వికటించిన హాస్యం
- Sudha Vishwam Akondi
- Feb 18
- 4 min read
#SudhavishwamAkondi, #VikatinchinaHasyam, #వికటించినహాస్యం, #సుధావిశ్వంఆకొండి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vikatinchina Hasyam - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 18/02/2025
వికటించిన హాస్యం - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
అదే పనిగా సెల్ రింగ్ అవుతోంటే ఇక తప్పదని అనుకుని, విసుగ్గా ఫోన్ ఎత్తాడు అప్పుడే ఆఫీసు నుంచి అలిసిపోయి వచ్చిన కామేశ్వరరావు.
"హలో! ఎవరండీ? ఆ.. మీరా మోహన్ గారూ! ఎలా ఉన్నారు? ఇది మీ నెంబరా! కొత్తగా తీసుకున్నారా? నెంబర్ మార్చారా?” అని అడిగాడు.
"అవునండీ! ఇది నా ఆఫీసు నంబర్ లెండి! నా పర్సనల్ ఫోన్ నెంబర్ కాస్త ట్రబుల్ ఇచ్చింది. సిగ్నల్స్ వీక్ అని చూపిస్తోంది. అందుకని ఈ ఫోన్ తో చేస్తున్నా! అసలు విషయం ఏంటంటే, మీకో శుభవార్త చెబుదామని కాల్ చేశాను. మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందట. మీ అమ్మాయిని తప్ప ఎవ్వరినీ చేసుకోనని అంటున్నాడు! అంతగా నచ్చిందట! మరి మీరు మీ అమ్మాయిని కనుక్కున్నారా? తనకు కూడా నచ్చితే నిశ్చితార్థం పెట్టుకుందాం!"
"అబ్బా! ఎంత మంచి శుభవార్త చెప్పారండి! మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చాడని చెప్పింది. మీ జవాబు కోసమే చూస్తున్నాను. ఏ వివాహ సంస్థల చుట్టూ తిరగాల్సి వస్తుందోనని బెంగ పడ్డాను. కానీ మనిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా ఇలా మీ సంబంధం వస్తుందనీ అనుకోలేదు. పిల్లలు ఇద్దరికీ ఒకళ్లకు మరొకళ్ళు నచ్చారు. చాలా సంతోషంగా ఉంది! పై వారం మంచి ముహూర్తాలు ఉన్నాయని మా పంతులుగారు చెప్పారు. నేను ఆయనతో మాట్లాడి, ముహూర్తం అడిగి పెట్టుకున్నాను. తయారుగా ఉంటుందని ఓ ఆలోచన! అప్పుడు పెట్టేసుకుందామా!"
"అవునా! మంచి ఆలోచన చేశారు. అయితే ఇంకేం! అలాగే కానివ్వండి! బెంగళూరు నుంచి అబ్బాయి ఇక్కడికి బదిలీ పెట్టుకున్నాడని చెప్పాను కదండీ! అది ఓకే అయ్యిందట! ఈ వారమే ఇటు వస్తున్నాడు. ఇక ఇద్దరూ కంపెనీలు వేరైనా ఇక్కడే జాబ్ చేసుకుంటారు. మన కళ్ళ ముందు వుంటారు. చాలా సంతోషంగా వుందండీ!"
"నిజమేనండి! పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయని పెద్దలు అంటుంటారు కదా! అలాగే అయ్యింది. సమయం కలిసి వస్తే ఎక్కువ కష్టం లేకుండా పనులు జరిగిపోతాయి."
ఇద్దరూ చాలా సంతోషంగా కాసేపు మాట్లాడుకున్నారు.
***
అబ్బాయి హర్ష, అమ్మాయి వర్షిణి. ఆ జంటను చూసి మురిసిపోయారు ఇరువైపులా పెద్దలు. నిశ్చితార్థం కోసం వచ్చిన అతిథులు కూడా ఇద్దరూ చూడచక్కని జంట అని సంతోషించారు.
హర్ష, వర్షిణి ఇద్దరూ ఫోన్ నంబర్స్ ఇచ్చి, పుచ్చుకున్నారు. నెలరోజుల వ్యవధితో పెళ్లి తేదీ ఖరారు అయ్యింది. పెళ్లికి ఓ నెల రోజుల వ్యవధి ఉండడంతో, గంటలు గంటలు ఫోన్లోనే కబుర్లు కలబోసుకున్నారు ఆ జంట.
ఓ రోజు..
"హలో వర్షిణి! రేపు సాయంత్రం నా బర్త్ డే పార్టీకి వస్తున్నావుగా! నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్లకు నిన్ను పరిచయం చేస్తాను.
"ఓకే! కానీ.. "
"లేట్ నైట్ పార్టీ కాదులే! జస్ట్ డిన్నర్! అంతే! త్వరగానే బయలుదేరుదాం! తొమ్మిది కల్లా అయిపోతుంది.
"అయితే సరే!"
"థాంక్యూ బంగారం!"
***
పేరెన్నికగన్న హోటల్ లోని పార్టీ హాల్ ను అందంగా, ఆకర్షణీయంగా, గొప్పగా అలంకరించారు. బర్త్ డే అబ్బాయి హర్ష సూటు వేసుకుని మెరిసిపోతున్నాడు. ఫ్రెండ్స్ కొందరు చుట్టూ చేరి ఏమేమో మాట్లాడుతున్నారు. కానీ అన్యమనస్కంగా ఉన్న హర్ష నిమిషానికి ఓసారి దారి వైపు చూస్తున్నాడు వర్షిణి కోసం.
కాసేపటికి కలర్ ఫుల్ పార్టీ డ్రస్ లో వచ్చింది వర్షిణి. హర్ష పక్కన వచ్చి, నిల్చుంది. అందరికీ తన ఫియాన్సీ అని పరిచయం చేసాడు. అందరికీ హాయ్ చెబుతోంది వర్షిణి. టైమ్ అవ్వడంతో కేక్ కట్ చేసాడు హర్ష. అందరూ చప్పట్లు కొడుతూ విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశాక మొదటగా వర్షిణి నోటికి అందించాడు. అలాగే ఆమె కూడా హర్షకు తినిపించింది. అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అందరికీ కేకు ముక్కలు సర్వ్ చేశారు.
కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిన బహుమతులు ఇచ్చి, డిన్నర్ వైపుకు వెళుతున్నారు. మరికొందరు అక్కడే వున్నారు. అప్పుడు ఒక ముస్లిం అమ్మాయి అక్కడికి వచ్చింది.
అందరూ 'ఎవరా అమ్మాయి?' అని చూస్తున్నారు. కానీ తెలియడం లేదు. ఆమె బురఖాలో ఉంది. ఆమె గబగబా హర్ష వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, గట్టిగా కౌగిలిలో బంధించింది. ఆనందంతో హర్షను పట్టుకుని ఊపింది. హర్ష వైపు కోపంగా చూసింది వర్షిణి. కానీ హర్ష అదేమీ పట్టించుకోకుండా ఆనందంగా..
"వాట్! రానన్నావు! నా స్పెషల్ బర్త్ డే కి రాకుండా ఎలా ఉంటావులే? థాంక్యూ డియర్!" అన్నాడు
ఆ ముస్లిం అమ్మాయి సినిమాలో లా హర్షను పట్టుకుని గుండ్రంగా తిరిగింది. వర్షిణి కి కోపం వచ్చింది.
"ఉండు! నీ గిఫ్ట్ తెస్తాను!" అని పక్కకు వెళ్ళింది.
"ఎవరు? ఆమె నీ గర్ల్ ఫ్రెండా? అలా ఎవరూ లేరని చెప్పావు!" అంది వర్షిణి హర్షతో కోపం, బాధ కలగలిపి.
నవ్విన హర్ష..
"ఆమె కాదు! వాడు నా బెస్ట్ ఫ్రెండ్. బెంగళూరులో మా కంపెనీ లోనే వర్క్ చేస్తున్నాడు. కాలేజీ నుంచే మేము ఫ్రెండ్స్. ఏదో సరదాగా ఆటపట్టిద్దామని అలా చేసాడు. ఎప్పుడూ ఇలా ప్రాక్టీకల్ జోక్స్ వేస్తుంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఎలా అయిపోయారో చూడు! విషయం తెలిసాక నవ్వుతారు చూడు!" అని చెప్పాడు.
ఇక మాట్లాడలేదు వర్షిణి. తను నమ్మలేదని అనుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి రాగానే బురఖా తొలగించాడు.
'ఓర్నీ రాకేష్! నువ్వా! సో ఫన్నీ! అని కొందరు ఫ్రెండ్స్ అరిచారు. ఆ ప్రాక్టీకల్ జోక్ కి అందరూ పగలబడి నవ్వారు. రాకేష్ ను పరిచయం చేసినా ముభావంగానే ఉంది వర్షిణి. నేను వెళతానని చెప్పి, ముందే బయలుదేరింది.
***
"వాట్! పెళ్లి క్యాన్సిల్ నా! ఎందుకండీ? ఏమయ్యింది? అమ్మాయికి కూడా నచ్చింది అని చెప్పారు!" అడిగాడు మోహన్
"ఏమోనండీ! మొన్న మీ అబ్బాయి బర్త్ డే పార్టీకి వెళ్లి, వచ్చినప్పటి నుండీ ఇదే వరుస! పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పింది. కారణము అడిగితే నాకిష్టం లేదంటోంది. ఎన్నోసార్లు బ్రతిమాలి వాళ్ళ అమ్మ అడిగితే అప్పుడు మీ అబ్బాయి 'గే'అని అనుమానం అని చెప్పింది. అక్కడ మరి ఏం జరిగిందో వివరంగా మాత్రం చెప్పలేదు. ఎంతగా నచ్చజెప్పి చూసినా, వినడం లేదండి! ఈ విషయం చెప్పడానికి నాకూ బాధగానే ఉంది"
"అవునా! అసలు ఏం జరిగిందో? ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని అంటే సరేనని ఒప్పుకున్నాను. సరే! నేను కనుక్కుంటాను మా అబ్బాయిని! తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి, సర్దిచెబుదాం!" అని అన్నాడాయన.
"సరేనండి!"
అకస్మాత్తుగా విషయం నలుగురిలో బయట పడేసరికి, అది కప్పిపుచ్చుకోవాలని ఇలా ఏదో ఒకటి కల్పించి చెప్పాడని వర్షిణి బలంగా అనుకుంది. అందుకే పెళ్లి వద్దని గట్టిగా చెప్పేసింది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు వర్షిణి.
నెమ్మదిగా. విషయం తెలుసుకున్న వర్షిణి తల్లిదండ్రులు హర్ష తల్లిదండ్రులకు చెప్పారు. ఆ పెద్దలు రాకేష్ ను తీసుకువచ్చి వర్షిణికి క్షమాపణలు చెప్పించారు. ఇలా ఎప్పుడూ ప్రాక్టికల్ జోక్స్ వేయనని చెంపలు వాయించు కున్నాడు రాకేష్. హర్ష కూడా సారీ చెప్పాడు.
"ఐ యాం రియలీ సో సారీ వర్షిణి సిస్టర్! నిజంగా మేమేమీ 'గే' కాదు. అలా అయితే నీతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు చెప్పు? అసలే ఇప్పుడు 'గే' విధానం గుర్తింపు పొందింది. నాకు వీలు పడక పోవడంతో మీ నిశ్చితార్థానికి రాలేకపోయాను. ఫ్రెండ్స్ అంతా వుంటారు కదా పార్టీలో అని, ఇలా జోక్ చేద్దామని ప్లాన్ చేశాను. కానీ నా ప్రవర్తన వల్ల నిన్ను బాధ పెడతానని అనుకోలేదు. ఇంకా నీ అనుమానం తీరకపోతే మా తల్లిదండ్రులను కనుక్కో!"
పెళ్లిచూపుల్లో చూసినప్పటినుంచి వాడు నిన్ను చాలా ఇష్టపడ్డాడు. గాఢంగా ప్రేమించాడు. మీ ఇద్దరూ ఈడుజోడుగా చక్కగా వున్నారు. నేను చేసిన ఇలాంటి తెలివితక్కువ పనికి, మీ ఇద్దరూ దూరం ఎందుకు అవ్వాలి? మీరు విడిపోతే నేను జీవితాంతం బాధ పడవలసి వస్తుంది. నేనే వెళ్లిపోతాను సరే నా!"అన్నాడు రాకేష్ బాధగా.
కాస్త మెత్తబడిన మనసుతో కనిపించేసరికి, అందరూ కలిసి మొత్తానికి నానా తంటాలు పడి, వర్షిణికి రకరకాలుగా నచ్చజెప్పారు. అప్పుడు ఆమె సరేనని ఒప్పుకుంది. అలా చివరకు ఆ జంట పెళ్లికి శుభం కార్డు పడింది.
అందుకే అసందర్భంగా పిచ్చి జోకులు వేయకూడదు. అలా వేయడం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత!
###
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
ANURAGA SUDHA Akondi
•3 hours ago
మన తెలుగు కథలు టీమ్ కి ధన్యవాదాలు🙏