అత్తగారి కథలు - 28: అందగత్తె

Atthagari Kathalu - 28: Andhagathe - Telugu Comedy Story | L. V. Jaya
అత్తగారి కథలు - 28: అందగత్తె - తెలుగు హాస్య కథ | L. V. జయ
Published in manatelugukathalu.com on 20/11/2026
అత్తా–కోడళ్ల మధ్య అపార్థాలు, అసూయ, అందంపై పోటీ ఎలా హాస్యానికి దారితీశాయో చెప్పే సరదా కుటుంబ కథ ఇది. చివర్లో జాగృతి ఇచ్చే చమత్కారమైన సమాధానం కథకు మరింత నవ్వు తెప్పిస్తుంది.
"మా పెళ్ళి ఫోటోలు, వీడియో వచ్చేసాయి." అంటూ ఆనందంగా అందరికీ చెప్పింది జాగృతి. సమర్థ్ వచ్చి జాగృతి పక్కన కూర్చుని నవ్వుకుంటూ ఫోటోలు చూస్తుండగా, అక్కడికి వచ్చిన సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ వాళ్ళని చూసి తట్టుకోలేకపోయింది.
"మొగుడు మీద పడిపోకుండా మాట్లాడలేదు కాబోలు ఈవిడ. పాపం పక్కన కూర్చున్నావేవమ్మా? ఇంకా వాడి ఒళ్ళో ఎక్కి కూర్చోవాల్సింది. ఏం పెంపకాలో ఏమో!! ఛీ." అంది జాగృతిని కోపంగా చూస్తూ.
రాధ మాటలకి భయపడి సమర్థ్ వెంటనే జాగృతికి దూరంగా జరిగాడు. 'పక్కనే కదా కూర్చున్నాను. దానికే అంత మాట అనేయాలా ఈవిడ!!' అనుకుని బిక్క మొహం వేసుకుని రాధని చూసింది జాగృతి.
రాధ వెళ్ళి సమర్థ్ కి, జాగృతికి మధ్యలో కూర్చుని, "ఏముందని ఈ ఆల్బమ్‌లో అంతలా నవ్వేసుకుంటూ చూస్తున్నారు!! ముందు నేను చూస్తాను. ఫోటోల్లో ఎలా పడ్డానో ఏమో!!" అని జాగృతి చేతిలోని ఆల్బమ్‌ని లాక్కుంది.
గబాగబా పేజీలన్నీ తిప్పి, "నాకసలు ఎక్కువ ఫోటోలే లేవు. ఎక్కడ చూసినా మీరిద్దరే ఉన్నారు." అని ఆల్బమ్‌ని జాగృతి మీదకి విసిరింది.
'మా పెళ్ళి ఆల్బమ్‌లో, మాకు ఎక్కువ ఫోటోలు ఉండడం కూడా తప్పేనా?' అనుకుంది జాగృతి.
అప్పుడే అక్కడికి వచ్చిన సమర్థ్ వాళ్ళ నాన్న మాణిక్యాలరావు, "మీ అమ్మ, మీ పెళ్ళిలో తనకి ఫోటోలు తీయటం లేదని ఫోటోగ్రాఫర్‌తో గొడవ పెట్టుకుంది.
వాడేమో 'అన్నిచోట్లా మిమ్మల్నే తీయలేం కదా. మీ అవసరం ఉన్నచోట మీకు తీస్తాం.' అన్నాడు. మీ అమ్మ మొహం చూడాల్సింది అప్పుడు." అని గట్టిగా నవ్వాడు.
రాధకి ఒళ్ళు మండిపోయింది. "ఎందుకా నవ్వు? నా కొడుకు పెళ్ళిలో నా అవసరం లేదా? అక్కడున్నవాళ్ళందరికంటే ఇంపార్టెంట్ మనిషిని నేనే!! నాకు ఎక్కువ ఫోటోలు తీయాలన్న విషయం వాడికి తెలియదా? ఎలా తెలుస్తుందిలే? ఇలాంటివన్నీ ముందే చెప్పుకోవాలి.
వీళ్ళ పుట్టింటివాళ్ళు వాడికి నా గురించి చెప్పుండరు." అంది రాధ జాగృతిని కోపంగా చూస్తూ.
'పెళ్ళిలో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కంటే ఈవిడ ఎక్కువనా ఈవిడ ఉద్దేశం!! ఏదో ఒక రకంగా నన్ను, నా పుట్టింటివాళ్ళని అంటూనే ఉంది. ఏమిటో ఈవిడకి నాతోనున్న ప్రాబ్లమ్.' అనుకుని బాధపడింది జాగృతి.
అది గమనించిన సమర్థ్, జాగృతి చేతిలోని ఆల్బమ్ తీసుకుని, "నువ్వు అన్ని ఫోటోల్లోనూ చాలా బాగున్నావ్!! పెళ్ళిమండపానికి వస్తున్నప్పుడు, కట్టుకున్న ఆ ఎర్ర రంగు చీరలో మరీ అందంగా కనపడుతున్నావ్. చూడు." అన్నాడు జాగృతితో.
"నీకు అప్పుడే పెళ్ళాం బెల్లం అయిపోయింది. మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో మీ నాన్న నన్నెప్పుడైనా అందంగా ఉన్నానని అన్నారా? నాతో ఎప్పుడైనా ఇంత బాగా మాట్లాడారా? దీన్ని మాత్రం నువ్వు ఇప్పటినుండే పొగిడేస్తున్నావ్.
అయినా అదేం బాగుంది అసలు? దీనికి తయారవ్వడం కూడా రాదు. మీ పెళ్ళిలో దీనికంటే ఎక్కువగా నేనే పెళ్ళికూతురిలా కనపడ్డాను. అసలు నీకిది చెప్పనేలేదు కదూ.
పెళ్ళికి ముందు దీని ఫోటోని చూసి, మీ నాన్న ముసలిదానిలా ఉంది, మెల్లకళ్ళు ఉన్నట్టున్నాయని వద్దన్నారు.
అయినా నేనే నీకు నచ్చిందన్నావని, ఒప్పించి పెళ్ళి చేయించాను. అసలు నీకిది ఎలా నచ్చిందో నాకు ఎప్పటికీ అర్థంకాదు." అంది రాధ. మాణిక్యాలరావు ఇక అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోయాడు.
'ఎన్నెన్ని మాటలు అంటోంది ఈవిడ నన్ను!! నేను ముసలిదానిలా ఉన్నానా? నాకు మెల్లకళ్ళా? అందుకేనా నా వెనక పడి మరీ పెళ్ళికి ఒప్పించారు!! నన్ను ఈవిడ ఇన్ని అంటుంటే, సమర్థ్ వాళ్ళ నాన్న కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోయారు!! సమర్థ్ కూడా నోరు విప్పటం లేదేమిటి? అంతలా వీళ్ళని నొక్కేసిందా ఈవిడ!!' అనుకుంటూ సమర్థ్‌ని చూసింది జాగృతి.
సమర్థ్, జాగృతి పడుతున్న మాటలని తట్టుకోలేకపోయాడు. రాధని ఎలా ఆపాలా అని ఆలోచించి, "అమ్మా, పెళ్ళి వీడియో పెట్టుకుని చూద్దాం. అందులో నువ్వు తప్పకుండా ఎక్కువసేపు కనపడతావ్." అన్నాడు.
"నాకేం అక్కరలేదు. నేను చూడను. అక్కడ కూడా దీని మొహమే చూడాలి. నాకు ఇష్టం లేదు." అంది రాధ. సమర్థ్‌కి ఇంకేం అనాలో, ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయాడు.
'అసలు ఈవిడ నాతో ఎందుకు కంపేర్ చేసుకుంటోంది? నన్ను కించపరచడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? తనే పెళ్ళికూతురిలా కనపడ్డానని చెప్తోందేమిటో!! కోడళ్ళతో పోటీపడిన అత్తగార్ల గురించి విన్నాను గానీ, అందంలో కూడా పోటీపడే మనిషిని ఇప్పుడే చూస్తున్నాను.' అనుకుని సమర్థ్ వెనకనే వెళ్ళబోయింది జాగృతి.
రాధ జాగృతిని ఆపి, "నువ్వు చాలా అందగత్తెనని ఫీల్ అయిపోతున్నావేమో!! చెప్పానుగా మా ఆయన నీ గురించి ఏమన్నారో? అసలు అందం అంటే ఏమిటో నీకు చూపిస్తాను, రా." అని ఒక వీడియో పెట్టింది.
'కొడుకు పెళ్ళి వీడియో చూడనన్న ఈవిడ ఈ వీడియో ఎందుకు చూస్తోంది? నాకెందుకు చూపిస్తోంది? ఏముంది ఆ వీడియోలో?' అనుకుని తప్పనట్టు కూర్చుంది జాగృతి.
అది కొన్ని నెలల క్రితం డార్జీలింగ్‌లో తీసిన వీడియో. దూరంగా మంచుతో కప్పబడిన కొండలు, చుట్టూ చెట్లు, చెట్ల మధ్యలో ఇల్లు.
"ఎలా ఉంది డార్జీలింగ్? ఇలాంటి ప్రదేశాలకి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఇలా మంచులో ఉన్నావా?" అని జాగృతిని అడిగింది రాధ గర్వంగా.
"డార్జీలింగ్ వెళ్ళలేదండీ. కానీ నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో అక్కడ కూడా ఇలాగే స్నో పడేది." అంది జాగృతి.
కోడలు అమెరికా వెళ్ళిందన్న సంగతిని తట్టుకోలేకపోయింది రాధ. "సరేలే, వీడియో చూడు." అంది చిరాకుగా.
పొట్టిగా, లావుగా ఉన్న ఒక పెద్దావిడ స్లీవ్‌లెస్ నైటీ వేసుకుని, ఇంటిపనులు చేసుకుంటోంది.
ఆవిడకి నోట్లో పళ్ళు లేకపోవడాన్ని, నోరు పీక్కుపోయినట్టు ఉండడాన్ని గమనించింది జాగృతి. 'ఈ పెద్దావిడని నాకెందుకు చూపిస్తోంది? ఆ పెద్దావిడ అంత చలిలో స్లీవ్‌లెస్ నైటీ ఎందుకు వేసుకుంది?' అనుకుంది జాగృతి.
తరువాత, మాణిక్యాలరావు ఇంటికి వచ్చి, "బయట చలి తట్టుకోలేకపోయాను. కొంచెం కాఫీ పెట్టి ఇవ్వు రాధా." అన్నాడు ఆవిడతో.
జాగృతి ఆశ్చర్యపోయింది. 'వీడియోలోనున్న ఆవిడ, ఈవిడే!! మరి అక్కడ అలా, ఇక్కడ ఇలా ఉందేమిటి?' అనుకుంటూ రాధని చూసింది. రాధవి పెట్టుడుపళ్ళని అర్థమయ్యింది జాగృతికి.
"చూడు ఎంత మంచులో, చలిలో ఎలా బతికేవాళ్ళమో మేము. భర్త వచ్చేటప్పటికి ఇలా చక్కగా తయారయ్యి ఉండేదాన్ని." అంది రాధ.
'అప్పుడు పళ్ళు పెట్టుకోలేదన్న విషయం మర్చిపోయి నాకు ఈ వీడియో చూపిస్తోందా ఈవిడ!! దొరికిపోయింది!!' అని నవ్వుకుంది జాగృతి.
తరువాత రాధ, మాణిక్యాలరావు ఫ్రెండ్స్‌తో కలిసి బయటకి వెళ్ళారు. రాధ పాత కాలం బాలీవుడ్ హీరోయిన్‌లా తయారయ్యింది. రాధ, మాణిక్యాలరావు మీద మంచు విసరడం, ఒళ్ళో వచ్చి కూర్చోవడం, దానికి మాణిక్యాలరావు ఇబ్బందిపడడం చూసింది జాగృతి.
"మొగుడు పెళ్ళాలంటే ఇలా అందంగా, అన్యోన్యంగా ఉండాలి, మాలాగా." అంది రాధ సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ.
'ఈ వయసులో ఈ సరదాలేమిటో? కొత్తగా పెళ్ళైన మేమిద్దరం పక్కపక్కన కూర్చుంటే చూసి తట్టుకోలేకపోయింది కానీ, తను మాత్రం అందరెదురుగా భర్త ఒళ్ళో కూర్చుంది. ఏమిటో ఈ మనిషి!!' అనుకుంది జాగృతి.
"వీడియో చూసావ్ కదా? ఇప్పుడు చెప్పు? ఎవరు బాగున్నారు? నువ్వా? నేనా? నేనే కదా? మా జంటే కదా బాగుంది." అని జాగృతిని అడిగింది రాధ.
'ఈవిడకి అందం పిచ్చి పరాకాష్టకు చేరినట్టుంది. ఇలాంటివాళ్ళతో పెట్టుకునేకంటే, వీళ్ళకి దూరంగా ఉండడం నయం.
హీరోయిన్‌లా తయారైపోతూ, కొత్తపెళ్ళికూతురిలా మెలికలు తిరిగిపోతున్న ఈ పళ్ళు లేని ముసలివాళ్ళని చాలా అందంగా ఉన్నారని చెప్పాలా? ఇప్పుడే పెళ్ళైన మాకంటే వీళ్ళ జంట బాగుందని చెప్పాలా? ఏం చెప్పను? ఎలా చెప్పగలను? ఏమిటో ఈ బాధ.' అనుకుంది.
"నీ కన్నా నేను అందంగా ఉన్నానని తట్టుకోలేకపోతున్నావా? ఏం ఆలోచిస్తున్నావు?" అడిగింది రాధ.
"అదే ఆలోచిస్తున్నాను అత్తయ్యగారు. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నారా అని!! ఇప్పుడే ఇలా ఉంటే ఇంక చిన్నప్పుడు ఇంకెంత బాగుండేవారో? అసలు మీకంటే అందగత్తెని నేను ఇప్పటివరకు చూడలేదు.
అసలు అందం అంటే మీరు, మీరంటే అందం. అద్దం కూడా మీ అందాన్ని చూసి తట్టుకోలేక పగిలిపోతుందేమో."
అని చెప్పి వెళ్ళిపోయింది జాగృతి.
జాగృతి మాటలు రాధకి ఏం అర్థమయ్యాయో తెలియదుగానీ, తానే అందగత్తెనని, కోడలి దగ్గర తానే గెలిచానన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya/profile
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు









Comments