top of page
Original.png

ఇంకా తెలవారదేమి?

2 minutes ago
5 min read

వందే భారత్ రైలులో భార్యా కూతురిని తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కూర్చున్న 47 ఏళ్ల వ్యక్తి

Inka Thelavarademi? - Telugu Family Story | Seeda Nagaraju

ఇంకా తెలవారదేమి? - తెలుగు కుటుంబ కథ | సీదా నాగరాజు

Published in manatelugukathalu.com on 23/11/2026


భార్యా కూతురికి చేసిన అన్యాయాన్ని గుర్తించిన ఓ భర్త, తన తప్పులకు పశ్చాత్తాపంతో తిరిగి వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబ బంధాలు, దాంపత్య సంఘర్షణ, పశ్చాత్తాపాన్ని హృదయస్పర్శిగా ఆవిష్కరించే కథ ‘ఇంకా తెలవారదేమి?’


రాత్రి 11 గంటలు అయింది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. వందే భారత్ వేగంగా వెళ్తోంది. అంతకంటే వేగంగా ఆలోచనలు పరుగెడుతున్నాయి. 


47 సంవత్సరాల నా జీవితం కళ్లముందు కదలాడుతూ కునుకు పట్టడం లేదు. ఎలా పెరిగాను, ఎలా చదువుకున్నాను, ఎలా జీవించాను, పెళ్లి, తదనంతర పరిణామాలు, తోబుట్టువుల కోసం చేసిన త్యాగాలు, ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకున్న వినతిని అమ్మ కోసం, తోబుట్టువుల కోసం పెట్టిన ఇబ్బందులు... 15 సంవత్సరాల దాంపత్య జీవితంలోని మధుర స్మృతులు, మెరుపులు, మలుపులు, మరకలు, చెదరని జ్ఞాపకాలు, తొమ్మిదేళ్ల కూతురు ప్రణతి తండ్రిగా మరచిపోలేని మధురానుభూతులు... అన్నీ మనసుని, మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


భార్య వినతి, కూతురు ప్రణతి గుర్తుకొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంత పొరపాటు చేశాను? వాళ్లిద్దరికీ ఎంత అన్యాయం చేశాను? అమ్మ మాట విని, తమ్ముడి సలహాలు పాటించి, చెల్లి చెప్పుడు మాటలు విని ఆవేశంతో ఎంతో తప్పు చేశాను. 


నా ప్రాణానికి ప్రాణమైన భార్యకు, ఒక్కగానొక్క కూతురుకు దూరమై ఎవరూ లేని వాడిలా ఇన్నాళ్లూ జీవచ్ఛవంలా బతికాను.


వినతి విషయంలో మాత్రం ఎన్నోసార్లు తప్పు చేశాను. తన మీద నాకు ప్రేమ లేక ఆ తప్పులు చేయలేదు. తనంటే నాకు ప్రాణం. 


తను నాకు మాత్రమే సొంతం అని నా అభిప్రాయం. అందుకేనేమో తనని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. పాపం తను మాత్రం నా కోసం వాళ్ల అమ్మానాన్నలను కూడా ఎదిరించింది. 


నేను చెప్పినట్లుగా చాలాసార్లు వాళ్లతో పరుషంగా కూడా మాట్లాడింది. నిష్కారణంగా నిందించింది కూడా. అమ్మ చెప్పే కంప్లైంట్లు, చెల్లి చెప్పే చెప్పుడు మాటలు, పెళ్లాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలని తమ్ముడు చెప్పే ఉచిత సలహాలు నన్ను రాక్షసుడిని చేసేవి. మగవాడిని అనే అహంతో చాలాసార్లు చేయి కూడా చేసుకున్నాను. 


అయినా తను చాలాసార్లు నిగ్రహించుకుంది.

తనంటే నాకు ఎంత ఇష్టం అంటే తన కోసం సన్నగా, నాజూకుగా తయారు కావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. జిమ్‌లకు వెళ్లాను. 


వ్యాయామాలు చేశాను. సన్నగా, నాజూకుగా తయారయ్యాను. ఒకసారి తన మీద కోపంతో తనని కాదుగానీ, నన్ను నేను కత్తితో కొద్దిగా పొడుచుకున్నాను. 


ఆ రోజు తను ఎంతగా కుమిలిపోయిందో మాటలతో చెప్పలేను. నిజం చెప్పాలంటే తను భయపడిపోయింది. బహుశా నన్నొక సైకో అనుకుందేమో!


కొన్నాళ్లకు మాకో అమ్మాయి పుట్టింది. అప్పుడు కూడా వినతి వాళ్ల అమ్మానాన్న మా అమ్మకి, చెల్లి తమ్ముళ్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తల్లీ బిడ్డని వదిలేసి వాళ్లతో పాటు వచ్చేశాను. ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటే నా మీద నాకే సిగ్గేస్తుంది. 


ఇలా ఒకటా రెండా ఎన్నో పొరపాట్లు చేశాను. కొన్నాళ్లు అందరికీ దూరంగా ముగ్గురమే బెంగళూరులో సపరేట్‌గా ఉన్నాం. 


చాలా అన్యోన్యంగా ఉన్నాము. అక్కడే స్థలం కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకున్నాము. 


గృహప్రవేశం కూడా చేద్దామనుకుంటూ ఉండగా తనకు హైదరాబాద్‌లో ప్రమోషన్ మీద మంచి ఉద్యోగం రావడంతో బెంగళూరు వదిలి హైదరాబాద్ చేరుకున్నాం. 


మా అమ్మ, తమ్ముడు, చెల్లి వాళ్లందరూ కూడా అక్కడే ఉండడంతో నేను కూడా వాళ్లకు దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాను. అయినా వినతి మాత్రం అభ్యంతరం చెప్పలేదు సరికదా వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించింది. 


మా తమ్ముడు సైంధవుడిలా అడ్డుపడేవాడు. తనతో మాట్లాడేవాడు కాదు. మా అమ్మ సరే సరి. ఎప్పుడూ నిష్ఠూరంగానే మాట్లాడుతుండేది. 


మా చెల్లి మాత్రం బాగానే మాట్లాడుతుండేది. అయినా నా కూతురు ప్రణతి విషయంలో గొడవలు వచ్చేవి. 


ప్రణతి కొంచెం అల్లరి పిల్ల. అమ్మమ్మ తాతయ్యల దగ్గర గారాబంగా పెరిగింది. నేనూ అంతే అపురూపంగా చూసుకుంటాను. అందుకేనేమో బాగా అల్లరి చేస్తుంది. 


ఆ విషయం నచ్చని అమ్మ ఆడపిల్ల అణకువగా ఉండాలంటూ కోప్పడుతుంది. మా తమ్ముడి సంగతి సరే సరి. 


పాప కొంచెం బొద్దుగా ఉంటుందని తిండి తగ్గించండి అని ఉచిత సలహాలు చెప్తుంటాడు. అందుకేనేమో వినతికే కాదు, ప్రణతికి కూడా వారంటే పడదు.

వాళ్లు అలా ప్రవర్తించడం నాకు కూడా నచ్చదు. 


కానీ సొంత అమ్మ, తమ్ముడు, చెల్లి... ఏమనగలను? నిజం చెప్పాలంటే, వారి అజాగ్రత్త కారణంగా నా చిన్నారి కూతురు ప్రణతికి యాక్సిడెంట్ అయ్యి నాలుగు నెలలు హాస్పిటల్లో కూడా ఉండాల్సి వచ్చింది. 


తన బాగోగులు చూసేవారెవరూ లేక నా భార్య తను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ పాపను ఆ నాలుగు నెలలు దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. ఎవరికి తప్పినా అమ్మానాన్నలమైన మాకు తప్పదు కదా!


ఇలా ఎన్నో విషయాలలో వాళ్లు నాకు అన్యాయమే చేశారు. నేను మాత్రం నా శాయశక్తులా వారికి న్యాయమే చేశాను. 


నా కుటుంబాన్ని పక్కనపెట్టి మరీ వాళ్ల అవసరాలు తీర్చాను. తమ్ముడి కుటుంబం సెటిల్ కావడం కోసం ఎన్నోసార్లు డబ్బు సాయం కూడా చేశాను. 


ఒక సంవత్సరంలోనే నా భార్యకు కూడా తెలియకుండా దాదాపు 10 లక్షలు తమ్ముడి భార్య బ్యాంకు అకౌంట్‌కు పంపించాను. 


వ్యాపారం చేస్తాను అంటే పెట్టుబడి పెట్టాను. లాభం కాదు కదా అసలుకే ఎసరు పెట్టాడు నా ఒక్కగానొక్క తమ్ముడైన అభినవ లక్ష్మణుడు. వాడు చేసిన మోసానికి, నష్టాలకు 'హా! లక్ష్మణా!!' అని నేను ఏడ్చే పరిస్థితులు వచ్చాయి.


నిజం నిప్పులాంటిది కదా! అందుకే నా కాపురంలో నిప్పులు చెలరేగాయి. నేను సంపాదించే సంపాదనలో చాలా భాగం అమ్మ, తమ్ముడు, చెల్లి కోసం ఖర్చుపెడుతున్నానని వినతికి తెలిసింది. అగ్గి మీద గుగ్గిలం అయింది. 


మగవాడిని కదా మండిపోయాను. భర్తను కదా భార్యను బాధేశాను. "నా సంపాదన నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు?" అని దబాయించాను. 


మా అమ్మ నన్నే సపోర్ట్ చేసింది, ఎంతైనా అమ్మ కదా! పైపెచ్చు నేను డబ్బులు ఇస్తున్నది వాళ్లకే కదా! మా చెల్లి కూడా నన్నే సమర్థించింది. ఎందుకు సమర్థించదు? నా భార్య నగలు తాకట్టు పెట్టి మరీ తనకు రెండవసారి ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేయించాను కదా! మా తమ్ముడు అయితే ఆడవాళ్ల దగ్గర ఆ మాత్రం గట్టిగా, కఠినంగా ఉండాలి అన్నయ్యా అని మనస్ఫూర్తిగా అభినందించాడు. 


నిజమే మరి, నా జీతంతో తను, తన భార్య, తన కొడుకు జల్సాలు చేస్తూ సంతోషంగా బతికేస్తూ ఉంటే ఎవరు మాత్రం సమర్థించకుండా ఉంటారు?


కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు మా దంపతుల మధ్య పొరపొచ్చాలకు వీళ్లంతా కారణమయ్యారు. చివరికి నా భార్య పాపను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. 


అందరూ 'తనే వస్తుందిలే బెట్టుగా ఉండు' అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు గానీ, 'తప్పురా నువ్వు అలా మాట్లాడకూడదు' అని గానీ, 'వాళ్ల పుట్టింటికి వెళ్లి తనకు నచ్చజెప్పి భార్యాపిల్లలను తీసుకొనిరా' అని గానీ ఎవరూ చెప్పిన పాపాన పోలేదు.


నెలలు గడిచాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా ఎవరిలోనూ పశ్చాత్తాపము గానీ, జాలి గానీ, దయ గానీ కనపడలేదు. 


అందరూ ఎవరికి వారు తమకు పట్టనట్లు, తమకు సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు. నేను మాత్రం పెళ్లయినా బ్రహ్మచారిలా, పాప ఉన్నా పిల్లలు లేని అభాగ్యునిలా ఒంటరిగా బతుకీడిస్తున్నాను.


తమ్ముడు హాయిగా తన భార్యతో, చెల్లి హాయిగా తన భర్తతో సంసారం చేసుకుంటున్నారు. నేను మాత్రం ఒంటరిగా ఉండిపోయాను. తమ్ముడు మాత్రం రోజూ బ్రాందీ, విస్కీలు తీసుకొని వచ్చి కంపెనీ ఇస్తూ ఉంటాడు.


నా పరిస్థితి ఇలా ఉంటే, పుట్టినింటిలో నా భార్య పరిస్థితి మరోలా ఉంది. తన పేరు మీద క్రెడిట్ కార్డులు తీసుకొని నేను మా తమ్ముడు కోసం, చెల్లి కోసం చేసిన అప్పులు తన నెత్తిన పడి అవి తీర్చలేక, అడిగే వారికి చెప్పలేక నానా అవస్థలు పడుతూ ఉంది. 


నాలో ఉన్న హింసాప్రవృత్తి సదరు బ్యాంకు వాళ్లకు తన అడ్రస్ చెప్పి మరీ తనను వేధించేలా, తనకు మనశ్శాంతి లేకుండా చేసేలా ప్రేరేపించింది. 


మొదట్లో తను బాధపడుతుంటే చూసి నాకు బాధనిపించింది గానీ మా అమ్మ నన్ను సమర్థించింది. "ఇలా అయితేనే తను దారికి వస్తుంది. 


గత్యంతరం లేక నీ దగ్గరికి వచ్చేస్తుంది. నోరు మూసుకొని నీ దగ్గరే పడి ఉంటుంది" అని చెప్పేటప్పటికీ కొంచెం సర్దుకున్నాను. తనను క్రెడిట్ కార్డ్ వాళ్లు ఇంకా ఇంకా వేధించేలా చేశాను. దీనినే పైశాచిక ఆనందం అంటారేమో!


తనంతట తనే వస్తుంది, నా కాళ్లమీద పడి క్షమించమంటుంది అని నా తమ్ముడు చెప్తే నిజమే అనుకున్నాను. కానీ తాను రాలేదు. 


మారని వ్యక్తి కోసం, మనసు లేని వ్యక్తి కోసం, భార్యాపిల్లల గురించి పట్టించుకోని భర్త కోసం ఎందుకు ప్రాకులాడాలి అనుకుందేమో గానీ తిరిగి రాలేదు.


నా ఒక్కగానొక్క కూతుర్ని తలుచుకుంటే నా పైన నాకే అసహ్యం వేస్తుంది. నేనంటే తనకు ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. మేమిద్దరం ఎన్నో ఆటలు ఆడుకొనేవాళ్లం. 


రోజూ తనను స్కూలుకు నేనే తీసుకొని వెళ్లేవాడిని. తన చేత ఉదయం బ్రష్ చేయించడం మొదలుకొని రాత్రి తనను దగ్గరుండి పడుకోబెట్టేవరకు అన్ని విషయాలలో నేనే ఇనిషియేటివ్ తీసుకొని అపురూపంగా చూసేవాడిని. 


అట్లాంటి నా గారాల కూతురికి కూడా అన్యాయమే చేశాను. తను ఎలా ఉందో, ఏమి తింటుందో, ఎలా చదువుతుందో కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నన్నే నమ్ముకున్న నా భార్యాపిల్లలకు అన్యాయం చేశాను.


అప్పుడు నా అంతరాత్మ నన్ను నిలదీసింది. నేను చేసింది మహా పాపం అని హెచ్చరించింది. తన దగ్గరకు వెళ్దామంటే ధైర్యం చాలడం లేదు. 


మా తమ్ముడు ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అంటూ పూర్తిగా ముంచేశాడు. అప్పులు పెరిగిపోయాయి. కట్టుకున్న ఇల్లు కోర్టు కేసులో ఇరుక్కుంది. 


తమ్ముడి పుణ్యమా అని ఉద్యోగానికి కూడా రాంరాం చెప్పాల్సి వచ్చింది. ఇంక లాభం లేదని సింగపూర్ బయలుదేరి వెళ్లాను. రెండు సంవత్సరాలు అయింది. రాత్రింబవళ్లు కష్టపడ్డాను. బాగానే సంపాదించాను.


అందుకే నేరుగా నా భార్య దగ్గరకే వెళ్లి తనని క్షమించమని వేడుకోవాలని బయలుదేరాను. 


తాకట్టు పెట్టిన తన నగలు విడిపించుకొని బయలుదేరాను. వెళ్లి తన పేరు మీద తీసుకొని, తనను ఇబ్బంది పెట్టిన నా అప్పులన్నీ తీర్చేసి ఇకపై మనస్పర్థలు లేకుండా సంతోషంగా నా భార్యాపిల్లలతో మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాను.


ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్నాను. ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?


*** 








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సీదా నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పరిచయం

సీదా నాగరాజు

: పేరు సీదా నాగరాజు.1965లో గుంటూరు పట్టణంలో జన్మించాను.స్థానిక జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి (1980)వరకు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల; నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్( 1980-82), సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు లో డిగ్రీ( 1982-85),ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ అఫ్ లా లో లా డిగ్రీ(1985-88) చదువుకున్నాను.దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ డివిజన్ లో ఉద్యోగం చేసి 2025 లో రిటైర్ అయ్యాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page