మామా మియా!

Mama Mia - Telugu Moral Story | Srinivasa Rao Pingali
మామా మియా! - తెలుగు నీతి కథ | శ్రీనివాస రావు పింగళి
Published in manatelugukathalu.com on 20/11/2026
“మామా మియా!” శ్రీనివాసరావు పింగళి రచించిన సరదా జంతు నీతి కథ. పిల్లపులికి వేట నేర్పించే పెద్దపులి, సింహం కంటే తన భార్యకు ఎక్కువగా భయపడే సందర్భాలు నవ్వులు పూయిస్తాయి.
అది ఒకానొక కీకారణ్యం. ఓ పిల్లపులి, మరో పెద్దపులి కలసి దట్టంగా ఉన్న ఆ కీకారణ్యం మధ్యభాగంలోకి నెమ్మదిగా నడక సాగిస్తున్నాయి.
"మామా... నన్నెక్కడికి తీసుకెళుతున్నావు? మనమింకా ఎంత దూరమిలా నడవాలి?" అంది పిల్లపులి పెద్దపులితో.
"దగ్గరకొచ్చేశాం అల్లుడూ... ముందు నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మీ అత్తను పరిచయం చేస్తాను.
ఆ తర్వాత నా చెల్లెలు అంటే మీ అమ్మ నాకు చెప్పినట్టు నీకు వేటాడడంలో మెళకువలు నేర్పిస్తాను" అంది పెద్దపులి. కాసేపటికల్లా పెద్దపులి స్వగృహానికి చేరుకున్నారు ఇద్దరూ.
అదో పెద్ద కొండగుహ. ఇద్దరూ లోనికి వెళ్ళారు. లోపల ఎవరూ లేరు. "అత్త ఎక్కడ మామా?" అంటున్న అల్లుడితో "మీ అత్త అలా విహారానికి బయటకు వెళ్ళినట్లుంది.
మనం కూడా కాసేపు అలా బయటకు వెళ్ళొద్దాం. నేను నీకు వేటలో మెళకువలు నేర్పిస్తాను. తిరిగి వచ్చాక పరిచయ కార్యక్రమం పెట్టుకుందాం" అంది పెద్దపులి.
నకనకలాడుతున్న ఖాళీ కడుపుతోనే వేట శిక్షణకు బయలుదేరారు ఇద్దరూ. చాలా దూరం నడిచినా వేటాడేందుకు కనీసం కుందేలు పిల్ల అయినా కనిపించలేదు.
పిల్లపులికి నీరసం వచ్చేసింది. "మామా... ఇక నావల్ల కావట్లేదు. నేను నడవలేను" అంది. అంతలోకే ఏదో అలికిడి వినిపించింది.
ఇద్దరూ దాపులోనున్న పొద వెనుక నక్కారు. ఆకలికి ఆగలేకపోయిన పిల్లపులి అలికిడి వినిపించిన వైపుకు దుమికేందుకు ప్రయత్నించబోయింది. ఆ ప్రయత్నాన్ని నివారించిన పెద్దపులి, పిల్లపులిని కొద్ది క్షణాల పాటు ఓర్పుగా ఉండమని సైగ చేసింది.
అటుగా వచ్చిన సింహాన్ని చూసి భయంతో బిర్రబిగుసుకుని అలాగే ఉండిపోయింది పెద్దపులి.
"ఏమైంది మామా?" అని అమాయకంగా అడగబోతున్న పిల్లపులి గొంతు నొక్కేస్తూ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది.
సింహం అక్కడ్నుంచి వెళ్ళిపోయాక హమ్మయ్య అన్నట్టుగా ఊపిరి పీల్చి వదిలింది పెద్దపులి. కొంత మేరకు అర్థం చేసుకున్న పిల్లపులి "ఎవరు మామా... ఆ వెళ్ళింది?" అని అడిగింది.
"అడవికి రారాజు... మృగరాజు... సింహం అని కూడా అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి" అంది పెద్దపులి. అర్థమైనట్లుంది పిల్లపులికి. సరేనంటూ తలాడించింది.
అలాగే మాటువేసి నక్కి ఉన్నారు ఇద్దరూ. సమయం గడుస్తోంది. "ఇంకెంతసేపు మామా... ఆకలి చంపేస్తోంది.
ఇంటికెళ్తే ఎంచక్కా అత్త పెట్టేవి ఆరగించవచ్చు కదా..." అంటున్న పిల్లపులిని చప్పుడు చేయవద్దని సైగలతో హెచ్చరించింది పెద్దపులి.
కాసేపటికి ఒక దుప్పి అక్కడకు వచ్చి పచ్చిక మేయసాగింది. హుషారుగా ఆ దుప్పి పైకి దుమకబోతున్న పిల్లపులిని వారించింది పెద్దపులి.
"అంటే... మనం దుప్పిని చూసి కూడా భయపడాలా మామా..." అంటున్న పిల్లపులితో "అదేం కాదు... అదును చూసి వేటాడాలి.
ఇదే అదును. ఇప్పుడు వేటాడు" అంటూ ఆ దుప్పిని వేటాడింది పెద్దపులి. మామను అనుసరించి తానూ కూడా ఆ దుప్పిని వేటాడింది పిల్లపులి.
ఇక తృప్తిగా విందుభోజనం ఆరగించవచ్చనుకున్న పిల్లపులి ఆశలు అడియాసలు అయ్యాయి.
పెద్దపులి ఆ దుప్పి కళేబరాన్ని కాస్తా తన కొండగుహ వైపుగా ఈడ్చుకొని పోసాగింది. "మరలా ఏమైంది మామా...? నేను ఆకలికి ఆగలేకపోతున్నాను..." అంటున్న పిల్లపులితో పెద్దపులి నోట్లోని దుప్పిని కిందకు వదిలి ఇలా అంది.
"అల్లుడూ... ఇందాక వెళ్ళిన మృగరాజును చూసి నేనెంత భయపడిపోయానో చూశావు కదా... అంతకు వందరెట్లు భయం నాకు మీ అత్త అంటే... నేనేది వేటాడినా మీ అత్త తిన్నాకనే నేను తినాలి.
భవిష్యత్తులో నీవైనా అంతే అల్లుడూ..." కిందపడేసిన దుప్పిని తిరిగి నోట కరచుకొని ముందుకు సాగుతున్న తన మేనమామ పెద్దపులిని అనుసరించింది పిల్లపులి ఆకలి తీరకపోయినా, తన శిక్షణ పూర్తయిందనే సంతోషంతో.
రచన : శ్రీనివాసరావు పింగళి
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y

రచయిత పరిచయం: శ్రీనివాస రావు పింగళి
పేరు : శ్రీనివాస రావు పింగళి
తల్లిదండ్రులు : అలివేలుమంగమ్మ, సుబ్బారావు
ఉద్యోగం : ఏ.పి.యస్ ఆర్టీసీ కండక్టర్
చదువు : డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్
ఇతర రచనలు : ఆంధ్రభూమి వీక్లీలో అనేక కవితలు, తెలుగు వెలుగు మాసపత్రికలో "భలే పెళ్లిపెద్ద" హాస్య కథ, స్వాతి వీక్లీలో "వర్మ ఫ్రమ్ బర్మా" హాస్య కథ ప్రచురింపబడినవి.
ప్రస్తుత నివాసం : గుంటూరు










Comments