#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #SikshaEvariki, #శిక్షఎవరికి

Siksha Evariki - New Telugu Story Written By - Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 11/03/2025
శిక్ష ఎవరికి - తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పశువుల షెడ్లో గేదెలకు గడ్డి వేసి, కింద పేడ, చెత్త అంతా చీపురుతో శుభ్రం చేస్తోంది యాదమ్మ.
"అత్తమ్మా!" పక్కింటి శీనుగాడు రొప్పుతూ వచ్చాడు.
"అక్కడ సాయిలు మామ, గణేష్ అన్న మస్తు కొట్టుకుంటున్రు. మామకి రక్తం వచ్చింది."
ఎక్కడి చీపురు అక్కడ పడేసి పరిగెత్తింది యాదమ్మ
ఇంటికి అరకిలోమీటరు దూరంలో, ఖాళీస్థలం అద్దెకి తీసుకుని నాలుగు గేదెలని పెట్టుకుని పాలు అమ్మి బతుకుతోంది యాదమ్మ.
యాదమ్మ మొగుడు సాయిలు, మేస్త్రిపనికంటే తాగడంలోనే టైం ఎక్కువ గడుపుతాడు. కొడుకు గణేషుని చదువుకోమని స్కూల్ లో చేర్పిస్తే, ఐదో క్లాస్ లోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. తండ్రి సారా ప్యాకెట్లు తెమ్మంటే అందులో సగం తాగేవాడు.
"నువ్వు తాగి నాశనమయ్యావు, కొడుకుని కూడా ఎందుకు నాశనం చేస్తావు?" అని యాదమ్మ ప్రశ్నిస్తే, ఆమెకు వంటి నిండా దెబ్బలతో సమాధానం చెప్పేవాడు సాయిలు.
దెబ్బలు తినితిని మొండితేలిపోయింది యాదమ్మ.
"చదువుకో కొడుకా! మీ నాయనలాగా తాగుబోతువాడివి కావద్దురా బిడ్డా! మంచిగా చదుకొని కొలువు చేస్కో బిడ్డా!" అని ఎంత చెప్పినా చదువు మానేసి చెడు తిరుగుళ్ళకి అలవాటుపడ్డాడు గణేష్.
కొడుకుని అదుపులో పెట్టేది పోయి, సాయిలు వాడితో కూర్చుని తాగేవాడు. యాదమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరూ కలిసిఆమెని కొట్టేవారు.
కూతురు స్రవంతి మాత్రం చక్కగా చదువుకుని, అన్నీ మంచి మార్కులతో పాస్ అయ్యింది. వకాలత్ చదువుతానంటే యాదమ్మ చదివించింది. స్రవంతి ముందునుంచి పైసలు ఖర్చు కాకుండా సర్కారు బడిలోనే చదివింది.
చుట్టుపక్కల కొట్లాటలు, దొమ్మీలలో న్యాయం చెయ్యడానికి, పోలీసుల దగ్గరనించి వకీలుకి పైసలు పెట్టడం చూసి "వకీలు అవుతా! నాకు సర్కార్ కాలేజిలోనే సీట్ వస్తుంది" అని అందులో చేరి వకీలు అయ్యింది.
రోజూ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎట్లా దొరుకుతున్నాయో గణేష్ గంజాయికి అలవాటు పడ్డాడు. నెమ్మదిగా తండ్రికి కూడా అలవాటు చేసాడు. పైసలు ఎక్కడివి అంటే చెప్పరు. గణేష్ వేరే వాళ్ళకి గంజాయి అమ్మి పైసలు తెస్తున్నాడేమో అని యాదమ్మకి అనుమానం. పొద్దున్న తాను గేదెల దగ్గరికి వచ్చేప్పుడే చూసింది, ఇద్దరు చిన్నగా కొట్లాడుతున్నారు. పరుగున ఇంటికెళ్ళేసరికి సాయిలు కింద పడిఉన్నాడు, గణేష్ లేడు. అందరూ కలిసి బస్తి దవాఖాన్కి తీసుకెళ్తే, డాక్టర్ చూసి చచ్చిపోయాడు అని చెప్పాడు.
“ఎట్లా దెబ్బలు తాకినాయి” అని డాక్టర్ అడిగితే తాగి కింద పడ్డాడు అని చెప్పింది యాదమ్మ.
ఇవన్నీ బస్తీలో అలవాటే కనక డాక్టర్ కూడా పట్టించుకోలేదు.
