉద్యమం లాగా ప్రవచిస్తూ, ప్రబోధిస్తూ ధర్మబోధలు చేస్తుండగా మన వంతుగా మనం ఏం చేస్తున్నాం?
—————++++———————————-
శ్రీకృష్ణగీతమాలిక.
నీ మధురానామం గానం చేసిన,
ఆనందదాయకం ఆనందదాయకం
శ్రీకృష్ణా జయ కృష్ణా రాధాకృష్ణా
మునులెందరో పొగడిన నామం,
భక్తులెందరో పలికిన నామం
మహిమాన్వితం నీనామం,
మదిలో నిరతము నీనామం.
వరాలనొసగే వసుదేవ తనయ,
దేవకి సుతగా అవతరించిన
కృష్ణావతార - నీనామం,
మదిలో నిరతము నిలిపెద కృష్ణా.
చింతనల తీర్చు శ్రీకృష్ణుడుండగా,
ఆత్మబంధువై అంతరాత్మయై
సర్వం కృష్ణమయం కృష్ణచైతన్యం,
నీ స్మరణలో నీ ధ్యానంలో
నా జీవితం కృష్ణా నీకంకితం
—
కోర్కెలేల నాలో నీవుండగ కరుణామయి విశ్వరూపా
నీపూజలో ఆరాధనలో నాజీవితం కృష్ణా నీకంకితం,
భక్తితో నిను పిలిచితే
ప్రేమతో నిను పిలిచి ప్రేమతో నిను కొలిచితి,
ఆనందం పరమానందం నా జీవితం కృష్ణా
నీ కంకితం, గోవర్ధన గిరిధారీ బృందావన విహారీ, గోకులనందనా గోపాలా, మురళీమోహన గోపాలా,
యశోదనందనా గోపాలా, నందకిశోర గోపాలా,
వేణుగానప్రియ గోపాల, రాధామాధవ,
రుక్మిణీ వల్లభ గోపాల-
దేవకీనందన గోపాల.
మధురం మధురం - మధురాతిమధురం,
శ్రీకృష్ణ నామం ఎంతోమధురం,
దీనులపాలిట దీనబాంధవా,
భక్తులబ్రోచే కరుణాంతరంగా,
భక్తితో నిను కొలిచెదమయ్యా,
శరణం శ్రీకృష్ణ నీ దివ్య చరణం,
కృష్ణా యని పిలిచిన చాలు,
భవబంధాలే తొలగుట తథ్యం,
శరణం శ్రీకృష్ణ నీ దివ్య చరణం.
—————————————————
శ్రీకృష్ణ భగవానుడు పెద్దల అనుమతి పొంది సభ నుండి నిష్క్రమించెను. నిపుణుడైన దౌత్యవేత్తగా దుర్యోధనుడికి, పాండవులకు స్నేహము చేత కలిగే ప్రయోజనాలను వివ
రించి సంధికొరకై అతనిపై ఎన్నో విధముల ఒత్తిడి తెచ్చినను ఆ సంధి విఫలమాయెను.
మరియు ఐదు గ్రామాలనైనను ఇచ్చినచో సంధి ఒప్పందం చేసుకోవచ్చునని ప్రతిపాదించి బ్రతిమాలినను, ఆ హితకరమైన సలహాలు నిరాకరించి యుద్ధమునకు సంసిద్ధత తెలిపినాడు. ఇక యుద్ధము అనివార్యం.
పిమ్మట శ్రీకృష్ణుడు తన అనుచర గణముతో ద్వారకకు వెడలిపోయెను.
————————————————
శ్రీకృష్ణుని సాయమర్థించడానికి హస్తిన నుంచి దుర్యోధనుడు, ఉపప్లావ్యం నుంచి అర్జునుడు ద్వారకకు వస్తారు.
ఎక్కడనుండి రాక యిటకు ఎల్లరునున్ సుఖులే కదా యశో-
భాక్కులు అన్నలును భవ్యమనస్కులు నీదు తమ్ములున్
చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
చక్కగ నిలిచి శాంతుగతి చరించునే తెల్పుమర్జునా.
బావా! ఎప్పుడు వచ్చితీవు? ఎల్లరునున్ సుఖులే? భ్రాతల్, సుతుల్, చుట్టముల్
నీ వాల్భ్యమున్ పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశాన్ని కోరు భీష్ముడును, నీ మేల్కోరు ద్రోణాది భూ-
దేవుల్ క్షేమంబై మెసంగుదురే? నీ తేజంబు హెచ్చియుండగన్.
కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యె, మాకు న-
వ్వారికి గూడ నెక్కువగా బంధు సముద్రుడ నీవు గాన్, నీ
చేరిక మాకు ననిర్వురకు సేమము గూర్చెడిదౌట, సాయమున్
కోరగ నేగుదెంచితిమి; గోపకులైక శిరోభూషణా!
