top of page

శ్రమ విలువ

#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #సుధావిశ్వంఆకొండి, #SudhavishwamAkondi, #SramaViluva, #శ్రమవిలువ


Srama Viluva - New Telugu Story Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 29/01/2025 

శ్రమ విలువ - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


రంగారావు తన కొడుకు సూరజ్ విషయంలో ఎప్పుడూ దిగులు పడేవాడు. రంగారావు నగరంలో పేరుగన్న ధనికుడు. 


అతడి కొడుకు సూరజ్ తల్లి చేతిలో గారాబంగా పెరిగాడు. అతడు బాధ్యత లేకుండా ధారాళంగా డబ్బు ఖర్చు చేసేవాడు. తన చుట్టూ పదిమంది స్నేహితులను వెంటబెట్టుకుని తిరిగేవాడు. ఆ స్నేహితులు సూరజ్ ఖర్చు చేసే డబ్బు కోసం వెంట వుండేవారు. 


 కొడుక్కి ఎలా బుద్ధివస్తుందోనని దిగులుపడేవాడు రంగారావు. 


 అనుకోకుండా ఒకరోజు రంగారావు చిన్ననాటి స్నేహితుడు ధర్మారావు వచ్చాడు. చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ, తమ వ్యాపార వృద్ధి గురించి చర్చించుకున్నారు. ఇద్దరూ వ్యాపారస్థులే కనుక వ్యాపారం లో అభివృద్ధి కోసం సలహాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అప్పుడు మాటల్లో నా తదనంతరం ఈ ఆస్తి ఏమవుతుందో, తన కొడుక్కి ఎలా బాధ్యత తెలుస్తుందో అని తన గోడు వెళ్లబోసుకున్నాడు రంగారావు. 


అప్పుడు ధర్మారావు ఆలోచించి ఒక సలహా చెప్పి, ఇలా చేస్తే మీ వాడిలో తప్పక మార్పు వస్తుంది అని చెప్పాడు. 


 #####


ఆ మరునాడు తన ఒక్కగానొక్క కొడుకు సూరజ్ ని పిలిచి "నీ చదువు అయిపోయింది కదా! నీ పనికిరాని ఫ్రెండ్స్ తో అల్లరిచిల్లరగా తిరగడం ఆపి వ్యాపారం చూసుకో" అన్నాడు


"నాన్నా! అలా అనొద్దు. నా ఫ్రెండ్స్ నా కోసం ఏమైనా చేస్తారు. ఇంకొన్నాళ్ళు నన్ను ఇలా ఆనందంగా వుండనీయండి. అప్పుడే అన్ని బాధ్యతలు నాపై పెట్టొద్దు. నాకో లక్ష రూపాయలు కావాలి ఇవ్వండి. పార్టీ ఇవ్వాలి ఫ్రెండ్స్ కి" అన్నాడు. 


"నేను ఇవ్వను. నువ్వు కష్టపడి సంపాదించు" అంటే ఆయన భార్య, "అదేంటండి! ఒక్కగానొక్క కొడుకు. వాడికే కదా ఇదంతా. ఎందుకు అలా అంటున్నారు" అని డబ్బుల కట్ట తెచ్చి ఇచ్చింది కొడుక్కి. 


అందులోనుంచి తనకు కావాల్సినంత తీసుకుని మిగతాది టేబుల్ పైన విసిరికొట్టాడు సూరజ్. 


"ఇది నా స్వార్జితం. అందుకే దాని విలువ నీకు తెలియట్లేదు నీకు ఉన్నది ఖర్చు చేయడం తప్ప. నువ్వు సొంతంగా కష్టపడి న్యాయంగా ఒక్క లక్ష సంపాదించు చాలు. అప్పుడు నిన్ను నమ్ముతాను. నీ ఫ్రెండ్స్ కి ఇంట్లోంచి వచ్చేసాను అని చెప్పు, మా నాన్న డబ్బులు ఇవ్వనన్నాడు అని చెప్పు అప్పుడు ఎవరైనా నీకు తోడుగా వుంటారేమో చూడు. ఉంటే వాడే నీకు నిజమైన మిత్రుడు. ఆనందం లోనే కాదు, కష్టాల్లో కూడా తోడుగా వుండేవాడే నిజమైన స్నేహితుడు" అన్నాడు. 


"చూసుకోండి అదేమీ గొప్పా! ఈజీగా సంపాదిస్తాను. నా ఫ్రెండ్స్ ను అడిగితే వాళ్లే ఇస్తారు. ఎన్నోసార్లు వాళ్లకు ఖర్చు చేసాను. ఛాలెంజ్" అన్నాడు సినిమాలో హీరోగారి డైలాగ్ లా.


 #####


ఫ్రెండ్స్ అందరినీ డబ్బులు అడిగాడు విషయం వివరించి. కానీ వీడికిస్తే మళ్ళీ తిరిగిరావు మన డబ్బులు అనుకుని ఎవ్వరూ సాయం చేయకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నారు. 


నీరసం వచ్చింది. జాబ్స్ కోసం తిరిగాడు తనకు కావాల్సిన జాబ్ లేదు. ఆ రోజంతా ఇంటికి వెళ్ళడానికి ఉక్రోషం వచ్చింది. దాంతో అలాగే తిరిగాడు పట్టుదల గా ఏ చిన్న జాబ్ అయిన చేద్దామని. 


చివరికి ఓ చిన్న హోటల్ లో ఎవరో సర్వర్ రాకపోవడంతో సూరజ్ కి పని దొరికింది. ఆ వారం అంతా పని చేస్తే వారం జీతం చేతిలో పెట్టారు. అతి తక్కువ డబ్బు అయినా అవి చేతిలో పట్టుకుంటే ఎంతో ఆత్మ సంతృప్తి, ఆనందం కలిగాయి. 


ఇంటికి వెళ్లి తను ఈ వారంలో సంపాదించిన మొత్తం అని జాగ్రత్తగా టేబుల్ పై పెట్టాడు. 

రంగారావు స్నేహితుడైన ధర్మరావుతో కలిసి కూర్చుని ఉన్నాడు అక్కడ. కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తున్న రంగరావును సైగ తో వారించి ధర్మారావు, "నువ్వు సంపాదించింది ఇంతేనా" అంటూ చేతిలోకి తీసుకుని లెక్కించినట్టు చేసి టేబుల్ పైకి విసిరాడు. ఆ డబ్బులో కొంత చిల్లర కూడా వుందేమో దొర్లుకుంటూ కింద పడ్డాయి. 


వెంటనే కోపం, ఉక్రోషం వచ్చిన సూరజ్ "నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అలా విసిరేస్తారేంటి మామయ్యా?".. కోపంగా అని, కిందపడ్డవి జాగ్రత్తగా తీసి టేబుల్ పై పెట్టాడు. 


అప్పుడు ధర్మారావు చిరునవ్వు తో "సూరజ్! ఇప్పుడైనా డబ్బు విలువ తెలిసిందా నీకు! మనం ఎంత సంపాదించినది ముఖ్యం కాదు. ఎలా సంపాదించాము అన్నదే ముఖ్యం. కష్టపడి, న్యాయం గా సంపాధిస్తే దాని విలువ ఎక్కువ. అయాచితంగా వస్తే దాని విలువ తెలియదు. నిన్నటివరకూ మీ నాన్న సంపాదించింది ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసావు ఆలోచించుకో! కానీ అప్పటికి, ఇప్పటికీ తేడా నీకే తెలుస్తోందిగా! 


మనిషి ఎదుగుతున్న కొద్దీ కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. ఇప్పుడు నువ్వు నాన్న వ్యాపారం చూసుకుంటూ, పెళ్లి చేసుకుని ఆయనకు కాస్త విశ్రాంతి ని ఇవ్వాలి. మనిషి జీవితం హక్కులే కాదు బాధ్యతలతో కూడా ముడిపడి ఉంది. తల్లిదండ్రుల పట్ల కొన్ని బాధ్యతలు, పెళ్లి చేసుకున్నాక భార్యాపిల్లల పట్ల కొన్ని బాధ్యతలు, మనం జీవించే ఈ సమాజం పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రతి మనిషికీ. జీవితంలో ఏ దశలో దానికి అనుగుణంగా ఆ బాధ్యత నిర్వర్తించాలి" అంటూ హితబోధ చేసాడు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు వేయాలి అనుకుని. 


డబ్బు విలువ తెలుసుకున్న సూరజ్ తండ్రి చెప్పినట్టుగా విని వ్యాపారం బాగా అభివృద్ధి చేసాడు. ధర్మారావు తన కూతురిని ఇచ్చి వివాహం చేసాడు. అలా రంగారావు దిగులు తీరింది. 

***

సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




2 Comments


mk kumar
mk kumar
Jan 31

ఈ కథలో రచయిత్రి శ్రమ విలువను, జీవితంలో బాధ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చక్కగా చూపించారు. ధనికుడైన రంగారావు తన కొడుకు సూరజ్ నిర్లక్ష్యంగా పెరుగుతున్నాడని ఆందోళన చెందుతుంటాడు. తండ్రి సంపాదించిన డబ్బును దారుణంగా ఖర్చు చేయడమే కాదు, తన స్నేహితులతో అనవసరంగా తిరుగుతూ అనుభవజ్ఞానం లేకుండా జీవితం గడిపే యువకుడిగా అతడిని చూపించారు. ఈ పరిస్థితిని మార్చడానికి రంగారావు స్నేహితుడు ధర్మారావు ఒక ఉద్దేశపూర్వక పరీక్ష నిర్వహిస్తాడు. తండ్రి డబ్బును ఇకపై ఇవ్వబోనని, తన కాళ్లపై తానే నిలబడాలని సూరజ్‌కి సూచించడం కథలో కీలక మలుపు.


సొంతంగా సంపాదించాలనే పరిస్థితి వచ్చాక, మొదట సూరజ్ తన స్నేహితుల సహాయాన్ని ఆశ్రయిస్తాడు. అయితే, అతడు ఖర్చు చేసిన డబ్బుకు వారు మాత్రమే స్నేహితులని స్పష్టమవుతుంది. ఎవరూ సహాయం చేయకపోవడంతో నిజమైన స్నేహితులు ఎవరనే విషయం అర్థమవుతుంది. పని చేసేందుకు ప్రయత్నించిన సూరజ్ అనేక కష్టాల్ని ఎదుర్కొంటాడు. చివరకు, ఒక చిన్న హోటల్లో పని చేసే అవకాశం వస్తుంది. వారం రోజుల కష్టానికి తగిన పారితోషికం అందుకున్నప్పుడు, తన శ్రమకు లభించిన ప్రతిఫలం ఎంత గొప్పదో అతడికి అర్థమవుతుంది. తన కష్టంతో…


Like
Replying to

మీ సమగ్ర విశ్లేషణ కు ధన్యవాదాలండీ

Like
bottom of page