top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

గురు దక్షిణ


'Guru Dakshina' written by M R V Sathyanarayana Murthy

రచన : M R V సత్యనారాయణ మూర్తి

“తప్పదు నాన్నా. అంతకన్నా నాకు వేరే దారి లేదు.” కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ , తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్. రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్త ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు. ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టుర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కు కి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కు కి చేరుకున్నాడు. అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు. మ్లానవదనంతో కూర్చున్న రాఘవ రావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ. కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు. నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది. మన ముగ్గురి మధ్య రహస్యాలు లేవుగా.” రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయ మంటున్నాడు.” అన్నాడు. “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట . నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు , వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ప్లాట్ కొంటాడట. అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు. మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. కాసేపటికి సుబ్బారావు అడిగాడు “మీ ఆవిడ ఏమంది?” “తల్లి ప్రేమ కదా. కొడుకు వైపే మాట్లాడింది. 'ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా', అని అంది .” “రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది . కానీ పరిస్థితుల్ని బట్టి మనం నడచుకోవాలి . నీకు ఒక్కగానొక్క కొడుకు. అతణ్ణి కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో. ఆలోచించు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం. సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు. ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు . అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు. కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు. గతం పదే పదే గుర్తుకు వస్తోంది . ***** పంచాయతి ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు స్థలం తీసుకుంటే రాఘవరావు, భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే , జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది. పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది. వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది. ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు. మిగతా మాస్టర్లు ‘వాళ్లిద్దరికీ చాదస్తం అని’ విమర్శించినా వాళ్ళ ఇల్లు నందన వనంలా పెరిగాకా అభినందించకుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు . మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్ చప్టా చేయించాడు. రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు. సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే. వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని మాట్లాడుకునే వారు. టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు. సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు. రెండు పడక గదులు, ఒక హాలు , వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు. పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాల్లిద్దరికీ. ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు. కానీ తప్పదు. కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు. ***** కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు. జానకమ్మ బెంగ పెట్టుకుంది , కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని. ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి. ప్రతీ గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా ,టేపు తో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు. “మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క. ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి. మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?” రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే. అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?” ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయ్యాలి. అందుకని స్థలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను. ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు. అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు. చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు” ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని . రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు. మర్నాడే రాఘవరావు షావుకారికి కబురు చేసి తమ అంగీకారం చెప్పాడు. వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది. రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది. నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదాబాద్ తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు , జానకమ్మ. కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ . మరో నెలరోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ. రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే ‘మనం ఆలస్యం చేయడం వలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్. కొడుకు ,కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి. ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది. పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’ జానకమ్మ దగ్గరకు వచ్చేసింది. ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది. ఆరునెలలు గడిచాయి. పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో టీచర్గా చేరింది. వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో. శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు. వంట తక్కువ , పని కూడా తక్కువే . విశ్రాంతిగా ఉండేది. ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని. మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.

ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు. మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘ మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది. శీతాకాలం వచ్చింది. టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది. అది చూసి రాజేష్ బజార్ నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ. ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు. పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు. రాఘవరావు, జానకమ్మ యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే పడింది. సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు. జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని. అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మళ్ళీ వాళ్ళ గదిలోనే పడుకో సాగారు. దాంతో రాఘవరావు ,జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది. కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని. ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు. శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని. రెండేళ్ళు గడిచాయి. ఒంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి పోతున్నారు వాళ్ళిద్దరూ . ఈ మధ్యనే పరమేశం, కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావు ని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు. పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు. రాఘవరావు, జానకమ్మ లను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు. “ఏమిటి రాఘవా ఇది? ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి ? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించుకున్నారా? “ “ఆ ఏమీలేదు , కొద్దిపాటి నీరసం . అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు. వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ. ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం. శివపురం వచ్చాక సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇద్దరూ చిక్కి పోయారు. కొడుకు వాళ్ళని పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది. చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ ,చేతులూ ఆడుతుండగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.” కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు. తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు. రెండు నెలలు గడిచాయి. ఒకరోజు రాజేష్ ఇంటికి మిథున్, సాత్విక్ వచ్చారు. “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము. వచ్చే ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది. ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిథున్. నాన్నగారు పూజ చేసుకుంటున్నారు కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలు లోకి వచ్చాడు. మిథున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి , తాము వచ్చిన పని చెప్పారు. “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు. “పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిథున్. తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు. ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిథున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు. అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ. వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది. శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని. పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండు రోజులూ మా ఇంట్లోనే ఉండాలని’. చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు. విజయవాడ లో భోజనాలు చేసి , సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ. పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిథున్ , సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లి పోయారు. ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు. మిత్రులు అన్దరికీ భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం. మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి. “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు. మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు. ఆ రాత్రి రాఘవ రావు , జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ. మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది. ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అన్దరికీ పాదాభివందనం చేసి , ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు.రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు. అమెరికాలో ,ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు ,పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూల కారకులు మిథున్ ,సాత్విక్. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్ చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్స్తున్నాను. మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానం చేసి , వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు. రాఘవరావు మాట్లాడుతూ ,”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత. మీరు మన ఊరికి ,మన స్కూల్ కి పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి. మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి. మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది. ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది. ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు. అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు. రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిథున్. రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు. తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి. గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిథున్ , రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు. “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు ,అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి. షావుకారు దగ్గర నుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలం క్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ , కోట్లు సంపాదిస్తున్నమంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే .మీకు గురుదక్షిణ చెల్లించు కోవాలనే నేనూ , నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం. మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు. మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది. మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం. మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక . కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు. కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిథున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దుపెట్టుకున్నాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి , ప్రతి గుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు. తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ, చాలా సేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు. ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు , మిత్రబృందం మిగిలారు. పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని ‘ మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో. “రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది. ***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు :

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V

ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

244 views0 comments

Comments


bottom of page