పశ్చాత్తాపం

Paschattapam - Telugu Social Story | Varalakshmi Yanamandra
పశ్చాత్తాపం - తెలుగు సామాజిక కథ | వరలక్ష్మి యనమండ్ర
Published in manatelugukathalu.com on 05/10/2026
పరువు పేరుతో తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబాన్ని ఎంతటి కష్టాల్లోకి నెట్టిందో తెలిపే భావోద్వేగ తెలుగు కథ “పశ్చాత్తాపం”.
ఆ ఇంట్లో దీపం వెలుగుతోంది, కానీ మనుషుల మధ్య మాత్రం చిమ్మచీకటి. రాఘవయ్య వేలు కోడలికేసి చూపిస్తోంది. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. ఎదురుగా చేతులు జోడించింది కోడలు సుమతి.
“ఎంత ధైర్యం నీకు? నా మాట కాదని ఉద్యోగానికి వెళ్తానంటావా? ఈ ఇంటి పరువు గంగలో కలిపేస్తావా?” ఆయన గొంతు అరిచేసరికి కోడలు వణికిపోతున్నది.
“మామయ్యగారూ! పరువు కోసమే అడుగుతున్నాను. అప్పుల వాళ్ళు రోజూ గడప తొక్కుతున్నారు. అత్తయ్యగారి మందులు కూడా అయిపోయాయి. ఇంటి పరిస్థితి బాగాలేదు....” సుమతి గొంతు జీరబోయింది.
“ఛీ! ఆ మాటలు నా దగ్గర కాదు. ఆడది సంపాదిస్తే మగవాడు బతికి కూడా చచ్చినట్టే. నా కొడుకు చేతగాని వాడని లోకం ఉమ్మేస్తుంది” అని సుమతి చేతిని విదిల్చి కొట్టాడు.
శ్రీధర్ గుమ్మంలో నిలబడి అన్నీ చూస్తున్నాడు. కానీ తండ్రి ఎదురుగా నోరెత్తే ధైర్యం చేయలేకపోయాడు. తను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దగా చదువుకోలేదు.
“నాన్నా, సుమ మన మంచి కోసమే...” అని గొణిగాడు.
“నువ్వు నోరు మూయ్. పెళ్లాం మాట వింటూ సంసారాన్ని నాశనం చేస్తావా?” రాఘవయ్య గర్జించాడు.
సుమతి ఆ రాత్రి అన్నం ముట్టలేదు. కానీ మరుసటి రోజు మౌనంగా ఇంటిపని చేసుకుంది. ఉద్యోగం ఊసెత్తలేదు. రాఘవయ్య గెలిచానని విర్రవీగాడు.
ఆరు నెలలు గడిచాయి.
అప్పు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షలైంది. వడ్డీ వ్యాపారి 'వెంకట్రావు' రోజూ ఇంటి ముందు అరుస్తున్నాడు. “రాఘవయ్యా, సొమ్ము ఇస్తావా? లేక పొలం పత్రాలు రాసిస్తావా?”
పరువు పోతుందన్న భయంతో రాఘవయ్య గుండె దడదడలాడింది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి.
శ్రీధర్ రాత్రి ఆటో తోలి, పగలు కంపెనీకి వెళ్లి నీరసించిపోయాడు. ఒక రోజు కళ్లు తిరిగి పడిపోయాడు.
“రెస్ట్ కావాలి. ఇలా చేస్తే కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది” అని హాస్పిటల్‌కి వెళ్తే డాక్టరు అన్నారు. మందులు రాసిచ్చారు.
దురదృష్టం కొద్దీ 'గోరుచుట్టు మీద రోకటి పోటు' అన్నట్లుగా అప్పుడే లక్ష్మమ్మకు గుండెనొప్పి వచ్చింది. హాస్పిటల్‌లో చేర్చితే 50 వేలు కట్టమన్నారు. రాఘవయ్య చేతిలో చిల్లిగవ్వ లేదు.
చుట్టాలంతా ముఖం చాటేశారు. ‘పరువుగల రాఘవయ్య’ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది.
వెంకట్రావు వచ్చి ఇంటి సామాన్లు బయట పడేస్తున్నాడు. “పరువు, పరువు అన్నావు కదయ్యా! ఇప్పుడు నీ పరువు ఏం చేస్తుంది? ఆకలి తీరుస్తుందా? ఆస్పత్రి బిల్లు కడుతుందా?” అని ఊరందరి ముందు అవమానించాడు.
రాఘవయ్య తల దించుకున్నాడు. 65 ఏళ్ల జీవితంలో మొదటిసారి నిస్సహాయంగా, మౌనంగా రోదించాడు. అదే సమయంలో స్కూల్ హెడ్‌మాస్టర్ ఇంటికి వచ్చాడు.
“అయ్యా! మీ కోడలు సుమతిగారికి మా స్కూల్లో టీచర్ పోస్ట్ ఇవ్వాలని ఆరు నెలల నుంచి ఎదురుచూస్తున్నాం.
ఆవిడ చాలా తెలివైనది. వాళ్ళ నాన్న నాకు స్నేహితుడు. అందుకే ఇప్పటికీ తనకోసం ఎదురు చూస్తున్నాం, గతంలో మా స్కూల్లో చేసింది కాబట్టి.
కానీ మీరు ఒప్పుకోరని రాలేదట. ఇప్పటికైనా ఒప్పుకోండి. జీతం అడ్వాన్స్‌గా 30 వేలు ఇస్తాను. మీ అబ్బాయి, మీ ఆవిడగారి వైద్యానికి ఉపయోగపడుతుంది” అన్నాడు విషయం అంతా తెలిసి.
రాఘవయ్యకు చెంప పగిలినట్టయింది. తాను ‘వద్దు’ అన్న ఉద్యోగమే ఇవాళ తన కుటుంబాన్ని ఆదుకుంటోంది. తాను కాపాడాలనుకున్న ‘పరువు’ తనని రోడ్డు మీద నిలబెట్టింది. తాను తిరస్కరించిన ‘కోడలు’ ఇప్పుడు ఆధారం అవుతోంది.
సుమతి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెళ్లి అత్తగారి బట్టలు సర్దింది, ఆస్పత్రికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ మామగారి కాళ్లకు చెప్పులు అందించింది. “మీరు కూడా రండి మామయ్యగారూ. అత్తయ్యకు ధైర్యంగా ఉంటుంది” అన్నది.
ఆ మాట, ఆ ప్రవర్తన రాఘవయ్య గుండెను కోసింది. ‘ఇంత అవమానించినా నన్ను ‘మామయ్యా’ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తోంది. నా భార్య కోసం తన గొడవ పక్కన పెట్టింది. ఇదేనా పరువు తీయడం?’ అనుకున్నాడు.
ఆస్పత్రిలో 15 రోజులు ఉన్నది లక్ష్మమ్మ. సుమతి పగలు స్కూల్, రాత్రి ఆస్పత్రి. శ్రీధర్ కూడా మందులు వాడుతూ క్రమంగా కోలుకున్నాడు. తండ్రి కొంత ఆర్థిక సహాయం చెయ్యడంతో ఒడ్డున పడ్డారు. రాఘవయ్య మాత్రం మౌనంగా కూర్చుని అన్నీ చూస్తున్నాడు. అతని ‘అహం’ అనే పురుగు నెమ్మదిగా చస్తోంది.
లక్ష్మమ్మ కోలుకుని ఇంటికి వచ్చింది. ఒక రోజు వెంకట్రావు మళ్లీ వచ్చాడు. కానీ ఈసారి రాఘవయ్య తల దించుకోలేదు.
సుమతి ముందుకు వచ్చింది. 20 వేలు వెంకట్రావు చేతిలో పెట్టింది. “లెక్క చూసుకోండి వెంకట్రావు గారూ! మిగిలింది నెలనెలా ఇస్తాము. మా పొలం జోలికి రాకండి” అన్నది స్థిరంగా.
ఊరంతా ఆశ్చర్యంగా చూసింది. వెంకట్రావు కూడా తల వంచుకుని వెళ్లిపోయాడు.
ఆ రాత్రి రాఘవయ్య భోజనం దగ్గర సుమతి చెయ్యి పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా అదిమిపట్టడానికి కాదు, క్షమాపణ అడగడానికి.
“తల్లీ! నన్ను క్షమించు. నా కళ్లు మూసుకుపోయాయి ఇప్పటి వరకు. ‘పరువు’ అంటే నలుగురు ఏమనుకుంటారో అని భయపడటం కాదని ఇవాళ తెలిసింది. కష్టంలో కుటుంబాన్ని నిలబెట్టడమే నిజమైన పరువు. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టడమే నేను గొప్ప అనుకున్నాను. కానీ నిన్ను బయటకు పంపితేనే మన ఇల్లు నిలబడింది. ఇప్పుడు తెలిసింది నాకు అసలైన పరువు ఏమిటో!” అన్నాడు నిజాయితీగా.
సుమతి కళ్లలో నీళ్లు... “మామయ్యగారూ! మీది ఎంతమాత్రమూ తప్పు కాదు. మీరు పెరిగిన వాతావరణం అటువంటిది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. మనందరం ఒక కుటుంబం. మీరు కుటుంబం కోసమే అప్పులు చేశారు.
కానీ అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా మామయ్యా! మీ దీవెన, ప్రోత్సాహం ఉంటే చాలు నాకు... ధైర్యంగా ఏ పనినైనా చేయగల సత్తా వస్తుంది నాకు. మిమ్మల్ని మా నాన్నగారే అనుకున్నాను. ఇది నా కుటుంబం అనుకున్నాను. మనందరం ఒకే మాట మీద ఉంటే మనంటిలోకి వచ్చే వారసులకు మంచి జీవితాన్ని ఇవ్వగలం కదా మామయ్యా!” అన్నది సుమతి.
రాఘవయ్య లేచి నిలబడి, అందరూ చూస్తుండగా తన చేతిని సుమతి తలమీద పెట్టి దీవించాడు. “ఇన్నాళ్లూ నా వేలు నిన్ను తప్పు పట్టింది తల్లీ. ఇక నుంచి ఈ వేలు నీకు ఆసరాగా ఉంటుంది. వారసుడు రాబోతూ నన్ను మార్చేశాడన్నమాట. ఎంత శుభవార్త చెప్పావు తల్లీ! ఇక నుండి ఈ ఇంట్లో నీ ఆలోచన ప్రకారమే నడుస్తుంది తల్లీ” అన్నాడు మనస్ఫూర్తిగా రాఘవయ్య.
తన మాటలలో పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తున్నది.
మరుసటి రోజు సుమతి బడికి వెళుతుంటే స్వయంగా రాఘవయ్య గారు తన బండిమీద సుమతిని బస్టాండు వరకు తీసుకెళ్ళి... “జాగ్రత్త తల్లీ. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పు. ‘ఆడపిల్ల, మగపిల్లాడు’ అనే తేడా లేకుండా అందరూ సమానమే అని చెప్పు. జాగ్రత్తమ్మా! సాయంత్రం వస్తాను ఇంటికి తీసుకువెళ్ళడానికి” అన్నాడు.
ఆ మాట విన్న సుమతికి కళ్లలో నీళ్లు తిరిగాయి. 'ఎంత మంచి మనసో మామయ్యది' అనుకుంది తృప్తిగా.
లక్ష్మమ్మ శ్రీధర్‌తో, "65 ఏళ్ల మర్రిచెట్టు కదిలింది. కదలడానికి కష్టం రావాల్సి వచ్చింది. కన్నీళ్లు రావాల్సి వచ్చింది. కానీ చివరికి చలించింది. కోడలిని అపురూపంగా చూసుకుంటున్నాడు" అని అన్నది.
"ఔనమ్మా! ఇక మనకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పొలం కూడా నేనే చూసుకుంటాను. ఇన్నాళ్ళూ కౌలుకిచ్చి ఇబ్బంది పడ్డాము. నాన్న మారారు. సమస్యలన్నీ తీరిపోతాయి ఇక మెల్లగా" అన్నాడు శ్రీధర్ సంతోషంగా.
వరలక్ష్మి యనమండ్ర✒️
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర
పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర
కలం పేరు: లేదు
స్వస్థలం: అద్దంకి,ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని
విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.
ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు
1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి)
2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి)
3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి)
తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం
4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి)
5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)
6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక)
(400 ఆటవెలది పద్య సంపుటీ)
7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు)
అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు
కొన్ని సమూహాలను నిర్వహణ, కొన్ని సమూహాలలో సమీక్షణం
యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను
నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.
ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.
జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం.





Comments