top of page
Original.png

సార్వభౌముడి సింహాసనం

3 hours ago
3 min read

అహంకారంతో ఉన్న తెలుగు రచయిత ఎదుట వీల్‌చైర్‌లో ప్రశాంతంగా కూర్చున్న వృద్ధ సాహితీవేత్త, పక్కన ప్రచురణకర్త ఉన్న దృశ్యం

Saarvaboumudi Simhasanam - Telugu Moral story | Venkat Manthripragada

సార్వభౌముడి సింహాసనం - తెలుగు నీతి కథ | వెంకట్ మంత్రిప్రగడ

Published in manatelugukathalu.com on 20/11/2026


“సార్వభౌముడి సింహాసనం” అహంకారం, సాహిత్య గర్వం, వినయం గురించి ఆలోచింపజేసే హాస్య వ్యంగ్య తెలుగు కథ. రచయిత కంటే పాఠకుడే సాహిత్యానికి నిజమైన సార్వభౌముడని చాటిచెప్పే కథ ఇది


విశ్వవిఖ్యాత రచనా సార్వభౌముడు ఒకసారి పుస్తక ప్రచురణకర్త సమరాంగుడిని కలవడానికి వచ్చాడు.


లోపలికి అడుగుపెట్టగానే ఆయనకు వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక స్ఫురద్రూపి అయిన పెద్దాయన కనిపించాడు. 


ఆయన మొహంలో ఒకవిధమైన ఆత్మవిశ్వాసం, ఒకవిధమైన ప్రశాంతత సార్వభౌముడిని కొంచెం భయపెట్టినా, గర్వం అనే ఎత్తుమీద ఉన్న అతడు తన పద్ధతిలోనే ప్రవర్తించాడు. 


చెప్పులు కూడా తీయకుండా లోపలికి వచ్చి, ఎదురుగా ఉన్న పెద్దాయనను చూస్తూ,

"సమరాంగుడు ఎక్కడ?" అని అడిగాడు.


పెద్దాయన నవ్వుతూ, "స్నానం చేస్తున్నాడయ్యా! ఈ కుర్చీని కొంచెం లాక్కుని కూర్చో," అన్నాడు.


సార్వభౌముడికి ఒంట్లో చిన్నపాటి సాహిత్య భూకంపం వచ్చింది.


"మీరు సరిగ్గా వినలేదు. 


నేను సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన విశ్వవిఖ్యాత రచనా సార్వభౌముడిని!" అన్నాడు గొంతులో కాస్త గర్వం, ముఖంలో మరికాస్త గాంభీర్యం నింపుకుంటూ.


పెద్దాయన మళ్లీ నవ్వాడు.


"అలాగా! పెద్దతనం కదా, సరిగా వినిపించలేదు. సార్వభౌముడివంటున్నావు. నీ కాళ్లు కూడా నేలమీద లేవు. నీకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాలి. ఒక పని చెయ్యి, రెండు కుర్చీలు తీసుకుని కూర్చో."


"ఇంట్లో పనివాళ్లెవరూ లేరా? నేనే కుర్చీలు వేసుకోవాలా? నాలాంటి కళాకారుడికి ఇది అవమానం కాదా?" అన్నాడు కోపంగా.


"అయ్యో! క్షమించు. మాకు ఇంకా సాహిత్య అకాడమీ స్థాయి పనివాళ్లు దొరకలేదు," అన్నాడు పెద్దాయన.


ఇంతలో స్నానం ముగించుకుని సమరాంగుడు బయటకు వచ్చాడు. సార్వభౌముడిని చూడగానే రెండు చేతులూ జోడించి, "రండి, రండి! మీ గురించి చాలా విన్నాను. 


మీ రచనలు మా ప్రచురణ సంస్థలో ప్రచురించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను," అన్నాడు.


సార్వభౌముడి ముఖం ఒక్కసారిగా వికసించింది. తన రాకకు తగిన గుర్తింపు లభించిందని భావించాడు.


"మీ సంస్థలో నా రచనలు ప్రచురించాలంటే కొన్ని నియమాలుంటాయి. నాకు ప్రత్యేకమైన గది, ఎయిర్ కండిషనర్, కార్యదర్శి, రోజూ రెండు పూటలా కాఫీ, నెలకు ఒకసారి సన్మానం ఉండాలి."


"తప్పకుండా. మరి పుస్తకం ప్రచురణకు మీ పారితోషికం ఎంత?" అడిగాడు సమరాంగుడు.

"పారితోషికమా? నా స్థాయి మీకు తెలియదా? నాకు అడ్వాన్స్‌గా ఐదు లక్షలు ఇవ్వాలి. 


పుస్తకాలు అమ్ముడుపోతే రాయల్టీ వేరుగా."

సమరాంగుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు.


"అయితే మీ పుస్తకానికి పాఠకులు ఎంతమంది ఉన్నారు?"

"అదేమిటి? సాహిత్యాన్ని పాఠకుల సంఖ్యతో కొలుస్తారా? నా పుస్తకాలు చదవకపోయినా, వాటి గురించి మాట్లాడేవాళ్లు లక్షల్లో ఉన్నారు."


"అద్భుతం! అంటే మీకు పాఠకులకన్నా ప్రచారకులే ఎక్కువన్నమాట."

"మీరు వ్యంగ్యం చేస్తున్నారా?" అన్నాడు సార్వభౌముడు.


"అదేం లేదు. మీ రచనల మాదిరిగానే నా మాటల్లో కూడా అంతరార్థం ఉంటుంది," అన్నాడు సమరాంగుడు.


ఇంతలో వీల్‌చైర్‌లో ఉన్న పెద్దాయన కలగజేసుకున్నాడు.


"బాబూ, ఒక చిన్న సందేహం. మీరు రచనా సార్వభౌములైతే, మీ రాజ్యంలో పాఠకులు ఎక్కడ ఉంటారు?"


"అది మీకు అర్థం కాదు. సాహిత్యం అనేది సామాన్యులకు అర్థం కావాల్సిన అవసరం లేదు."

పెద్దాయన నవ్వాడు. 


"నిజమేనయ్యా! అందుకే మీ పుస్తకాలు చదివినవాళ్లకంటే కొనకుండా వదిలేసినవాళ్లే ఎక్కువేమో!"


సార్వభౌముడికి ఇక అక్కడ కూర్చోవడం అసాధ్యమైపోయింది. లేచి నిలబడి, "సమరాంగుడూ! మీ సంస్థలో సాహిత్యానికి గౌరవం లేదని అర్థమైంది. నేను వెళ్తున్నాను," అన్నాడు.


సమరాంగుడు మర్యాదగా తలూపాడు.


"తప్పకుండా. కానీ వెళ్లేముందు ఒక చిన్న పరిచయం. 


ఈయన మా తండ్రిగారు, మా సంస్థ వ్యవస్థాపకుడు. గత నలభై ఏళ్లుగా వేల పుస్తకాలు ప్రచురించారు. రచయితల్ని తయారు చేశారు. పాఠకుల్ని పెంచారు. 


అంతేకాక స్వయంగా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత అయిన కవి," అన్నాడు.

సార్వభౌముడు ఆశ్చర్యంగా పెద్దాయన వైపు చూశాడు.


"అయ్యో! మీరు ఇంత పెద్దవారని తెలియక..."

"పరవాలేదయ్యా! నేను పెద్దవాడినని నాకు తెలుసు. కానీ సార్వభౌముడినని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు."


కాసేపు ఆగి మరో మాట అన్నాడు.


"ఒక చిన్న విషయం చెప్పనా? రాజ్యాలు పాలించేవాళ్లకు సార్వభౌములు అని బిరుదులిస్తారు. 


కానీ సాహిత్యంలో నిజమైన సార్వభౌముడు పాఠకుడే! ఎందుకంటే రచయిత రాసిన పుస్తకాన్ని కొనాలా, చదవాలా, మూసి పక్కన పెట్టాలా అన్నది నిర్ణయించేది ఆయనే!"


సార్వభౌముడు ఏమీ మాట్లాడలేదు.


బయటకు వెళ్తూ తన చెప్పులు వెతుక్కుంటున్నాడు.


పెద్దాయన మళ్లీ పిలిచాడు.

"సార్వభౌముడుగారూ! ఒక్క నిమిషం."


"ఏమిటి?" అన్నాడు చిరాకుగా.


"మీరు వచ్చినప్పుడు చెప్పులు తీయలేదు కదా! మా సంస్థలో ఒక సంప్రదాయం ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్లు తమ అహంకారాన్ని బయట వదిలి లోపలికి రావాలి. 


చెప్పులు మాత్రం ఎవరైనా వేసుకోవచ్చు!"

ఆ మాటకు సమరాంగుడు నవ్వాడు. సార్వభౌముడు నవ్వలేదు.


ఎందుకంటే ఆ క్షణంలో ఆయనకు అర్థమైంది—తాను రాసిన పుస్తకాల్లో అహంకారం గురించి ఎన్నో పేజీలు ఉన్నా, తనలోని అహంకారాన్ని మాత్రం ఇప్పటివరకు ఒక్క పేజీ కూడా చదవలేదని!


     *****  









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y

వెంకట్ మంత్రిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: వెంకట్ మంత్రిప్రగడ


వెంకట్ మంత్రిప్రగడ

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...

ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...

ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page