స్టీరింగ్ పడితే సంస్కృతమే!

Steering Padithe Samskruthame! - Telugu Comedy Story | VVS Prasad
స్టీరింగ్ పడితే సంస్కృతమే! - తెలుగు హాస్య కథ | VVS ప్రసాద్
Published in manatelugukathalu.com on 20/11/2026
‘స్టీరింగ్ పడితే సంస్కృతమే!’ కథలో హైదరాబాద్ నగర ట్రాఫిక్ నేపథ్యంలో మోహనరావు అనే వ్యక్తి ఎదుర్కొనే విచిత్రమైన డ్రైవింగ్ అనుభవాలను హాస్యంగా చిత్రించారు.
హైదరాబాదులో కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్సు ఒక్కటే సరిపోదు. అపారమైన సహనం, అచంచలమైన మనోనిబ్బరం, ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చినా తట్టుకోగలిగే గుండెధైర్యం ఉండాలి.
వీటన్నింటికీ మించి, అవసరమైనప్పుడు ఆశువుగా పద్యాలు చెప్పగలిగినంత భాషా పాండిత్యం కూడా ఉండాలి.
అయితే ఆ పద్యాలు కాళిదాసువో, శ్రీనాథుడివో కావు. హిందీ, ఉర్దూ, తెలుగు భాషల కలయికతో ఏర్పడిన ఒక విశిష్టమైన సంస్కృతం.
అందులో ‘మ’కారాలు, ‘బ’కారాలు, ‘ఛ’కారాలు యథేచ్ఛగా దొర్లుతుంటాయి. ఈ భాషకు ప్రత్యేకంగా వ్యాకరణం ఉండదు. నిఘంటువు అసలే ఉండదు.
సందర్భానుసారంగా కొత్త పదాలు పుట్టుకొస్తుంటాయి.
ఒక్కోసారి ఏ భాషలో మొదలుపెట్టామో, ఏ భాషలో ముగించామో కూడా తెలియదు.
ఈ భాషలో అసాధారణమైన ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి మోహనరావు.
మోహనరావు సరదాగా మాట్లాడే మనిషి. ఎదుటివాళ్లతో స్నేహంగా మెలుగుతాడు.
చిన్నచిన్న విషయాలకు గొడవపడే స్వభావం కాదు. అయితే అతని వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన మినహాయింపు ఉంది. అది కారు స్టీరింగ్ పట్టుకున్నప్పుడు మాత్రమే బయటపడుతుంది.
ఇంట్లో ఎంతో ప్రశాంతంగా కనిపించే మోహనరావు, రోడ్డెక్కగానే ఒక్కసారిగా మారిపోతాడు. అతని సహనం క్రమంగా ఆవిరైపోతుంది.
భాషలో కొత్తకొత్త విశేషణాలు చేరిపోతుంటాయి. ఒక్కోసారి తన నోటి నుంచి వచ్చిన పదాలను తలచుకుని తనే ఆశ్చర్యపోతుంటాడు.
నిజానికి ఆ పాండిత్యానికి బీజాలు పడింది అతని బాల్యంలోనే.
మోహనరావు పుట్టి పెరిగింది నల్లకుంటలో. ఆరో తరగతి వరకు అక్కడే చదివాడు.
చుట్టుపక్కల స్నేహితుల సాంగత్యంలో మూడో తరగతికే సంస్కృతంలో మంచి పట్టు సాధించాడు.
ఆటల్లో ఓడిపోయినా, ఎవరైనా తోసినా, తన బొమ్మలు తీసుకున్నా అతని నోటి నుంచి వెలువడే మొదటి పదం సాధారణంగా ‘నీ...’ అనే మాతా సంబోధనతో మొదలయ్యేది.
అది అతని వాక్య నిర్మాణంలో విడదీయరాని భాగమైపోయింది.
వేసవి సెలవుల్లో బొంబాయిలోని పెద్దమ్మ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి కజిన్స్ అతన్ని చుట్టుముట్టేవారు.
‘ఒరేయ్ మోహన్! ఆ రోజు చెప్పిన తిట్టు మళ్లీ చెప్పరా!’ వాళ్ల కోరిక మేరకు మోహన్ తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడు. వారి నుంచి వచ్చే నవ్వులు, చప్పట్లు అతనికి మరింత ఉత్సాహాన్నిచ్చేవి.
అతని పాండిత్యాన్ని విని కడుపుబ్బా నవ్వుకుని మళ్లీ మళ్లీ మాట్లాడించేవారు ఆ కజిన్స్.
ఒకరోజు మూడో తరగతి చదువుతున్న మోహన్ మోచేతులు, మోకాళ్లు గీరుకుపోయి ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ‘ఏమైందిరా?’ అని తండ్రి అడిగాడు.
‘ఆ బాలబెమ్మంగాడు నూకిండు... మా.....గాడు’ అంటూ ఒక ‘మ’కార మచ్చుతునకతో పాటు మరికొన్ని విశేషణాలు చేర్చి సంఘటనను వివరించాడు.
గాయాలకన్నా ఆ వివరణే తండ్రిని ఎక్కువ కలవరపెట్టింది. ‘ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా?’
‘మా దోస్తుల దగ్గర.’
ఆ రాత్రి అతను భార్యతో తీవ్రంగా చర్చించాడు. ‘వీడిని ఇక్కడే ఉంచితే చదువు పూర్తయ్యేసరికి బూతుమార్తాండ బిరుదు సంపాదిస్తాడు.
ఇల్లు మార్చేద్దాం.’ కొద్దిరోజుల్లోనే కుటుంబం దిల్‌సుఖ్‌నగర్‌కు మకాం మార్చింది. కొత్త ఇల్లు, కొత్త బడి, కొత్త స్నేహితులు.
క్రమంగా మోహన్ భాష కూడా మారిపోయింది. అయితే చిన్నతనంలో ఒంటబట్టిన విద్య అంత తేలికగా వదిలిపోదు.
నల్లకుంటలో నేర్చుకున్న ఆ పదసంపద మెదడులో ఎక్కడో ఒక మూల భద్రంగా ఉండిపోయింది.
ఇన్నేళ్ల తర్వాత నగర ట్రాఫిక్ దాన్ని మళ్లీ బయటకు తీసుకొచ్చింది.
మోహనరావుకు నగరంలో కారు నడపడం అలవాటే అయినా ప్రతిసారీ ఒక అగ్నిపరీక్షలా ఫీలవుతుంటాడు. అందులో మొదటి పరీక్ష వెనక నుంచి వినిపించే హారన్.
ఒకరోజు సిగ్నల్ దగ్గర ఎర్రలైటు పడటంతో కారు ఆపాడు. ముందు వరుసగా వాహనాలు. కదలడానికి అంగుళం చోటు లేదు. వెనక నుంచి హారన్ మొదలైంది.
ఒకసారి. రెండుసార్లు. మూడుసార్లు. తర్వాత ఆగకుండా మోగుతూనే ఉంది. మోహనరావు రియర్‌వ్యూ మిర్రర్లో చూశాడు.
వెనక కారులో ఉన్న వ్యక్తి స్టీరింగ్ మీద వాలి మరీ హారన్ కొడుతున్నాడు. అతని ముఖంలో ప్రపంచంలోని సమస్త సమస్యలకూ మోహనరావే కారణమన్నంత అసహనం.
‘ఏం చేయమంటాడే వీడు? కారుకి రెక్కలు మొలిపించి ఎగరమంటాడా?’ అని గొణుక్కున్నాడు.
పక్కన కూర్చున్న భార్య సుజాత అతని ముఖం చూసి అప్రమత్తమైంది. ‘సిగ్నల్ పడుతుంది. నువ్వేం మాట్లాడకు.’
‘నేనేం మాట్లాడాను?’ ‘ఇంకా మాట్లాడలేదు. అందుకే చెబుతున్నాను.’
హారన్ మళ్లీ మోగింది.
‘వీడికి హారన్ తప్ప బ్రేక్ కూడా ఉందని తెలుసో లేదో!’
‘వదిలేయ్.’
‘వదిలేస్తాను. కానీ ఒక్కసారి దిగి వెళ్లి, ముందంత ట్రాఫిక్ ఆగిపోయినా హారన్ ఎందుకు కొడుతున్నావని వాడిని అడిగొస్తా.’
‘వాడితో వాదన పెట్టుకుని ఇక్కడే గొడవ మొదలుపెట్టకు. సిగ్నల్ పడగానే వెళ్లిపోదాం.’
మోహనరావు ఏదో అనబోయి ఆగిపోయాడు. సిగ్నల్ పచ్చగా మారింది.
వెనకవాడు మళ్లీ హారన్ కొట్టాడు. ‘అరే, పచ్చలైటు వెలిగిందని నాకు తెలుసురా! ముందున్న పది కార్లకూ తెలిసే ఉంటుంది. నువ్వొక్కడివే కనిపెట్టినట్టు ఎందుకంత సంబరం?’
సుజాత కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది.
ఆమెకు తెలుసు, ఇది కేవలం ప్రారంభ సంగీతం మాత్రమే!
మోహనరావుకు మరో రకం డ్రైవర్లంటే మరింత చిరాకు.
వాళ్లు రోడ్డుమీద వాహనాలు నడపరు. విహారయాత్ర చేస్తుంటారు. ఒకసారి అత్యవసరమైన పనిమీద వెళ్తున్న మోహనరావు ముందు ఓ కారు వచ్చి చేరింది.
దాని ముందు అర కిలోమీటరు రోడ్డు ఖాళీగా ఉంది. కానీ ఆ కారు వేగం మాత్రం గంటకు ఇరవై కిలోమీటర్లు దాటడం లేదు.
డ్రైవర్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో ఫోనులో ఏదో చూస్తున్నాడు. మోహనరావు హారన్ కొట్టాడు. స్పందన లేదు. మళ్లీ కొట్టాడు.
డ్రైవర్ తల కూడా తిప్పలేదు. ‘వీడికి ఈ లోకంతో సంబంధం తెగిపోయినట్టుంది.’ కొద్దిసేపటికి కుడివైపు ఖాళీ దొరకడంతో మోహనరావు ఓవర్టేక్ చేయబోయాడు.
సరిగ్గా అప్పుడే ముందున్న కారు వేగం పెరిగింది. మోహనరావు ఆశ్చర్యపోయాడు. ఇంతసేపూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా వెళ్తున్న వ్యక్తికి, తనను మరొకరు దాటిపోతున్నారనే విషయం మాత్రం అద్భుతంగా తెలిసిపోయింది!
‘ఇదేం రోగమే? ఇంతసేపూ నిద్రపోతున్నాడు. ఇప్పుడు పరువు పోయినట్టు స్పీడు పెంచుతున్నాడు?’
ఆ కారు మరింత వేగంగా దూసుకెళ్లింది.
మోహనరావు కూడా ఒక్క క్షణం వేగం పెంచాలనుకున్నాడు. కానీ వెంటనే తగ్గించాడు. ‘వెళ్లనివ్వు. వాడి పరువు వాడికి ముఖ్యం, మన బంపర్ మనకి ముఖ్యం.’
సుజాత నవ్వింది.
‘అమ్మయ్య, ఈసారి గొడవ పెట్టుకోకుండా వదిలేశావు.’
‘వాడితో పోటీ పడితే మనమూ వాడిలాగే తయారవుతాం. అందుకే వదిలేశాను.’
‘అయితే ఇక తిట్టడం కూడా మానేయొచ్చు కదా?’
‘అదేంటి? వాడు చేసిన పనికి కనీసం వాడిని తిట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా?’
సుజాత నవ్వాపుకుంది.
ఇంకోసారి రెండు మోటార్‌సైకిళ్లు పక్కపక్కనే వెళ్తున్నాయి. ఒకదానిమీద ఇద్దరు యువకులు.
మరోదానిమీద మరో ఇద్దరు. నలుగురూ ఏదో ముఖ్యమైన అంతర్జాతీయ సమస్య మీద చర్చిస్తున్నట్టు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్లకు రోడ్డు మొత్తం కావాలి.
వెనక వాహనాలు వస్తున్నాయన్న స్పృహ కూడా లేదు. మోహనరావు హారన్ కొట్టాడు. ఒక యువకుడు వెనక్కి తిరిగి చూశాడు. మళ్లీ తన మిత్రుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘వీళ్లకు ఇంట్లో మాట్లాడుకోవడానికి చోటు లేదా?’
కొద్దిసేపటికి ఒక బైకు కాస్త పక్కకు జరిగింది.
మోహనరావు కారు ముందుకు తీసుకెళ్లబోతుండగా రెండో బైకు మళ్లీ అడ్డంగా వచ్చింది. అతనిలోని నల్లకుంట మోహన్ ఒక్కసారిగా మేల్కొన్నాడు.
నోటిదాకా వచ్చిన ఓ పదాన్ని అతికష్టంమీద ఆపుకున్నాడు.
‘ఏమైంది?’ అడిగింది సుజాత.
‘ఏమీ లేదు. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యమొకటి గుర్తొచ్చింది.’
‘మనసులోనే చదువుకో.’
‘అదే చేస్తున్నాను. కానీ భావప్రకటనకు కొంచెం ఇబ్బందిగా ఉంది.’
సెల్‌ఫోన్ డ్రైవర్ల విషయంలో మాత్రం మోహనరావుకు హాస్యం కన్నా భయమే ఎక్కువ. ఒకసారి ముందున్న బైకు విచిత్రంగా అటూ ఇటూ ఊగుతోంది. దగ్గరకు వెళ్లి చూస్తే డ్రైవర్ మెడను ఒకవైపు వంచి, భుజానికీ చెవికీ మధ్య ఫోన్ ఇరికించుకుని మాట్లాడుతున్నాడు.
వెనక భార్య. ఆమె ఒడిలో చిన్నపిల్ల. ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో మధ్యమధ్యలో ఫోన్ సర్దుకుంటున్నాడు.
‘వీడికి ఫోన్ మాట్లాడకపోతే ప్రపంచం మునిగిపోతుందేమో! కానీ వీడు పడిపోతే ముగ్గురూ మునిగిపోతారన్న ఆలోచన లేదు.’ మోహనరావు కొంచెం దూరం పాటిస్తూ కారు నడిపాడు.
అంతలో బైకు అకస్మాత్తుగా కుడివైపుకు తిరిగింది. ఇండికేటర్ లేదు. వెనక్కి చూడటం లేదు. మోహనరావు సడన్ బ్రేక్ వేశాడు.
సుజాత ముందుకు తూలింది. మోహనరావు నోటి నుంచి కొన్ని సంస్కృత పదాలు అనర్గళంగా వెలువడ్డాయి.
‘ఇలాంటి వాళ్లను చూస్తే ఆ ఫోన్ బాగా కాల్చి చెవికి అంటించాలనిపిస్తుంది! బైకు మీద పెళ్లాం పిల్లలున్నారన్న ఇంగితజ్ఞానం కూడా లేదు. వీడి ప్రాణంతోపాటు వాళ్ల ప్రాణాలు, రోడ్డుమీద వెళ్లేవాళ్ల ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నాడు.’
సుజాత కాసేపు మౌనంగా ఉండిపోయింది.
‘కోపం రావడం సహజమే. కానీ నువ్వు కూడా ఆవేశంలో ఏదైనా చేస్తే?’
‘అదే నా బాధ, వీళ్ల నిర్లక్ష్యానికి మనం కూడా ప్రమాదంలో పడాలి. పైగా నోరు మూసుకుని ఊరుకోవాలి.’
నగర రోడ్లమీద బస్సు డ్రైవర్ల ప్రవర్తన మోహనరావుకు అంతుచిక్కని విషయం. అంత పెద్ద బస్సును దాని డ్రైవర్ ఒక చిన్న మోటార్సైకిల్లా భావిస్తాడేమోనని అతని అనుమానం.
ఒకరోజు ఇరుకైన రోడ్డుమీద వెళ్తుండగా ఎడమవైపు నుంచి ఓ బస్సు దూసుకొచ్చింది. ఆటో కూడా పట్టని సందులో బస్సు దూరుతుండటం చూసి మోహనరావుకు గుండె ఆగినంత పనైంది.
‘ఇంత చిన్న గ్యాప్‌లో బస్సు ఎలా దూరుస్తాడు వీడు?’
సుజాత కిటికీ వైపు చూసింది. ‘అయ్యో, మన కారుకి తగులుతుందేమో!’
'తగిలితే మన తప్పే అంటాడు. బస్సుకి దారి ఇవ్వకుండా రోడ్డుమీద కారు ఎందుకు పెట్టావని గొడవ పడతాడు.’
బస్సు అతని కారుకు అతి దగ్గరగా వచ్చి, ముందుకు వెళ్లి ఒక్కసారిగా కుడివైపుకు తిరిగింది.
మోహనరావు బ్రేక్ వేశాడు. ‘వీళ్లకి సైడ్ మిర్రర్లుంటాయా? లేక అవి బస్సుకి అలంకారాలా?’
కొద్దిదూరంలో బస్సు ఆగింది.
స్టాప్‌కు చేరుకోవడానికి డ్రైవర్ మూడు వరుసల ట్రాఫిక్‌ను అడ్డంగా దాటాడు. మోహనరావు నిట్టూర్చాడు.
‘బస్సులో కూర్చున్నవాళ్లు బాగానే ఉంటారు. దాని పక్కన వెళ్లే కార్లు, బైకుల వాళ్లకే అసలు ప్రాణసంకటం! బస్సు ఏ వైపు తిరుగుతుందో తెలియక గుండెలు అరచేతిలో పెట్టుకుని నడపాలి!’
నగరంలో ఇంకో విచిత్రమైన అలవాటు ఉంది. రోడ్డు మలుపుల దగ్గరే వాహనాలు పార్క్ చేయడం.
ముఖ్యంగా ఆటోవాళ్లకు మలుపు కనిపిస్తే చాలు, అక్కడే నిలబడాలనిపిస్తుందేమో! ఒకరోజు మోహనరావు ఓ సందులోంచి మెయిన్ రోడ్డులోకి తిరగబోతున్నాడు. సరిగ్గా మలుపు దగ్గరే ఓ ఆటో నిలబడి ఉంది.
ఆటో డ్రైవర్ సీట్లో కూర్చుని ఫోనులో మాట్లాడుతున్నాడు. మోహనరావు హారన్ కొట్టాడు. ఆటోవాడు వెనక్కి తిరిగి చూశాడు.
‘ఏం సార్?’
‘ఆటో కొంచెం ముందుకు తీస్తావా? మలుపు తిరగడానికి చోటు లేదు.’
‘జాగా ఉంది కదా సార్, పోనీయండి.’
‘ఉంది. కానీ కారు నేరుగా వెళ్లడానికి కాదు, మలుపు తిరగడానికి.’
‘అయితే కొంచెం వెనక్కి తీసుకుని తిప్పండి.’
మోహనరావు నోరు తెరిచాడు. ‘అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆటో ఆపుతావు.
మేమంతా నీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట!’
ఆటోవాడు ఏమాత్రం స్పందించకుండా ఫోనులో మాట్లాడటం కొనసాగించాడు. మోహనరావు అతికష్టంమీద కారు తిప్పాడు. ‘వీళ్లకు రోడ్డుమీద మలుపు అంటే పార్కింగ్ ప్లేస్ అనుకుంటా.’
అంతకన్నా దారుణమైన అనుభవం ఓ అపార్ట్మెంట్ దగ్గర ఎదురైంది. ఒకసారి మోహనరావు తన స్నేహితుడిని కలవడానికి ఓ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాడు.
తిరిగి వస్తున్నప్పుడు మెయిన్ గేటుకి ఇరువైపులా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. గేటు దాటి ఎడమ వైపుకు తిరగాలి.
కానీ గేటుకు ఆనుకుని ఎడమవైపున నిలిపిన కారు వల్ల మలుపు తీసుకోవడానికి అవసరమైన స్థలం లేదు. దాంతో మోహనరావు తన కారును ముందుగా రోడ్డులోకి నేరుగా తీసుకురావాల్సి వచ్చింది.
ఆ తర్వాత కూడా ఎడమవైపుకు తిప్పబోతే, కారుకు సరిపడా మలుపు రాలేదు. మరోసారి కారును రివర్స్ చేసుకుని కుడివైపుకి ముందుకు జరిపి, అప్పుడు స్టీరింగ్ పూర్తిగా ఎడమవైపుకు తిప్పాల్సి వచ్చింది.
ఈలోగా రోడ్డుమీద అటూ ఇటూ వస్తున్న వాహనాలు ఆగిపోయాయి. వెనక నుంచి హారన్లు మొదలయ్యాయి.
ఒక బైకువాడు చిరాగ్గా అరిచాడు. ‘ఏం సార్? రోడ్డుకి అడ్డంగా కారు పెట్టేశారు?’
మోహనరావుకు చిర్రెత్తుకొచ్చింది. ‘నేనేమైనా సరదాగా అడ్డంగా పెట్టానా? గేటు పక్కనే కార్లు పార్క్ చేస్తే మలుపు ఎలా తిరగాలి?’
బైకువాడు ఏదో గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.
అక్కడే నిలబడ్డ సెక్యూరిటీ గార్డును మోహనరావు పిలిచాడు. ‘ఏమయ్యా? గేటుకి పక్కనే కార్లు పార్క్ చేయనిస్తే లోపల నుంచి వచ్చేవాళ్లు ఎలా తిరగాలి?’
‘ఏం చేస్తాం సార్! చెప్పినా వినడం లేదు.’
‘మరి గేటు దగ్గర “నో పార్కింగ్” బోర్డు పెట్టి, అక్కడ వాహనాలు నిలపకుండా చూడొచ్చు కదా! ఎవడో ఇక్కడ కారు పార్క్ చేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బయటకు వచ్చే ప్రతివాడూ రోడ్డుమీద అడ్డంగా తిరగాలి. మిగతావాళ్లతో తిట్లు తినాలి.’
గార్డు ఇబ్బందిగా నవ్వాడు. ‘అదే సార్, అందరూ తొందరలో ఉంటారు.’
‘తొందరలో ఉన్నవాళ్లు కార్లు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తారు. వాళ్ల వల్ల ఇబ్బంది పడేవాళ్లు మాత్రం ఓపిగ్గా ఉండాలన్నమాట!’ మోహనరావు కారు ముందుకు తీసుకెళ్లాడు.
తమకు రెండు నిమిషాలు నడిచే శ్రమ తప్పించుకోవడానికి, ఇతరులకు పది నిమిషాల ఇబ్బంది కలిగించడంలో మనుషులకు ఏమాత్రం సంకోచం ఎందుకు ఉండదో అతనికి అర్థం కాలేదు.
రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర మాత్రం మోహనరావుకు మనుషుల మనస్తత్వం మీద పరిశోధన చేయాలనిపించేది. గేటు పడింది.
వాహనాలన్నీ ఒకదాని వెనక ఒకటి ఆగాయి. అంతలో వెనక నుంచి ఓ కారు కుడివైపునకు వెళ్లి అందరినీ దాటుకుంటూ గేటు ముందుకు చేరుకుంది.
దాని వెనక మరో కారు. తర్వాత రెండు బైకులు, ఇంకో నాలుగు ఆటోలు. కొద్దిసేపటికి రోడ్డుకి రెండు వైపులా వాహనాలు కిక్కిరిసిపోయాయి. అవతలివైపు కూడా ఇదే పరిస్థితి.
గేటు తెరుచుకుంది. ఎవరూ కదల్లేదు. ఎదురెదురుగా నిలబడ్డ వాహనాల మధ్య అంగుళం ఖాళీ లేదు. మొదట హారన్లు మోగాయి. తర్వాత కిటికీలు తెరుచుకున్నాయి. చివరికి డ్రైవర్లు దిగారు.
‘ఏం డ్రైవింగ్ రా ఇది? రాంగ్ సైడ్ వచ్చి అడ్డంగా నిలబడ్డావు’ అని ఒకడు అరిచాడు.
‘నువ్వు మాత్రం ఏం చేశావు? రోడ్డు మొత్తం ఆక్రమించేశావు’ అని రెండోవాడు ఎదురు తిరిగాడు.
‘ముందు నీ బండి వెనక్కి తీయ్.’
‘నువ్వే తీయ్.’
అంతలో మూడోవాడు వచ్చి ఇద్దరినీ తిట్టడం మొదలుపెట్టాడు.
అతను కూడా రాంగ్ సైడ్‌లోనే నిలబడి ఉన్నాడు! మోహనరావుకు నవ్వొచ్చింది. ‘ఇక్కడ అందరూ తప్పు చేసినవాళ్లే. కానీ ఒక్కొక్కరూ మిగతావాళ్లకు ట్రాఫిక్ రూల్స్ నేర్పిస్తున్నారు.’ అరగంట తర్వాత కూడా ట్రాఫిక్ కదల్లేదు.
సుజాత విసుగ్గా అడిగింది. ‘ఎంతసేపు పడుతుంది?’
‘అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్లడానికి పెద్ద సమయం పట్టలేదు. బయటకు రావడమే సమస్య అయింది. మన పరిస్థితీ అంతే.’
‘అందరూ వరుసగా ఆగితే ఎంత బాగుంటుంది!’
‘అది అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కరికీ తన సమయం మాత్రమే విలువైనది.
మిగతావాళ్లంతా ఖాళీగా తిరుగుతున్నారనుకుంటారు.’
ఆ రోజు మోహనరావు ఇంటికి చేరేసరికి గంటన్నర ఆలస్యమైంది.
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రతి వ్యక్తీ మిగతావాళ్లను తిడుతున్నాడు. ఆ జామ్‌కు తానూ కారణమై ఉండవచ్చనే అనుమానం మాత్రం ఎవరికీ రావడం లేదు.
వారాంతపు సంతలంటే మోహనరావుకు మరో రకమైన భయం. అతని ఇంటికి దగ్గరలోని ఒక వీధిలో ప్రతి ఆదివారం కూరగాయల సంత జరుగుతుంది.
సంత కోసం కేటాయించిన స్థలం లోపల ఉన్నా, చాలామంది వ్యాపారులు రోడ్డుమీదకే వచ్చి దుకాణాలు పెడతారు. కూరగాయల బుట్టలు, తూకాలు, బేరసారాలు అన్నీ రోడ్డుమీదే. వాటికి తోడు కూరగాయలు కొనడానికి వచ్చేవాళ్లు.
ఒకరోజు మోహనరావు పొరపాటున కారుతో ఆ వీధిలోకి వెళ్లాడు. ముందు ఓ మోటార్‌సైకిల్ అడ్డంగా నిలబడి ఉంది. దానిమీద భర్త కూర్చున్నాడు.
ఇంజన్ నడుస్తోంది. భార్య పక్కనే కూరగాయలు కొంటోంది. ‘టమాటాలు ఎంత?’
‘నలభై రూపాయలు.’
‘ముప్పైకి ఇవ్వు.’
‘కుదరదమ్మా.’
‘సరే, ముప్పై ఐదు చేసుకో.’
బేరం సాగుతోంది. వెనక ట్రాఫిక్ నిలిచిపోయింది.
మోహనరావు చిన్నగా హారన్ కొట్టాడు. బైకుమీదున్న భర్త వెనక్కి తిరిగి చూశాడు. ‘ఏం సార్? కనిపించట్లేదా? కూరగాయలు కొంటున్నాం.’ ‘కనిపిస్తోంది.
కానీ మీ ఇంట్లో కూరగాయలు కొనడం పూర్తయ్యేవరకు ఈ రోడ్డుకి సెలవు ప్రకటించారా?’ అతను చిరాగ్గా ముఖం తిప్పుకున్నాడు. మోహనరావు కారు దిగబోయాడు.
సుజాత అతని చెయ్యి పట్టుకుంది. ‘వద్దు. ఇంకో ఐదు నిమిషాల్లో అయిపోతుంది.’ ‘ఐదు నిమిషాల్లో అయిపోతుందా? ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఉచితంగా ఇవ్వాలనే చర్చ మొదలవ్వలేదు!’ ఎలాగో బైకు పక్కకు జరిగింది.
కారు ముందుకు కదిలింది. అంతలో మరోవైపు నుంచి ఓ ఆటో వచ్చింది. ఇద్దరికీ దారి లేదు. మోహనరావు కారు వెనక్కి తీయాల్సి వచ్చింది.
వెనక కూరగాయల బుట్టలు. పక్కన బైకులు. కుడివైపు తోపుడుబండి. పది నిమిషాల పాటు అతను స్టీరింగ్‌ను అటూ ఇటూ తిప్పుతూ, అద్దాల్లోంచి చూస్తూ, అంగుళం అంగుళం కదిలాడు. చివరికి కారు బయటపడింది.
సుజాత ఊపిరి పీల్చుకుంది. ‘హమ్మయ్య! గీతలు పడలేదు.’ మోహనరావు కారు పక్కన ఆపి ఒకసారి పరిశీలించాడు. ‘ఈ రోజు మన జీవితంలో మర్చిపోలేని రోజు.’ ‘ఎందుకు?’ ‘కారుకి గీతలు పడకుండా సంతలోంచి బయటపడ్డాం.
ఇంతకన్నా గొప్ప సాధన ఏముంటుంది?’ ‘అయితే సంతోషించు.’ ‘సంతోషమే. కానీ ఇక్కడ సంత పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినవాళ్లు, ఆ సమయంలో ఈ వీధిలోకి వాహనాలు రాకుండా ఎందుకు చూడరో అర్థం కాదు.’
ఇలా ఎన్నో సంఘటనలతో మోహనరావు భాషా పాండిత్యం రోజురోజుకీ పదునెక్కుతోంది. అయితే ఆ పాండిత్యాన్ని బయటపెట్టకుండా నిగ్రహించుకోవాల్సిన సందర్భాలూ అప్పుడప్పుడు వస్తుంటాయి.
ఒకసారి అతని తోడల్లుడి కూతురు వాళ్లింటికి వచ్చింది. తిరిగి వెళ్లేటప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర దింపడానికి మోహనరావు కారులో బయలుదేరాడు.
సుజాత కూడా వచ్చింది. వెళ్లే ముందు సుజాత భర్తను పక్కకు పిలిచింది. ‘చూడు. అమ్మాయి ముందు నీ పాండిత్య ప్రకర్ష మొదలుపెట్టకు.’ ‘అంటే నేను ఎప్పుడూ తిడుతూనే ఉంటానా?’ ‘ఇంట్లో కాదు. కారు ఎక్కాక నీ నోటి మీద నీకే అదుపుండదు.
అందుకే ముందే చెబుతున్నాను!’ మోహనరావు మాటిచ్చాడు. ప్రయాణం మొదలైంది. మొదటి సిగ్నల్ దగ్గర ఓ ఆటో అడ్డంగా వచ్చింది. అతని నోటిదాకా ఒక పదం వచ్చి ఆగిపోయింది.
రెండో సిగ్నల్ దగ్గర ఓ బైకు అద్దాన్ని తాకినంత దగ్గరగా దూసుకెళ్లింది. మరో రెండు పదాలు గొంతులోనే నిలిచిపోయాయి. కొద్దిదూరంలో ఒక కారు ఇండికేటర్ వేయకుండా అకస్మాత్తుగా మలుపు తిరిగింది. మోహనరావు పళ్లు బిగించాడు.
సుజాత ఓరకంట చూసింది. ‘ఏమైంది?’ ‘ఏమీ లేదు.’ ‘ముఖం అలా పెట్టావేంటి?’ ‘లోపల చాలా పెద్ద యుద్ధం జరుగుతోంది!’ ‘ఏ యుద్ధం?’ ‘నోటిదాకా వస్తున్న మాటలకీ, వాటిని ఆపుతున్న నా సహనానికీ!’ సుజాత నవ్వాపుకుంది.
మెట్రో స్టేషన్ చేరేసరికి మోహనరావుకు చెమటలు పట్టాయి. అమ్మాయి దిగిపోయాక సుజాత సంతోషంగా అంది. ‘చూశావా, ఒక్క తిట్టు కూడా తిట్టకుండా ఎంత చక్కగా వచ్చామో!’ ‘నీకు చక్కగానే ఉంటుంది.
నా పరిస్థితి ఏమిటో నీకేం తెలుసు?’ ‘అంత కష్టమా?’ ‘నోటిదాకా వచ్చిన పద్యాలను లోపలే దిగమింగుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఇన్నాళ్లుగా సంపాదించిన పాండిత్యాన్ని ఒక్కసారిగా అణచిపెట్టుకోవాల్సి వచ్చింది!’ సుజాత నవ్వింది.
‘అసలు ఆ బూతులేంటి? మామూలుగా తిట్టొచ్చు కదా? మా బామ్మ తిట్టినట్టు “దొంగ సచ్చినోడా”, “దరిద్రపు వెధవా” అని తిట్టి ఊరుకోవచ్చు.’ మోహనరావు ఆమెవైపు విచిత్రంగా చూశాడు.
‘రోడ్డుమీద మనకు వచ్చే కోపానికి “దొంగ సచ్చినోడా” అంటే సరిపోతుందా? అవతలివాడికి మన ఆవేశం అర్థమవుతుందా? మన ఆత్మ శాంతిస్తుందా?’ ‘అయితే తిట్టగానే వాడు మారిపోతాడా?’ ‘మారకపోవచ్చు. కానీ మనకు కాస్త ఉపశమనం కలుగుతుంది, కనీసం నాకు అదో తృప్తి.’
కొన్నేళ్ల తర్వాత అదే తోడల్లుడి కూతురు వాళ్లు కొత్త కారు కొన్నారు. ఆమె భర్త శశాంక్ చాలా సౌమ్యుడు. మితభాషి. ఎవరితోనూ పెద్దగా వాదించడు.
కుటుంబ సభ్యులందరికీ అతనంటే మంచి అభిప్రాయం. కొత్త కారు కొన్న ఆనందంలో భార్యాభర్తలిద్దరూ మొదటి ప్రయాణానికి బయలుదేరారు.
ఇంటినుంచి మెయిన్ రోడ్డుకి చేరుకునేలోపే ఒక ఆటో అడ్డంగా వచ్చింది. శశాంక్ చిన్నగా ఏదో బూతు పదం గొణిగాడు. భార్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
అతని నోటి నుంచి అలాంటి మాట వినడం ఆమెకు అదే మొదటిసారి. కొద్దిదూరంలో ఓ బైకు రాంగ్ సైడ్ నుంచి దూసుకొచ్చింది. ఈసారి శశాంక్ గొంతు కాస్త పెరిగింది.
తర్వాత ముందున్న ఓ కారు అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. అంతే! అప్పటివరకు భార్యకు పరిచయం లేని శశాంక్లోని మరో వ్యక్తి బయటకొచ్చాడు.
అతని నోటి నుంచి హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లోని విశేషణాలు ఏకధాటిగా ప్రవహించడం మొదలైంది.
‘ఏంటండీ ఇవన్నీ?’ అని ఆమె ఆశ్చర్యపోయింది. ‘ఈ తిట్లేంటి? మీకు ఇన్ని బూతులు వచ్చని నాకు తెలియదే?’ ‘అంటే... ఈ ట్రాఫిక్‌లో...’ ‘ఇంతకాలం ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు కదా!’ ‘ఇంతకాలం కారు నడపలేదు కదా!’ ఆమెకు నవ్వాలో, కోప్పడాలో అర్థం కాలేదు.
కొద్దిరోజుల తర్వాత ఈ విషయం సుజాత ద్వారా మోహనరావుకు తెలిసింది. అతను పగలబడి నవ్వాడు. ‘చూశావా, నేనేదో ఊరికే తిడతానంటావు.
కారు స్టీరింగ్ పట్టుకుంటే ఎంత సౌమ్యుడైనా సంస్కృత పండితుడవుతాడు.’ సుజాత వెంటనే అంది. ‘అందరూ నీలాగే ఉంటారని మురిసిపోకు.’ ‘అందరూ కాకపోవచ్చు. కానీ మా పండిత పరిషత్తు సభ్యుల సంఖ్య పెరుగుతోందన్నమాట!’
ఒకరోజు మోహనరావు వియ్యంకులు ఇంటికి వచ్చారు. మాటల మధ్యలో నగర ట్రాఫిక్ ప్రస్తావన వచ్చింది. వియ్యపురాలు నిట్టూర్చింది.
‘ఈయనతో కార్లో కూర్చుని వెళ్లాలంటే భయమేస్తోందండీ.’ మోహనరావు ఆసక్తిగా ముందుకు వంగాడు. ‘ఎందుకండీ?’ ‘డ్రైవింగ్ చేస్తున్నంతసేపూ ఒకటే తిట్లు! ఎవరైనా అడ్డొస్తే తిట్లు. హారన్ కొడితే తిట్లు.
సైడ్ ఇవ్వకపోతే తిట్లు. అసలు ట్రాఫిక్‌లో ఈయన నోరు మూసుకునే సందర్భమే ఉండదు.’ మోహనరావు ముఖం వెలిగిపోయింది.
‘అవునా?’ ‘అవునండీ, ఆయనకు కోపమొస్తే నాకేంటి శిక్ష? పక్కన కూర్చుని ఆ తిట్లన్నీ వినలేక చచ్చిపోతున్నాను.’ మోహనరావు సుజాతవైపు చూశాడు.
ఆ చూపులో విజయగర్వం తొణికిసలాడుతోంది. ‘విన్నావా? నేనొక్కడినే కాదు!’ సుజాత తల పట్టుకుంది.
‘ఇంకొకరు దొరికారని ఇంత సంబరమా?’ ‘అది కాదు. ఇన్నాళ్లూ నా భాషా పాండిత్యాన్ని నువ్వు గుర్తించలేదు. ఇప్పుడు మన వియ్యంకుల రూపంలో మరో పండితుడు దొరికాడు.’
వియ్యంకుడు నవ్వుతూ అన్నాడు. ‘ఏం చేస్తాం బావగారూ, రోడ్డుమీద పరిస్థితులు అలా ఉంటున్నాయి.’ ‘అంతే, పరిస్థితులు మనల్ని అలా తయారు చేస్తున్నాయి.’
ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్ల భార్యలు మాత్రం ఆ నవ్వులో పాలుపంచుకోలేదు.
ఆ సాయంత్రం అతిథులు వెళ్లిపోయాక మోహనరావు కారులో బయటకు బయలుదేరాడు. ఇంటి దగ్గరే ఓ వ్యక్తి తన కారును రోడ్డుకి అడ్డంగా ఆపి ఫోనులో మాట్లాడుతున్నాడు.
మోహనరావు హారన్ కొట్టాడు. స్పందన లేదు. మళ్లీ కొట్టాడు. అవతలివాడు చేత్తో “ఒక్క నిమిషం” అన్నట్టు సైగ చేశాడు. మోహనరావు పళ్లు బిగించాడు. ఇంతలో వెనక నుంచి మరో కారు వచ్చి హారన్ కొట్టింది. మోహనరావుకు కోపం వచ్చింది.
‘ముందు వాడు కదలకుండా ఉంటే నేనేం చేయాలి? కారుని ఎత్తుకుని వెళ్లాలా?’ వెనకవాడు మళ్లీ హారన్ కొట్టాడు. మోహనరావు కిటికీ దించి వెనక్కి చూశాడు. ‘ఏంటయ్యా నీ తొందర?’ వెనకవాడు కూడా కిటికీ దించాడు.
‘ముందుకు పోవయ్యా.’ ‘ముందు కారు అడ్డంగా ఉందని కనిపించట్లేదా?’ ‘అయితే వాడిని కదలమను.’ ‘అదే చేస్తున్నాను కదా!’ ‘అయితే తొందరగా చెయ్యి.’ మోహనరావు నోటిదాకా నల్లకుంట సంస్కృతం వచ్చేసింది.
సరిగ్గా అప్పుడే ముందున్న కారు కదిలింది. మోహనరావు ముందుకు వెళ్లాడు. వెనకవాడు అతన్ని ఓవర్టేక్ చేసి, ఓ సీరియస్ చూపు విసిరి దూసుకెళ్లాడు.
మోహనరావు కూడా ఏదో అనబోయి ఆగిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక సుజాత అడిగింది. ‘ఏమిటి త్వరగా వచ్చేశావు?’ ‘ట్రాఫిక్ కాస్త తక్కువే ఉంది.’ ‘ఎవరినైనా తిట్టావా?’ ‘లేదు.’
‘అయితే ఈ రోజు చాలా మంచి రోజు! ట్రాఫిక్ లేదు, నువ్వు ఎవరినీ తిట్టలేదు.’ మోహనరావు కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు.
‘ఒక విషయం అర్థమైంది సుజాతా.’ ‘ఏమిటి?’ ‘మన ముందు వాడు నిదానంగా వెళ్తే మనకు కోపం. మన వెనకవాడు హారన్ కొడితే వాడిమీద కోపం.
మనం ఓవర్టేక్ చేస్తే తప్పులేదు. ఇంకొకడు మనల్ని ఓవర్టేక్ చేస్తే అహం దెబ్బతింటుంది.’ ‘అయితే?’ ‘రోడ్డుమీద ప్రతి ఒక్కడికీ మిగతావాళ్లందరికీ సరిగ్గా డ్రైవింగ్ చేయడం రాదనే నమ్మకం.
తనొక్కడికే వచ్చని విశ్వాసం!’ సుజాత ఆశ్చర్యంగా చూసింది.
‘అబ్బో! ఇంత గొప్ప విషయం ఇప్పుడు కనిపెట్టావా?’ ‘అవును.’ ‘మరి రేపటినుంచి తిట్టడం మానేస్తావా?’ మోహనరావు కొద్దిసేపు ఆలోచించాడు.
‘ప్రయత్నిస్తాను.’ ‘అంతేనా?’ ‘చూడు సుజాతా, నలభై ఏళ్లుగా సాధన చేసిన విద్యను ఒక్కరోజులో వదిలేయమంటే ఎలా?’ ‘అయితే?’ ‘ఇకనుంచి వీలైనంతవరకు మనసులోనే తిట్టుకుంటాను.’ సుజాత నవ్వింది. ‘అది కూడా మానేస్తే ఇంకా మంచిది.’
మోహనరావు తలూపాడు. మరుసటి ఉదయం కారు తీసుకుని బయటకు వచ్చాడు. మొదటి సిగ్నల్ దగ్గరే ఓ బైకు రాంగ్ సైడ్ నుంచి వచ్చి అడ్డంగా నిలబడింది.
మోహనరావు బ్రేక్ వేశాడు. నోరు తెరిచాడు. మళ్లీ మూసుకున్నాడు. ఒక్క క్షణం కళ్లు మూసుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు.
మనసులో మాత్రం నల్లకుంట పాఠశాల మళ్లీ తెరుచుకుంది.
అక్కడ మొదటి పాఠం అప్పటికే మొదలైపోయింది!
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
VVS ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: VVS ప్రసాద్
నేను కేంద్ర ప్రభుత్వం లో పని చేసి 2024 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న అభిరుచి తో రచనా వ్యాసంగం మొదలుపెట్టాను. నాకున్న ఇతర అభిరుచులు.. ఫోటోగ్రఫీ, మార్షల్ ఆర్ట్స్, సంగీతం.









Comments