top of page
Original.png

పాత పనిమనిషి

49 minutes ago
6 min read

పాత పనిమనిషి రంగమ్మ ఇంటి తాళం తిరిగి ఇస్తూ, సుభద్ర దంపతులకు వారి ఇంటి మొక్కలను కాపాడిన విషయం చెబుతున్న దృశ్యం.

Patha Panimanishi - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao

పాత పనిమనిషి - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 05/10/2026


‘పాత పనిమనిషి’ శ్రీ శ్రీనివాసరావు జీడిగుంట గారు రచించిన హృదయాన్ని హత్తుకునే తెలుగు కుటుంబ కథ. పనిమనిషి రంగమ్మ చూపిన విశ్వాసం, బాధ్యత, మానవత్వం ఈ కథలో చక్కగా ప్రతిబింబిస్తాయి. యజమానులు పనివారి కష్టాలను, వారి వ్యక్తిగత సమస్యలను అర్థం చేసుకోవాలనే విలువైన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. మనుషుల మధ్య అనుబంధాలకు, కృతజ్ఞతకు నిజమైన అర్థం తెలిపే ఈ నీతి కథను చదివి ఆస్వాదించండి.



"ఏమిటి రంగమ్మా, శుక్రవారం పూట కూడా త్వరగా రావు? ఇల్లు ఊడిస్తే గాని నేను పూజ చేసుకోలేను. సార్ టిఫిన్ అంటూ గొడవ పెడుతున్నారు. ముందు స్టవ్ తుడిచి, అట్ల పెనం తోమి ఇవ్వు," అంది నాన్-స్టాప్‌గా సుభద్ర.


"మధ్యలో నా టిఫిన్ గొడవ ఎందుకు? స్టవ్ మండితే చాలు, తుడవటం టిఫిన్ తిన్న తరువాత చేయమని చెప్పు," అన్నాడు సుందరం.


"చూడమ్మా, ఐదో నంబర్ ఇంటివాళ్ళు ఏడింటి నుంచి పది గంటల వరకు అన్ని పనులు చేయించుకుంటారు. టీ కూడా నేనే పెట్టాలి.


మళ్ళీ మీ ఇంటి నుంచి వెళ్లి వంట వండిపెట్టాలి. నడుం నొప్పి మందులు వేసుకుని పని చేస్తున్నాను," అంది రంగమ్మ.


"మా ఇంట్లో రెండు గిన్నెలు ఎక్కువ పడితే వంకర చేసేసి పెడతావు, మేము కూడా డబ్బులు ఇస్తున్నాము కదా రంగమ్మా," అంది సుభద్ర.


"క్రిందటి ఏడాది మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళు రెండు లక్షలు అప్పు ఇచ్చారు. ప్రతి నెల జీతంలో కొంత పట్టుకుంటారు.


మీరు డబ్బులు నాకు అవసరమైతే ఇవ్వగలరా మేడమ్? సార్ రిటైర్ అయ్యారు, పెన్షన్ మీద గడవాలని జీతం కూడా పెంచటం లేదు. అయినా పనిచేయడం మీ ఇంటి నుంచే మొదలుపెట్టాను అనే కృతజ్ఞతతో మీరు జీతం పెంచకపోయినా మీ ఇంట్లో ఏదో టైములో వచ్చి పనిచేస్తున్నాను," అంది.


"మేము ఉండేది ఇద్దరం, ఏడాదిలో సగం రోజులు అమెరికాలో ఉంటాము, అప్పుడు కూడా నీ జీతం తగ్గించకుండా ఇస్తున్నాము. మా వల్ల నీకు, నీ వల్ల మాకు లాభం, అంతే.


ఇంతకీ నిన్ను అడిగింది శుక్రవారం కొద్దిగా ముందు వచ్చి ఇల్లు ఊడ్చి వెళ్ళమని, దీనికోసం ఇంత కథ ఎందుకు రంగమ్మా? చూడు.. సార్ టిఫిన్ కోసం ఎలా తిరుగుతున్నారో," అని వంటగదిలోకి వెళ్ళిపోయింది సుభద్ర.


సుభద్ర చెప్పడమే గాని పనిమనిషి తన పద్ధతి మార్చుకోకుండా ఉదయం పది గంటలు దాటిన తరువాత పనికి వచ్చేది.


ఒకరోజు అంట్లు తోముతూ, "అమ్మా, మా అమ్మాయి పురిటికి వచ్చింది, డబ్బులు చాలడం లేదు. ఒక ఐదు వందల జీతం పెంచండి. అందరినీ వెయ్యి రూపాయలు పెంచమన్నాను, సార్ రిటైర్ అయ్యారు కాబట్టి మీ దగ్గర తక్కువ అడిగాను," అంది.


"ఇదిగో రంగమ్మా, మాటికి మాటికి 'సార్ రిటైర్ అయ్యారు' అని అనకు. రిటైర్ అయినంత మాత్రాన అడుక్కు తినడం లేదు," అంది సుభద్ర.


"అయ్యో, నేను అలా అనలేదు అమ్మా! అయితే మీరు కూడా వెయ్యి పెంచండి," అంది.

"ఇదిగో, రేపు సోమవారం శివుడి అభిషేకం చేసుకుంటున్నాము, కార్తీకమాసం కదా. సార్ అన్నదమ్ములు వస్తారు.


నువ్వు ఆ ఒక్కరోజే పెందరాళే వచ్చి ఇల్లు, స్టవ్ శుభ్రం చేసి, అంట్లు తోమి, తరువాత మిగిలిన వాళ్ళ ఇంటికి వెళ్ళు. నాలుగు రోజుల ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో," అంది సుభద్ర.


"అలాగేనమ్మ, ఈరోజే మిగిలిన వాళ్ళకి చెప్తాను వాళ్ళ ఇంటికి లేటుగా వస్తాను అని," అంది.


ఆరోజు సాయంత్రం పక్కింటి సరోజ, "ఏమండీ, రేపు సోమవారం మీ ఇంట్లో అభిషేకం అని చెప్పింది రంగమ్మ. మా ఇంటి ఆయనకి ఇలాంటివి పట్టవు, నేనూ మా అమ్మాయి రావచ్చా అభిషేకానికి?" అంది.


ఇలా నాలుగు ఇళ్ళవాళ్ళు అడగటంతో సుభద్ర గుండెల్లో రాయి పడింది. 'ఈ పనిమనిషి అందరినీ ఆహ్వానించిందేమో, వచ్చిన వాళ్ళని ఊరికే ఎలా పంపగలం? సాయంత్రం అలా బజారు వెళ్లి పది జాకెట్టు పీసులు కొని తెస్తాను,' అంది.


"చూడు, మనం చేసేది శివాభిషేకం, తలో కొద్దిగా విభూతి ఇవ్వు, చాలు," అన్నాడు సుందరం.


"మీకే, బాగానే చెప్తారు! తెల్లారిలేస్తే ఒకరి మొహం ఒకళ్ళు చూసుకోవాలి. ఎందుకైనా మంచిది, కేటరింగ్ వాడికి ఇంకో పదిమందికి భోజనం ఎక్కువ పంపమనండి," అంది.


"నీ చాదస్తంతో నాకు వచ్చిపడింది! గుళ్ళో రెండు వందలు కట్టి అభిషేకం చేయిద్దాం అంటే 'లేదు, ఇంట్లో చేస్తే ఇంటి యజమానికి మంచిది' అని నన్ను రొంపిలోకి లాగావు," అన్నాడు.


"దూరం నుంచి సమయానికి రాలేము, అందుకే ఆదివారం రాత్రికి వచ్చేస్తాము. ఉప్మా చేయించు చాలు, తిని పడుకుంటాము," అని అన్నదమ్ములు అనడంతో, "అంతకంటేనా! వచ్చేయండి. వెధవ ఉప్మా ఎందుకు, పూరీకూర చేయిస్తాను, చక్కగా పాత విషయాలు మాట్లాడుకోవచ్చు," అన్నాడు సుందరం.


ఆదివారం రాత్రి పదిహేను మందికి పూరీలు, సోమవారం ఉదయం ఇడ్లీలు, ఇరవై ఐదు మందికి భోజనం మాట్లాడుకున్నాడు కేటరింగ్ అతనితో.


ఆదివారం అన్నదమ్ములతో తమ చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి పన్నెండు దాటిన తరువాత పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న సుందరానికి క్రింద హాలు నుంచి అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కిందకి వచ్చి, "ఏమైంది, అలా అరుస్తున్నావు?" అన్నాడు.


"పనిమనిషి కొంపముంచింది! రాత్రి నుంచి జ్వరం అట, ఈరోజు రాలేను అని ఫోన్ చేసింది," అంది.


"దానికి విశ్వాసం లేదు, వేరే పనిమనిషిని చూడు అంటే విన్నావా? చూడు, ఇప్పుడు ఎగగొట్టింది! నేను అలా వెళ్లి వాచ్‌మెన్‌తో చెప్పి ఎవరైనా పనిమనిషిని పంపమంటాను. రేపు రంగమ్మ వస్తే జీతం ఇచ్చి మానిపించేయ్," అన్నాడు.


"అమ్మా, వాచ్‌మెన్ పంపించాడు. మీకు పనిమనిషి కావాలి అన్నారుటగా," అంది ఒక మధ్య వయసు స్త్రీ వచ్చి.


"అవును, మా పనిమనిషికి ఒంట్లో బాగుండలేదు అని రాలేదు. ఈరోజు, రేపు పని చెయ్యాలి," అంది సుభద్ర.


"రెండు రోజులకంటే చెయ్యనమ్మా. పూర్తిగా పనికి పెట్టుకుంటే చేస్తాను," అంది.


"నీకు ఏం చెప్పాను? పాత పనిమనిషి సమయానికి మానేసింది, ఇంక రానివ్వకు. ఈ అమ్మాయి చేస్తాను అంటే ఒప్పుకో సుభద్రా," అన్నాడు సుందరం.


"అయ్యగారికి నా పేరు ఎలా తెలిసింది?" అంటూ సిగ్గుపడుతున్న పనిమనిషిని, కొంపదీసి "నీ పేరు కూడా సుభద్రేనా?" అని అడిగింది.


"అవునమ్మా, మా ఆయన పేరు కృష్ణుడు," అంది.


"సరే, మానకుండా రావాలి. టీ ఇస్తాను, టిఫిన్ పెట్టాలి అంటే కుదరదు, ఏమంటావు?" అంది. "ఇంకో విషయం, సార్ ‘సుభద్రా’ అని పిలిస్తే అది నన్ను అని, నువ్వు పలకకూడదు," అని కండిషన్ కూడా పెట్టింది.


ఏ మాట కా మాటే, పని శుభ్రంగా చేసింది. కడుపు నిండా భోజనం చేసి, సుభద్ర ఇచ్చిన వంటలు తన ఇంటికి తీసుకుని వెళ్ళింది కొత్త పనిమనిషి.


మూడు రోజులు అయిన తరువాత పాత పనిమనిషి రంగమ్మ వచ్చింది. "వద్దులే రంగమ్మా, వేరే ఆమె వచ్చి పనిలోకి చేరింది. ముందుగా చెప్పినా ఫంక్షన్ ఉన్న రోజునే మానేశావు అని సార్‌కి కోపం వచ్చింది," అంది సుభద్ర.


"అదేమిటమ్మా, మనిషి అన్న తరువాత రోగం రాకుండా ఉంటుందా? సరే, మీ ఇష్టం," అని చెప్పి వెళ్ళిపోయింది.


అప్పుడప్పుడు ఇంకో వంద రూపాయలు ఇచ్చి మేడమీద ఉన్న టెర్రస్ గార్డెన్ బాగు చేయించేది సుభద్ర.


ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సుభద్ర పనిమనిషితో చెప్పింది, "మేము వచ్చేవారం అమెరికా వెళ్తాము. మూడు నెలల వరకు నువ్వే మేడమీదకి వెళ్లి రోజూ మొక్కలకి నీళ్లు పోసి, గుమ్మం ముందు ముగ్గు వేయాలి.


జీతం తగ్గించములే, నీకు ఆన్‌లైన్‌లో పంపిస్తాను. తాళం చెవులు ఎదురింట్లో ఇస్తాము, మళ్ళీ వాళ్ళకే ఇవ్వు," అని చెప్పింది.


ప్రయాణం రోజున అన్ని గదులకి లాక్ వేసి, హాలు గదికి తాళం వేసి ఎదురింట్లో ఇచ్చి, "మా పనిమనిషి వచ్చి తీసుకుని మొక్కలకి నీళ్లు పోసి మళ్ళీ కీ మీకు ఇస్తుంది.


పైన వంకాయ చెట్టు పూత మీద ఉంది, కాయలు వస్తే మీరు కూడా కోసుకోండి," అని చెప్పింది సుభద్ర.


అమెరికా వెళ్ళిపోయారు సుందరం, సుభద్ర. వెళ్లే రోజు రెండు సార్లు మేడపైకి వెళ్లి తోట చూసి, 'ఏమిటో ఈ ప్రయాణాలు, ఇన్నాళ్ళు పెంచిన తోట పనివాళ్ళకి అప్పగించి వెళ్లిపోవడం, తిరిగి వచ్చేసరికి మొక్కలు అన్నీ ఎండిపోయి ఉండటం' అనుకున్నారు.


పది రోజులు అయ్యింది ఇల్లు వదిలి.


"పనిమనిషి రోజూ నీళ్లు పోస్తోందో లేదో ఒకసారి అడుగు," అన్నాడు సుందరం.


"నమస్తే అమ్మా, నేను పనికి వెళ్లడం లేదు. మీరు ఊరు వెళ్లిన తరువాత నాకు యాక్సిడెంట్ అయ్యింది. రెస్ట్ అవసరం అని పనికి వెళ్లడం లేదు," అంది పనిమనిషి.


"అయ్యో, మరి నాకు ఫోన్ చేసి చెప్పాల్సింది! మొక్కలు అన్నీ నీళ్లు లేక చచ్చిపోతాయి, ఇలా చేశావు ఏమిటి?" అంది.


"బాగానే ఉంది, నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీ మొక్కల గురించి ఎలా ఆలోచిస్తాను?" అంటూ ఫోన్ కట్ చేసింది.


"చూశారా దాని పొగరు? మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ చేసింది," అంది భర్తతో.


"సుభద్ర కదా, అలాగే ఉంటారు," అన్నాడు సుందరం.


"ఏమిటి అంటున్నారు?" అని భర్త వంక కోపంగా చూసింది.


"ఏమీ లేదు, మొక్కల గురించి బాధపడుతూ ఉంటే అమ్మాయి ఫీల్ అవుతుంది. మొక్కలైనా మనుషులైనా ఏదో ఒక కారణం వలన నశించాల్సిందే. మొక్కలు, కుక్కలు, పిల్లలు... ఇవన్నీ బంధాలు. ఇక మొక్కలు పెంచొద్దు," అన్నాడు.


మూడు నెలలు అమెరికాలో ఇట్టే గడిచిపోయాయి. వెళ్లే రోజు కూతురు, మనవడి బాధ చూసి 'ఇంకో రెండు నెలలు ఉండిపోదాం' అనుకున్నారు సుందరం, సుభద్ర. అయితే సుందరం వాడే మందులు అయిపోవడంతో బాధగానే ఇండియాకి బయలుదేరారు.


తెల్లారి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరారు ఇంటికి. ఇంటి ముందు ఆగిన క్యాబ్‌లో నుండి దిగిన సుభద్ర, ఇంటి ముందు ముగ్గు, బాల్కనీలో ఉన్న మొక్కలు 'రండి రండి' అన్నట్టుగా పచ్చగా స్వాగతం చెప్తూ ఉండటం చూసి, "అరే, మొక్కలు బాగానే ఉన్నాయి! ముగ్గు కూడా వేశారు.


బహుశా ఎదురింటి ఆవిడ వాళ్ళ పనిమనిషితో ఈ పని చేయించి ఉంటుంది," అనుకుంటూ తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు. హాలు అప్పుడే ఊడ్చినట్టుగా ఉంది.


సుందరం మెట్లు ఎక్కి మేడమీదకి వెళ్ళాడు, అన్నీ మొక్కలు కళకళలాడుతూ ఉన్నాయి.


వంగ మొక్కలు వంకాయలతో వంగి ఉన్నాయి. ఇన్ని రోజులు నీళ్లు పోయకుండా ఉంటే ఇలా ఉండటం అసాధ్యం. 'ఏమిటి మాయ?' అనుకుంటూ కిందకి వచ్చాడు.


పాత పనిమనిషి రంగమ్మ సుభద్రతో అంటోంది: "మీ కొత్త పనిమనిషి మీరు ఊరు వెళ్లిన నాలుగు రోజులకే రావడం లేదు అని తెలిసింది. ఎంతైనా మీ ఇంట్లో పది సంవత్సరాల నుండి పనిచేసిన దానిని. ప్రతి ఏడాది మొక్కల బాధ్యత నేనే చూసుకునేదానిని.


అలాంటిది మీకోసం వచ్చి నన్ను తీసేసినా నేను గమ్మున ఉండలేక ఎదురింటి వాళ్ళని కీ గురించి అడిగితే ఇవ్వలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది, క్రిందటి ఏడాది మీరు అమెరికా వెళ్తూ నాకు ఒక కీ ఇచ్చారు. అది వాడి ఈ మూడు నెలలు మొక్కలు కాపాడాను. ఇదిగో మీ ఇంటి కీ," అని టేబుల్ మీద పెట్టింది.


"నీ దగ్గరే ఉంచు రంగమ్మా, మళ్ళీ దసరాకి అబ్బాయి దగ్గరికి ముంబై వెళ్లాలి, రేపటి నుంచి నీ ఇంటి పని నీదే," అంది సుభద్ర.


"అమ్మా, నీళ్లు పోసినందుకు మూడు కిలోల టమాటో, రెండు కిలోల వరకు వంకాయలు వచ్చాయి, నేను తీసుకుని వెళ్లాను. ఈవారం వంకాయలు కోయకుండా ఉంచా, సార్‌కి వంకాయలు అంటే ఇష్టం కదా," అంది నవ్వుతూ, సుందరం తాగేసిన కాఫీ కప్ తీసుకుని కడగటానికి వెళ్తూ.


పనిమనుషులకు కూడా బాధలు ఉంటాయి, యజమానులు అర్థం చేసుకోవాలి. తప్పిపోయి కొత్త పనివాళ్ళని పెట్టుకుంటే అందరూ రంగమ్మలా ఉండరుగా!


~ శుభం ~



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page