ముందుగ వచ్చితీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్,
బందుగులన్నయంశ మరి పాయక నిలిపె నా సహాయమిర్వురున్
జెందుట పాడి మీకు నేను చేసెద సైన్య విభాగమందు మీ-
కునే దగుదాన గైకొనుడు; కోరుట బాలుని కొప్పు మన్నికన్.
అన్ని యెడల నాకు ధీటైనవారు, గోపకులు పదివేవురకుంఠబలులు
గలరు నారాయణాఖ్య జెన్నలరువారు, వారలొక వైపు మరియు.
యుద్ధమొనరింత్రు వారల బద్ధమ్మెందులకు? నేను పరమాప్తుడనై
యుద్ధము త్రేవబోవక, బుద్ధికి దోచిన సహాయము బొనరింతున్.
ఆయుధము పట్టడట; యని
సేయండట; “కంచి గరుడసేవ” యితనిచే
నేయు ప్రకృతి యుద్ధార్థికి
నేయెడనగు నిట్టివాని నెవ్వడు గొనున్.
ఆయుధము ధరించనని కగ్గముగా నొకపట్ల నూరకే
సాయము సేయువాడ, బెలుచన్ నను బిమ్మట నెగ్గులాడినన్
దోయిలి యొగ్గుదున్, నిజము; తొల్త వచించితి గోరికొమ్మని నీ-
కేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందన.
నందకుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మధ్యందిన
భానుమండల విధంబున నీదగు కల్మిజేసి నా
స్యందన మొప్పుగాక, రిపు సంతతి తేజము దప్పుగాక, నీ-
వెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా!
రథమునందెన్ని చిత్రపు ప్రతిమలుండ,
నందు శివుడు, విష్ణువు, నజుడు నెల్ల
దేవతలు నుండవచ్చు; నా ఠీవి కృష్ణు-
డర్జున స్యందన విభూష యగును గాక.
ఉన్నది పుష్టి మానవులకు, యదుభూషణ! యాల జాతికిన్
తిన్నది పుష్టి; నీ వరుగుదెంచి రథంబున నున్న జాలు, నే
సున్నము జేసెదన్ రిపుల చూపఱులద్భుతమంద, సర్వలో-
కోన్నత! నాకు బేరొనగు; మూరక చూచుచుండు మచ్యుతా!
ఊరక చూచుచుండుమను టొప్పితి గాని భగవద్గీత రథస్థునన్
బారగ జూచి నీ రిపులు పక్కున నవ్వి యనీదరింతురా,
శూరకలంబు మెచ్చ రిపుసూదనతాభరమూను నీకు నే
సారధినై, యికన్ విజయసారధి నామమున జరించెదన్.
సారధి యంట; వేదముల సారము శౌరి, తదంఘ్రి భక్తిచే-
న్నారెడు క్రీడి రధికుడౌనట, చిందము విల్లు దేరునున్,
వారువమువ్ మొదల్ దివిజవర్గ మొసంగినవంట; యస్త్రవి-
స్తార గురుల్ శివాదులట, సంగరమందెవడాగ జాలుడిన్.
——————————————-
సంధి కొరకు శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమాయెను. గురువృద్ధులు ద్రోణ, కృపాచార్యులు- కురువృద్ధులు భీష్మ, బాహ్లిక, సోమదత్తాదులు. ఎంత చెప్పినా, దుర్యోధనుని మూర్ఖపు పట్టుదలతో సంధి విఫలమాయెను. ధృతరాష్ట్రుడు ఉదాహరణలతో కొడుకును ఒప్పింపదలచెను. తండ్రి మాట వినలేదు. తల్లి గాంధారి మాటను కూడా పెడచెవిన పెట్టెను.
నిపుణుడైన దౌత్యవేత్తగా పాండవులతో స్నేహప్రయోజనములను వివరించి సంధికి ఒత్తిడి
తెచ్చెను. ఆ ప్రయత్నము విఫలమవ్వగా అనేక వివిధ రకాలుగా ఒప్పించదలచెను. ఆఖరికి ఐదు ఊళ్ళను ఇమ్మని అడిగెను. దానికి కూడా దుర్యోధనుడు ససేమిరా అనెను. పాండవ వీరుల బలపరాక్రమములు ఎరిగించెను. ఘోషయాత్ర, ఉత్తరగోగ్రహణంలో జరిగిన పరాభవాలను జ్ఞాపకం చేసి భయపెట్టెను. మూర్ఖపు పట్టుదలతో సంధికంగీకరింపక సమరమునకే
సంసిద్ధమయ్యెను.
ఈ విధముగా శ్రీకృష్ణుని రాయభారము విఫలమయ్యెను.
———————-సమాప్తం———————-+++———————————————————-
ఈ మహాభారత ఘట్టం మీకు నచ్చితే షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
=========================================
సమాప్తం
===========================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కొన్ని ఇతర రచనలు:
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments