top of page
Original.png

ఒకరికి ఒకరు

48 minutes ago
2 min read

ఒకరికి ఒకరు తెలుగు నీతి కథలో కుందేలు కుటుంబానికి సాయం చేస్తున్న కోతి, తన అందంపై గర్వపడే జింక, అందాల పోటీకి న్యాయనిర్ణేతగా ఉన్న ఏనుగు

Okariki Okaru - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

ఒకరికి ఒకరు- తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 02/10/2026


ఒకరికి ఒకరు రాళ్లబండి సంగం నాయుడు రచించిన చక్కని తెలుగు నీతి కథ. తన అందంపై గర్వపడే జింకకు, ఇతరులకు సాయం చేసే కోతి తన ప్రవర్తనతో ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన అందం శారీరక రూపంలో కాకుండా మంచి మనసులో, పరోపకార గుణంలో ఉంటుందని ఈ కథ వివరిస్తుంది. పిల్లలకు మానవతా విలువలు, దయ, సహాయం చేసే గుణం నేర్పించేందుకు ఈ కథ ఎంతో ఉపయోగకరం.


అనగనగా ఒక అడవి. ఆ అడవి పచ్చపచ్చని బయళ్లతోను, అందమైన సరస్సులు, పూల మొక్కలతో అలరారుతుండేది.


తరతరాల నుండి వస్తున్న జంతు, వృక్ష సంపద ఆ అడవి సొంతం. ఆ అడవిలోని జంతువులు 'ఒకరికి ఒకరు' అన్నట్టు జీవనం సాగించేవి.


ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా, అది తమ కష్టమనుకుని మిగిలిన జంతువులన్నీ సాయపడేవి. ఇలా అడవి జంతువులన్నీ సుఖంగా, సంతోషంగా జీవనం కొనసాగించేవి.


ఆ అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా పొగరుబోతుది. తన అందం చూసుకుని తెగ మురిసిపోయేది.


దేవుడు తన ఒక్కదానికే ఇంత అందమిచ్చాడని, తనెంతో అదృష్టవంతురాలనని పొంగిపోయేది.


తనకు మిగిలిన జంతువులు సాయం చేయడం వాటి అదృష్టమని భావించేది. సాయం పొందిన తాను ఇతర జంతువులకు సాయపడటం నామోషీగా అనుకునేది.


ప్రతిరోజూ అడవిలో ఉన్న సరస్సులో తన అందాన్ని తనివితీరా చూసుకునేది. సరస్సుకు నీళ్లు తాగటానికి వచ్చిన ప్రతీ జంతువుకు తన అందం గురించి చెప్పేది.


ఆపదలో ఉన్న జంతువులను కనీసం పరామర్శించేది కాదు.


ప్రతినిమిషం తన అందాన్ని పొగుడుకునే జింక తీరు మిగిలిన జంతువులకు విసుగు కలిగించి, మృగరాజు సింహానికి మొరపెట్టుకున్నాయి. జింకకు ఎలాగైనా బుద్ధి చెప్పమని కోరాయి.


సింహం ఆలోచించి అడవిలో అందాల పోటీలు ప్రకటించింది. న్యాయనిర్ణేతగా ఏనుగును నియమించింది. చీమ మొదలుకుని అడవిలో గల సర్వప్రాణులు ఈ అందాల పోటీలో పాల్గొనవచ్చని ఏనుగు వివరించింది.


ఈ అందాల పోటీకి అడవిలోని సమస్త జంతువులు తరలివచ్చాయి. జింకతో పాటు ఒక కోతి కూడా ఈ పోటీలకి బయలుదేరింది. మార్గం మధ్యలో ఒక కుందేలు ఏడుస్తూ కనిపించింది.


జింక ఆ కుందేలును పట్టించుకోకుండా ముందుకు కదిలింది.


కోతి ఆగి కుందేలు బాధకు కారణం అడిగి తెలుసుకుంది. కుందేలు తన భర్త, పిల్లలకు జ్వరమని, తినటానికి ఏమీ లేదని అన్నది. కుందేలు, కోతి సాయంతో భర్త, పిల్లలను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లింది.


ఆహారంగా తన వెంట తీసుకువెళుతున్న పండ్లను ఇచ్చింది కోతి. కుందేలుకు ధైర్యం చెప్పి అందాల పోటీకి బయలుదేరింది.


అందాల పోటీ ప్రారంభమైంది. కోతి ఆలస్యంగా వచ్చింది. ఆలస్యానికి కారణం అడిగింది ఏనుగు. జరిగిందంతా చెప్పింది కోతి.


కోతిని మెచ్చుకుని అందాల పోటీలో విజేతగా ప్రకటించింది ఏనుగు. "అందమంటే మంచి మనసు ఉండడం, సాయం చేసే గుణముండడం.


ఆ గుణాలు కోతికున్నాయి, అందుకే విజేతగా నిలిచింది" అని ఏనుగు అన్నది. సింహంతో పాటు అన్ని జంతువులు చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశాయి.


ఇన్నాళ్లు అందగత్తెననుకున్న జింక గర్వమణిగి, బుద్ధి వచ్చింది. ఇక అక్కడ నుండి పరోపకారం చేస్తూ జింక బతకసాగింది.


~ సమాప్తం ~

*** 



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page