దాపరికాలు
- Yasoda Pulugurtha
- Mar 10
- 10 min read
#YasodaPulugurtha, #యశోదపులుగుర్త, #దాపరికాలు, #Daparikalu, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Daparikalu - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 10/03/2025
దాపరికాలు - తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏమే కల్యాణీ, రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదేమే?" అక్క గొంతుకలో ఒకలాంటి అసహనం.
నిజంగా తను ఫోన్ చూసుకోలేదు. వంటింట్లో వంటచేస్తోంది. ఫోన్ రింగైన శబ్దం తనకు వినబడనే లేదు.
"సారీ అక్కా, ఏమిటో వంటింట్లో హడావిడిగా ఉన్నాను. మా కిరణ్ ఫ్రెండ్ ఇండియా వచ్చాడుట. రెండురోజుల్లో వెళ్లిపోతున్నాడు. కరివేపాకు పొడి ఒక కిలో పంపించమ్మా వాడితో అంటే తయారుచేస్తున్నాను. మీ మరిది ఈరోజు సాయంత్రం వెళ్లి అతనికి అందచేయాలి. నీకు తెలుసు కదా, మా మనవడికి, మనవరాలికి కరివేపాకు పొడంటే చాలా ఇష్టమని. "
"ఆ తెలుసులే” అక్క గొంతుకలో ఒక లాంటి నిర్లక్ష్యం!
అదేమిటీ అక్క మాటలు కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు ఏది చెప్పినా తరచి తరచి ప్రశ్నలు వేస్తుంది. అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ సలహాలిచ్చే అక్కనే ఇలా మాట్లాడుతోంది. ఏమైందక్కకు?
"ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావక్కా?"
"ఏమి లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోన్ లో చెప్పేది కాదు. రేపు ఒకసారి వస్తావా? నేను వద్దామంటే ఒక వారం రోజులనుండి మా పనిమనిషి రావడం లేదు. రాగిణీ, పిల్లలు వచ్చారుకదా. ఎల్లుండే వెళ్లిపోతున్నారు. కదిలి రాలేని పరిస్తితి. "
"అర్ధం అయింది. రేపు వస్తాను. వచ్చే ముందు ఫోన్ చేస్తాను, సరేనా? బై అక్కా” అంటూ ఫోన్ పెట్టేసింది.
'అక్క ఎందుకు రమ్మందబ్బా’ అని పదిసార్లు మనసులో అనుకుంది.
తను వారంరోజుల క్రితమే అక్కా వాళ్లింటికి వెళ్లి వచ్చింది. ఈ మధ్యనే అమెరికాలో ఆరు నెలలు ఉండి వచ్చింది తన భర్తతో. వచ్చిన తరువాక అక్కావాళ్లింటికి వెళ్లింది. అక్కకూతురు రాగిణి ముంబై నుండి పిల్లలతో అప్పటికే వచ్చి ఉంది. రాగిణి ఒక పదిరోజులు శెలవు పెట్టి తల్లి దగ్గరకు వచ్చింది చూడాలని. దాని భర్త రాలేదు. సరే దాన్ని కూడా చూసినట్లు ఉంటుంది కదా అనుకుని వెళ్లింది.
అక్క ప్రమీల సోమాజీగూడా లో ఉంటుంది. తను కూకట్ పల్లిలో ఉంటుంది. అందరికంటే పెద్ద అన్నయ్య బెంగుళూర్ లో ఉంటాడు. అమ్మా నాన్న కూడా బెంగుళూర్ లోనే ఉంటారు. తమ్ముడు దుబాయ్ లో ఉంటాడు. అక్కా, తను చిన్నప్పటి నుండి చాలా క్లోజ్. తామిద్దరూ స్నేహితుల్లా ఉంటారు. అక్క అంటే తనకు చాలా ఇష్టం. చెప్పాలంటే అక్కే తనకు స్పూర్తి. ఎంతో చొరవగా ముందుకు దూసుకుపోతుంది. బాగా చదువుకుంది. మంచి బేంక్ లో ఉద్యోగం తెచ్చుకుంది.
రెండు సంవత్సరాలక్రితమే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుంది. తనకీ అక్కకూ సహస్రం తేడా అన్ని విషయాలలోనూ. అక్కలా తను చొరవ చూపలేదు. పెళ్లికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసి ఆతరువాత మానేసి ఇంటిని పిల్లలనూ చూసుకోవడంలో బిజీ అయిపోయింది.
అక్కకు కూతురు రాగిణి, ఆ తరువాత కొడుకు రేవంత్. రేవంత్ యూ. ఎస్ లో ఉంటున్నాడు. వాడికి పెళ్లి అయి సంవత్సరం దాటింది. తనకు ఇద్దరూ కొడుకులే. పెద్దవాడు కిరణ్, రెండోవాడు ఆదిత్య. ఇద్దరూ యూ. ఎస్ లోనే ఉంటున్నారు. కిరణ్ కు ఇద్దరు పిల్లలు. ఆదిత్య కు ఇంకా పెళ్లి కాలేదు. పిల్లలను చూద్దామనే తను, తన భర్తా ఈ మధ్యనే అమెరికా వెళ్లి వచ్చారు. కిరణ్ న్యూయార్క్ లో ఉంటాడు. అక్క కొడుకు రేవంత్ బోస్టన్ లో ఉంటాడు. ఇండియా వచ్చేసే ముందు దగ్గరే కాబట్టి వాడు మరీ మరీ రమ్మనమని పిలిస్తే ఒక వారం రోజులు వాడిదగ్గర ఉండి వచ్చారు.
మర్నాడు భర్త రామకృష్ణ ఆఫీస్ కు వెళ్లిపోగానే కేబ్ బుక్ చేసుకుని ప్రమీల ఇంటికి వచ్చింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. రాగిణి పిల్లలను తీసుకుని స్నేహితురాలు లంచ్ కి పిలిచిందని వెళ్లిందిట. అక్క ఒక్కర్తీ ఉంది తన కోసమే ఎదురుచూస్తున్నట్లుగా కూర్చుని.
తనను చూడగానే లేచి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. భోజనం చేస్తావా అని అడిగింది. ఇప్పుడే కాదంటూ సమాధానమిచ్చింది. అక్క ఎందుకో తనతో ముభావంగా ఆచి తూచి మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఎప్పుడూ తనతో గల గలా మాట్లాడుతూ, హడావిడిగా తిరిగే అక్క ఎందుకో ముభావంగా ఉన్నట్లు తనకు తోచింది.
ఇంతలో అక్కే సడన్ గా మాట్లాడడం మొదలు పెట్టింది.
"ఒక్క విషయం సూటిగా అడుగుతాను, దాచకుండా సమాధానం చెప్తావా కల్యాణీ?"
"అడుగక్కా, ఏ విషయం? నీ దగ్గర నాకు దాపరికాలు ఏముంటాయి?" విస్తుపోతూ సమాధానమిచ్చింది.
"అమెరికా వెళ్లినప్పుడు మా కోడలు శృతి తో నీవు ఏమిటో చాలా చాలా విషయాలు చెప్పావుట?"
"ఏం చెప్పాను, ఏ విషయాలు?" నిర్ఘాంతపోతూ అడిగింది.
"మా రేవంత్ పెళ్లికి ముందు ప్రియాంక అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, ఇరువైపుల పెద్దల అంగీకారం కూడా అయిందని, ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చిన పెళ్లి కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందని, ఈ విషయాన్ని పైకి రానీయకుండా దాచిపెట్టామని చెప్పావుట. "
"నేను చెప్పానా శృతికి ఇవన్నీను? నీవు నమ్ముతున్నావా?
అయినా నేనెందుకు చెపుతానక్కా? నీవెలా నమ్మావూ?"
"బాగుందే, స్వయంగా మా శృతే ఏడుస్తూ రేవంత్ ని అడిగిందట. వాడు స్టన్ అయ్యాడుట. నన్ను మోసం చేసావంటూ ఒకటే ఏడ్పుట. ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయిట. మీ కళ్యాణి పిన్ని చెప్పారని అందట.”
"నేను చెప్పానా?" కల్యాణి నిర్ఘాంతపోయిందో క్షణం.
"అయినా ఇటువంటి విషయాలు శృతికి చెప్పడమేమిటే కళ్యాణీ? మేమందంరం ఆ విషయమెప్పుడో మర్చిపోయాం. వాళ్లిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారని సంబర పడుతుంటే, నీవేమిటే తగుదునమ్మా అంటూ ఏదో గొప్ప విషయం చెప్పినట్లుగా చెపుతూ వాళ్ల ఆనందాన్ని పాడుచేసావు? కాపురాలు కూల్చడం అంటే ఇదే” అక్క గొంతుకలో ఆగ్రహం.
"అక్కా” తీక్షణంగా పలికింది కళ్యాణి గొంతుక!
"నేను కాపురాలు కూల్చేదాన్ని కాదు. నాకు ఆ అవసరం లేదుకూడా. శృతి అబధ్దం చెపుతోంది. ఆమె ఎందుకు అలా చెప్పిందో నిలదీసీ అడుగు ముందు. ఆమెకీ విషయాలు ఎలా తెలిసాయో కనుక్కోమను రేవంత్ ని. నేను ఎటువంటిదాన్నో తెలిసి కూడా నన్ను అనుమానిస్తున్నావేమిటే అక్కా?"
"శృతి స్వయంగా రేవంత్ కి చెప్పడం, ఇద్దరి మధ్యా రాచుకుంటున్న గొడవలూ అవీ అబధ్దమంటావా? నీవు చెప్పావని క్లియర్ గా చెపుతుంటే, మళ్లీ శృతిని కనుక్కోమంటావేమిటి? శృతి అబధ్దం చెపుతోందని నీ అనుమానమా?"
"అక్షరాలా అబధ్దం అంటాను అక్కా! శృతి నీకు కోడలే కావచ్చు, కాదనను. నేను నీకు తోడపుట్టిన దాన్ని. నీతో కలసి పెరిగాను. ఒకే ప్రాణంగా పెరిగాం. అమ్మ తరువాత నిన్నే అమ్మగా భావిస్తాను. నేనేమిటో, నా మనస్తత్వం ఏమిటో బాగా తెలిసిన నీవు నన్ను అనుమానించడంలో అర్ధం లేదంటాను. నిన్నగాక మొన్న వచ్చిన శృతి మీదున్న నమ్మకం నా మీద ఎందుకు లేదా అని ఆవేదన పడుతున్నాను. నీ మనస్సాక్షిని ఒక్కసారి అడిగి చూడక్కా, ఏమి చెపుతుందో? ఈ విషయంలో ఒక క్లేరిటీ వచ్చేవరకూ నేనేమీ ప్రస్తుతం మాట్లాడే స్తితిలో లేను. ఉంటాను, బై” అంటూ ఒక్క క్షణం కూడా ఆగకుండా వచ్చేసింది.
కేబ్ కూడా మాట్లాడుకోకుండా బయటకు వచ్చి ఆటో ఎక్కేసింది. అసలే ఎండ దంచేస్తోంది. అక్క దగ్గరకు వెడ్తున్నాను కదా అనుకుంటూ పొద్దుట టిఫిన్ కూడా తినలేదు. ఒకవైపు కడుపులో ఆకలి, ఉక్రోషంతో దుఖం పొంగుకొస్తోంది. కళ్లమ్మటనీళ్లు ఊటబావిలా ఊరుతూనే ఉన్నాయి.
అసలేమైంది? శృతి కి రేవంత్ ప్రేమ వ్యవహారం ఎవరి ద్వారా తెలిసింది? తను చెప్పలేదు, మరి మరో వ్యక్తి ఎవరో చెప్పి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? తనింటికి వెళ్లాక శృతికి ఫోన్ చేసి నిలదీసి అడుగుతుంది. ఎవరు ఏమనుకున్నా తను లక్ష్య పెట్టదు. ఈ అవమానాన్ని తను తట్టుకోలేదు. మనసు పరి పరి విధాలు ఆలోచనల్లోకి వెడుతుంటే నాలుగు సంవత్సరాలనాటి గతం కళ్లముందు కదలాడింది.
రేవంత్ యూ. ఎస్ లో ఎమ్. ఎస్ పూర్తిచేసి అప్పటికే జాబ్ లో స్తిరపడిన రోజులు. అక్క తనతో అంది "కల్యాణీ, రేవంత్ కి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీ ఎరుకలో ఏమైనా సంబంధాలుంటే చెప్ప”మంది.
అప్పటికే తన కొడుకు కిరణ్ కి పెళ్లి అయి మూడు సంవత్సరాలవడం, వాడికి కొడుకు పుట్టడం కూడా అయింది. కిరణ్ భార్య 'రాగమాలిక' ఇక్కటే బి. టెక్ చదివి పెళ్లికి ముందునుండీ జాబ్ చేస్తూ ఉండేది. చెప్పాలంటే తన కోడలు చాలా చురుకైనది, అందమైనది. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చింది.
ఉమ్మడి కుటుంబం నుండి వచ్చిన పిల్ల. ఆప్యానుతారాగాలు తెలిసిన అమ్మాయి. కిరణ్ తో యూ. ఎస్ వెళ్లాకా ఖాళీగా ఉండకుండా ఎమ్. ఎస్ చేసింది. పుట్టిన బిడ్డను మేనేజ్ చేసుకుంటూనే జాబ్ కి వెళ్లేది. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. కారు డ్రైవింగ్ నేర్చుకుంది. అన్ని పనులూ తనే చేసుకుంటుంది. మనవడు పుట్టిన రెండు సంవత్సరాలకి మనవరాలు పుట్టింది.
తనూ, తన భర్తా రెండు పురుళ్లకీ వెళ్లారు. భర్తకి ఎక్కువ శెలవు లేని కారణంగా అతను వచ్చేసేవాడు. తను ఆరునెలలూ ఉండీ వచ్చేది. తన కోడలు రాగమాలిక తనతో ఎంతో గౌరవంగా ప్రవర్తించేది. అక్కకి రాగమాలిక అంటే ఎంతో ఇష్టం. "ఎంత అదృష్టవంతురాలివే కల్యాణీ, చక్కని కోడలిని తెచ్చుకున్నావు, నాకు కూడా మీ 'రాగ' లాంటి కోడలిని చూసి పెట్టవే, " అంటూ అభిమానంగా అంటుండేది.
ఒక రోజు అక్క ఫోన్ చేసి "మనం ఏదో అనుకుంటాం గానీ ఏదీ మన చేతిలో లేదే కల్యాణీ. మా రేవంత్ అక్కడే తన కొలిగ్ ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించాడుట. ఆ అమ్మాయికి కూడా తనంటే చాలా ఇష్టమంటున్నాడు. కులగోత్రాలు ఒకటే కాదు, మన భాషా, సాంప్రదాయాలు కూడా సరిపోవు. ఒరిస్సాకు చెందిన అమ్మాయి, ఏమి చేస్తాం చెప్పు? కాదూ కూడదని వాడి మెడలు వంచి మనకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లిచేయలేముగా?
వాడీ విషయం చెప్పినప్పటినుండి నా మనసుకి అంత సంతోషంగా అనిపించడం లేదే" అంది. అప్పుడు అక్కకు తనే ధైర్యం చెప్పింది. ఈ రోజుల్లో ఇవన్నీ సాధారణమే కదక్కా. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మనసులు కలవాలేగానీ, కులగోత్రాలన్నది సమస్య కాదక్కా. వాళ్లిద్దరూ ఆనందంగా కలసికాపురం చేసుకోవడం కంటే మనకి కావలసిందేముం”దంటూ.
ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇద్దరూ యూ. ఎస్ నుండి వచ్చారు. ప్రియాంక లో అందం కంటే ఆకర్ణణ ఎక్కువగా కనపడుతోంది. ఆ అమ్మాయి తల్లితండ్రులు ఒడిశాలోని కోరాపుట్ లో ఉంటారు. వాళ్ల బంధుగణాలందరూ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే ఉంటారు. నిశ్చితార్ధం వాళ్ల సాంప్రదాయ ప్రకారం జరపిస్తామన్నారు. హైద్రాబాద్ రాలేమన్నారు. పెళ్లి కూడా వెంటనే జరిగిపోవాలని అదికూడా కోరాపుట్ లోనే అవ్వాలన్నారు.
ఎంగేజ్ మెంట్ మీ ఊళ్లో చేయండి, పెళ్లిమాత్రం మా సాంప్రదాయ ప్రకారం మా ఊరిలోనే జరగాలని అక్కా, బావా పట్టుపట్టారు. పెళ్లి కూతురి తండ్రి అహంభావి. ఆయన ప్రతీ మాట, చేష్టల్లోనూ అది దౌత్యమౌతోంది. ఒక్కగానొక్క కూతురేమో, ప్రతీదీ వాళ్లకి అనుకూలంగా ఉండేటట్లు డిమేండ్ చేస్తున్నాడు. రేవంత్ అప్పుడే తమ ఇల్లరికపు అల్లుడన్నట్లుగా ఉంది సుకుమార్ మిశ్రా ప్రవర్తన.
రేవంత్ అయితే, "అమ్మా, ఎందుకీ వాదనలు, వాళ్లు చెప్పినట్లు చేస్తే పోలే, కావాలంటే పెళ్లి అయి వచ్చాక ఇక్కడ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దా”మంటాడు.
అక్కడే గొడవలు తారాస్తాయికి చేరుకున్నాయి. రేవంత్ కూడా అలా మాట్లాడేసరికి, బావ "నీ పెళ్లి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, మాకు సంబంధం లే”దంటూ గట్టిగా అరిచేసాడు. ఇరువైపులా అదే పట్టుదలతో ఉన్నారు. చివరకు ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చిన వాళ్ల ప్రేమ బ్రేక్ అప్ అయింది. "మమ్మలని కాదని రేవంత్ ని చేసుకుంటే మాతో నీకు సంబంధం పోయినట్లే”నంటూ ప్రియాంక తండ్రి కుండబ్రద్దలు కొట్టినట్లు కూతురితో చెప్పేసాడు.
రేవంత్ కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ప్రమీల బెంగపడిపోయింది, కొడుకు మళ్లీ మామూలుగా అవుతాడా అని. వెంటనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే వాడి మనసు డైవర్ట్ అవుతుందని అనుకున్నారు. ఏది జరిగినా మన మంచికే అన్నట్లుగా ఎక్కువ శ్రమ పడకుండానే రేవంత్ పెళ్లి శృతితో జరిగిపోయింది. తను ఆలోచనలలో ఉండగానే ఆటో తమ ఇంటిని సమీపించడం, ఆటోవాడు తనను పిలిచేసరికి తను వాస్తవంలోకి వచ్చింది.
ఇంటికి వచ్చిందన్న మాటేగానీ తన మనస్సు మనస్సులో లేనేలేదు. భర్తకు చెప్పాలని అనుకోలేదు. ఆ రాత్రి ఎనిమిదిగంటలకు శృతికి ఫోన్ చేసింది. శృతి కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్ కూడా చేసింది, తనకి కాల్ చేయమని. రెస్పాన్స్ లేదు.
ఆ తరువాత నాలుగు రోజుల తరువాత కిరణ్ ఫోన్ చేసాడు. "ఏమి జరిగిందమ్మా” అంటూ! వాడు రేవంత్ కి మామూలుగా ఫోన్ చేస్తే ముభావంగా మాట్లాడాడుట. "ఏమైందిరా, అంతా బాగానే ఉందా" అని అడిగితే, గతంలోని నా ప్రేమ వ్యవహారాన్ని మొత్తం కల్యాణి పిన్ని శృతికి చెప్పేసిందిట. సో, నాకూ, శృతికి మధ్య బాగా గొడవ జరిగింది, శృతి సీరియస్ గా ఉందని చెప్పాడుట. అందుకే విషయమేమిటో కనుక్కుందామని నీకు ఫోన్ చేస్తున్నానమ్మా” అనేసరికి, ఇన్నాళ్లూ తనలో దాచుకున్న దుఖం కట్టలు తెంచుకుంటూ ప్రవహించింది వాడి మాటలకు.
“నేను అవన్నీ ఎందుకు చెబుతానురా కిరణ్, శృతి అబధ్దం ఆడుతోంది. అందరూ నన్ను దోషిగా నిలదీస్తున్నా”రంటూ ఏడ్చేసింది. కిరణ్ తల్లిని ఓదార్చాడు. తను అసలు విషయం కనుక్కుంటానని, నీవు తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడ్తావమ్మా, ధైర్యంగా ఉండాలంటూ అనునయించాడు.
తను, తన భర్తా ఇద్దరూ అమెరికాలో ఉండగా రేవంత్ తమని వాళ్లింటికి పిలిచాడు అభిమానంతో. కానీ శృతికి ఎందుకో తాము వాళ్లింటికి వెళ్లడం ఇష్టంలేదు. శృతి బధ్దకస్తురాలు. తాము వచ్చామన్న కనీస మర్యాద కూడా చూపలేదు. కాఫీ దగ్గరనుండి అన్నీ తనే తయారు చేసేది. వంటగది ఛాయలకు వచ్చేదేకాదు. ఎన్నో సార్లు రేవంత్ తన ఎదురుగానే "ఏయ్ శృతీ, మా 'రాగ' వదిన అన్ని పనులూ తనే చేసుకుంటుంది. కల్యాణి పిన్ని చేత ఏమీ చేయించదు. నీవేమిటీ, మొత్తం కిచెన్ ని పిన్నికిచ్చేసావంటూ ఉడికించేవాడు.
అలాగే మరోసారి, నీవు 'రాగ' వదినలాగ కారు నేర్చుకుని ఉంటే, నీవే మా పిన్నిని బాబాయ్ ని బయటకు షాపింగ్ కి, చూడవలసిన ప్రదేశాలకూ తిప్పేదానివి కదా. నేనేమో ఆఫీస్ పనితో బిజీగా ఉన్నాను. పాపం మా పిన్నీ వాళ్లకు బోర్ గా ఉంది. ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవూ అంటూ దెప్పేవాడు.
మా 'రాగ' వదిన జాబ్ చేస్తూ కూడా ఇంటిని పిల్లలని మేనేజ్ చేస్తోంది. ఎంతో ఏక్టివ్ గా ఉంటుంది. నీవు కూడా ఖాళీగా ఉండకుండా ఏదైనా చేయచ్చుకదా! నీవు చదువుకుంటానంటే చెప్పు, ఎమ్. ఎస్ చదివిస్తానని అనడం తను వింది.
ఎప్పుడూ ఫోన్ చేతిలో పట్టుకుని ఫ్రెండ్స్ తో చిట్ చాట్ తప్పించి మరో పని చేసేదికాదు. డిష్ వాషర్ కూడా చివరకు తనే సర్దేది. "అయ్యో, నేను చేస్తా”నని కూడా అనేదికాదు.
పోనీలే, తన కొడుకింట్లో తను చేయదా, అలాగే ఇక్కడానూ అనుకుని సర్దుకుపోయింది. పనులు చేయడం, ఇంటిని క్లీన్ గా పెట్టడం తనకిష్టం. "మా కల్యాణిపిన్ని వంటలు సూపర్ గా చేస్తుంది. దగ్గరుండి నేర్చుకోచ్చు కదా" అనేవాడు. ఎప్పుడూ తనని, రాగ మాలికనీ మెచ్చుకుంటుంటే ముఖం గంటు పెట్టుకునేది. ముఖం మీద చిరునవ్వు కనిపించేది కాదు. తను కూడా ఏమీ పట్టించుకోకుండా సరదాగా గడిపి వచ్చేసింది. అక్కకు ఇవేమీ చెప్పలేదు. శృతి మమ్మలని బాగా చూసుకుందని అన్నీ చక్కగా చేసిపెట్టిందని చెప్పింది.
మరో నాలుగు రోజులు మామూలుగా గడచిపోయాయి.
ఒకరోజు సడన్ గా శృతి నుండి మెసేజ్. "కల్యాణి అత్తయ్యా, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ఐయామ్ సారీ. మీతో తరువాత వివరంగా మాట్లాడుతాను - నన్ను క్షమించండి" అంటూ ఇచ్చింది. తను ఆశ్చర్యపోయింది. "సరే, తనే ఫోన్ చేయనీ" అనుకుంది.
మరో అరగంటకి రాగమాలిక నుండి ఫోన్. "అత్తయ్యా, విషయమంతా మీ అబ్బాయి చెప్పారు. నాకు చాలా బాధ వేసింది. అదేమిటీ, అత్తయ్యను అలా అవమానించడం ఏమిటి? అత్తయ్య అలా ఎప్పటికీ చెప్పదు. మీరంతా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే అత్తయ్యే తప్పు చేసిందని అనుకోరా?" పాపం అత్తయ్య మానసికంగా ఎంత బాధపడ్తున్నారో, నేనే శృతిని నిలదీస్తానని అన్నాను.
శృతికి వెంటనే ఫోన్ చేసాను. మళ్లీ అదేమాటంది. నేను సీరియస్ గా మా అత్తయ్య చాడీలు చెప్పే మనిషి కాదు. ఎంతో మంచి మనసున్న అత్తయ్యపై అనవసరంగా నిందలు వేయకన్నాను. ధైర్యం ఉంటే, నీకు ఎవరు ఈ విషయాలన్నీ చెప్పారో చెప్పమన్నాను. కొంచెం తడబడింది. నీవు చదువుకున్న చదువు, నీ తల్లితండ్రుల పెంపకం నిన్ను ఇలా తయారుచేయడం శోచనీయమన్నాను. సంస్కారం లేకుండా మాట్లాడకూడదన్నాను. ఫోన్ లో ఏడ్చేసింది.
చివరకు బయట పడింది. తన తో ఇంజనీరింగ్ చేసిన తన స్నేహితురాలు యూ. ఎస్ లో ఎమ్. ఎస్ చేసి జాబ్ చేస్తోందిట చికాగో లో. మాటల్లో తనకు పెళ్లి కుదిరిందని చెప్పిందిట. శృతి పెళ్లికి తనకి ఇన్విటేషన్ పంపలేదేమంటూ నిష్టూరమాడుతూ పెళ్లి ఫొటోలు పంపమందట. ఇది పంపిందిట. రేవంత్ ఫొటో చూడగానే, అదేమిటీ, మా ప్రియాంక, ఇతనూ ప్రేమించుకున్నారు కదా పెళ్లికి ముందు. వాళ్ల పెళ్లి వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లి కేన్సిల్ అయిందంటూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పిందిట.
ప్రియాంక, శృతి స్నేహితురాలు ఎమ్. ఎస్ చదువుతున్నప్పటి నుండి ఫ్రెండ్స్ ట. ఇప్పటికీ తమిద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పిందిట. అయితే ప్రియాంక కూడా పెళ్లి చేసుకుని ప్రస్తుతం డెట్రాయిట్ లో భర్తతో ఉంటోందిట. ఈ విషయాలన్నీ నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పద్దంటూ ఒట్టు వేయించుకుందట.
ఇదేమో ఆగ్రహంతో ఊగిపోతూ, తననేదో మనం అందరం కలసి అన్యాయం చేసినట్లు బాధపడిపోతూ రేవంత్ ని కడిగి పారేసిందట. అసలుకే శృతి కి నేనన్నా, మీరన్నా అసూయ. మీ అక్కగారు కూడా ఎప్పుడూ శృతితో మా రాగమాలికను చూసి నేర్చుకో అంటారుట. శృతే ఈ విషయం అదివరలో ఒకసారి చెప్పింది.
రేవంత్ శృతిని "నీకీ విషయాలు ఎవరు చెప్పా”రని అడగగానే, మీమీద ఉన్న అక్కసుతో టక్కున మీమీదకు తోసేసింది. కేవలం అసూయతోటే. రేవంత్ తన ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నాడుట. ఇప్పుడవన్నీ మరచిపోయానని, సారీ చెప్పాడుట. మొత్తానికి శృతి కూడా కూల్ అయిందట. తను గిల్టీగా ఫీల్ అవుతున్నానని మీకు సారీ చెపుతానంది. శృతి మాట్లాడి సారీ చెపితే మీరు క్షమించేయండి. సరేనా” అంటూ ఫోన్ పెట్టేసింది.
కల్యాణి రాగ మాటలను మౌనంగా వింది. తను శృతి నుండి సారీలు, క్షమార్పణల కోసం ఎదురుచూడడం లేదు. ఒక్క సారీ అనగానే తను ఇంతవరకూ ఎంత క్షోభను అనిభవించిందో అది మనస్సులోనుండి తొలగిపోతుందా? అసలు తప్పు ఎవరిది, ఎక్కడుందంటూ ఒక్క క్షణం ఆలోచించింది.
భార్యా భర్తల బంధంలో దాపరికాలు ఉండకూడదంటారు. పెళ్లికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను ఇద్దరూ ఫేర్ చేసుకోవాలంటారు. నిజంగా రేవంత్ తనకిలా జరిగిందని పెళ్లికి ముందే శృతికి చెప్పి ఉంటే శృతి రేవంత్ ని అంగీకరించేదా? పోనీ పెళ్లి తరువాతైనా రేవంత్ జరిగిన విషయాన్ని నెమ్మదిగా శృతికి చెప్పి ఉండాల్సిందేమో.
అయినా ఎవరైనా ఎలా చెప్పగలుగుతారు? సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కోచోట ఒక్కో తీరుగా వ్యవహరించక తప్పదు. 'నా జీవితం తెరిచిన పుస్తకమని, రహస్యాలూ, దాపరికాలూ ఉండవని కొంతమంది ప్రగల్భాలు పలుకుతారు. కానీ చెప్పినంత సులభం కాదు ఆచరించడం.
దాపరికం ఎటువంటిదైనా ఒక్కోసారి మనం ఊహించని రీతిలో ఏదో విధంగా బయటకు వచ్చేస్తుంది. ఎవరిద్వారానో తెలిసే కంటే, తన మనిషే చెప్పి ఉంటే ఇంత రాధ్దాంతం జరిగేదే కాదు. అదే జరిగింది ఇక్కడ. రేవంత్ ఏదో సందర్భంలో శృతికి చెప్పేసి ఉంటే అప్పుడే వారిరువురి మధ్య మనస్పర్ధలు వచ్చినా ఇప్పటికి చల్లబడిపోయేవి.
ప్రేమించుకోవడం, ఆ ప్రేమ ఏవో కారణాలవల్ల సఫలం కాకపోవడం ప్రస్తుత రోజుల్లో సహజం అయిపోయాయి. పీటలమీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. పెళ్లి అయిన కొద్దిరోజులలోనే విడాకులకు కోర్టుకు ఎక్కుతున్నారు నేటి యువతీ యువకులు. ఇవన్నీ అర్ధం చేసుకోలేని అమాయకురాలా శృతి? ఇదే అనుభవం ఆమె విషయంలో జరిగి ఉంటే? అయినా ప్రతీ ఒక్కరూ ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటారు. వాటిని అర్థం చేసుకుని సామరస్యంతో ముందుకు సాగిపోతే ఆ జీవితం నందనోద్యానవనం అవుతుంది.
శృతిని ప్రతీ విషయానికి చిన్నపరుస్తూ మాట్లాడడం కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్లైంది. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం, అలవాట్లు వేరు. ప్రతీ విషయానికి అక్క కూడా రాగమాలికతో శృతిని పోల్చుకుంటూ అసంతృప్తికి లోనౌతుంది. మా 'రాగ' వదిన కేపబుల్, నీలా కాదు, భలే ఏక్టివ్ అంటూ రేవంత్ పదే పదే శృతి దగ్గర అనడం తను చాలాసార్లు వింది. అలాగే శృతి దగ్గర తనను మెచ్చుకుంటూ, నీకేమీ రాదంటూ రేవంత్ ఇన్ సల్ట్ చేస్తూ మాట్లాడడం తనకు తెలుసు.
ఈసారి తను అక్కను కలిసినప్పుడు గట్టిగా చెప్పాలి. రాగమాలిక ప్రసక్తిని పదే పదే శృతి దగ్గర తీసుకురావద్దని, శృతిని కించపరచే విధంగా మాట్లాడవద్దని. అలాగే రేవంత్ కు కూడా చెప్పమని చెప్పాలి. "ఏం, రేవంత్ శృతిని తనకు అనుకూలంగా ఉండేటట్లు, తనకు నచ్చినట్లుగా మార్చుకోలేడా?" ఒకరితో పోల్చి కించపరిస్తే వాళ్లు వృధ్దిలోకి రారు సరికదా, ఇలాగే అసూయా, ద్వేషాలతో రగిలిపోతారు.
రక రకాల ఆలోచనలు మనస్సుని ముప్పిరిగొంటుండగా శృతి ఫోన్ చేసింది.
"హలో కల్యాణి అత్తయ్యా!"
"చెప్పు శృతీ, ఎలా ఉన్నావు?"
