top of page

నాన్న ..ఒంటరి


'Nanna Ontari' written by M R V Sathyanarayana Murthy

రచన : సత్యనారాయణ మూర్తి M R V

“నాన్న ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు” కోపంగా అంది శ్రావణి.

“ఇప్పుడు ఏం మునిగిపోయిందని ఈ నిర్ణయం తీసుకున్నాడు?” అసహనంగా గదిలో పచార్లు చేస్తూ అన్నాడు సందీప్. ఇద్దరికీ, తండ్రి త్రినాధరావు మీద చాలా కోపంగా ఉంది. పిల్లలు ఇద్దరికీ తన నిర్ణయం చెప్పి బయటకు వెళ్ళాడు త్రినాధరావు.

“మనిద్దరికీ మనశ్శాంతి లేకుండా చేయాలనే ఈ పని చేస్తున్నాడు నాన్న”అంది శ్రావణి. ఆమె మాటలకు ‘అవును’ అన్నట్టు తలాడించాడు సందీప్. కొద్దిసేపటికే త్రినాధరావు లోపలకు వచ్చాడు.

“మమ్మల్ని ఎందుకు అన్యాయం చేయాలని అనుకుంటున్నావు నాన్నా?”రోషంగా అడిగింది శ్రావణి. ‘అవును! నాదీ అదే ప్రశ్న’ అన్నట్టు తండ్రి కేసి చూసాడు సందీప్. త్రినాధరావు ఆమె మాటలకు ఒకింత ఆశ్చర్యపడి నెమ్మదిగా అన్నాడు ”నేను మీ ఇద్దరికీ సమ న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అమ్మా శ్రావణీ! నీకు పి.జి.చెప్పించాను. నువ్వు కోరుకున్న సంబంధమే చేసాను. అల్లుడు, నువ్వూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. హైదరాబాద్ లో నీకొక ఫ్లాట్, తమ్ముడికో ఫ్లాట్ కొని ఇచ్చాను. తండ్రిగా, మీ ఇద్దరికీ మంచి చదువు చెప్పించి ఉద్యోగాలలో కుదురుకునే వరకూ శ్రమించాను.పెళ్ళిళ్ళు చేసాను. స్వంత నివాసాలు ఏర్పాటు చేసాను. ఇదేనా నేను మీకు చేసిన అన్యాయం?”

“అది ఏ తండ్రి అయినా చేస్తాడు. అది కామనే” తేలిగ్గా అన్నాడు సందీప్.

“మరి ఇంకేమిటి?”సూటిగా అడిగాడు త్రినాధరావు.

“నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం” విసురుగా అంది శ్రావణి. ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు త్రినాధరావు.

“ఈ జీవన పోరాటంలో నేను చాలా అలసిపోయాను. నాకు శాంతి కావాలి” దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు త్రినాధరావు.

“అంటే మా దగ్గర ఉంటే నీకు శాంతి ఉండడం లేదా? మేము నిన్ను ఇబ్బంది పెట్టామా?” ఉక్రోషంగా అంది శ్రావణి. “అదేం లేదమ్మా, మీరు ఇద్దరూ నన్ను బాగానే చూసుకున్నారు. కానీ నాకే మొహమాటంగా ఉంటోంది. నా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను” అన్నాడు త్రినాధరావు. పిల్లలు ఇద్దరూ తండ్రికేసి చిరాగ్గా చూస్తున్నారు.

“చూడండి.ఆ వచ్చే ఆవిడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు అనుమానిస్తున్నారు. అదేం ఉండదు. నీలవేణి చాలా మంచిది. ఆమెకీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరితో కలిసిపోయే మనిషి” పిల్లల్ని కన్విన్సు చేయబోయాడు త్రినాధరావు.

“నువ్వు ఎన్నైనా చెప్పు నాన్నా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. ఇంకోసారి ఆలోచించు. మేం వెళ్తున్నాం. పదరా తమ్ముడూ” అంది శ్రావణి. మరుక్షణమే ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఏ భావం లేకుండా వాళ్ళు వెళ్తున్న వైపు చూసాడు త్రినాధరావు. కొద్దిసేపయ్యాక రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాడు.

***

రెండు నెలలు గడిచాయి. నీలవేణి, త్రినాధరావు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తనని అర్ధం చేసుకున్న కొద్దిపాటి మిత్రుల్ని ఇంటికి ఆహ్వానించి నీలవేణిని పరిచయం చేసాడు త్రినాధరావు. ఈ వయసులోనే మనిషికి తోడు ఉండాలని, నువ్వు మంచి పని చేశావని మిత్రులు అభినందించారు.

“త్రినాధా! పిల్లలు అలిగారని నువ్వు బాధపడకు. ఇవి సహజం. వాళ్ళ అమ్మ స్థానంలో వచ్చే ఆవిడ ఎలా ఉంటుందోనని, వాళ్ళ భయం కావచ్చు. ముందు ముందు అవే సర్దుకుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకో. నిన్ను నమ్మి వచ్చిన నీలవేణికి న్యాయం చెయ్యి” అన్నాడు రాఘవ. ఒక గంట సేపు ఉండి కబుర్లు చెప్పి వెళ్ళారు మిత్రులు.

రోజూ ఉదయమే పూలు కోసి, త్రినాధరావు పూజకు సిద్ధం చేసేది నీలవేణి. పూజ అయ్యాక అతనికి ఇష్టమైన టిఫిన్ చేసేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేవారు. తర్వాత పేపర్ చదవడం, టి.వి. చూడడం మధ్యాహ్నం భోజనం, తర్వాత విశ్రాంతి. సాయంత్రం టీ తాగి పార్క్ కి వెళ్ళడం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నాయి. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి.

పిల్లలకు తమకు మధ్యన ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని ఒకరోజు కూతురికి ఫోన్ చేసాడు త్రినాధరావు. “అమ్మా! కులాసాగా ఉన్నారా? నేనూ, నీలవేణి హైదరాబాద్ వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నాము” అన్నాడు.

“మేము ఊళ్ళో ఉండటం లేదు. తర్వాత చూద్దాం” అని ఫోన్ పెట్టేసింది శ్రావణి. కనీసం ‘ఎలా వున్నావు నాన్నా!’ అని కూడా అడగకుండా ఫోన్ పెట్టేసినందుకు చాలా బాధ పడ్డాడు త్రినాధరావు. కొడుక్కి ఫోన్ చేస్తే అతని దగ్గర నుండి అదే సమాధానం వచ్చింది. ఆ రోజల్లా త్రినాధరావుకి మనసంతా బాధగానే ఉంది.

“మరి కొంత కాలం గడిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది. బెంగ పెట్టుకోకండి” భర్తని అనునయించింది నీలవేణి. మర్నాడు ఉదయం భర్తతో “ఒక వారం రోజులు పుణ్య క్షేత్రాలు తిరిగి వద్దాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవ సహాయం కూడా లభిస్తుంది” అంది నీలవేణి. మిత్రుడు రాఘవ కూడా ప్రోత్సహించడంతో పది రోజుల పాటు శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, అరుణాచలం తిరిగి వచ్చారు త్రినాధ రావు, నీలవేణి. పదిరోజులూ ఆనందంగా గడిపి వచ్చారు. మిత్రులకి ప్రసాదాలు ఇవ్వడం, యాత్రా విశేషాలు చెప్పడం వలన త్రినాధరావులో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. పిల్లలకు కూడా యాత్రలు చేసి వచ్చామని చెప్పారు.

శ్రావణి తమ్ముడికి ఫోన్ చేసింది “చూసావురా, నాన్న చేస్తున్న పని? కొత్త పెళ్ళాన్ని వెంటబెట్టుకుని యాత్రల వంకతో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. మన అమ్మని తిరుపతి తీసుకు వెళ్ళడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. ఆరు నెలలు తిరగకుండానే ఆవిడగారిని తిరుపతి తీసుకువెళ్ళాడు” అక్కసుగా అంది శ్రావణి. సందీప్ కూడా తండ్రి చర్యలను తప్పుపట్టాడు.

మరో ఆరు నెలలు గడిచాయి. శ్రావణి, సందీప్ లలో మార్పు రాలేదు. సంక్రాంతి పండుగకు రమ్మని పిల్లలు ఇద్దరినీ ఆహ్వానించాడు త్రినాధరావు. మాకు వీలు అవదని ఇద్దరూ ఖరా ఖండిగా చెప్పారు. నీలవేణి కూతుళ్ళు ఇద్దరినీ పండుగకు పిలవగా వాళ్ళు తమ పిల్లలతో సహా వచ్చి వెళ్ళారు. త్రినాధరావు అందరికీ కొత్త బట్టలు పెట్టాడు. వాళ్ళు ఉన్న వారం రోజులు ఇల్లంతా సందడిగా ఉంది.

”తాతగారూ ..తాతగారూ ..” అంటూ చిన్న పిల్లలు పిలుస్తుంటే త్రినాధరావు చాలా ఆనందించాడు. తన మనవలు కూడా పండుగకు వస్తే ఇంకా బాగుండేది కదా అని బాధ పడ్డాడు.

ఏడాది గడిచింది.నీలవేణి కాశీ చూడాలంటే విమానం మీద తీసుకువెళ్ళాడు త్రినాధరావు. తను ఎప్పుడూ విమానం ఎక్కలేదు. భార్య సంతోషమే తన సంతోషమని భావించాడు. కాశి , అయోధ్య, నైమిశారణ్యం అన్నీ చూసి వచ్చారు త్రినాధరావు, నీలవేణి. మరుసటి ఏడాది నీలవేణితో కలిసి మైసూరు, బెంగుళూరు, ఊటి తిరిగి వచ్చాడు త్రినాధరావు.

శ్రావణి, తన స్నేహితురాలు రమణి వలన తండ్రి ఎక్కడకు వెళ్తున్నాడో తెలుసుకుంటోంది. తండ్రి పనులకు ఆమె మనసు కుత కుత ఉడికిపోయింది.

వెంటనే తమ్ముడికి ఫోన్ చేసింది.”చూసావురా నాన్న చేసిన పని?” కోపంగా అంది శ్రావణి.

“ఏం జరిగింది అక్కా?” ఆసక్తిగా అడిగాడు సందీప్.

“కొత్త పెళ్ళాన్ని వెంటబెట్టుకుని నాన్న హనీమూన్ వెళ్ళారు. హవ్వ! ఎవరైనా, ఏదైనా అంటారన్న భయం కూడా లేకుండా పోయింది. అమ్మ ఎక్కడికైనా తీసుకు వెళ్ళమని అడిగితే ఆర్థిక పరమైన లెక్కలు చెప్పేవాడు.

పిల్లలు ఎదుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పేవాడు. అటువంటి నాన్న ఇప్పుడు ఖర్చుకి లెక్క చేయడం లేదు. ఆవిడ గారు నాన్నని కీలుబొమ్మని చేసి ఆడిస్తోంది” అక్కసుగా అంది శ్రావణి.

“అవును అక్కా! నాన్న చాలా మారిపోయాడు” వంత పాడాడు సందీప్. పావుగంట సేపు తండ్రిని విమర్శించి ఫోన్ పెట్టేసింది శ్రావణి. మరో రెండేళ్ళు గడిచాయి. శ్రావని, సందీప్ తండ్రి దగ్గరకు రావడం మానేశారు. నీలవేణి పిల్లలు వచ్చి వెళ్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న శ్రావణి, సందీప్ తండ్రి మీద మరింత కోపం పెంచుకుని తండ్రితో మాట్లాడటం మానేశారు.

ఒకరోజు ఉదయం శ్రావణికి ఫోన్ చేసాడు త్రినాధరావు “మీ పిన్ని ఈరోజు ఉదయం చనిపోయింది. చివరి సారిగా చూడటానికి వస్తావా అమ్మా!” బాధతో అడిగాడు. ఆ వార్త వినగానే శ్రావణి చిరాకు పడింది.

”ఆవిడతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఐనా నాకు తీరుబడి లేదు” అని ఫోన్ పెట్టేసింది. సందీప్ అదే సమాధానం చెప్పాడు తండ్రికి. నీలవేణి మరణం శ్రావణికి లోలోపల ఆనందం కలిగించింది. ‘హమ్మయ్య! ఈవిడ పోవడం నాన్నకు పట్టిన శని వదిలినట్టేన’ని భావించింది.

రెండు నెలలు గడిచాక శ్రావణికి రమణి ఫోన్ చేసి చెప్పింది ”మీ నాన్న నీలవేణి అస్థికలు తీసుకుని కాశి, అలహాబాద్ వెళ్లి గంగా నదిలో నిమజ్జనం చేసి వచ్చారు” అని. ఈ మాట వినగానే శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అయిపొయింది. ఆ రాత్రి తీరుబడిగా కూర్చుని తండ్రికి ఉత్తరం రాసింది. మూడు రోజులకు త్రినాధరావుకి ఉత్తరం చేరింది.

”నాన్నకు నమస్కారములు.మమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో అమ్మ ఎంతో శ్రమ పడింది. మీ జీతంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంటే అప్పడాలు, వడియాలు చేసి ఆ పాకెట్లు ఇంటింటికి తిరిగి అమ్మేది. రాత్రిళ్ళు పదిగంటల వరకూ మేలుకుని మిషన్ మీద బట్టలు కుట్టేది. ఒక యంత్రంలా కుటుంబం కోసం కష్టపడింది. మాకు మంచి బట్టలు కొనేది. తాను మాత్రం కాటన్ చీరలే కొనుక్కునేది. మిమ్మల్ని ‘అక్కడకు తిసుకేల్లండి, ఇక్కడకు తీసుకెళ్లండి’ అని ఎప్పుడూ నోరు తెరిచి అడగలేదు. తన అనారోగ్యం దాచి పెట్టుకుని కొవ్వొత్తిలా కాలి, కరిగిపోయింది. అమ్మ అస్థికలు మీరు రాజమండ్రి గోదావరిలో కలిపి వచ్చారు. కానీ ఇప్పుడు మీరు చేసినది ఏమిటి? నిన్న గాక మొన్న వచ్చిన ఆవిడని వేలు,లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో తిప్పారు.కాశి, అలహాబాద్ వెళ్లి ఆస్థినిమజ్జనం చేసి వచ్చారు. ఇది మీకు సబబుగా అనిపించిందా? ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. మీ కష్ట సుఖాలలో ముప్ఫై ఐదేళ్ళు పాలు పంచుకున్న ఆ ఇల్లాలికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా? మా అమ్మ జ్ఞాపకాలని మీ మనసులోంచి తుడిచేయడం నేను తట్టుకోలేకే, మన ఇంటికి రావడం మానేసాను. అమ్మకి ద్రోహం చేసినట్లు మీకు అనిపించడం లేదా నాన్నా? ఎందుకు మారిపోయావు నాన్నా ఇలా? ఇప్పటికైనా మా పాత నాన్నలా ఉంటావా నాన్నా? నీలో మార్పు వస్తుందని కన్నీళ్ళతో ఎదురు చూస్తున్నాను నాన్నా.. శ్రావణి”

ఉత్తరం చదివి త్రినాధరావు దీర్ఘంగా నిట్టూర్చాడు. హాలులో ఉన్న భార్య విశాల ఫోటో కేసి చూసి కన్నీళ్ళుపెట్టుకున్నాడు. కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగింది. ఒక రోజు శ్రావణి కి రిజిస్టర్ పార్సెల్ వచ్చింది. అందులో రెండు కవర్లు ఉన్నాయి. తన పేరుమీద ఉన్న కవరు తెరిచి చదవసాగింది.

“చిరంజీవి శ్రావణిని మీ నాన్న దీవించి వ్రాయునది. నీ ఆవేదన అర్ధం చేసుకున్నాను.నా చర్యలను మీరు ఇద్దరూ సరిగా అర్ధం చేసుకోలేదనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీ అమ్మ పట్ల నా ప్రేమ, అనురాగం నా గుండెలో ఇప్పటికీ పదిలంగానే ఉందమ్మా. మీ అమ్మ తోడు లేకపోతే నేను ఈ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాలేనని నాకు పూర్తిగా తెలుసు. అందుకు మీ అమ్మకు నేనెప్పుడూ ఋణపడిఉంటాను. ఇంక నీలవేణి సంగతి! నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. నీలవేణి నా క్లాసుమేటు. వాళ్ళ నాన్నగారే నాకు స్కూల్ ఫీజు కట్టడం, పుస్తకాలు కొని ఇవ్వడం చేసేవారు. నీలవేణి పదవతరగతి చదివేటప్పుడు వాళ్ళ నాన్నగారు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోయింది. అప్పటికే ఆమె అక్కలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నీలవేణి కాలేజీ చదువు ఆగిపోయింది. రైస్ మిల్లులో అకౌంట్స్ రాసే గుర్నాధంతో ఆమె పెళ్లి జరిపించేసారు వాళ్ళ బావలు ఇద్దరూ. నేను స్కాలర్ షిప్పులు మీద డిగ్రీ చదువుకుని గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను. ఏళ్ళు గడిచినా నీలవేణి గురించి తెలియలేదు. మీ అమ్మ చనిపోయాక నేను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఒక సత్రంలో వంట చేస్తున్న నీలవేణిని చూసి ఆశ్చర్యపోయాను. తనకు ఇద్దరు ఆడపిల్లలని, వాళ్లకు పెళ్ళిళ్ళు అయిపోయాయని, రోడ్ ఆక్సిడెంట్ లో భర్త చనిపోతే, గత్యంతరం లేక ఇక్కడకు వచ్చి వంట చేసి బతుకుతున్నానని చెప్పింది. వెంటనే ఆమెని నాతో తీసుకువచ్చాను. సమాజం మమ్మల్ని అపార్ధం చేసుకోకూడదని ఆమెని పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమెకి తోడుగా ఉండాలనే ఆమెని పెళ్లి చేసుకున్నాను కానీ వేరే ఉద్దేశ్యం లేదు. జీవన పోరాటంలో అలసిపోయి, చరమదశకు చేరిన ఆమెకి సాంత్వన చేకూర్చాలని భావించాను. అందుకే ఆమె చిరకాల కోర్కెలను తీర్చడానికే ఆమెని ఎన్నో ప్రదేశాలకు తీసుకువెళ్ళాను. నేను చేసిన పనులకు మీరు, సమాజం కూడా నన్ను తప్పుపట్టారు. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెపుతుందని మౌనం వహించాను. నీలవేణి కూడా బాధపడింది ‘నా వలన మీరు మీ పిల్లలకు దూరం అవుతున్నారని’. ‘ఫరవాలేదు, అన్నీ అవే సర్దుకుంటాయ’ని చెప్పేవాడిని. నీలవేణి కోరుకున్నట్టుగా,ఆమె అస్థికలు గంగా నదిలో నిమజ్జనం చేసాను. అంతే! అమ్మా శ్రావణీ! మీ నాన్న ఎప్పుడూ మీవాడేనమ్మా. నా బిడ్డల మీద ప్రేమ ఎప్పుడూ నా గుండెల్లో గూడు కట్టుకునే ఉందమ్మా. శివపురంలోని మన ఇల్లు నీకు, తమ్ముడికి రాసాను. డాక్యుమెంట్లు కవర్ లో పంపుతున్నాను. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకవద్దు. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. ఒంటరిగా ఈ లోకం లోకి వచ్చాను. ఒంటరిగానే వెళ్ళిపోతున్నాను. నువ్వూ,తమ్ముడూ సుఖంగా ఉండండి. నాన్న ..”

ఉత్తరం చదవడం పూర్తిచేసిన శ్రావణి కళ్ళు శ్రావణ మేఘంలా వర్షిస్తూనే ఉన్నాయి. ‘నిన్ను అపార్ధం చేసుకున్నాను నాన్నా. నన్ను క్షమించు’ అంటూ రోదిస్తోంది. అదే సమయంలో త్రినాధరావు కాశి లో తను

జీవితాంతం ఉండడానికి ఒక ఆశ్రమం యజమానితో మాట్లాడుతున్నాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


181 views0 comments
bottom of page