బుర్ఖా అమ్మాయి

Burkha Ammai - Telugu Social Story | Gousia Noor
బుర్ఖా అమ్మాయి - తెలుగు సామాజిక కథ | గౌసియా నూర్
Published in manatelugukathalu.com on 02/10/2026
కుటుంబంలో జరిగే చిన్న చిన్న గొడవలు కొన్నిసార్లు మనసులను ఎంతగా కలచివేస్తాయో తెలిపే భావోద్వేగ తెలుగు కథ బుర్ఖా అమ్మాయి. గౌసియా నూర్ రచించిన ఈ కథలో, ఇంటి కలహాలతో విసిగిపోయి ఆవేశంలో బయటకు వెళ్లిన ఒక యువతి ఎదుర్కొన్న అనుభవాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది. కుటుంబ విలువలు, జీవిత పాఠాలు నిండిన ఈ హృదయాన్ని తాకే కథను పూర్తిగా చదవండి.
ఎండాకాలం ఉదయం.
తెల్లవారుజామునే ఇంట్లో ఏదో శబ్దం వినిపించడంతో ఆ అమ్మాయి ఉలిక్కిపడి నిద్రలేచింది.
“అప్పుడే తెల్లారిపోయిందా?” అని అనుకుంటూ కాసేపు మంచం మీదే కూర్చుంది.
గత పదిహేను రోజులుగా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చిన్న విషయం పెద్దదవుతుంది. ఆ గొడవలు చూస్తూ చూస్తూ ఆమెకు ఇంట్లో ప్రశాంతత అనే మాటే మరిచిపోయినట్టుగా అనిపించింది.
ఆమె మెల్లగా కళ్లను మూసుకుని దేవుడిని ప్రార్థించింది.
“దేవుడా... ఈ రోజన్నా మా ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడవాలి” అని మనసులో కోరుకుని మెల్లగా కిందికి దిగింది.
కిందికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా, కొంచెం చిందరవందరగా కనిపించింది. వాళ్ల అమ్మ మాత్రం ఇంటి పనుల్లో బిజీగా ఉంది.
“అమ్మా... నాన్న ఎక్కడ?” అని ఆ అమ్మాయి అడిగింది.
“ఎక్కడో ఉంటాడు. వాష్‌రూమ్‌లో ఉన్నాడేమో... నువ్వు ముందు ఫ్రెష్ అయి రా” అంది వాళ్ల అమ్మ.
“సరే” అంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ అమ్మ దగ్గరికి వచ్చి, “అమ్మా... ఏం చేస్తున్నావు?” అని అడిగింది.
“పొంగల్ చేస్తున్నాను. అందరూ లేచారు కదా... టిఫిన్ చేసేద్దాం” అంది వాళ్ల అమ్మ.
ఇంట్లో అందరూ తమ తమ పనుల్లో పడిపోయారు.
అంతలో వాళ్ల అమ్మ ఒకసారి బయటికి చూసి, “నీ అన్నయ్య ఇంకా రాలేదు కదా?” అంది.
“హాఫ్ డ్యూటీ కదా... వస్తుంటాడు” అంది ఆ అమ్మాయి.
కొద్దిసేపటికి అన్నయ్య కూడా ఇంటికి వచ్చాడు.
అందరూ కలిసి టిఫిన్‌కి కూర్చున్నారు.
కానీ ఇంతలోనే వాళ్ల నాన్న, “ఇవన్నీ ఎవరు అడిగి చేస్తున్నారు? ఇంట్లో టిఫిన్ చేసేస్తే అయిపోయిందా? నేను అసలు ఈ టిఫిన్ తినను” అని కోపంగా అన్నాడు.
అంతే... మళ్లీ అమ్మానాన్నల మధ్య మాటలు మొదలయ్యాయి.
మొదట చిన్నగా మొదలైన మాటలు కాసేపటికే పెద్ద గొడవగా మారిపోయాయి.
ఆ అమ్మాయి మాత్రం మౌనంగా కూర్చుని వాళ్లిద్దరినీ చూస్తూ ఉంది.
ఇలాంటి గొడవలు ఆమెకు కొత్తేమీ కాదు.
ఎప్పుడో బంధువుల విషయం మీద గొడవ. ఎప్పుడో డబ్బు విషయం మీద గొడవ. మరికొన్ని సార్లు... వాళ్లిద్దరి మధ్య చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారేవి.
ఇలాంటి గొడవలు చూస్తూ చూస్తూ ఆ అమ్మాయికి ఇల్లంటేనే విసుగు వచ్చేసింది.
“నా జీవితం కూడా ఇలానే అయిపోతుందా?” అనే ఆలోచన ఒక్కసారిగా ఆమె మనసులోకి వచ్చింది.
గొడవ ఎంత పెద్దదైందో, చివరికి వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా తమ తమ పనుల్లోకి వెళ్లిపోయారు.
వాళ్ల నాన్న షాప్‌కి వెళ్లిపోయాడు. వాళ్ల అమ్మ ఇంటి పనుల్లో పడిపోయింది.
అందరూ తమ పనుల్లోకి వెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయి మాత్రం అక్కడే కాసేపు మౌనంగా కూర్చుంది.
ఇంట్లో ఉన్నా... తనకు ఊపిరి తీసుకోవడానికి కూడా చోటు లేనట్టుగా అనిపించింది.
చివరికి ఆమె అమ్మ దగ్గరకు వెళ్లింది.
“అమ్మా... నాకు ఇంట్లో ఉండి ఉండి కొంచెం విసుగ్గా ఉంది. నేను ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తాను.”
వాళ్ల అమ్మ కూడా పెద్దగా ఏమీ అనలేదు. “సరే... వెళ్లి రా. సాయంత్రానికి వచ్చేయ్” అంది.
ఆ మాట వినగానే ఆ అమ్మాయి బయటికి వచ్చింది.
ఇంటి గడప దాటి రోడ్డుపై అడుగుపెట్టింది.
ఇంట్లోని గొడవల శబ్దం క్రమంగా వెనక్కి వెళ్లిపోయింది.
ఆమెకు తెలియదు... ఆ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని బయటకు వేసిన ఆ చిన్న అడుగే, ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఒక కొత్త కథకు మొదటి అడుగు అని.
అమ్మకు తెలియకుండా తన దగ్గర ఉన్న కొంత డబ్బును, తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను మాత్రమే తీసుకుంది.
బుర్ఖా వేసుకుని ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టింది.
ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన.
“ఇక నేను ఒంటరిగా నా కోసం జీవించాలి. నాకు కావాల్సింది ప్రశాంతత. రోజూ ఇలాంటి కుటుంబాలను చూస్తుంటే పెళ్లి మీదే నమ్మకం పోతుంది. పెళ్లి అంటేనే నాకు విరక్తి వస్తోంది.
నా జీవితంలో పెళ్లి చేసుకోను. నాకంటూ నేను ఒక జీవితాన్ని ఏర్పరచుకుని జీవిస్తాను” అని కోపంతో, బాధతో అనుకుంటూ బస్‌స్టాండ్‌కి వెళ్లింది.
అక్కడ ఒక బస్సు ఎక్కి మరో ఊరికి వెళ్లింది. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కి చేరుకుంది.
రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆమె గుండెల్లో భయం పెరుగుతోంది.
“నేను ఇలా ఇంటి నుంచి వచ్చేశానని అమ్మానాన్నలకు తెలిస్తే ఎలా ఉంటుంది? అన్నయ్య ఎలా బాధపడతాడు? నేను ఇంత దూరం వెళ్లి ఒంటరిగా ఎలా బతకగలను?” అని ఎన్నో ప్రశ్నలు ఆమె మనసును వేధించాయి.
అయినా వెనక్కి తిరిగి వెళ్లడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు.
రైలు ఎక్కి జనరల్ బోగీలో కూర్చుంది.
బుర్ఖాలో ఒంటరిగా కూర్చున్న ఆమెను చుట్టూ ఉన్న కొంతమంది ప్రయాణికులు అనుమానంగా చూశారు.
ఆ చూపులు ఆమెకు మరింత భయాన్ని కలిగించాయి.
“నేను ఇలా వచ్చేసింది తప్పా?” అనే ఆలోచన కూడా ఒక్కసారి ఆమె మనసులోకి వచ్చింది.
కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని టీసీ దగ్గరకు వెళ్లింది.
“నాకు రిజర్వేషన్ బోగీలో సీటు కావాలి” అని అడిగింది.
అక్కడ సీటు దొరకడంతో ఆమె రిజర్వేషన్ బోగీలోకి వెళ్లి కూర్చుంది.
అక్కడి ప్రయాణికులు మాత్రం ఆమెతో మామూలుగానే మాట్లాడారు. ఆమెను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు.
కొంతసేపటికి ఒక ఆవిడ ఆమెను పలకరించింది. “ఎక్కడికి వెళ్తున్నావమ్మా?” అని అడిగింది.
ఆమె చిన్నగా నవ్వి ఏదో సమాధానం చెప్పింది. కానీ మనసులో మాత్రం అమ్మే గుర్తుకొచ్చింది.
“ఇప్పుడు అమ్మ ఎలా ఉందో? నాన్న ఏం చేస్తున్నాడో? నేను ఇంటి నుంచి వచ్చేశానని తెలిసిందా?” అని ఆలోచిస్తూ ఉంది.
తనతో స్నేహంగా మాట్లాడుతున్న వాళ్లకు నిజం చెప్పాలని ఆమెకు చాలాసార్లు అనిపించింది.
“నేను ఇంటి నుంచి ఇలా వచ్చేశాను... ఎక్కడైనా పని చూసుకుని, నాకంటూ నేను బతకాలనుకుంటున్నాను...” అని చెప్పాలని అనిపించినా, ఆ మాటలు ఆమె నోటికి రాలేదు.
అంతలో ఆమెతో మాట్లాడిన ఒక వ్యక్తి, “ఏదైనా సమస్య ఉంటే ఈ నంబర్‌కి ఫోన్ చేయమ్మా” అని ఒక ఫోన్ నంబర్ రాసిచ్చాడు.
ఆమె ఆ నంబర్‌ను జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకుంది.
రైలు తన ప్రయాణాన్ని కొనసాగించింది.
ఉదయం పదకొండు గంటలకు ఎక్కిన ఆ రైలు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒక పెద్ద నగరానికి చేరుకుంది.
ఆమె రైలు దిగింది. చుట్టూ చూసింది.
అంత పెద్ద నగరం. తనకు ఎవరూ తెలియరు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఎలా బతకాలో తెలియదు.
ఒక్కసారిగా ఆమెకు చాలా భయమేసింది.
చివరికి రైల్వే స్టేషన్‌లోని మహిళల వెయిటింగ్ హాల్‌లోకి వెళ్లి కూర్చుంది.
“తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను. ఉదయం ఏదైనా పని చూసుకుంటాను” అని అనుకుంది.
అలా ఆ రాత్రంతా అక్కడే గడిపింది.
తెల్లవారిన తర్వాత బయటికి వచ్చింది.
కొన్ని చోట్ల మహిళల హాస్టళ్ల గురించి అడిగింది. కానీ అక్కడ వాళ్లు, “నీ అమ్మానాన్నల ఆధార్ కార్డులు తీసుకురా. వాళ్లు కూడా నీతో వస్తేనే నిన్ను ఇక్కడ ఉంచగలం” అని చెప్పారు.
ఆ మాట విన్నాక ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.
తన దగ్గర ఉన్న డబ్బు చూసుకుంది.
“ఏదైనా చిన్న పని దొరికితే బాగుండేది...” అని అనుకుంది.
కానీ ఆ ఆలోచన వచ్చిన వెంటనే మళ్లీ అమ్మానాన్నలు గుర్తొచ్చారు.
వాళ్లు తనతో ఎంత గొడవపడినా, తనను మాత్రం ఎప్పుడూ ప్రేమగానే పెంచారు.