తాగుబోతు మొగుడు పోనేపోయాడు, కొడుకు పారిపోయాడు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే కొడుకు జైలుకి పోతాడు అని గమ్మున కూర్చుంది యాదమ్మ. స్రవంతి చెప్పినా వినలేదు. తాగి కొట్టే మొగుడు లేడు, కొట్లాటలు తెచ్చే కొడుకు లేడు, యాదమ్మ ప్రాణం సుఖంగా ఉంది. స్రవంతి చదువు అయ్యి పెద్ద వకీలు దగ్గర చేరింది. గేదెలపాల పైసలు, కూతురి జీతం పైసలు అన్నీ కలిపి, యాదమ్మ మంచిగా బంగారం కొన్నది, పైన ఇల్లు కట్టి, కింద కిరాయికి ఇచ్చింది.
హాయిగా ఉన్న ఇంట్లోకి మళ్ళీ గణేష్ వచ్చాడు. బాగా గంజాయికి కూడా అలవాటు పడి పూర్తిగా పాడైపోయాడు. ఇన్ని రోజుల తర్వాత కొడుకుని చూసిన యాదమ్మకి కన్నపేగు కదిలింది.
"నాతోని వచ్చి గేదెల దగ్గర పని చూస్కో. మనకి ఆ పైసలు చాలు, ఆ మత్తుమందు మానెయ్యి బిడ్డా!" బతిమిలాడింది యాదమ్మ. 'సరే' అన్నా నాలుగు రోజుల్లో మళ్ళీ మామూలే. ఇంట్లో పెట్టిన డబ్బులు మాయం అవుతున్నాయి, దినమంతా మత్తుగా పడుకోవడం, రాత్రి లేచి వండిన వంటంతా తినేసి బయటికి పోయి తాగి రావడం.
ఇన్ని రోజులూ ఏ గొడవా లేకుండా ఉన్న స్రవంతికి చికాకుగా ఉంది. ఈ మధ్య అన్న చూపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఒక రోజు స్నానం చేస్తుంటే వెంటిలేటర్ పై నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించి "అమ్మా!" అని కేక పెట్టింది, వెనకే దభాలున శబ్దం. మర్నాడు ఆ కిటికీ పేపర్ తో మూయించింది.
ఇంట్లో ఒక్కతి ఉండాలంటే భయం, తల్లికి తన అనుమానం చెప్తే ఉన్నంతా సేపు యాదమ్మ కాపలాగా ఉండేది. బస్తీలో కూడా ఇద్దరు,ముగ్గురుతో గొడవ పెట్టుకున్నాడు గణేష్, వాళ్ళ కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులకి చెప్తామని అన్నారు. అయినా గణేష్ పద్దతి మారలేదు.
మరో నాలుగు రోజుల తరవాత వాళ్లు పోలీసులకి చెప్పడం, వాళ్లు గణేష్ ని వాళ్ళ స్టైల్ లో భయపెట్టడం జరిగింది.
ఒకరోజు రాత్రి తల్లీ, కూతుళ్లు మంచి నిద్రలోఉన్నారు. ఆ రోజు లోపల గడియ పెట్టడం మర్చిపోయారు. రాత్రి వేళ స్రవంతికి తనని ఎవరో తడుముతున్నట్టు అనిపించి అరవపోయింది. నోరుమూసి మరీ మీద పడిపోయాడు గణేష్. కాళ్ళు గట్టిగ విదిలిస్తే యాదమ్మకి తగిలి లేచి చూసింది. గణేష్ మత్తులో ఉన్నాడు, వంటి మీద బట్టలు సరిగ్గా లేవు, గట్టిగా అరచినా, పట్టుకు లాగినా లాభం లేకపోయింది.
బలవంతాన స్రవంతి మీద పడుతుంటే, యాదమ్మ పరుగున వంట గదిలోనున్న రోకలి తెచ్చి నడుము మీద ఒక్కటి వేసింది, "అమ్మో!" అని లేవగానే మోకాళ్ళ మీద అదే రోకలితో కొట్టింది.
పట్టుమంటు కాళ్ల ఎముక విరిగిన శబ్దం అయ్యింది.
బాధతో గణేష్ కేకలకు చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు.
"మా అమ్మ నన్ను చంపేసింది, నా నడుము, కాళ్ళు విరగ్గొట్టింది" అంటూ కేకలు పెట్టాడు. ఎవరో అంబులెన్సు కి ఫోన్ చేస్తే వచ్చి సర్కార్ దవాఖానకి తీసుకెళ్లారు. రెండు కాళ్ళకి కట్టు కట్టి, నడుముకి ఏమీ చేయలేమని, అదృష్టం బావుంటే అతుక్కుంటుంది, లేదంటే జీవితాంతం మంచం మీదే ఉండాలని అన్నారు డాక్టర్లు.
"మా అమ్మే నన్ను ఇలా కొట్టింది" అని గణేష్ చెప్పడంతో, ఆమెని అరెస్ట్ చేసి కోర్ట్ కి తీసుకుని వచ్చారు పోలీసులు.
"యాదమ్మా! నువ్వు నీ కొడుకుని చంపడానికి ప్రయత్నించావని, నువ్వు కొట్టడంవల్లే అతనికి నడుముకి తీవ్ర గాయాలు అయ్యి కాళ్ళు రెండూ విరిగాయని నీ మీద అభియోగం.
కారణం చెప్పమంటే, నా కన్నప్రేమతోనే అలా చేశాను అంటావు, ఏమన్నా అర్థం ఉందా అమ్మా?నీకు కావాలంటే ప్రభుత్వం తరఫున మంచి లాయర్ని ఏర్పాటు చేస్తాం, లేదంటే నువ్వు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది" అన్నారు జడ్జి గారు.
"నాకు వేరే లాయర్ ఎందుకు జడ్జి గారు? అక్కడ కూర్చుంది చూడండి, నల్లకోటు వేసుకొని ఆ అమ్మాయి నా కూతురు. ఆమె మీద, ఆమె లాంటి వేరే తల్లులు కన్న కూతుళ్ల మీద, నా కొడుకు మీద ఉన్న ప్రేమతోనే వాడిని చితక్కొట్టాను" అంది యాదమ్మ.
వెంటనే ఆ అమ్మాయి లేచి జడ్జి గారికి నమస్కారం పెట్టింది.
"కూర్చోమ్మా!" అని ఆ అమ్మాయికి చెప్పి "మరి ఇన్ని తెలిసినదానివి, ఎందుకు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావమ్మా ?" అడిగారు న్యాయమూర్తి.
"సార్! నా మొగుడు తాగి, తాగి చచ్చాడు. వాడు ఉన్నప్పుడు ఏ ఉపయోగం లేదు, నన్ను, పిల్లల్ని రోజూ కొట్టి ఉన్న నాలుగు డబ్బులు పట్టుకుపోవడం తప్ప.
అందుకే వాడు చచ్చినా, పెద్ద బాధ పడకుండా, నా పిల్లలు బాగా చదవాలని గేదెలని పెట్టుకుని పాలు అమ్మి ఫీజులు కట్టాను. కానీ, నా కొడుకు చదువుకోకుండా, తాగుడికి, మత్తు పదార్థాలకి బానిస అయ్యాడు.
దానితో ఆపకుండా ఆడపిల్లల జోలికి వెళ్లడం, వాళ్ళ పెద్దవాళ్ళ చేతిలో తన్నులు తినడం.
తాగిన మైకంలో వాడికి అమ్మ, అక్క, చెల్లి తేడా ఏమితెలియడం లేదు. ఎన్నో సార్లు మంచిగా చెప్పాను, వినలేదు. మొన్న మళ్ళీ అలానే చేసాడు, తాగి నా కూతురి మీదకి వస్తే కర్ర తీసుకుని కొట్టాను" మామూలు విషయంలా చెప్పింది యాదమ్మ.
"పోలీసులకి చెప్పచ్చుగా!" అన్న న్యాయమూర్తి ప్రశ్నకి, "పోలీసులా! వాళ్ళేమి చేస్తారు సార్. కాసేపు స్టేషన్లో కూర్చోపెట్టి, నాలుగు కొట్టి, నాలుగు మాటలు చెప్పి పంపేస్తారు.
ఎంతమంది తాగుబోతుల్ని పట్టుకుంటారు, జైళ్లు సరిపోవు సార్.
వీడు తాగి ఒంటి మీద స్పృహ లేకుండా, ఎనుబోతులా వచ్చి మీద పడుతుంటే, ఎప్పుడు ఏమవుతుందో అని నా కూతురు వణికిపోయింది. ఆమెని వదలమంటే, వాడు నామీద పడ్డాడు. తల్లి, చెల్లి అనే జ్ఞానమే లేదు వాడికి ఆ మత్తులో. ఎంత సేపు కాపలాకాస్తాను,జరగరానిది జరిగితే నా కూతురు బతకదు,
వాడు తాగడం ఆపడు, ఎప్పుడు ఏ ఆడపిల్లకి ద్రోహం చేస్తాడో తెలీని ఆ వెధవని చంపేయడమే సరైందనిపించింది. కానీ నేను జైల్లో కూర్చుంటే, నా కూతురి బతుకు ఏమికావాలి? అందుకే దెబ్బలతో ఆపాను, వాడు చెయ్యరాని అఘాయిత్యం చేసి, జైలుకెళ్లి, ఎవరో ఓ ఆడకూతురి బతుకు బండలయ్యి, ఎందుకు సార్ ఇంతమంది బాధపడాలి?
అందుకే మళ్ళీ ఏ ఆడకూతురి వంక చూడకుండా నడుం విరగ్గొట్టాను. ఇప్పుడు వాడికి చాకిరీ నేనేగా చెయ్యాలి, ఆ జ్ఞానం కూడా లేకుండా పోలీసులకి ఫిర్యాదు చేసాడు. నన్ను జైల్లో పెడితే వాడి ముఖాన ఇన్ని నీళ్లు పోసేవాళ్ళు కూడా లేరు.
నాకు శిక్ష వేసేముందు కొన్ని ఆలోచించండి సార్! ఈ తాగుడుతో ఎన్ని కుటుంబాలు నాశనమవుతున్నాయో. టీవిలో, సినిమాల్లో కంటికి కనపడకుండా 'మద్యపానం హానికరం' అని వెయ్యడం కాదు, ఆ షాపుల దగ్గర పెద్ద బోర్డులు పెట్టాలి.
సందుకో డాక్టర్ ఉండడు, మందుల షాప్ ఉండదు, కానీ 'మందు' షాప్ మాత్రం ఉంటుంది.
ఆ షాప్ లైసెన్స్ కోసం ఆడా, మగా పోటీ పడతారు. ఇప్పుడు తాగడానికి కూడా పోటీ పడుతున్నారు లెండి.
ఇప్పుడు ఇంకా గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. చదువుకునే పిల్లలకి అలవాటు చేస్తున్నారు. చిన్న పాన్ షాపులో కూడా గంజాయి చాకేలెట్స్, ఐస్ క్రీములు అమ్ముతున్నారు. అమ్మే వాళ్ళని పట్టుకుంటారు కానీ, అసలు వాళ్లు దొరకరు. పిల్లల స్కూళ్ల దగ్గర నిఘా పెట్టాలి, స్కూల్ బయట ఎవరూ ఏమీ అమ్మకుండా చూడాలి.
బియ్యం, పప్పులకి రేషన్ కాదు సార్, మద్యానికి రేషన్ పెట్టాలి. ఎక్కువ తాగిన వాళ్ళు రోడ్ల మీద పడిపోకుండా, ఇంటికొచ్చి గొడవ చెయ్యకుండా షాప్ వాళ్లే ఏర్పాట్లు చెయ్యాలి.
అక్కడ కొట్లాటలు కాకుండా పోలీసులు ఉండాలి. తాగుబోతులకి ప్రభుత్వం పెన్షన్లలాంటివి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ డబ్బులతో తాగి కూర్చుంటున్నారు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చెయ్యకూడదు, తాగి తెచ్చుకునే రోగాలకు వైద్యం ఎందుకు?
మద్యపాన నిషేధం ఎలానూ చెయ్యలేరు. కనీసం ఇదైనా చేసేటట్టు చూడండి, చిన్న పిల్లలు, మత్తుపదార్థాలకి బానిసలు కాకుండా చర్యలు తీసుకోండి.
తప్పు చేసిన నా కొడుకుని కొట్టినందుకు నాకు శిక్ష పడ్డా పరవాలేదు, కానీ వాడికి ఆ మత్తుమందు, తాగుడు అలవాటు అవడానికి కారణమైనవారికి అందరికీ కూడా శిక్ష పడితే న్యాయం జరిగినట్టే."
విన్న న్యాయమూర్తి ఏమీ మాట్లాడలేదు, ఏమి మాట్లాడాలో తెలియలేదు.
"కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను" అని లేచి వెళ్లిపోయారు.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments