top of page

స్వర సంగమం


Swara Sangamam written by M R V Sathyanarayana Murthy

రచన : సత్యనారాయణ మూర్తి M R V

“ఏం రామనాధం గారు, ఎలా వున్నారు?”

పలకరించిన వ్యక్తి ఎవరా? అని వెనుదిరిగి చూసారు రామనాధం. సైకిల్ కేరెజీ మీద పచ్చగడ్డి మోపు, నెత్తిన తలపాగా, మోకాళ్ళ పైకి కట్టిన పంచ, బనీనుతొ ఉన్న మనిషిని సరిగ్గా పోల్చుకోలేక పోయినా గొంతు బట్టి గుర్తు పట్టారు.

“ఏమోయ్ మంగరాజు, ఎలా వున్నావు? ఈ అవతారం ఏమిటి ?” నవ్వుతూ అడిగారు.

“మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఏం చేయను మరి. గేదెకు పచ్చగడ్డి కోసం

నేనే వెళ్ళాల్సి వచ్చింది. నా సంగతి సరే, మీ సంచిలో ఏమిటి, రంగు డబ్బాలేనా?” అడిగాడు మంగరాజు.

“అవును. అవే. బాగా కనిపెట్టావు. సా ప సా. . ఎలాగా లేదు. అందుకని వీటినే

నమ్ముకున్నాను. బండి నడవాలిగా. ” నవ్వుతూ అన్నారు రామనాధం. ఆయన నవ్వుతూ అన్నా, ఆ మాటల వెనుక ఉన్న ఆవేదనని పసిగట్టాడు మంగరాజు.

సైకిల్ నడిపించుకుంటూ, ఆయనతో కబుర్లు చెబుతూ నడవ సాగాడు

మంగరాజు. ఐదు నిముషాలకు రామనాధం గారి ఇల్లు వచ్చింది. రామనాధం ఆగారు.

“ఉంటానండి మాస్టారు “ అని ముందుకు నడిచాడు మంగరాజు.

రెండు నిమషాలు అతను వెళ్ళిన వైపే చూసి, దీర్ఘంగా నిట్టూర్చి ఇంటిలోకి వెళ్ళారు

రామనాధం. భార్య జానకమ్మ ఎదురొచ్చి చేతిలోని సంచి తీసుకుని లోపల పెట్టి, భర్తకు

మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మంచినీళ్ళు త్రాగి గ్లాసు స్టూల్ మీద పెట్టారు రామనాధం.

“దారిలో మంగరాజు కనిపించాడు. ” భార్య కేసి తిరిగి అన్నారు.

“అలాగా. కులాసాగా ఉన్నాడా? అలివేలు బాగుందా? కొడుకు రైస్ మిల్లులోనే

పనిచేస్తున్నాడా?”

భార్య ప్రశ్నల పరంపరకు రామనాధం పెదవులపై దరహాస కుసుమం విరిసింది. తన

తప్పు తెలిసింది. నిజమే. ఆమె అడిగిన మూడు ప్రశ్నలు తాను మంగరాజుని అడగలేదు.

ఎందుకో అతన్ని చూడగానే మనసు మూగబోయిన వయోలిన్ అవుతుంది. యాంత్రికంగా

మాటలు మొలుస్తాయి. గుండె దడదడ లాడుతుంది.

గతం గుర్తుకు వస్తుంది. కానీ ఏం చేయగలరు ?

జానకమ్మ మళ్ళీ అడిగింది మంగరాజు ఎలా ఉన్నాడని. బాగానే ఉన్నాడని చెప్పి కళ్ళు

మూసుకున్నారు రామనాధం. గతం ఆయన ముందు ఒకసారి గిర్రున తిరిగింది.

*********

పాలకొల్లు చిన గోపురం దేవాలయం లోని ఆడిటోరియం సంగీత ప్రియులతో కిట కిట

లాడుతోంది. చెన్నై కి చెందిన రంగరాజన్ గాత్ర సంగీత కచేరీ జరుగుతోంది. ఆయన కచేరీకి

రామనాధం వయోలిన్ తో, మంగరాజు మృదంగం తో కొత్త సొగసులు చేకూరుస్తున్నారు. రెండు గంటలపాటు రంగరాజన్, తన మధురమైన గాత్రంతో శ్రోతలందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసారు.

కచేరీ ముగిసిన తర్వాత రంగరాజన్ రామనాదం ని, మంగరాజు ని ప్రత్యేకంగా అభినందించారు. అంత పెద్ద గాయకుడి నుంచి మెప్పు పొందినండులకు వారిద్దరూ ఆనందించారు.

ఒక పడి సంవత్సరాలు ఏకధాటిగా మిత్రులు ఇద్దరు భీమవరం, ఏలూరు, రాజముండ్రి, కాకినాడ,

తిరుపతి వంటి ప్రసిద్ధ పట్టణాలలో తమ ప్రతిభను ప్రదర్శించి ఎన్నో సత్కారాలు పొందారు.

శివపురం గ్రామ సర్పంచ్ కూడా రామనాధం, మంగరాజు లను నగరేశ్వర స్వామి గుడిలో

ఘనంగా సత్కరించారు. “మీ వలన మన గ్రామానికి ఎంతో పేరు వస్తోందని, క్రిష్ణార్జునుల్లా మీరు

ఇద్ద్దరు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని” సర్పంచ్ శ్రీరాములు కితాబు ఇచ్చారు. గ్రామ

ప్రముఖులు కూడా వారిద్దరినీ అభినందిస్తూ మాట్లాడారు.

ఆనాటినుండి వారి ఇద్దరినీ కృష్ణార్జునులు గానే జనం వ్యవహరించ సాగారు. సంగీత

కచేరిలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వీరిని సంగీత అభిమానులు అలాగే పిలవడం

ప్రారంభించారు. ప్రజల అభిమానానికి రామనాధం, మంగరాజు చాలా పొంగిపోయారు.

“మంగరాజు, మనం ఏనాడో చేసుకున్న పుణ్యం వలన మనకు సంగీత జ్ఞానం అబ్బింది.

మన గురువుల ఆశీస్సుల వలన అది రాణించి, ప్రజలకు చేరి మనకు ఈ గౌరవం దక్కింది. ”

అన్నారు రామనాధం ఆనందంగా.

“అవును రామనాధం గారు. మన తల్లితండ్రుల ప్రోత్సాహం కూడా మనల్ని ముందుకు

నడిపించింది. అంతా దైవానుగ్రహం. ” అన్నాడు మంగరాజు సంతోషంగా. మంగరాజు,

రామనాధం ని ఎప్పుడూ ‘గారు’ అనే సంభోదిస్తాడు. ఎందుకంటే, మంగరాజుకి మృదంగం

నేర్పింది రామనాధం తండ్రి రంగనాధం. ఆయనకు వయోలిన్,

మృదంగం రెండింటిలో ప్రావీణ్యం ఉంది.

రామనాధంకి ఒక్కతే కూతురు. పేరు కల్యాణి. ఆమె తండ్రి దగ్గర వయోలిన్

నేర్చుకుంటోంది.

మంగరాజుకి ఒక్కడే కొడుకు, షణ్ముఖ. తండ్రి దగ్గర మృదంగం, రామనాధం దగ్గర గాత్రం నేర్చు కుంటున్నాడు.

కాలం లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజలు ఆధునిక సంగీతం వైపు మొగ్గు

చూపసాగారు. శాస్త్రీయ సంగీత కచేరీలు తగ్గాయి. ఫలితంగా రామనాధం, మంగరాజు ఇద్దరూ ఉపాధి

కోల్పోయారు.

కుటుంబ పోషణ కోసం రామనాధం పెయింటర్ గా మారిపోయారు. వడ్రంగి పరబ్రహ్మం

తయారుచేసే చెక్క గుర్రాలకు రంగులు వేస్తున్నారు. మంగరాజు పొలం కౌలుకి తీసుకుని

వ్యవసాయం చేస్తున్నాడు.

******

“కుర్చీలో కూర్చునే నిద్రపోతున్నారా? వంట అయ్యింది. రండి భోజనం చేద్దురుగాని”

అని జానకమ్మ పిలవడంతో వాస్తవంలోకి వచ్చారు రామనాధం. కల్యాణి ఓ ప్రైవేటు కాన్వెంట్ లో

టీచర్గా పని చేస్తోంది. మర్నాడు చెప్పవలిసిన లెసన్ కోసం ప్రిపేర్ అవుతోంది. తల్లి భోజనానికి

రమ్మనమని పిలవగానే, పుస్తకం పక్కన పెట్టి వంటింటి లోకి వచ్చింది. వాళ్ళిద్దరికీ భోజనం

వడ్డించింది జానకమ్మ. ఇద్దరు మౌనంగానే భోజనం చేసారు. ఆ తర్వాత జానకమ్మ భోజనం

చేసింది.