"ఏమీ బాగాలేను కల్యాణి అత్తయ్యా. నిజం. మీ పట్ల చాలా సంకుచితంగా, ఛైల్డిష్ గా ప్రవర్తించాను. నా ప్రవర్తన నాకే అసహ్యం పుట్టేటట్లు. ఎవరిమీదో ఉన్న ఉక్రోషం మీమీద చూపించాను. నా మీద కోపం లేదూ మీకు?"
"కోపం కాదు శృతీ, మీ అందరి నిందారోపణలకూ నేను బాధపడిన మాట వాస్తవం. అందరి దృష్టిలో ఒక సంస్కార హీనురాలిగా ముద్రపడ్డానే అని మానసికంగా కృంగిపోయాను. మాటే ఒక మనిషి సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది. కాలుజారితే తీసుకోవచ్చు, కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేం అన్న నానుడి నీకు తెలియనిది కాదు. ఒక చిన్న అబధ్దపు మాట ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుందో ఇప్పుడీ సంఘటనే ఒక ఉదాహరణ.
ఒక చక్కని కుటుంబానికి కోడలిగా వెళ్లావు. రేవంత్ జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తావు చెప్పు. జీవితంలో తప్పొప్పొలు జరుగుతూనే ఉంటాయి. వాటినే తలచుకుంటే అక్కడే ఆగిపోతే ఇంక జీవితంలో ముందుకు పోలేం శృతీ.
నీవు నన్ను బ్లేమ్ చేసావని నిన్ను జీవితాంతం శతృవుగా చూడాలా, లేక ఏదో పొరపాటులో, ఫ్రస్ట్రేషన్ లో పాపం శృతి మాట్లేడేసింది, నా అనుభవం ముందు తన అనుభవం చాలా చిన్నదని సరిపెట్టుకుంటేనే బాంధవ్యాలు నిలుస్తాయి”.
కల్యాణి మాటలకు అవతల శృతి కి ఏడ్పు వచ్చేస్తోంది. గద్గదస్వరంతో మీది ఎంత మంచి మనస్సు కల్యాణి అత్తయ్యా. మీ మాటలకు నా సంకుచిత మైన మనస్సు పునీతమైంది. మీ మాటలూ, 'రాగ' అక్క మాటలు నా కళ్లు తెరిపించాయి. మీరు, రాగమాలిక అక్కా ఎంత మంచి వ్యక్తులో. మీ ఇద్దరి సాహచర్యంలో నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒక ఉన్నతమైన వ్యక్తిగా నన్ను నేను మార్చుకుంటాను. "నన్ను క్షమిస్తారు కదూ? చెప్పండి అత్తయ్యా!"
"అంత పెద్ద మాటలు వద్దురా శృతీ. మేము కూడా మామూలు మనుషులమే. దేవతలమేమీ కాదు. ముందరే చెప్పాను. నాకు కోపమేమీ లేదని. అయినా నీమీద కోపమా? పిచ్చిపిల్లా! అలా ఎప్పుడూ అనుకోకు. ఇప్పుడు నీమీద ఎంతో ఇష్టం ఏర్పడింది నాకు. నిజం శృతీ. పిల్లలు తప్పుచేస్తే పెద్దలు క్షమించాలి. అప్పుడే మా పెద్దరికానికి విలువ. సంతోషంగా ఉండండమ్మా" అంటూ ఫోన్ పెట్టేసింది.
శృతి ఫోన్ చేసిన ఒక అరగంటకు ప్రమీల ఫోన్ చేసింది. "కళ్యాణీ, పొరపాటు జరిగిందే, ఏమనుకోకు. నిన్ను అనవసరంగా తప్పుపట్టాను. శృతి ఇలా చేస్తుందని అనుకోలేదు. నీవన్న మాటలు అక్షరాలా నిజమే కళ్యాణీ. సొంత చెల్లెలి మనస్సుని అర్ఘం చేసుకోలేకపోయాను. విషయం వినగానే ఏదో ఒకలాంటి ఆవేదన కలిగింది. రేవంత్, శృతీ సంసారం ఏమౌతుందోనన్న ఒకలాంటి భయంతో విచక్షణ కోల్పోయాను, నన్ను క్షమించవే కల్యాణీ!"
“అక్కా, నాకు నీవు అమ్మతో సమానం. క్ణమార్పణ ఏమిటి? నిజం దాగదు అక్కా. ఈరోజు అక్క నన్ను అనుమానించింది. రేపో, మరెప్పుడో నిజం బయటకు వస్తుంది. అప్పుడు అక్కకు నేనేమిటో తెలుస్తుందిలే, అప్పుడు ఆ అక్కే నన్ను తన గుండెలకు హత్తుకుంటుందన్న నమ్మకం నాకుందక్కా. ఇంకనైనా ప్రశాంతంగా, హాయిగా ఉండక్కా” అంటూ బై చెపుతూ ఫోన్ పెట్టేసింది.
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments