top of page
Original.png

అనర్థ సంవాదం

1 hour ago
5 min read

అనర్థ సంవాదం తెలుగు కథలో తండ్రీకొడుకుల మధ్య కుటుంబ గౌరవం, పెళ్లి నిర్ణయంపై జరిగిన ఘర్షణను ప్రతిబింబించే దృశ్యం.

Anartha Samvadam - Telugu Family Story | Bhattu Venkata Rao

అనర్థ సంవాదం - తెలుగు కుటుంబ కథ | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 02/10/2026


‘అనర్థ సంవాదం’ భట్టు వెంకటరావు రచించిన హృదయాన్ని కలచివేసే తెలుగు కుటుంబ కథ. కుటుంబ గౌరవం, తరాల మధ్య ఆలోచనా భేదాలు, తండ్రీకొడుకుల మధ్య పెరిగిన సంఘర్షణ ఈ కథలో ప్రధానాంశాలు. ఆవేశంతో పలికిన మాటలు, విచక్షణ కోల్పోయిన క్షణాలు ఒక కుటుంబ జీవితాన్ని ఎలా మార్చగలవో ఈ కథ ఆలోచింపజేస్తుంది. మానవ సంబంధాల విలువను గుర్తుచేసే ఈ తెలుగు నీతి కథను పూర్తిగా చదవండి.


(1)


"అదంతా ఆషామాషీ విషయం కాదు నీ అంతట నువ్వు నిర్ణయించుకోవడానికి. తరతరాల కుటుంబ గౌరవానికి, ప్రతిష్ఠకు సంబంధించిన విషయం.


అందువల్ల నీ ఇష్టం ప్రకారం చేస్తానంటే కుదరదు. ప్రేమలూ గీమలూ ఈ ఇంట్లో నడవవు. పెద్దవాళ్ల నిర్ణయం ప్రకారమే పెళ్లిళ్లు జరుగుతాయి. అంతే!" అన్నాడు రాఘవ తండ్రి చాలా కోపంగా, విసురుగా.


"అవన్నీ మీ కాలపు రోజుల్లో నాన్నా! ప్రపంచం మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ కాలపు న్యాయం. ఆ న్యాయం ప్రకారమే నా పెళ్లి నా ఇష్టం ప్రకారమే చేసుకుంటాను.


ఇందులో మీ జోక్యం అనవసరం!" అన్నాడు దాదాపుగా అంతగానూ నిశ్చయం ప్రకటిస్తూ రాఘవ. ఆయనకు ఒక్కడే కొడుకు రాఘవ. ఎంత గారాబంగా పెంచాడో, అంత మొండిగానూ పెరిగి పెద్దవాడయ్యాడు.


రాఘవ తండ్రికి మండింది కొడుకు మాటలకి. ఆయన మొహం ఎర్రబడింది. కోపం వస్తే ఆయనకంతే... మనిషి మొత్తంగా ఊగిపోతాడు.


అదే మొదలు కాదు వాళ్ల మధ్య ఆ విషయంపై సంభాషణ జరగడం. అంతకుముందు కూడా రెండు సార్లు జరిగింది. అప్పుడూ అలాగే తెగేసి చెప్పాడు రాఘవ తండ్రి. అయినా రాఘవలో ఏ మార్పూ రాలేదు.


"అంత తేలికగా తీసిపారేయకు అబ్బాయ్! విషయాలు చాలా సీరియస్ అవుతాయి. అంత పట్టనట్టుగా వదిలేయ్యం. కుటుంబ పరువు ప్రతిష్ఠలతో ముడిపడి ఉన్న విషయం. ఎంతదూరమైనా వెళ్లి వదిలించుకుంటాం తప్పితే, వదిలేసి చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోం!" అన్నాడు రాఘవ తండ్రి చాలా కోపంగా.


"ఏం చేస్తారు నాన్నా? మహా అయితే ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటారు. మీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటారు.


అంతే కదా! అలాగే వెళ్లిపోతాను. నేను చదువుకున్న చదువుతోను, నా తెలివితేటలతోను నాకు చేతనైన బతుకు నేను బతుకుతాను. మీ వైపుకే రాను, మీ వంకే చూడను! అంతే కదా!" అని బదులిచ్చాడు రాఘవ... ‘అదేముంది, అదొక పెద్ద విషయమా?’ అన్నట్లుగా.


ఒక్క క్షణం కొడుకు వంక ఒకరకమైన క్రూరత్వం నిండిన చూపుతో, శత్రువును చూసినట్లు చూశాడు తండ్రి.


"నీకు నేను చెప్పింది సరిగా అర్థమైనట్లు లేదు. వదిలించుకోవడం అంటే నీపాటికి నువ్వు వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటామని కాదు... ఎంత దూరమైనా వెంటాడి లేపేస్తాం అని!" అన్నాడాయన, చాలా కఠినంగా, మాటలు ఒకటొకటే పలుకుతూ అంతకంటే స్పష్టంగా వినపడేలా మాట్లాడుతూ.


"నాన్నా...!!" అన్నాడు రాఘవ, తండ్రి మాటలు నమ్మలేనట్లుగా. సినిమాలలో పాత్రలు మాట్లాడినట్లు, తన తండ్రిలో ఈ మాటల తీరు అతడిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. 'నా తండ్రేనా ఇలా మాట్లాడుతున్నది?' అని ఆశ్చర్యపోయి, కనులప్పగించి చూస్తూ నిలుచుండిపోయాడు.


రాఘవకు కొంచెం దూరంలో నిలబడి, ఇరువురి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న రాఘవ మేనమామ అది చూసి కంగారు పడ్డాడు.


"ఊరుకో బావా... ఏంటా మాటలు! అట్లా భయపెడతావేంటి? ఏదో జాగ్రత్తగా సర్ది చెప్పి దారికి తెచ్చుకుంటాం గాని, ఇన్నేళ్లు గారాబంగా పెంచి పెద్దజేసిన కొడుకుని మన చేతుల్తో మనమే కడతేర్చుకుంటామా?" అన్నాడు రాఘవ మేనమామ. ఆయనకు ఒక్కతే కూతురు.


ఆ కూతుర్ని రాఘవకిచ్చి చేస్తే ఇరు కుటుంబాల ఆస్తి బయటికి పోకుండా భద్రంగా ఉంటుందని, ఇంకా వృద్ధి చెందుతుందని ఆయన కోరిక... రాఘవ వాళ్ల తల్లిదండ్రుల కోరిక కూడా!


"అర్థమయింది కదా... అదీ సంగతి. ఇప్పటికైనా ఒళ్లు దగ్గరబెట్టుకుని ఇంట్లోవాళ్లు చెప్పినట్లు చెయ్యడం నీకూ మంచిది, మాకూ మంచిది. ఫో!" అన్నాడాయన.


ఇంకేమీ మాట్లాడకుండా రాఘవ అక్కడి నుండి వెళ్లిపోయాడు.


అతడు వెళ్లిపోగానే రాఘవ మేనమామ... "అదేంటి బావా, అంత మాటనేశావు? ఎంత కోపం వస్తే మాత్రం అట్లా ఏకంగా చంపేస్తామని చెప్తామా?" అన్నాడు.


"నా ఉద్దేశం నా కొడుకునని కాదయ్యా. నీకట్లాగని ఎట్లా అనిపించిందో నాకు బోధపడటం లేదు!" అన్నాడు రాఘవ తండ్రి.


"బలేవాడివేలే... నాకు అర్థం కాకనా? అట్లాగని రాఘవకు అనుమానం రాకూడదని అలా మాట తిప్పాను. అట్లాగని ముందే చెప్పేస్తే ఎట్లా బావా?" అన్నాడు రాఘవ మేనమామ.


"నేనంత దూరం ఆలోచించలేదులే..." అన్నాడు ముక్తసరిగా రాఘవ తండ్రి.


"సర్లే... ప్రస్తుతానికి అలా వదిలేయ్. రాఘవ తెలివైనవాడు, అర్థం చేసుకుంటాడు. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందిలే బావా... ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోమాక, నే వెళ్తా!" అని సలహా చెప్పి వెళ్లిపోయాడు రాఘవ మేనమామ.


కొడుకుతో అలా శత్రువులాగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఇంట్లో రావడాన్ని విసుక్కుంటూ, కోపంగా భుజం మీది జరీ అంచు కండువాను తీసి పక్కనున్న పాతతరాల పేము కుర్చీలోకి విసిరి కొట్టాడు రాఘవ తండ్రి. ఆ విసురుకి అది వెళ్లి కుర్చీలో పడకుండా, కింద పరిచి ఉన్న ఖరీదైన తివాచీ మీద పడింది.


అప్పుడే ఆ గదిలోకి అడుగు పెట్టిన రాఘవ అమ్మగారు "ఏమిటంత కోపం?" అంటూ వచ్చి, కింద పడ్డ ఖరీదైన జరీఅంచు కండువాను చేత్తో భద్రంగా తీసి భర్త చేతికందించింది.


"అందులో పడేయ్!" అన్నాడు ఆయన కోపంగా కుర్చీ వంక చెయ్యి చూపిస్తూ.


"ఏమన్నారు రాఘవని? వాడు హడావుడిగా బయలుదేరి ఊరెళ్లిపోతున్నాడు!" అందామె.


"ఏముందీ... ఎప్పటి గొడవే! ముహూర్తాలు పెట్టుకుందాం బావా, మంచి రోజులు పోతున్నాయని మీ అన్న వచ్చి ముందు కూర్చున్నాడు. సరే అని మాట్లాడబోతే వీడు మాట వినడం లేదు. మండుకొచ్చి ఏదో అనేశాను!" అన్నాడు.


"అదే ఏమన్నారూ అని?" అని విశదంగా చెప్పమని అడిగిందామె.

"ఏదో అన్నానులే. వెళ్లు... తరువాత మాట్లాడుకుందాం గాని!" అన్నాడు.


"సరే!" అని ఆమె వెళ్లిపోయింది.


(2)


"నేను బయలుదేరుతున్నానమ్మా!" అంటూ విసురుగా బయలుదేరాడు రాఘవ.


"అలాగే నాన్నా! ఈ రాత్రి వేళ ఇప్పుడింత హడావుడిగా ఎందుకు వెళ్తున్నావో అర్థం కావడం లేదు నాకు. రేప్పొద్దున వెళ్లొచ్చు కదా అంటే వినవు. సరే... జాగ్రత్త!" అందామె కొడుక్కి వీడ్కోలు పలుకుతూ.


"అలాగేలే..." అంటూ భవనం బయటికొచ్చి, పోర్టికోలో ఉన్న కారును స్టార్ట్ చేసి, గిరుక్కున కారును రౌండు కొట్టించి స్పీడుగా గేటు బయటికి పోనిచ్చాడు రాఘవ.


అక్కడికి యాభై కిలోమీటర్లుంటుంది అతడు చేరవలసిన నగరం... ముప్పావుగంట ప్రయాణం. ఇంకో పది నిమిషాల్లో నగరం చేరుతాడనగా కారు ప్రమాదానికి గురైంది.


పట్టు తప్పి పెద్ద చెట్టును బలంగా గుద్దుకుంది. కారును నడుపుతున్న రాఘవ అక్కడికక్కడే మరణించాడు.


ప్రమాదం జరిగిన తీరును చూసిన వాళ్లకి ప్రమాద కారణం బోధపడలేదు. బహుశా అకస్మాత్తుగా అడ్డం వచ్చిన దేన్నో తప్పించబోయి, పట్టు తప్పి చెట్టుకు గుద్దుకుని ఉండొచ్చని, ఆ సమయంలో కారు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుండడం వలన ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా, మనిషి ప్రాణం పోయేంతగా ఉండడం సంభవించిందని అనుకున్నారు.


ఊహించని ఈ దారుణ పరిణామానికి రాఘవ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి శోకానికి అంతం లేకుండాపోయింది.


అసలు ఇంతకీ కారణమైన రాఘవ ప్రేమించిన అమ్మాయి ఎవరా అని రాఘవ స్నేహితులతోను, మరి తనకు తెలిసిన వారందరితోనూ మాట్లాడి విచారించిన రాఘవ మేనమామకు అటువంటి వ్యక్తి ఎవరూ రాఘవ జీవితంలో లేరని తెలిసింది.


‘ఏమీ లేని దానికి ఇంతగా వినాశనం జరగడమేమిటా?’ అని ఆయన ఆశ్చర్యపోయి, రాఘవ తల్లిదండ్రులతో కలిసి విలపించాడు.


'ఈ ఇంటికి ఏమిటి ఈ దుర్దశ?' అనే దిగులుతో, మరింక కోలుకోలేక, కొన్నాళ్లకు రాఘవ అమ్మ మరణించింది. ఆ తరువాత కొన్నాళ్లకు, విరక్తి చెంది రాఘవ తండ్రి, నిద్రాహారాలు మాని మరణం పాలయ్యాడు.


ఇల్లు స్మశానంగా మారింది. తలుపులకు తాళం పడి క్రమంగా పాడుబడిపోయింది. చుట్టుపక్కల ఇళ్లలో నివసించే జనం, ఆ భవనంలోంచి అర్ధరాత్రి సమయానికి రోదనలు వినసాగారు. ఆ రోదనలతో వారు హడలిపోయి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.


ఇది జరిగి దాదాపుగా రెండున్నర దశాబ్దాల కాలం గడిచింది. ఇప్పుడాయిల్లు ఊరి నుండి పూర్తిగా వేరుచేయబడి, ఊరికి దూరంగా నెట్టబడి, ఎవరికీ పనికిరానిదిగా మారిపోయి, పొలిమేరల్లో ఒక దయ్యాలకొంపగా పేరుపడిపోయి మిగిలింది.


ఎందుకు అంత తీవ్రస్థాయికి తీసుకెళుతున్నారో తెలుసుకోకుండా, అంత తీవ్రస్థాయి సంభాషణ అవసరాన్ని గుర్తించకుండా, విచక్షణను ఆ క్షణాలలో కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు... తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఐదు నిమిషాల సంభాషణ ఫలితం, సకల భోగాలతో కళకళలాడుతున్న ఇంటిపై అలా ఉండగలదని తెలుసుకున్నప్పుడు భయము, ఆశ్చర్యము మిళితమైన బాధ కలుగుతుంది.


~ సమాప్తం ~



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page