కీచకులు

Keechakulu - Telugu Moral Story| Nandyala Vijaya Lakshmi
Published in manatelugukathalu.com on 03/05/2026
కీచకులు - తెలుగు నీతి కథ | నంద్యాల విజయలక్ష్మి
గోపీకృష్ణ పేరుకు తగ్గట్టు, విలాస పురుషుడు.
"కృష్ణుడే మాకు ఆదర్శం" అని అహంకారంగా మాట్లాడుతూ, అవకాశము చూసుకుని అమ్మాయిలను నయానా భయానాఏదో రకంగా ప్రలోభపెట్టి తన సరదా తీర్చుకోవడం అలవాటుగా మారింది. దానికి తోడు తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోవడం, వారు పల్లెటూరికే పరిమితమై పట్టించుకోకపోవడం, కొడుకు ఏది చెప్పినా నమ్మి అతడు అడిగితే డబ్బు పంపడం —
దీనితో గోపీకృష్ణ ఆడిందే ఆటగా విలాస జీవితము గడపటానికి అలవాటు పడిపోయాడు. కాలేజీలో చేరడానికి కొత్త పిల్లలు రావడంతో అతడికి హుషారు పెరిగింది.
ఉన్నవారిలో ఒక అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్లి, "హాయ్" అన్నాడు.
ఆ అమ్మాయి ఒక్క చూపు చూసింది;"పోరా" అన్న ఛీత్కారం కనిపించింది ఆ చూపులో.
ఇది కొంచెం తేడా అనుకుని ముందుకు వెళ్లాడు.
ఆ అమ్మాయి పేరు అచల. మొదటినుండీ కొంచెం ధైర్యం కల పిల్ల.
ఈ మధ్య అబ్బాయిలు చేస్తున్న మోసాలు అన్నీ వినడం, పేపర్లలో వార్తలు చూసి తను జాగ్రత్తగా ఉండాలని అనుకుంది. వారం రోజులు గడిచాయి. విసుగు చెందని విక్రమార్కుడిలా రోజూ ఏదో విధంగా అచలను కవ్విస్తున్నాడు.
అచల ఈ ప్రవర్తనతో విసిగిపోయింది. ఎవరికి చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండదు; పైగా అందరికీ తెలిసి లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. తన సమస్యను తనే పరిష్కరించు కోవడానికి, గోపీకృష్ణలాంటి వారికి గుణపాఠం చెప్పాలని అనుకుంది.
రోజూలాగానే గోపీకృష్ణ, "హాయ్, సినిమాకు వెళదామా?" అని కొంటెగా అడిగాడు.
"సరే" అంటూనే తన స్నేహితులందరినీ, "రండి! గోపీకృష్ణ మన అందరినీ సినిమాకు తీసుకెళ్తా అంటున్నారు, పదండి" అంది అచల.
గోపీకృష్ణ కొంచెం కంగారుపడ్డా, "పోనీ పిట్ట దారిలోకి వస్తోంది"అనుకుని "పదండి" అన్నాడు గత్యంతరము లేక.
ఇలా షాపింగ్‌కి, పార్కులకు కొన్ని రోజులు గడిచాక, గోపీకృష్ణ అచలను ఎలాగైనా తన దారిలోకి తీసుకుని రావడానికి నాందిగా, ఆ రోజు అచలను తన ఇంటికి రమ్మని, తన తల్లిదండ్రులకు పరిచయం చేద్దామనుకుంటున్నానని చెప్పాడు.
అచల సరేనని వెళ్లింది.
గోపీకృష్ణ ఆనందంతో ఏవేవో ఊహించుకున్నాడు. ఈ మధ్యకాలంలో అచల అతని గురించి తెలుసుకుంది. అంతకుముందు గోపీకృష్ణ అన్యాయం చేసి బెదిరించిన అమ్మాయిలను కలుసుకుంది. ఆ వీడియోలను చూసింది.
ఆ సాయంత్రము ఏమి చేయాలో ఇద్దరు అమ్మాయిలకు చెప్పింది. గోపీ చెప్పిన ఇంటికి ముందుగా వాళ్లను వెళ్లమంది. తను కూడా ఆ ఇంటికి వెనకాలే వెళ్లింది. చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సిద్ధం చేసుకుంది.
గోపీకృష్ణ, అచల కన్నా ముందు వచ్చిన అమ్మాయిలను చూసి, "మీరు ఎందుకు వచ్చారు?" అన్నాడు కంగారుపడుతూ.
"ఏమీ లేదు, నీ మీద మనసైంది అంతే" అంటూ గోపీకృష్ణ చెయ్యి పట్టుకుని తమ మీద పడుతున్నట్లుగా లాగారు. రెండు మూడు వీడియోలు పక్కనుండీ అచల తీసింది.
వెంటనే ఎదురుగా వచ్చిన ఆటో ఎక్కి తన రూమ్‌కి వెళ్లిపోయింది.
గోపీకృష్ణను డబ్బులు కావాలని అమ్మాయిలు గొడవ చేశారు.
వారిని ఎలాగో తప్పించుకుని, అచలకు ఫోన్ చేశాడు. "డార్లింగ్! నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశానో?" అన్నాడు.
అచల, "సారీ! మా అమ్మానాన్న ఊరినుండి వచ్చారు, ఎలా రాను?" అంది అమాయకత్వం నటిస్తూ.
మరునాడు గోపీకృష్ణకు ఒక కొత్త నంబరు నుండి ఫోన్ వచ్చింది.
"హలో" అన్నాడు.
"నీ రాసలీలల గురించి ఇప్పుడే తెలిసింది. నేను తలచుకుంటే నిన్ను ఇప్పుడే జైలులో కూచోపెట్టగలను"అన్నాడు ఆ వ్యక్తి.
గోపీకృష్ణ క్షణం కంగారు పడ్డాడు.
"నేను శ్రీరామచంద్రుడిలాంటివాడిని. ఎవరో కిట్టని వాళ్లు పుకారు పుట్టించారు సార్, కావాలంటే సాక్షాలు చూపించి మాట్లాడండి" అని బుకాయించాడు.
కొంచెం సేపు అయ్యాక, రెండు ఫొటోలు, వీడియోలు ఇంకో ఫోన్ నుండి వచ్చాయి.
అందులో గోపీకృష్ణ అమ్మాయిలతో అసభ్యకరంగా ఉన్నవి,అమ్మాయిల మొహాలు కవర్ చేసి ఉన్నాయి.
ఒక మెసేజ్ కూడా: "ఇక నీ ఆటలు సాగవు. అమ్మాయిలంటే అంగట్లో దొరికే సొమ్ములు కాదని తెలుసుకో. విలువలు, సంస్కారం అలవరచుకో. లేకపోతే ఇదే నీకు మొదటి, చివరి వార్నింగ్" అని ఉంది.
ఇది చదివాక గోపీకృష్ణకు అర్థమైంది తనది ఎంత తప్పు ఆలోచనో! ఇకముందు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
ఈ మార్పు అచల వలన వచ్చిందనే విషయం రహస్యంగానే ఉంచుదామని అనుకున్నారు అచల, ఆమెకు సహకరించిన అమ్మాయిలు. అందుకే అప్పుడప్పుడు కీలెరిగి వాతపెట్టాలి; లేకపోతే సమాజంలో కీచకులు చెలరేగిపోతారు.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .





Comments