సునంద భరతులు
- Vagumudi Lakshmi Raghava Rao
- Mar 10
- 4 min read
#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #SunandaBharathulu, #సునందభరతులు

Sunanda Bharathulu - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 10/03/2025
సునంద భరతులు - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కాశీ రాజు సర్వ సేనుడు శివానుగ్రహం తో ప్రజలను ధర్మ బద్ధంగా పరిపాలించేవాడు. అతని ఏలుబడిలో ప్రజలంతా శివనామ స్మరణతో, తమ శక్తి మేర కష్టపడి ఒళ్ళు వంచి పనిచేస్తూ ఆనందంగా జీవించేవారు.. సకాలంలో వర్షాలు కురిసేవి. నిరంతరం భూమాత ఆకుపచ్చని చేల తో, పుష్కలమైన పంటలతో కామధేనువు లా ప్రకాశించేది. విధాత రాతకు అనుకూలంగా ప్రజలందరూ ధర్మం తప్పకుండా తమ విధిని తాము నిర్వహించేవారు.
రాజ్య పరిపాలన కు సంబంధించిన సర్వ విషయాల మీద సర్వ సేనునకు ప్రాధమిక జ్ఞానం ఉండేది. దానితో రాజ్యాభివృద్ధికి పరులు ఇచ్చే సలహాలలో ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని తనే చక్కగా గమనించేవాడు. ఆపై రాజ్య క్షేమం కోరే పెద్దల, మహర్షుల అభిప్రాయాలను స్వీకరించి, అందుకు అనుకూలంగా నడుచుకునేవాడు.
అతని మీద కాశీ విశ్వనాథుని కరుణాకటాక్ష వీక్షణలు పుష్కలంగా ఉండేవి. సర్వ సేనుడు ఒకపూట నిరాహారంతో నన్నా ఉండేవాడు కానీ శివారాధన చేయకుండా ఒక పూట కూడా ఉండేవాడు కాదు.
సర్వ సేనుని భక్తికి మెచ్చిన బోళాశంకరుడు అతని ఏలుబడిలో ప్రజలకు ఎలాంటి ఇడుములు కలగకుండా కాపాడేవాడు. అతని రాజ్యంలోని ప్రజలు చావును కూడా పెళ్ళి తంతులా జరిపించి చనిపోయిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగించేవారు. సర్వ సేనుని పరిపాలన లో కాశీలో మరణమంటే కైలాస వాసుని సన్నిధి చేరినట్లే అని ప్రజలందరూ అనుకునేవారు.
నీతి నియమం నిగమ ధర్మం తప్పని సర్వ సేనునకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సర్వ సేనుడు తన సంతాన లేమికి ప్రధాన కారణం తన పూర్వ జన్మ పాపం అనుకున్నాడు కానీ దైవాన్ని, భార్యని నిందించలేదు. ఆపై మహర్షుల మాటలను విని సంతానం నిమిత్తం అనేక యజ్ఞయాగాదులు చేసాడు. తన రాజ్యం లోని అనేక ప్రాంతాల్లో నిత్యాన్నదాన శాలలను ఏర్పాటు చేసాడు.
సంతానం తో కళకళలాడేవారిని తగిన రీతిలో సత్కరించాడు. కడకు అతని కోరిక నేరవేరింది. సర్వ సేన దంపతులకు ఒక శుభ ముహూర్తాన ఒక ఆడ శిశువు జన్మించింది.
సర్వ సేనుడు ఆడ శిశువు ను చూచి మహదానంద పడ్డాడు. తన యింట లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి ఒకటై జన్మించారు అని పదుగురితో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
అయితే సర్వ సేనుని భార్య విచిత్రిక “ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచిన కాశీ విశ్వనాథుడు వంశోద్ధారకుడైన మగ పిల్లవాడిని ప్రసాదించలేదు. ఈ ఆడ శిశువు ను ఏదో ఒక ఏనుగు కాళ్ళ కింద పడేసి తొక్కించేయండి. " అని భర్త సర్వ సేనునితో అంది.
సర్వ సేనుడు తన భార్య విచిత్రిక మాటలను విని, "దేవీ నా ధర్మ పత్నివై ఉండి ఇంత అవివేకం తో మాట్లాడతావు అని అనుకోలేదు. కాశీ విశ్వనాథుడే అర్థ నారీశ్వర స్వరూపుడు. సృష్టి లో ఆడ మగ అనే భేద భావం చూపకూడదనే స్వామి ఆ రూపం ధరించాడు. నా దృష్టిలో అందరూ సమానులే. మహర్షులందరూ మనకు పుట్టిన ఆడ పిల్లను చూచి, ఈ పిల్ల మహర్జాతకురాలు అవుతుంది అని అంటున్నారు. " అని అన్నాడు.
సర్వ సేనుని మాటలను విన్న విచిత్రిక, "నాథ! మహర్షుల దృష్టి వేరు. మామూలు మానవుల దృష్టి వేరు. సమదృష్టి వేరు. సంఘదృష్టి వేరు. ఈ లోకం లో నలుగురితో నారాయణ పదుగురితో గోవిందా అని అనుకోవాలే కానీ ఆదర్శం అంటూ ఆలోచిస్తే ముందు ముందు తాడే పామై కాటు వేస్తుంది. ఈ సత్యం గమనించిన దుష్యంత మహారాజు నిండు సభ లో నువ్వు ఎవరో నాకు తెలియదని శకుంతలను పరాభవించాడు. పరువు ప్రతిష్ట లకే పెద్ద పీట వేసాడు. కాబట్టి సంఘాచారాలకు అనుకూలంగా నడుచుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. " అని భర్తతో అంది.
విచిత్రిక మాటలను విన్న సర్వ సేనుడు, " ప్రియపత్ని సంఘాచారాలను పాటించడమంటే, ఆడ మగ తేడా చూపించడం కాదు. విరాట్ పురుషుని సృష్టి లో ఆడ మగ అనే తేడా లేనేలేదు. అలాగే వలచి వరించిన వనితను నువ్వెవరో నాకు తెలియదు అనడం సరి కాదు. అది సంఘాచారం అసలే కాదు. చేసిన తప్పులన్నిటినీ చేసేసి, తన తప్పులను తాను సమర్థించుకోవడానికి సంఘాన్ని, పెద్దరికాన్ని, ఆచార వ్యవహారాలను అడ్డుపెట్టుకోవడం అమానుషం అవుతుంది కానీ సంఘాచారం కాదు. అలా తప్పులు చేసినవారి ముందు తరాలకు అది శాపమే అవుతుంది కానీ వరం కాదు సరికదా అలా చేసిన వారి వంశానికి అది క్షేమం కూడ కాదు. ఇది కాలం చెబుతున్న సత్యం.
నేను మహర్షుల ద్వారా విన్నాను. శకుంతలను పరాభవించిన దుష్యంత మహారాజు కు ఇంకా అనేక మంది రాణులు ఉన్నా, వారికి సమర్థులైన సంతానం కలగలేదట. ఇక దుష్యంత మహారాజు విషయం లో ముందు ముందు ఏం జరుగుతుందో భవిష్యత్తే చెబుతుంది. ఇక మన ఆడబిడ్డ విషయానికి వస్తే, పండితులు, మహర్షులు అందరూ శిశువు జాతకం పరిశీలించి, సునంద అనే పేరు పెట్టామన్నారు. మరి నీ అభిప్రాయం ఏమిటి?" అని సర్వ సేనుడు భార్యను అడిగాడు.
"మీ అభిప్రాయమే నా అబిప్రాయం " అని భర్తతో విచిత్రిక అంది.
సర్వ సేనుడు తన కుమార్తె నామ కరణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు. ఆ నామకరణ మహోత్సవానికి అనేకమంది రాజులు, సామంత రాజులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు కవిపండిత వైతాళికులు వచ్చి సునందను ఆశీర్వదించారు.
ఆ మహోత్సవానికి వచ్చిన దుష్యంత మహారాజు సునందను చూచి, ఈమె మా యింటి కోడలైతే బాగుండును అని మనసులో అనుకున్నాడు.
సునంద బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెట్టినప్పటినుండి అందరిని ఆనందింప చేసే పనులు చేయసాగింది. సర్వ సేనుడు సునందకు వేద పురాణేతిహాస విద్యలన్నిటిని నేర్పించాడు. అటు పిమ్మట క్షత్రియోచిత విద్యలన్నిటిని నేర్పించాడు.
దుష్యంత మహారాజు శకుంతలను తన ధర్మ పత్నిగా స్వీకరించాడనీ, పులుల మీద, సింహాల మీద, ఐరావతాల్లాంటి ఏనుగుల మీద సంచరించే శకుంతల కుమారుడు భరతునే తన తదనంతర రాజుగా ప్రకటించాడనీ సర్వ సేనుని కి తెలిసింది.
సర్వ సేనుడు భరతునికి అనేక కానుకలను పంపి తన కుమార్తె సునందతో స్నేహ పూరిత యుద్ద విన్యాసాలకు ఆహ్వానించాడు. అందుకు భరతుడు అంగీకరించాడు.
సునందభరతులు మొగలి పొదల మీద, మల్లె పొదల మీద, తాళ వృక్ష కొనల మీద నిలబడి కత్తి యుద్దం చేసారు. కత్తి యుద్దంలో ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు. అనంతరం అశ్వాల మీద నిలబడి యుద్దం చేసారు. భూమి మీద మోకాళ్ళ మీద నిలబడి యుద్దం చేసారు. వారి యుద్ద విన్యాసాలు అందరిని ఆకర్షించాయి. ఇద్దరూ భార్యాభర్తలు అయితే బాగుంటుందని పురప్రజలు అనుకున్నారు. వశిష్టాది మహర్షులు పురప్రజల మనసులో మాటలను దుష్యంత మహారాజు కు, సర్వ సేన మహారాజు కు తెలియ చేసారు. అందుకు వారుకూడ అంగీకరించారు.
సునంద భరతుల ఇష్టానుసారంగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారికి పుట్టిన సుసంతానమే భుమన్యువు.
సర్వే జనాః సుఖినోభవంతు
***
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments