top of page
Original.png

దాతృత్వం

4 minutes ago
5 min read

దాతృత్వం తెలుగు కథలో వ్యాపారవేత్త వినయ్, ఇంజనీర్ శ్రీనివాస్ కలిసి 25 మంది పేద కుటుంబాలకు ఉచిత గృహాల పత్రాలు అందిస్తున్న దృశ్యం.

Datrutvam - Telugu Social Story | B. N. Satyanarayana

దాతృత్వం - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 02/10/2026


దాతృత్వం అనేది కేవలం ధనం ఇవ్వడం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించడం కూడా. “దాతృత్వం” తెలుగు కథలో వ్యాపారవేత్త వినయ్ తన సొంత భూమిలో 25 మంది శ్రామిక పేదల కోసం ఉచిత గృహాలను నిర్మించి అందిస్తాడు. అతని మిత్రుడు శ్రీనివాస్ సహకారంతో సాకారమైన ఈ సేవా కార్యక్రమం స్నేహం, నమ్మకం, పారదర్శకత, పరోపకారం యొక్క విలువను చాటిచెబుతుంది. సమాజానికి మేలు చేయాలనే మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ కథ స్ఫూర్తినిస్తుంది.


కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న ఒక పెద్ద వ్యాపార సంస్థకు యజమాని వినయ్‌. చాలా సౌమ్యుడు. తన లాభాలలో కొంత శాతం దానధర్మాలకు వెచ్చిస్తున్న వితరణశీలి. అతడి ఆలోచనలు ఎప్పుడూ పేదలకు సేవలు అందించడం పైనే సాగుతుంటాయి.


అందులో భాగంగానే తన గ్రామంలో ఉన్న కొద్దిమంది “శ్రామిక పేదలకు” ఉచితంగా గృహాలు నిర్మించి ఇవ్వాలనే కోరిక అతడిలో పుట్టుకొచ్చింది.


తన గ్రామంలో తనకున్న ఐదు ఎకరాల మెట్ట భూమిలో కొంత భాగాన్ని అందుకు ఉపయోగించాలనుకున్నాడు.


ఆ స్థలంలో “శ్రామిక పేదల” కొరకు 25 గృహాలతో కూడిన ఒక “గృహ సముదాయాన్ని” నిర్మించి వారికి ఉచితంగా ఇవ్వాలని, వారికి ఒక నీడ కల్పించాలని ఆశపడ్డాడు.


ఆ ఆలోచన కలగగానే అతడిలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. తాను తలపోసిన ఈ ప్రాజెక్టుకు తాను డబ్బు సమకూర్చగలిగినా, దానిని పూర్తి చేయడం తనకు సాధ్యమయ్యే పనేనా? కానప్పుడు మరి దానికి ఎవరి సహాయం తీసుకోవాలి? అనే మీమాంస అతడిని వెంటాడసాగింది.


"ఏ సేవా సంస్థకో, స్వచ్ఛంద సంస్థకో దానిని అప్పగిస్తే ఎలా ఉంటుంది?" అని ఒక్కసారి ఆలోచించాడు. నిజానికి అటువంటి సంస్థలపై అతడికి ఏమాత్రం విశ్వాసం లేదు.


అవి అన్నీ అవినీతిమయమైపోయాయని, మోసాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని, దాతలు ఇచ్చే విరాళాలను దిగమింగేస్తున్నాయనే వార్తలు అతడు చాలానే వింటున్నాడు, చూస్తున్నాడు కూడాను.


అందువల్ల తాను ఆ గృహాల నిర్మాణానికి వెచ్చించాలనుకుంటున్న డబ్బు అటువంటి వారి చేతుల్లో పడనీకూడదని నిర్ణయించుకున్నాడు.


ఆ ఆలోచనల్లో సతమతమవుతున్న అతడికి మిత్రుడు, సివిల్‌ ఇంజనీర్ శ్రీనివాస్‌ గుర్తుకు వచ్చాడు. దాంతో అతడిలో కొంత ఆరాటం తగ్గింది.


ఆశ చిగురించింది. వెంటనే శ్రీనివాస్‌తో సంప్రదించాలనుకున్నాడు. అతడి ద్వారానే ఈ ప్రాజెక్టును మంచిగా పూర్తి చేయగలననే నమ్మకం అతడికి కలిగింది.


వెంటనే మిత్రుడికి ఫోన్ చేశాడు. "శ్రీనూ! నీతో ఒక విషయమై చర్చించాలనుకుంటున్నాను.


దానికి ఇప్పుడు నీకు సమయం కుదురుతుందా?" అని అడిగాడు. శ్రీనివాస్‌ నమ్మలేకపోయాడు—వినయ్ ఫోన్ చేసి ఇలా తన పర్మిషన్ కోరతాడని! జవాబుగా వినయ్‌ను తప్పకుండా రావలసిందిగా ఆహ్వానించాడు.


దాంతో వినయ్‌లో ఆశ చిగురించినట్లయింది. వెంటనే కారు తీసి శ్రీనివాస్‌ ఆఫీసుకు బయలుదేరాడు.


వినయ్‌ రాక కొరకు వేచి చూస్తున్న శ్రీనివాస్‌ మిత్రుడిని చూస్తూనే ఆదరంగా ఆహ్వానించి, తన కేబిన్ లోకి తీసుకువెళ్లి సోఫాలో కూర్చుండబెట్టాడు.


బిస్కెట్లు, కాఫీలు వంటి సాధారణ మర్యాదలు పూర్తయ్యాక... "చెప్పు వినయ్, ఏమిటి విషయం?" అని అడిగాడు. దానికి వినయ్ తన ఆలోచనలన్నీ మిత్రుడికి తెలియజేసి, "ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నీ సహాయం, సహకారం కావాలి" అని కోరాడు.


వినయ్‌ చెప్పినదంతా విన్న శ్రీనివాస్‌ అతడి దాతృత్వానికి మనసులోనే సలామ్ చేశాడు.


అతడు చేపట్టిన సేవా కార్యక్రమంలో తనకు కొంత భాగస్వామ్యం లభిస్తున్నందుకు ఆనందపడుతూ తన సమ్మతిని తెలిపాడు.


"శ్రీనూ, ఈ ప్రాజెక్టు భారం అంతా నీ పైనే పెడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ విషయంలో వృత్తిపరంగా నీకు లభించే పారితోషికం కంటే సంతృప్తికరమైన పారితోషికం నా నుండి లభిస్తుంది.


కాదనకు, మొహమాటానికి పోమాకు. నీ ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి కావడమే నాకు కావాల్సింది, అదే నాకు సంతృప్తినిస్తుంది.


ముందుగా ఇప్పుడు 25 లక్షల రూపాయలకు నీకొక చెక్కు ఇస్తున్నాను. భూమి సర్వే, చదును చేయించడం, ప్లానింగ్, ప్రభుత్వం నుండి అనుమతులు వంటివన్నీ చూసుకో."


"ఆ స్థలంలో 150 చదరపు గజాలలో ఒక గృహం చొప్పున 25 గృహాలు కట్టాలనే ఆలోచన నాకు ఉంది. అందుకు కావలసిన భూమి, అయ్యే బడ్జెట్, పూర్తి కావడానికి పట్టే కాలం వంటి విషయాలు లెక్కించి నాకు తెలియజేయి.


ఈ ప్రాజెక్టు నాదిగా కాకుండా మనదిగా భావించు. అయితే కేవలం దీనిపైనే నీ దృష్టి అంతా కేంద్రీకరించి నీ పనులు నిర్లక్ష్యం చేసుకోకు.


తొందరేమీ లేదు, సమయం తీసుకున్నా ప్రశాంతంగా, దృఢంగా, ఆదర్శవంతంగా ప్రాజెక్టు పూర్తి చేద్దాం. అని చెబుతూ, ముందుగా మనం ఒకమారు మా గ్రామం వెళ్లి భూమి చూసొద్దాం.


వీలైనంత వరకు ప్రాజెక్ట్ వివరాలు గుప్తంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం" అని చెప్పి లేచి మిత్రుడి నుండి సెలవు తీసుకుని వినయ్‌ తన కారులో ఆఫీసుకు బయలుదేరాడు.


శ్రీనివాస్‌కు ఎంతో ఆనందంగా ఉంది. వినయ్‌ వంటి దాతలు ఉంటే ఏ కొద్దిమంది పేదలకైనా లబ్ధి చేకూరుతుంది, గూడు దొరుకుతుంది అని అనుకుంటూ మిత్రుడి దాతృత్వానికి ఎంతో సంతోషించాడు.


మంచి మనసుతో పరోపకారార్థం చేపటే ఏ కార్యక్రమానికైనా ఆటంకాలు ఎదురుకావు.


అనుకున్న కొద్ది రోజులకే మిత్రులు ఇద్దరూ భూమిని చూసేందుకు వినయ్‌ గ్రామానికి వెళ్లారు.


అన్ని సౌకర్యాలతో కూడి ఎంత భూమి అవసరమవుతుందో లెక్కలు వేసి కొలతలు తీసుకున్నారు.


పంచాయతీ ఆఫీసుకు వెళ్లారు. కార్యదర్శిని, సర్పంచ్‌లను కలిశారు. తమ ప్రాజెక్టు విషయం చెప్పి వారి సలహాలు తీసుకుని, విషయాన్ని గోప్యంగా ఉంచాలని అభ్యర్థిస్తూ వారి సహకారాన్ని కోరారు.


వారి నుండి అనుకూలత రావడంతో, అలాగే ఆ గ్రామంలో “శ్రామిక పేదల” వివరాలు కొన్ని సేకరించగలిగారు. అన్నీ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణమై హైదరాబాద్‍కు తమ ఇళ్లకు చేరుకున్నారు.


శ్రీనివాస్‌ ఆ ప్రాజెక్టు పనులు కొద్ది రోజుల్లోనే మొదలుపెట్టాడు. భూమి సర్వే చేయించాడు. చదును చేయించాడు. కొత్తగా కొలతలు తీసుకున్నాడు. 25 గృహాల సముదాయానికి ప్లాను తయారు చేసేందుకు ఉపక్రమించాడు.


పూర్తి చేసి దానిని పంచాయతీ కార్యాలయంలో సబ్‌మిట్‌ చేశారు. తర్వాత ఇద్దరు మిత్రులు కలెక్టరు గారిని, ఎం.ఎల్‌.ఏ గారిని కలిసి తమ ప్రాజెక్టు వివరాలు తెలియజెప్పి, తమ లక్ష్యాన్ని తెలియజేస్తూ అనుమతులు వీలైనంత తొందరలో మంజూరు చేయవలసిందిగా కోరారు.


వారి సేవానిరతిని అభినందిస్తూ, "అన్ని అనుమతులు త్వరలోనే మీకు లభిస్తాయి, ప్రభుత్వ విభాగాల నుండి అన్ని విధాలా సహకారం ఉంటుంది" అని వారి నుండి హామీ లభించడంతో మిత్రులు ఎంతో సంతోషించారు.


కొద్ది రోజులకే అనుమతులు లభించడంతో ఎటువంటి జాప్యం చేయకుండా ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిన అన్ని రుసుములు చెల్లించేశారు.


వినయ్‌ మిత్రుడికి నిర్మాణ పనుల నిమిత్తం మరో 50 లక్షల రూపాయలకు చెక్కు అందజేశాడు.


నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్, వాటర్ మొదలైనటువంటి అన్ని విభాగాల నుండి పనులు మొదలయ్యాయి.


అనుమతులన్నీ తొందరగానే లభించడంతో ముందుగా తమ వైపు నుండి బోరు బావులు తీయించి, మోటార్లు ఏర్పాటు చేసి, రోడ్లు, కాలువల నిర్మాణం పూర్తి చేశారు.


అనంతరం ప్లాను ప్రకారం గృహనిర్మాణం పనులు మొదలుపెట్టారు, పూర్తి చేశారు.


అందుకు సుమారుగా 17, 18 నెలల సమయం పట్టింది. వినయ్‌ అందుకు అయిన ఖర్చు పూర్తి మొత్తాన్ని మిత్రుడికి చెక్కు రూపంలో చెల్లించివేశాడు.


మిత్రుడి సహకారానికి, శ్రమకు గాను సంతోషకరమైన పారితోషికాన్ని అందించి, అతడి కలలకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు.


అంతా పూర్తి కావడంతో తమ కలలు ఫలించాయని మిత్రులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు.


వినయ్‌ తన తల్లిదండ్రుల పేరు మీద ఆ “గృహ సముదాయానికి” “లలితా ప్రసాద్‍ కాలనీ” గా నామకరణం చేశాడు. తల్లిదండ్రులపై వినయ్‌కు గల ప్రేమకు శ్రీనివాస్‌ మిత్రుడిని చాలా అభినందించాడు.


పెద్ద హోర్డింగ్ అమర్చి, ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయించి భారీగా సభకు ఏర్పాట్లు చేశారు.

కలెక్టర్ గారిని, ఎం.ఎల్‌.ఏ గారిని, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్‌లను, ఇతర పెద్దలందరినీ ఆహ్వానించారు. గ్రామస్తులందరినీ సభకు రావలసిందిగా కోరారు.


ఈలోగా తాము నిర్ధారించుకున్న లబ్ధిదారులు 25 మందికి, ఎవరికి కేటాయించబడిన గృహం భూమి హక్కులతో సహా సర్వహక్కులతో వారి పేరుతో దస్తావేజులు రాయించి, రిజిస్ట్రేషన్లు చేయించి పంపిణీకి సిద్ధపరిచారు.


భారీగా జరిగిన ఆ కాలనీ ప్రారంభోత్సవ సభలో ఎం.ఎల్‌.ఏ గారి చేతులమీదుగా దస్త్రాలు లబ్ధిదారులకు అందజేయబడ్డాయి.


దానితో విచ్చేసిన గ్రామస్తులందరి ఆనంద హర్షధ్వానాలతో, చప్పట్లతో సభ దద్దరిల్లిపోయింది. ధన్యవాదాలు తెలుపుతూ దాతను పొగడసాగారు.


వినయ్‌ దాతృత్వానికి, అతడి మిత్రుడు శ్రీనివాస్‌ కృషికి ఎం.ఎల్‌.ఏ గారు ఎంతగానో ఆనందించి అభినందించారు.


కలెక్టర్ గారు మాట్లాడుతూ... "వినయ్‌ వంటి దాతలు ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడితే వారికి తమ నుండి, ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి" అని హామీ ఇస్తూ, "దాత వినయ్‌" ను ఎంతగానో అభినందిస్తూ పూల గుత్తితో (బుకేతో) సత్కరించారు.


"దాతలు వినయ్‌ని ఆదర్శంగా తీసుకుని, తామిచ్చే విరాళాలు దుర్వినియోగం కాకుండా, మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా తమ ఆధ్వర్యంలోనే, తమ పర్యవేక్షణలోనే తాము కోరుకున్న ప్రాజెక్టులకే వినియోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి" అని హితవు పలికారు.


తమకు ఉచితంగా లభించిన ఆస్తిని లబ్ధిదారులు జాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరిస్తూ హితవు పలికారు.


~ సమాప్తం ~

***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page