తండ్రి గారాబంగా చూసుకున్నాడు. తల్లి ప్రేమగా చూసుకుంది.
“ఇప్పుడు నేను ఇలా వెళ్లిపోయానని వాళ్లు ఎంత బాధపడుతున్నారో?” అనే ఆలోచన ఆమెను లోపల నుంచి కలిచివేసింది.
చివరికి ఆమె తన అక్కకు ఫోన్ చేసింది.
అవతల నుంచి అక్క గొంతు వినగానే ఆమెకు కన్నీళ్లు వచ్చాయి.
“నేను ఇంట్లో రోజూ జరుగుతున్న గొడవలు తట్టుకోలేక ఇలా వచ్చేశాను. నాకంటూ నేను జీవించాలనిపించింది. అందుకే ఇంటి నుంచి వచ్చేశాను” అని చెప్పింది.
అక్క కొంతసేపు మౌనంగా విని, “నువ్వు ఏం చేసినా ఒక్కసారి ఆలోచించాలి కదా! ఇంట్లో గొడవలు ఉన్నాయని ఇలా ఒంటరిగా వచ్చేస్తే ఎలా బతుకుతావు?” అని అడిగింది.
ఆ మాటలు ఆమె మనసులో గట్టిగా తగిలాయి.
“నిజమే... ఒంటరిగా జీవించడం అంత సులభం కాదు. నేను నా ప్రశాంతత కోసం వచ్చాను. కానీ నా వల్ల అమ్మానాన్నలు ఎంత బాధపడుతున్నారు?” అని ఆమె తనలో తాను ఆలోచించింది.
“నేను వెళ్లిపోవడం సరైన నిర్ణయం తీసుకున్నానా? తొందరపడి వచ్చేశానా?” అనే సందేహం మొదలైంది.
అంతలో ఆమె అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్ తీసుకోగానే అన్నయ్య గొంతు వినిపించింది.
“నాన్నకి అసలు బాగోలేదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే... తిరిగి ఇంటికి వచ్చేయ్.”
అతని మాటల్లో కోపం లేదు. ఆమెను తిట్టే మాట లేదు. ఉన్నదంతా ప్రేమ మాత్రమే.
ఆ మాటలు విన్న వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నేను నా కోసం జీవించాలనుకున్నాను... కానీ నా కోసం వాళ్లను ఇంత బాధపెట్టడం సరైనదేనా?” అని అనుకుంది.
చివరికి ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది.
మళ్లీ అదే రైలులో తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది.
రాత్రంతా ప్రయాణించి మరుసటి రోజు తన ఊరికి చేరుకుంది.
రైలు దిగగానే ఆమె గుండెల్లో మళ్లీ భయం మొదలైంది.
“అన్నయ్య నన్ను కొడతాడా? అమ్మానాన్నలు ఏమంటారు? నేను ఇలా ఎందుకు చేశావని అడుగుతారా?” అని భయపడింది.
తన తప్పు తనకే అర్థమైంది.
“నా కోపంలో నేను ఈ పని చేశాను. నా వల్ల అమ్మానాన్నలు ఎంత బాధపడి ఉంటారో... బంధువులు ఏమేమో అనుకుని ఉంటారో...” అని అనుకుంటూ మౌనంగా నిలబడింది.
కొద్దిసేపటికి ఆమె అన్నయ్య కనిపించాడు.
ఆమెను చూడగానే అతను ఒక్క క్షణం కూడా కోపం చూపించలేదు.
అతని కళ్లలో కనిపించింది ఒక్కటే... ప్రేమ.
అన్నయ్య ఆమె దగ్గరకు వచ్చి ఏమీ అనకుండా, ప్రేమగా ఆమెను తనతో తీసుకెళ్లాడు. బైక్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని ఇంటి వైపు బయలుదేరారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత అన్నయ్య మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“చూశావా... ఇంత ఎండాకాలంలో కూడా ఈరోజు వర్షం పడుతోంది. వాతావరణం కూడా కొంచెం చల్లబడింది కదా” అని మామూలుగానే మాట్లాడాడు.
అన్నయ్య తనతో ఏమీ అనకుండా ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుండటంతో ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
“నేను ఇలా ఇంటి నుంచి వెళ్లిపోయినా అన్నయ్య నన్ను ఏమీ అనడం లేదు...” అని ఆమె మనసులో అనుకుంది.
కానీ ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ ఆమె గుండెల్లో భయం మాత్రం పెరుగుతూనే ఉంది.
“నాన్న నన్ను చూసి ఎలా స్పందిస్తాడు? అమ్మ ఏమంటుంది? నేను చేసిన పని గురించి అందరూ ఏమనుకుంటారు? బంధువులు ఏమనుకుంటారు? పక్కింటివాళ్లు ఏమనుకుంటారు?” అని ఎన్నో ఆలోచనలు ఆమెను వెంటాడాయి.
ఒకరోజంతా ఇంట్లో లేకుండా, రాత్రి బయట గడిపి తిరిగి వస్తున్నానని తెలిసి అందరూ తన గురించి తప్పుగా అనుకుంటారేమోనని బాధపడింది.
“నేను ఎంత పెద్ద తప్పు చేశాను?” అని తనలో తాను అనుకుంటూ ఇంటికి చేరుకుంది.
ఇంటికి వెళ్లగానే తండ్రి ఆమెను చూసి ఒక్కసారిగా తన దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.
ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.
“ఎందుకమ్మా... ఇంత పని ఎందుకు చేశావు? నువ్వు లేకుండా నేను ఉండగలనా? నువ్వు లేకుండా నేను జీవించగలనా?” అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.
“ఇంకెప్పుడూ ఇలా చేయకు అమ్మా...” అని చెబుతూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
ఆ తండ్రి ప్రేమను చూసిన ఆమెకు కూడా కన్నీళ్లు ఆగలేదు.
తర్వాత తల్లి ఆమె దగ్గరకు వచ్చింది.
ఆమె కోపంగా మాట్లాడలేదు, బాధగా మాత్రమే చెప్పింది.
“నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయావని నాకు బాధ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్లాలి అనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చు.
నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉంది. కానీ మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోవడం తప్పు కదమ్మా.
నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండి కూడా నీ మనసులో ఉన్న మాట ఒక్కటి కూడా నాకు చెప్పకుండా వెళ్లిపోయావంటే... అది నాకు చాలా బాధగా అనిపించింది.”
అమ్మ మాటలు వింటూ ఆ అమ్మాయి తల వంచుకుంది.
తన తల్లితో తనకు ఉన్న అనుబంధం ఆమెకు గుర్తొచ్చింది.
“ఇంత పెద్ద విషయం కూడా అమ్మతో ఒక్క మాట చెప్పకుండా వెళ్లిపోయానా?” అని తనలో తాను బాధపడింది.
నిజానికి అమ్మానాన్న ఇద్దరూ ఒకరితో ఒకరు తరచూ గొడవపడేవారు. కానీ పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవారు. వాళ్లను ప్రేమగా పెంచారు.
ముఖ్యంగా తమ కూతురిని ఎంతో గారాబంగా చూసుకున్నారు.
అది అర్థం చేసుకున్న కొద్దీ ఆమెకు తన తప్పు మరింత పెద్దదిగా అనిపించింది.
“నా కోపంలో నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల అమ్మానాన్న ఎంత బాధపడ్డారు! బంధువుల ముందు వాళ్లు ఎలా తలెత్తుకుని తిరుగుతారో? అందరూ నా గురించి ఏమనుకుంటారో?” అని ఆమె ఎంతో బాధపడింది.
కానీ అమ్మ మాత్రం ఆమెను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది.
“మాకు బంధువులు ఏమనుకుంటారు, పక్కవాళ్లు ఏమనుకుంటారు అన్నది అవసరం లేదు అమ్మా. నువ్వు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చావు, అంతే మాకు ముఖ్యం.
నువ్వు మా మీద నమ్మకం పెట్టుకుని తిరిగి వచ్చావు. మాకు కూడా నీ మీద నమ్మకం ఉంది. ఎవరు ఏం అనుకున్నా మనం పట్టించుకోనవసరం లేదు” అని చెప్పింది.
కొద్దిసేపు ఆగి మళ్లీ అంది.
“ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయమ్మా. ఇప్పుడు నేను, మీ నాన్న ఇన్ని సంవత్సరాలుగా గొడవపడుతూనే ఉన్నాం. కానీ అందుకే మేమిద్దరం విడిపోయామా? లేదు కదా.
కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. మనం ఒకరినొకరం అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అంతే కానీ... కోపంలో అన్నీ తెంచుకుని వెళ్లిపోకూడదు. ఏదైనా సమస్య ఉంటే మన వాళ్లతో చెప్పుకోవాలి.
మనసులో పెట్టుకుని, ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.”
అమ్మ మాటలు వింటూ ఆ అమ్మాయి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ రోజు తన తల్లిదండ్రుల ప్రేమను కొత్తగా అర్థం చేసుకుంది.
తాను ప్రశాంతత కోసం ఇంటి నుంచి వెళ్లింది, కానీ తన ప్రశాంతత కోసం తనను ప్రేమించే వాళ్లకు ఎంత బాధ కలిగించిందో అర్థమైంది.
ఆమె చేసిన తప్పు ఆమెకు ఒక పెద్ద పాఠంగా మారింది.
ఆమె అదృష్టం కొద్దీ, దేవుడి దయవల్ల ఇంటి నుంచి వెళ్లి మళ్లీ క్షేమంగా తిరిగి వచ్చింది.
కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి అలా ఉండకపోవచ్చు.
కాబట్టి ఎవరైనా జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, కోపంలో ఒక్కసారిగా ఇంటి నుంచి వెళ్లిపోవడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగా మన వాళ్లతో చెప్పుకోవాలి. అవసరమైతే సహాయం అడగాలి.
ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన తప్పును... ఇంకెవరూ చేయకూడదు.
అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
ఇంట్లో మళ్లీ అంతా మామూలైపోయింది. అమ్మానాన్న కూడా మామూలుగానే ఉన్నారు. ఆ రోజు జరిగిన విషయం కూడా క్రమంగా అందరి జీవితాల్లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం తన రైలు ప్రయాణం అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది.
ఆ రైలులో తనతో ప్రయాణించిన వాళ్లు కూడా తనను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా?
“ఆ రోజు బుర్ఖా వేసుకుని ఒంటరిగా ప్రయాణించిన ఆ అమ్మాయి ఎలా ఉందో?” అని వాళ్లు కూడా ఎప్పుడైనా అనుకుంటారా? అని ఆలోచించేది.
వాళ్లకు తన పేరు కూడా తెలియదు.
“బహుశా వాళ్లు నన్ను నా పేరుతో కాదు... ‘ఆ బుర్ఖా అమ్మాయి’గానే గుర్తు పెట్టుకుంటారేమో!” అని అనుకుంది.
ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె పెదవులపై చిన్న నవ్వు వచ్చింది.
తన జీవితంలో ఒక్కరోజు మాత్రమే కలిసిన ఆ ప్రయాణికులకు తాను ఎవరో తెలియకపోయినా... వాళ్ల జ్ఞాపకాల్లో మాత్రం ఒక చిన్న పరిచయంగా మిగిలిపోయింది.
“బుర్ఖా అమ్మాయి.”
~ సమాప్తం ~
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
గౌసియా నూర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: గౌసియా నూర్
నా పేరు గౌసియా నూర్. నేను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాన్ని. చిన్నప్పటి నుంచి కథలు, కవితలు రాయాలనే ఆసక్తి ఉంది. నా చుట్టూ జరిగే సంఘటనలు, మనుషుల భావోద్వేగాలు నాకు కథలు రాయడానికి ప్రేరణ ఇస్తాయి. ప్రస్తుతం నా రచనల ద్వారా నా ఆలోచనలను, భావాలను పాఠకులతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. రచయితగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, మంచి కథలు మరియు కవితలు రాయాలన్నదే నా కోరిక.








Comments