'Naa Margam' written by M R V Sathyanarayana Murthy
రచన : M R V సత్యనారాయణ మూర్తి
విశాలా, రెడీ అయ్యావా? ఈ బస్సు దాటిపోతే మరో గంట వరకూ బస్సు లేదు" అసహనంగా అన్నాడు శ్రీధర్.
" ఆ.. వచ్చేస్తున్నానండి. బాబుకి ఇవ్వవలసినవి డబ్బాలో పెడుతున్నాను" అంది విశాల.
రెండు నిముషాలలో వంటింట్లోంచి వచ్చింది విశాల. చిన్న బాగ్ లో రెండు ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్ పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ స్కూటర్ మీద బస్సు స్టాండ్ కి వచ్చి, వేములపల్లి వెళ్ళే బస్సు ఎక్కారు. ఒక గంట గడిచేసరికి బస్సు వేములపల్లి చేరుకుంది. ఇద్దరూ బస్సు దిగి " వెలుగు" రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కి చేరుకున్నారు.
ఆరోజు రెండవ ఆదివారం. పిల్లల్ని కలుసుకోవడం కోసం వచ్చే తల్లి తండ్రులు, సందర్శకులతో సందడిగా ఉంది కాలేజీ అంతా. అక్కడ ఐ. ఐ. టి. ఫౌండేషన్ కోర్స్ ఉంది. ఈ కాలేజీలో చదివి ఐ. ఐ. టి. ప్రవేశ పరీక్షలలో మంచి రాంకులు సాధించి చెన్నై, కాన్పూర్, ఐ. ఐ. టి. లలో సీట్లు వచ్చి, చదువు పూర్తి అయ్యాక పెద్ద పెద్ద ఉద్యోగాలలో చేరిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఆ కాలేజీ కి అంత డిమాండ్.
పది గంటలకు గంట కొట్ట గానే హాస్టల్ నుండి బిల బిల మంటూ పిల్లలు అందరూ హాలు లోకి వచ్చారు. చైతన్యని తీసుకుని హాలు బయటకు వచ్చి, కాలేజీ ఆవరణలోనే ఉన్న మామిడి చెట్టు వద్దకు వచ్చారు శ్రీధర్, విశాల.
డబ్బా లోంచి ఒక మినప సున్ని ఉండ తీసి కొడుకు నోట్లో పెట్టింది విశాల. నెమ్మదిగా తింటున్నాడు చైతన్య. ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. శ్రీధర్ అదేం పట్టించుకోకుండా
" ఎలా చదువుతున్నావ్? ఐ. ఐ. టి. లో సీటు రావాలి. మర్చిపోకు" అన్నాడు. మౌనంగా తలూపాడు చైతన్య. ఇంతలో ఒక కుర్రాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. " అంకుల్ మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా. మా అమ్మతో మాట్లాడాలి" కంగారుగా అడిగాడు. శ్రీధర్ తట పటాయిస్తుంటే, విశాల తన ఫోన్ తీసి ఆ కుర్రాడికి ఇచ్చింది. దగ్గరగా ఉన్న మరో సిమెంట్ బెంచి మీద కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు అ కుర్రాడు. ఆ కాలేజీలో ఫోన్లు అనుమతించరు. ఇంటికి ఉత్తరాలు రాసుకోవచ్చు. కానీ వాటిని ప్రిన్సిపాల్ సెన్సార్ చేసి పంపుతారు.
ఏదో కారణం వలన తల్లి తండ్రులు రాకపోతే, పిల్లలు వచ్చిన వారి దగ్గర ఫోన్ తీసుకుని ఇంటికి మాట్లాడుతుంటారు. ఫోన్ మాట్లాడుతున్న కుర్రాడి కేసే చూస్తోంది విశాల. ఎంతో ఆనందంతో వెలిగిపోతోంది ఆ
కుర్రాడి మొహం. అది చూసి విశాల తల్లి హృదయం సంతసించింది. శ్రీధర్ కొడుక్కి చదువు గురించి నూరి పోస్తున్నాడు. చైతన్య ముభావంగా ఊ కొడుతున్నాడు. ఒక అరగంట గడిచాకా ఆ కుర్రాడు ఫోన్ తెచ్చి విశాలకి ఇచ్చి " మెనీ మెనీ థాంక్స్ ఆంటీ" అన్నాడు. విశాల డబ్బా తీసి మినపసున్ని ఉండ ఆ కుర్రాడికి ఇచ్చింది. మరోసారి థాంక్స్ చెప్పి ఉండ తింటూ వెళ్ళిపోయాడు కుర్రాడు.
ఇంకో అరగంట కూర్చుని బయల్దేరారు శ్రీధర్, విశాల. ’బై అమ్మా’ అన్నాడు చైతన్య. విశాల వెనక్కి తిరిగి చూస్తూ నడుస్తోంది. రెండు ప్లాస్టిక్ డబ్బాలు చేత్తో పట్టుకుని చెట్టుకింద నిలబడ్డ కొడుకుని చూడగానే ఆమె కళ్ళు మరోసారి వర్షించాయి. తల్లీ, తండ్రి వెళ్లిపోవడంతో హాస్టల్ రూమ్ కి వచ్చాడు చైతన్య. తల్లి ఇచ్చిన తినుబండారాలు స్నేహితులు అందరికీ ఇచ్చాడు. అతని మనసు భారంగా మూలిగింది.
******
ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్షలు, ఐ. ఐ. టి. ప్రవేశ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు చైతన్య. తండ్రి పరీక్షలు ఎలా రాసావంటే, బాగానే రాసానని చెప్పాడు. అతనికి చాలా చిరాగ్గా ఉంది. ఆ మాటే తల్లితో అన్నాడు.
" సరే, తాత గారింటికి వెళ్ళు. రిజల్ట్స్ రాగానే తిరిగి ఇంటికి వద్దువుగాని. " అని భర్తని వొప్పించి చైతన్యని తీసుకుని సిద్ధాంతం వచ్చింది విశాల. రాఘవరావు, జానకమ్మ కూతుర్ని, మనవడిని సాదరంగా ఆహ్వానించారు. సాయంత్రం బయల్దేరి శివపురం వచ్చేసింది విశాల.
వశిష్ట గోదావరి తీరాన ఉన్న సిద్ధాంతం గ్రామం చైతన్యకి బాగా నచ్చింది. రోజూ తాతగారితో కలిసి గోదావరికి వెళ్లి స్నానం చేసేవాడు. సూర్యోదయం చూసి చాలా ఆనంద పడ్డాడు. నారింజపండు రంగులో ఉన్న పెద్ద సూర్యబింబం అతనికి గమ్మత్తుగా ఉండేది. కళ్ళు విప్పార్చి, గోదావరి వడ్డునే నిలబడి, నెమ్మది నెమ్మదిగా పైకివస్తున్న సూర్యబింబం చూడడం చైతన్యలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.
గోదావరిలో వెళ్ళే చిన్న చిన్న పడవల్ని చాలా ఆసక్తిగా చూసేవాడు. అమ్మమ్మ ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి పెడుతున్న చిరుతిళ్ళు తినేటప్పుడు చైతన్యకి తల్లి గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేవి. సాయంకాలాలు అమ్మమ్మతో కలిసి ‘వొప్పుల కుప్ప’ తిరిగే వాడు. ఆవిడతో కలిసి సమానంగా తిరగడం చైతన్యకి కష్టంగా ఉండేది. కానీ అమ్మమ్మ తన రెండు చేతుల్నీ పట్టుకుని అలా తిప్పుతుంటే చాలా త్రిల్లింగ్ గా ఉండేది.
తాతగారి దగ్గర చదరంగం ఆడడం నేర్చుకున్నాడు చైతన్య.
" చైతూ, చదరంగానికి మనిషి జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చదరంగంలో చిన్న బంటు పోయినా, ఒక జంతువు నష్ట పోయినా విజయం సాధించడంలో చాలా కష్టపడాలి. మన జీవితంలో కూడా అంతే. చిన్న చిన్న పొరపాట్ల వలన మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చి మానసికంగా, ఆర్ధికంగా కృంగి పోవాల్సివస్తుంది. అయితే చదరంగం ఆటలో కొద్దిపాటి నష్టం జరిగినా మంత్రి, ఏనుగు మిగతా బలగాలతో చక్కని ఎత్తులు వేస్తూ ఆటలో విజయం సాధించవచ్చు. అలాగే జీవితంలో కూడా చేసిన చిన్న పొరపాట్లకు విచారిస్తూ బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో, నిరంతర కృషితో ఎంతో విలువైన జీవితాన్ని సంరక్షించుకుంటూ, అనుకున్న లక్ష్యాన్ని సాధించి, ఆనందంగా జీవించవచ్చు. ఎప్పుడూ మనిషి మానసికంగా బలహీనుడు కాకూడదు. మనోధైర్యంతో ముందుకు సాగాలి" అన్నారు శాస్త్రి గారు.
తాతగారి మాటలకు చైతన్య మనసులో అస్తవ్యస్తంగా ఉన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. అమ్మమ్మ గ్రామంలోని వారికి హొమియోపతీ వైద్యం చేయడం చైతన్యకి ఆశ్చర్యం కలిగించింది. ఐదవ తరగతి మాత్రమే చదివిన అమ్మమ్మ, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాకా కరేస్పాన్డేన్సు కోర్స్ ద్వారా బి. ఏ. పూర్తి చేసిందని తెలిసి మరింతగా ఆశ్చర్యపోయాడు. చైతన్య తాతగారి ఇంటిదగ్గర ఉండగానే ఒకరోజు పోలిసువాన్ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఆయన సరాసరి వచ్చి శాస్త్రి గారి పాదాలకు నమస్కరించాడు.
" సుధీర్, బాగున్నావా?" అని అడిగారు శాస్త్రిగారు.
" బాగున్నాను సార్. మీరు నేర్పిన క్రమశిక్షణ, సమయ పాలన నన్ను జీవితంలో పైకి తీసుకు వచ్చాయ్. విశాఖపట్నంలో ఐ. జి. గా ఉంటున్నాను" ఎంతో వినయంగా అన్నాడు సుధీర్. తను తెచ్చిన పళ్ళు, స్వీట్లు మాస్టారికి ఇచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు సుధీర్. అంత పెద్ద అధికారి తాతగారి ముందు ఎంత వినయంగా, గౌరవంగా ఉన్నాడో అని అబ్బురపడ్డాడు చైతన్య.
*****
చైతన్య సిద్ధాంతంలో ఉండగానే ఎంసెట్ రిజల్ట్స్, ఐ. ఐ. టి. ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. చైతన్య కి శ్రీధర్ ఆశించిన రాంక్ రాలేదు. కొడుకుని నాలుగూ దులిపేద్దామనుకుంటే ఎదురుగా లేడు. తాతగారింట్లో ఉన్నాడు. తన అక్కసు అంతా భార్య మీద చూపించాడు శ్రీధర్.
" నువ్వు వాడ్ని సరిగా పెంచలేదు. నా మాటంటే వాడికి గౌరవం లేదు. మా ఆఫీసులో పనిచేసే వాళ్ళ పిల్లలకు మంచి రాంకులు వచ్చాయి. వీడికే ఇలా వచ్చింది. రేపు నేను ఆఫీసులో ఎలా తల ఎత్తుకుని తిరగాలి. మీరు ఇద్దరూ నన్ను అర్ధం చేసుకోలేదు" నిష్టూరంగా అన్నాడు శ్రీధర్.
విశాల ఏం మాట్లాడలేదు. చైతన్యని బి. టెక్. చదివించి కంప్యూటర్ కోర్సులు నేర్పించి పెద్ద ఉద్యోగస్తుడిగా చూడాలని భర్త ఆశ. నలుగురిలో కొడుకు గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆయన కోరిక. కానీ చైతన్యకి ఆ చదువు ఇష్టంలేదు. అందుకే పరీక్షలు సరిగా రాయలేదని గ్రహించింది విశాల.
రెండు రోజులు గడిచాకా శాస్త్రిగారు చైతన్యని తీసుకు వచ్చారు. మావగారి ముందే చైతన్యని కేకలేసాడు శ్రీధర్.
" అల్లుడుగారూ, చైతన్యకి టెక్నికల్ కోర్సులకు వెళ్ళడం ఇష్టం లేదంటున్నాడు. వాడికి ఏ కోర్స్ లో చేరాలని ఉందో తెలుసుకుని అందులో చేరిస్తే మంచిదేమో ఆలోచించండి" అన్నారు శాస్త్రి గారు.
" ఏరా, ఎందులో చేరాలని నిర్ణయించుకున్నావ్?" వెటకారంగా అడిగాడు శ్రీధర్.
" నాన్నగారూ, నాకు టీచింగ్ ప్రొఫెషన్ లో రాణించాలని ఉంది. అందుకని ముందుగా బి. ఎస్. సి. లో చేరాలనుకుంటున్నాను. " నెమ్మదిగా చెప్పాడు చైతన్య. కొడుకు సమాధానానికి నిర్ఘాంతపోయాడు శ్రీధర్.
" వద్దు . . వద్దు . ఆ మాష్టారి ఉద్యోగం వలన నీకు గుర్తింపు ఉండదు. ఎంత డొనేషన్ ఐనా కడతాను. నువ్వు బి. టెక్. లోనే చేరుదువు గాని" అన్నాడు శ్రీధర్.
చైతన్య తాతగారి కేసి చూసాడు.
" చూడండి అల్లుడు గారూ, చైతన్యకు ఇష్టంలేని కోర్స్ లో చేరిస్తే, వాడు అందులో మంచి ఫలితం రావడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళి మీరే బాధపడతారు. మరోసారి ఆలోచించండి" నచ్చచెప్పారు శాస్త్రి గారు.
తన మాట నెగ్గనందుకు ఉడుకుమోత్తనం వచ్చింది శ్రీధర్ కి.
" అన్నీ వాడే నిర్ణయం చేసుకున్నాకా నేను ఏం చెప్పినా ఉపయోగం ఏముంది?వాడి కిష్టమైన కోర్స్ లోనే చేరమనండి" అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు శ్రీధర్.
రాత్రి భోజనాలయ్యాకా భర్తకి నచ్చ చెప్పింది విశాల. ‘ఇష్టంలేని కోర్సులలో బలవంతంగా చేరిన పిల్లలు అందులో ఇమడలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అటువంటి పరిస్థితి ఎదురైతే మనం ఎలా జీవించగలమని?’ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అప్పుడు కొంచెం కుదుటపడ్డాడు శ్రీధర్.
విశాఖపట్నంలో ఆర్ట్స్ కాలేజీ లో బి. ఎస్. సి. లో చైతన్య ని జాయిన్ చేసాడు శ్రీధర్. మూడు సంవత్సరాలు మూడు రోజుల్లా గడిచి పోయాయి చైతన్యకి. కార్పొరేట్ జూనియర్ కాలేజీ లో చదివేటప్పుడు ఎంతో డల్ గా ఉండే చైతన్య డిగ్రీ చదివేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉండడం గమనించారు శ్రీధర్, విశాల. సెలవలకు సిద్ధాంతం తాతగారింటికి వెళ్ళడం మానడం లేదు.
డిగ్రీ పూర్తి కాగానే ఎం. ఎస్. సి. చదువుతానంటే ‘సరే’ అన్నాడు శ్రీధర్. యూనివర్సిటీ లో లెక్కలు మెయిన్ గా తీసుకుని ఎం. ఎస్. సి. లో చేరాడు. యూనివర్సిటీ చదువు చైతన్య లో చాలా మార్పు తీసుకు వచ్చింది. ప్రొఫెసర్లు చెప్పేది శ్రద్ధగా వినడం, కొత్త విషయాల మీద అధ్యయనం చేయడం అలవాటు అయ్యింది. తాతగారు చెప్పిన సమయపాలన, క్రమశిక్షణ, ఏకాగ్రత మూడు సూత్రాల్ని పాటించాడు.
ఈ రెండు సంవత్సరాలలో ఎప్పుడూ కాలాన్ని వృధా చెయ్యలేదు. చైతన్య వినయం, గురువుల పట్ల గౌరవం ప్రొఫెసర్లని బాగా ఆకట్టుకున్నాయి. అతనికి ఏ సందేహం వచ్చినా ప్రత్యెక సమయం కేటాయించి ఆ సందేహానికి తగిన సమాధానం చెప్పేవారు. చాలా కష్టపడి చదివిన చైతన్య ఎం. ఎస్. సి. లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు.
గవర్నర్ చేతుల మీదుగా కొడుకు గోల్డ్ మెడల్ అందుకుంటుంటే, ప్రేక్షకులలో ఉన్న శ్రీధర్, విశాల సంతోషంతో ఉప్పొంగిపోయారు. అకస్మాతుగా ఇరువురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు చోటు చేసుకున్నాయి. కాన్వోకేషన్ పూర్తి అయ్యాక కొడుకుని దగ్గరకు తీసుకుని అభినందించాడు శ్రీధర్. విశాల ఆనందానికి అంతేలేదు. తండ్రీ కొడుకుల మధ్య అగాధం తోలిగిందని సంతోషించింది.
ఆ తర్వాత పి. హెచ్. డి. కూడా చేసి విశాఖపట్నం లోనే ఒక అటానమస్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు చైతన్య. దీపావళి సెలవలకు ఇంటికి వచ్చాడు చైతన్య. సోఫాలో కూర్చున్న కొడుకు పక్కనే కూర్చున్నాడు శ్రీధర్. " చైతూ, ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా?" శాంతంగా అడిగాడు శ్రీధర్.
" అయ్యో నాన్నగారూ, మీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. నన్ను అర్ధం చేసుకోలేదనే నా బాధ. మీ వలననే కదా ఇంత చదువు చదువుకున్నాను. ఆ విషయం నేనెప్పుడూ మర్చిపోను. నేను తాతగారి ఊరు సిద్ధాంతం వెళ్ళాక చాలా విషయాలు తెలుసుకున్నాను. మనిషి ఆనందంగా ఎలా జీవించవచ్చో నాకు అర్ధమయ్యింది. నా ఈడు పిల్లలతో హాయిగా ఆడుకున్నాను. గోదావరి వడ్డున ఉన్న రావిచెట్టుకి ఉన్న ఉయ్యాలలో నన్ను కూర్చోబెట్టి, తాతయ్య నన్ను ఎంతో ప్రేమగా ఊపినప్పుడు ఎంత సంతోషం కలిగిందో నేను మాటల్లో చెప్పలేను.
ఒక రోజు ఏం జరిగిందో తెలుసా నాన్నగారూ, గోదావరి వడ్డున పచ్చికలో ఒక ఆవు, దూడ మేస్తున్నాయి. గోధుమ రంగులో ఉన్న ఆ ఆవుదూడని పట్టుకోవాలని దాని దగ్గరకు వెళ్లాను. అది నాకు అందకుండా పరిగెత్తింది. నేనూ దాని వెనకాలే పరిగెత్తాను. పావు గంట గడిస్తేనే కానీ అది నాకు దొరకలేదు. దాన్ని ఆప్యాయంగా నిమిరి వదిలేసాను. అది వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ దూడ వెనకాలే పరుగెడుతూ పొందిన ఆనందం నేను జీవితంలో మర్చిపోలేను.
నేను బి. టెక్. చదివి పెద్ద ఉద్యోగంలో చేరి లక్షలు సంపాదించడం కన్నా ఒక ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్దులని తీర్చిదిద్దడం లోనే నాకు ఎక్కువ ఆనందం ఉంటుందని తాతగార్ని చూసి తెలుసుకున్నాను. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాను. పంజరంలో బంధించి చెప్పే చదువుకన్నా, స్వేచ్ఛాయుత వాతావరణంలో చెప్పే చదువు మనిషిని విశాలహృదయుడిగా మారుస్తుందని నమ్మిన వ్యక్తిని నేను" అన్నాడు చైతన్య.
తండ్రి కొడుకులు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం చూసి, విశాల ఆనందంగా వచ్చి కొడుకు పక్కనే కూర్చుంది. " చైతూ, ఈ దీపావళి మన జీవితాల్లో కొత్త వెలుగుల్ని తీసుకొచ్చింది" అని కొడుకుని అక్కున చేర్చుకుంది. ఆమె మొహం, కార్తీక పౌర్ణమి వెన్నెలలో మెరుస్తున్న గోదావరిలా కళ కళ లాడింది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
Comentários