ఒక ఆదివారం నాడు రామనాధం కొయ్య గుర్రానికి రంగు వేస్తున్నారు. కల్యాణి ని పిలిచి

“ఏదైనా కీర్తన వాయించు తల్లీ “ అని అన్నారు. కల్యాణి లోపలకు వెళ్లి వయోలిన్ తెచ్చి

‘కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు’ అన్నమయ్య కీర్తన మృదు మధురంగా

వాయించింది. అప్పుడే లోపలకు వచ్చిన పరబ్రహ్మం ఆ సంగీతం విని పులకించి పోయాడు.

“రామనాధం గారూ, మీ లాంటి సంగీత విద్వాంసుల చేత ఇలా రంగుల పని చేయించడం నాకు చాలా బాధగా ఉంది” ఆవేదనగా అన్నాడు పరబ్రహ్మం.

“బ్రహ్మం, నువ్వు అలా అనుకోవద్దు. ఇబ్బందులలో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకుని,

నాకు ఉపకారమే చేస్తున్నావు. ఈ పని కూడా లేకపోతే, మేము చాలా అవస్తలు పడేవాళ్ళం. ”

అన్నారు రామనాధం.

అప్పటివరకు రంగులు వేసిన కొయ్య గుర్రాలకు, లెక్క కట్టి రామనాధం కి డబ్బులు ఇచ్చేసి,

వాటిని రిక్షా మీద వేసుకుని వెళ్ళిపోయాడు బ్రహ్మం. తిరిగి రంగుల పనిలో మునిగిపోయారు

రామనాధం.

ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నారు రామనాధం. సంధ్యా సమయం అయ్యాకా

స్నానం చేసి వయోలిన్ తీసుకుని పూజ గదిలోకి వెళ్లి కీర్తనలు వాయించ సాగారు. సావిట్లో

జానకమ్మ, కల్యాణి దేవుడు స్త్రోత్రాలు చదువు కుంటున్నారు. రామనాధం “నీ దయ రాదా, రామ

నీ దయ రాదా “ అంటూ చాలా ఆర్తిగా పాడుతూ మధ్యలో అలా ఒరిగి పోయారు. కీర్తన మధ్యలో

ఆగిపోయింది ఏమిటా అని లోపలకు వచ్చిన జానకమ్మ, కల్యాణి ఆయన్ని అలా చూసి నిర్ఘాంత

పోయారు. గబ గబా ఆయన్ని సావిట్లోకి తీసుకు వచ్చి దివాన్ మీద పడుకోబెట్టి, మంగరాజుకి ఫోన్

చేసి డాక్టర్ ని తీసుకు రమ్మనమని చెప్పారు. కొద్దిసేపటికి మంగరాజు డాక్టర్ని వెంట బెట్టుకుని

వచ్చాడు.

డాక్టర్ రామనాదాన్ని పరీక్షించి ప్రాణం పోయిందని చెప్పారు. తల్లీ,కూతురు ఒక్కసారిగా

ఘోల్లు మన్నారు. అప్పుడే వచ్చిన అలివేలు, షణ్ముఖ వారిద్దరినీ ఓదార్చారు.

రామనాధం గారి దిన వారాలు పూర్తి అయ్యాయి. వచ్చిన బంధువులు ఎక్కడ వాళ్ళు

అక్కడ సద్దుకున్నారు. జానకమ్మ, కల్యాణి ఇద్దరే మిగిలారు ఇంట్లో.

“జానకమ్మా, మా ఇంటికి వచ్చి ఉండండి. కొంచం స్తలం మార్పు ఉంటుంది. కాస్త దిగులు

తగ్గుతుంది. ఒక అన్నగా చెబుతున్నాను. ” ప్రాధేయ పడ్డాడు మంగరాజు.

“చూడు మంగరాజు, ఆయన జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్ళాలని మేం అనుకోవడం

లేదు. ఈ ఇల్లు వదిలి రాలేము. నువ్వు ఏమీ అనుకోవద్దు. ఆయన మీద అభిమానం తో, ఈ

పనులన్నీ నువ్వే భుజాన వేసుకుని చేసావు. నీ ఋణం తీర్చుకోలేం. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ

ఉండు. ” అన్నారు కన్నీల్లతొ జానకమ్మ.

“ఎంత మాట తల్లీ. రోజూ వచ్చి కనిపిస్తాను. ”అన్నాడు మంగరాజు.

ఇంటికి వచ్చాక అకస్మాతుగా రామనాధం గారు నెల క్రితం అన్న మాటలు గుర్తుకు

వచ్చాయి మంగరాజుకి. “మంగరాజూ, ప్రజలు మనల్ని ఎందుకన్నారో కృష్ణార్జునులని, దానిని

మనం నిజం చేయాలి. మన స్నేహం,బంధుత్వం గా మారాలి. సంగీతానికి శృతి,లయలు ఎంత

ముఖ్యమో, మన రెండు కుటుంబాలకు ఈ బంధం కూడా అంత ప్రధానమని నేను

భావిస్తున్నాను. ఏమంటావు?”

“అలాగే “ అని ఆయనకు మాట ఇచ్చాడు. అప్పుడు జానకమ్మ కూడా ఆయన పక్కనే

ఉన్నారు.

నెల రోజులు గడిచాకా కల్యాణి కాన్వెంట్ కి వెళుతోంది. మంగరాజు రోజూ సాయంత్రం

వచ్చి వాళ్ళిద్దర్నీ చూసి వెళ్తున్నాడు. ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చి ఇస్తున్నాడు.

కాలచక్రం లో సంవత్సరం గిర్రున తిరిగి వచ్చింది. శివపురం జిల్లా పరిషత్ హై స్కూల్ లో

ఒక సంగీతం మాస్టర్ వచ్చారు. ఆయన ప్రోత్సాహంతో షణ్ముఖ, కల్యాణి మ్యూజిక్ ఎం. ఏ. కట్టారు.

రెండు సంవత్సరాలలో ఇద్దరూ పాస్ అయ్యారు. తర్వాత కల్యాణి బి. ఎడ్. కూడా చేసింది.

షణ్ముఖ ఈ మధ్య కాలం లో కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాడు. తణుకు కంప్యూటర్ సెంటర్ లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు.

ఒక రోజు సాయంత్రం మంగరాజు, జానకమ్మ దగ్గర పిల్లల పెళ్లి విషయం కదిపాడు.

“కల్యాణి తో చెప్పాను. నువ్వూ,షణ్ముఖ పెళ్లి చేసుకోవాలని. ఇది నాన్నగారి కోర్కె. అని

కూడా చెప్పాను. దానికి అమ్మాయి ఒప్పుకొంది. కానీ తనకి కూడా ఉద్యోగం వచ్చాకా

తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ” మంగరాజు కి వివరించింది జానకమ్మ. వీరి ఇద్దరి

మాటలు పూర్తి అయ్యాకా కల్యాణి వచ్చింది.

ఆ ఏడాది జిల్లా సెలెక్షన్స్ లో కళ్యాణికి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆర్నెల్లు గడిచాకా

కళ్యాణి,షణ్ముఖ వివాహం శివపురం లోనే, రామనాధం ఇంటి ముందే పందిరివేసి జరిపించారు

సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలు. వివాహం అయ్యాకా సర్పంచ్ నూతన దంపతులను ఒక కోరిక కోరారు. “మీరిద్దరూ కూడా సంగీత విద్వాంసులే కదా. మీరు ఇద్దరూ కూడా కచేరీలు చేస్తే రామనాధం గారి ఆత్మ శాంతిస్తుంది. మన గ్రామానికి ఖ్యాతి వస్తుంది. ”

కల్యాణి, షణ్ముఖ ఇద్దరూ కూడా సంగీత కార్యక్రమాలు చేయడానికి అంగీకరించారు.

మొదటిసారిగా భీమవరం త్యాగరాజ గానసభలో షణ్ముఖ గాత్ర కచెరీ జరిగింది. కళ్యాణి

వయోలిన్ పై, మంగరాజు మృదంగం పై కచేరీ కి సహకరించారు. షణ్ముఖ పాడిన కీర్తనలు అన్నీ

శ్రోతలను అలరించాయి. ప్రజలలో మళ్ళీ శాస్త్రీయ సంగీతంపై మోజు కలిగింది. సంగీత సభలే

కాకుండా రోటరీ,లయన్స్ వంటి స్వచ్చంద సంస్థలు కూడా

సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. దాంతో శాస్త్రీయ సంగీతానికి పునర్వైభవం వచ్చింది.

ఏడాది గడిచేసరికి కల్యాణికి పండంటి మగ బిడ్డ కలిగాడు. మళ్ళీ రామనాధం గారే

పుట్టారని అందరూ సంతోషించారు. పిల్లాడికి ‘రామరాజు’ అని పేరు పెట్టారు.

**************************************************************************

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

కవి, రచయిత. 250కథలు, 300కవితలు ప్రచురితమైనవి. 10 కథా సంపుటులు, 7కవితా సంపుటులు, 2 నాటిక పుస్తకాలు ప్రచురితం. నా

సంపాదకత్వంలో 20 పుస్తకాలు ప్రచురితం అయ్యాయి.


116 views0 comments

Comentarios


bottom of page