top of page
Original.png

గ్రీఫ్ థెరపీ


గ్రీఫ్ థెరపీ, తెలుగు కథ, భావోద్వేగ కథ, కుటుంబ కథ, మానసిక ఆరోగ్యం, కుటుంబ బంధాలు, ప్రేమ, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కుటుంబ విలువలు, తెలుగు సాహిత్యం, Emotional Story, Family Story, Telugu Stories

గ్రీఫ్ థెరపీ కథలో మానసిక వేదన నుంచి కోలుకుంటున్న వృద్ధుడికి కుటుంబ సభ్యులు, మానసిక వైద్యుడు అండగా నిలిచిన భావోద్వేగ దృశ్యం.
గ్రీఫ్ థెరపీ కథలో మానసిక వేదన నుంచి కోలుకుంటున్న వృద్ధుడికి కుటుంబ సభ్యులు, మానసిక వైద్యుడు అండగా నిలిచిన భావోద్వేగ దృశ్యం.

Grief Therapy - Telugu Emotional Family Story | Malla Karunya Kumar

గ్రీఫ్ థెరపీ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్

Published In? manatelugukathalu.com On 23/07/2026


ఒక్కోసారి మనిషి చేసే చర్య వెనుక ద్వేషం ఉండదు... భరించలేని ప్రేమ, భయం, ఒంటరితనం, మానసిక వేదనే దాగి ఉంటుంది. అలాంటి ఒక హృదయ విదారక సంఘటన చుట్టూ అల్లుకున్న కథే 'గ్రీఫ్ థెరపీ'. ప్రేమించిన భార్యను కోల్పోతాననే భయం ఒక భర్తను ఎంతటి మానసిక సంక్షోభంలోకి నెట్టిందో, ఆ పరిస్థితి నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకువచ్చారో భావోద్వేగంగా చెప్పే ఈ కథ కుటుంబ బంధాల విలువను, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను హృదయానికి హత్తుకునేలా గుర్తు చేస్తుంది.


ఆ మాటను న్యూరాన్లు తీసుకోలేకపోతున్నాయి. చివరికి వాటిలో నిక్షిప్తం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. 

విద్యుత్ ఘాతం నుండి తేరుకున్నట్టుగా తేరుకొని ఈ లోకంలోకి వస్తూ, "నమ్మలేకపోతున్నాను బాబాయి! ఇది నిజమా?" దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు వసంత్.


"వసంత్! ఇది నిజం. ఇదుగో అమ్మ మాట్లాడతానంటుంది, మాట్లాడు." అంటూ పక్కనే ఉన్న తన వదినకు ఫోన్ అందించాడు వసంత్ బాబాయి అయిన ప్రకాశం.


"వసంత్!." ఆమె మాట నాలుక మీదే సమాధి అయిపోయింది. దుఃఖంతో ఏడ్చేసింది. 

"అమ్మా! అమ్మా , బాధపడకు. దయచేసి ఏం జరిగిందో చెప్పు." కలవరపడుతున్న మనస్సుతో అడిగాడు.


"వసంత్!... మీ నాన్న నన్ను చంపాలని చూశారురా!."


బాధను దిగమింగుకుంటూ, గొంతులో ఇరుక్కున్న మాటకు ఊతమిస్తూ, "తోసేసి తప్పించుకొని వచ్చాను. లేకుంటే ఆ తలగడతో నా ఊపిరి ఆపాలని ప్రయత్నం చేశారు." ఆమె స్వరంలో తడబాటు మొదలైంది.


"అమ్మా! అమ్మా!." వసంత్ కంగారు పడటం వినిపిస్తుంది.


"వసంత్!, అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా, మీ నాన్న చేసిన పనిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇలా కృంగిపోతుంది. మీ నాన్న ఎందుకు ఇలా చేశాడో తెలియదు. ఈ విషయమే అడగడానికి వెళితే నన్ను కూడా కొట్టడానికి వెనుకాడలేదు." 


వసంత్ నుండి ఏ సమాధానం రాలేదు.

"వసంత్! లైన్లో ఉన్నావు కదా!." 


 "ఆ బాబాయి!." 


"నువ్వు ఒకసారి ఇక్కడికి రారా! నువ్వైనా నాన్నతో మాట్లాడితే, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని, పరిష్కారం కనుక్కోవాలి. లేకపోతే ఏ పరిస్థితి దాపురిస్తుందో చెప్పలేం."


"అలాగే బాబాయి! నేను వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టి సోఫాలో కూలబడ్డాడు.


"ఏవండీ! ఏమైంది? ఫోన్లో మాట్లాడింది ఎవరు? మీరేంటి ఇలా దిగులుగా కూర్చున్నారు?" అడిగింది అప్పుడే అక్కడకు చేరుకున్న పావని.


"పావనీ! దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది?." జరిగింది చెప్పాడు.


భర్త చెప్పింది విన్న తర్వాత ఆమె నిశ్చేష్టురాలైంది. నియంత్రణ కోల్పోయి వసంత్ పక్కనే కూర్చుని కాసేపు స్తబ్దుగా ఉండిపోయింది.


'కూతురులా నన్ను చూసుకునేవారు. చీమకి కూడా హాని చేయని వ్యక్తి. ఇలా... ఇలా చేశారా! లేదు, ఇది అబద్ధమైతే ఎంత బాగుంటుంది.' తనలో అనుకుంటూ, "మనం వేగంగా మామయ్య దగ్గరకు వెళ్దామండి." భర్త వైపు చూస్తూ అంది పావని.

*******

వసంత్ రాకతో పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకొని తడిమి తడిమి చూస్తూ, "నాన్న! వసంత్ వచ్చావా?." సంతోషంతో కన్నీరు కార్చుతూ నిల్చుంది పద్మజ.


"వసంత్! నువ్వు వచ్చి మంచి పని చేశావు. మీ నాన్న ప్రవర్తన కారణంగా మీ ఇంటికి కూడా వెళ్ళలేక పోతున్నాం. అసలు మీ నాన్న ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. తిన్నాడో లేదో?" నిట్టూర్చాడు ప్రకాశం.


తండ్రి పరిస్థితి విని వసంత్ హృదయం ద్రవించింది.

"పావని! పదా, వెళ్ళి ఒకసారి నాన్నతో మాట్లాడి వద్దాం." అని భార్యతో అంటూ అక్కడ నుండి తండ్రి దగ్గరకు చేరుకున్నాడు.


తలుపు తెరిచే ఉంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది.

మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి చేరుకున్నారు.

మొదటి గది దాటిన తర్వాత ఉన్న కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని బయటకు తదేకంగా చూస్తున్నాడు పద్మనాభం.


మాసిన జుట్టు, గుబురుగా పెరిగిన గడ్డంతో కళావిహీనంగా దర్శనమిస్తున్నారు పద్మనాభం.


తండ్రిని అలా చూసి లోలోపల దుఃఖం పొంగివచ్చి,

"నాన్న!" వణుకుతున్న స్వరంతో పిలిచాడు వసంత్.


ఆ పిలుపుకు ఒక్కసారిగా తుళ్లిపడి వీళ్ళవైపు చూసి, కాసేపు తదేకంగా చూస్తూ, మెల్లగా ఆ కుర్చీలో నుండి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ వసంత్ దగ్గరకు చేరుకున్నాడు. ఎదురుగా ఉన్న మనవడు సందేశ్‌ను ఒక్కసారిగా కౌగలించుకుంటూ ఏడ్చేశాడు.


పద్మనాభంను చూసి ఆశ్చర్యపోతూ, 'బాబాయి చెప్పినదానికి ఇప్పుడు భిన్నంగా ఉందే. అంటే నేను ఇక్కడికి రావాలని నాన్న ఈ నాటకం ఆడలేదు కదా.' అని లోలోపల సందిగ్ధపడుతూ, "నాన్నా! ఎందుకు ఇలా చేశావు? అమ్మను ఎందుకు ఇబ్బంది పెట్టావు?" అడిగాడు వసంత్.


వసంత్ మాట విని ఒక్కసారిగా మనవడిని వెనక్కి తోసేస్తూ "నేనా... నేనా... లేదే... నేనేమీ ఇబ్బంది పెట్టలేదు. పెట్టలేదు. నువ్వే... నువ్వే ఇబ్బంది పెట్టావు!" ఒక్కసారిగా వసంత్ గొంతు పట్టుకున్నాడు, అంతలోనే ఏడ్చేస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు.


తండ్రి పరిస్థితి ఏమిటో వసంత్ కు అర్థం కావడం లేదు. ప్రశ్నార్థకంగా పావని వైపు చూశాడు. ఏం కాదు అన్నట్టుగా ఆమె తల ఆడించి, తన చేతిలో ఉన్న చిన్న సంచితో పద్మనాభం దగ్గరకు వెళ్ళింది, "మామయ్య! మీకు సమోసాలు అంటే చాలా ఇష్టం కదా, మీ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చాను." అని పద్మనాభం దగ్గరకు చేరుకొని వాటిని ఇచ్చింది. 


పావని వైపు ఎగాదిగా చూస్తూ ఒక్కసారిగా వాటిని అందుకొని గబగబా తినేశాడు. ఎప్పుడూ హుందాగా ఉండే మనిషి ఇప్పుడు ఇలా ఆవురావురుమని తినడం చూసి పావని కళ్ళ వెంబడి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి.


భర్త దగ్గరకు చేరుకొని, "ఏవండీ! మామయ్య మనసులో ఏదో బాధ ఉంది. దాని నుండి బయటపడలేక ఇలా ప్రవర్తిస్తున్నారు. అతని మనస్సు నుండి ఆ బాధను దూరం చేస్తే అతను మళ్ళీ ఎప్పటిలానే మామూలు మనిషి అవుతారు." అని అంది పావని.


"నాకేం అర్ధం కావడం లేదు పావని, నువ్వే ఏదైనా సలహా ఉంటే చెప్పు?."


"మీ నాన్నను మీరే దగ్గరుండి రిలాక్స్ దొరికే ప్రదేశాలకు తిప్పండి. ఏమో, అతనిలో మార్పు రావచ్చు కదా?" అని సలహా ఇచ్చింది పావని.


"సరే, నాన్న ఒకప్పుడు తరచుగా బీచ్‌కు వెళ్తుండేవారు. నేను రేపు నాన్నను ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్‌కు తీసుకువెళ్తాను." అని భార్యతో అన్నాడు వసంత్.

********

మరుసటి రోజు తన బాబాయి సహాయం తో దగ్గరలో ఉన్న బీచ్ కు తండ్రిని తీసుకొని వెళ్ళాడు వసంత్.


దారంతా కాస్త కోపం ప్రదర్శిస్తూనే ఉన్నాడు పద్మనాభం. కానీ తండ్రిని సముదాయించి, బుజ్జగించి మెల్లగా సముద్ర తీరానికి తీసుకువచ్చాడు.


అలల శబ్దం ఏవో జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు గట్టిగా వీస్తున్న గాలి ఏదో సందేశం తెచ్చినట్టుగా అనిపిస్తుంది. మెల్లగా ముందుకు నడుస్తున్నాడు పద్మనాభం.


వెనుకే వెంబడిస్తూ వెళ్తున్న వసంత్, బాబాయిని ఆపి, "బాబాయి! నాన్నను వెళ్ళనివ్వండి. మనం వెనుక అనుసరిద్దాం." అని ప్రకాశంతో అన్నాడు వసంత్.

"సరే," అంటూ తన నడకలో వేగం తగ్గించాడు ప్రకాశం.


చుట్టూ చూస్తూ ముందుకు సాగుతున్నాడు పద్మనాభం.

ఇంతలో అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి పద్మనాభం ను గుద్దుకున్నాడు. పద్మనాభం తూలిపోతూ అదుపు తప్పబోయాడు. వెంటనే ఆ వ్యక్తి పద్మనాభం ను పట్టుకొని పడిపోకుండా నిలవరించాడు. 


"అయ్యో! క్షమించండి అంకుల్. చుట్టూ చూస్తూ మీ రాకను చూడలేదు. మీరు బాగానే ఉన్నారు కదా." నవ్వుతూ అడిగాడు ఆ వ్యక్తి.


నవ్వుతూ పలకరిస్తున్న అతని తీరు, వర్చస్సు తో వెలిగిపోతున్న అతని ముఖం చూసి అలానే స్తబ్దుగా నిలబడి చూస్తున్నాడు పద్మనాభం. 


ఇంతలో తన చేతి నుండి కింద పడిన పిల్లనగ్రోవిని అందుకుంటూ, "సరే అంకుల్. వస్తాను. జాగ్రత్త." అని చెబుతూ అక్కడ నుండి ముందుకు నడిచాడు ఆ వ్యక్తి.


ఆ వ్యక్తి వైపే చూస్తూనే ఉన్నాడు పద్మనాభం. తిన్నగా వెళ్ళిన ఆ వ్యక్తి సముద్ర తీరాపు రాళ్లపై కూర్చుని తన వేణువును తీసి రాగాలను పలికిస్తున్నాడు. ఒక్కసారిగా ఆ రాగాన్ని విని పద్మనాభంకు ఏదో అయ్యింది.


వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు పరుగుతీసి, "ఈ రాగం ఎందుకు ఆలపిస్తున్నావు? ఇది విషాద రాగం కదా?" అని అడిగాడు పద్మనాభం.


వేణువు వాయించడం ఆపుతూ, "అవును! మీకెలా తెలుసు? మీకు కూడా వేణువు వాయించడం వచ్చా?" అడిగాడు ఆ వ్యక్తి.


"వచ్చు, కానీ నువ్వు ఈ రాగం ఎందుకు ఆలపిస్తున్నావు?."


"దీని వెనుక ఒక విషాద గాథ ఉంది."


ఒక్క క్షణం ఇరువైపులా నిశబ్దం.

"ఏమిటా గాథ తెలుసుకోవచ్చా?."


"వద్దు, నేను చెప్పలేను."


"చెప్పవా? చెప్పవా? చెప్పకపోతే నీ తల పగల గొడతాను." కింద ఉన్న రాయి తన చేతిలోకి తీసుకున్నాడు.


"అంకుల్! శాంతించండి. మీరు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెబుతాను. ముందు మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి." పక్కనే ఉన్న బల్లపరుపు రాయిని చూపిస్తూ చెప్పాడు ఆ వ్యక్తి.


చేతిలో ఉన్న రాయిని పక్కన పడేస్తూ వెళ్ళి ఆ రాయి మీద కూర్చున్నాడు పద్మనాభం.


"బాధ్యత లేని తండ్రి, ప్రేమను కురిపించే తల్లి, ప్రేమగా చూసుకునే అక్క, నేను. ఇది మా కుటుంబం. తండ్రి జల్సాలకు అలవాటుపడి మమ్మల్ని పట్టించు కోవడం మానేశాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కూడా దొరకడం కష్టమైంది. రోజులు పరుగు తీస్తున్నాయి, అలాగే మా వయస్సులు కూడా పరుగు తీస్తున్నాయి. తండ్రి దినదిన వ్యసనాలకు బానిసై చివరికి కాలం చేశాడు. తల్లి మీద భారం పడింది. నేను అప్పుడు పదవ తరగతికి చేరుకున్నాను. 


మా అక్క నాకంటే ఐదేళ్ల పెద్ద, ఆమె బ్రతుకు కూడా సుఖంగా లేదు. సరైన పోషణ అందక ఆమె ఆరోగ్యం క్షీణించింది. చిన్న దగ్గుగా మొదలై పెద్ద దగ్గుగా మారి ఓ జబ్బు ఆమె శక్తిని లాగేసి ఆమెను క్షీణింపజేసింది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే ఆమెకు టీబీ జబ్బు అని చెప్పారు. పరిస్థితి కూడా చేయదాటిపోయింది అని చెప్పారు. 


కొన్ని రోజులకు ఆమె మాకు దూరమైంది. ఈ సంఘటన నన్ను ఇప్పటికీ కూడా బాధిస్తూ ఉంది. ముందు సరైన వైద్యం చేయడానికి మా దగ్గర డబ్బు లేదు. ఉండుంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో. అప్పటికీ కూడా ఆమెను బ్రతికించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఆమె చివరి దశలో లేవడం కూడా కష్టమయ్యేది. అమ్మ ఆమెకు అన్నీ అయ్యింది. 


తల్లి చివరి దశలో కూతురు చేయాల్సిన సేవలు. తల్లి కూతురికి చేయడం ఎంత గుండెల్ని పిండేసే బాధో మాటల్లో చెప్పలేను. కానీ మా అమ్మ అక్క కోలుకుంటుంది, కోలుకోవాలి అని ఆశపడుతూ సేవలు చేసేది. కానీ ఆ దేవుడు మాపై జాలి చూపలేదు. అక్కను తీసుకువెళ్ళిపోయాడు." చెబుతూ చెబుతూ ఆగిపోయాడు ఆ వ్యక్తి.


ఆలోచనలో పడ్డాడు పద్మనాభం.


పద్మనాభం వైపు చూస్తూ, "అంకుల్! ప్రాణం నిలబెట్టడానికి మేము ఎంత ప్రయత్నం చేశాం అంటే అది ఆ దేవుడికే తెలుసు. మాకు తోడు ఎవరూ లేరు. ఆర్థికంగా, అన్ని విధాలుగా మేము నష్టంలో ఉన్నాం. కానీ ఆమెను దూరం చేసుకోకూడదని చాలా ప్రయత్నం చేశాం. కానీ మేము ఓడిపోయాం అంకుల్. 


అందుకే ఇప్పుడు నేను ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్లకు సహాయం చేయడం ప్రారంభించాను. ఈ సేవ చూసైనా పైనున్న మా అక్క సంతోషిస్తుంది అని నా తృప్తి" అని అన్నాడు ఆ వ్యక్తి.


పద్మనాభం వెక్కివెక్కి ఏడ్చేశాడు. "అయ్యో అంకుల్, నా బాధల్ని చెప్పి మిమ్మల్ని బాధపెట్టానా? నన్ను క్షమించండి." అని క్షమాపణ కోరాడు ఆ వ్యక్తి.


మళ్ళీ మౌనం దాల్చాడు పద్మనాభం.


"మీ మౌనం చూస్తుంటే మీరు కూడా ఏదో బాధలో ఉన్నారు అనిపిస్తుంది. అదేమిటో నాతో పంచుకోండి. మీ ఇష్టం అయితే." అడిగాడు ఆ వ్యక్తి.


ఆ వ్యక్తి వైపు చూస్తూ, "బాబూ! నేనొక హంతకుడ్ని, నా భార్యనే చంపాలని చూసిన హంతకుడ్ని. అవును బాబు. నా భార్య ఈ మధ్యనే జబ్బుపడింది. అది ఆ టీబీ జబ్బు అని తెలిసింది. నాకు భయం కలిగింది. ఆమె ఎక్కడ నాకు దూరం అవుతుందో అని భయం వేసింది.


 రోజురోజుకీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. దగ్గు ఎక్కువవుతోంది. కొడుకు గురించి ఆమె దిగులు పెట్టుకుందని నాకు తెలుసు. రోజూ ఆమె దగ్గు నాలో భయం కలిగించింది, కోపం కలిగించింది. ఆమె అలా బాధపడటం నేను తట్టుకోలేకపోయాను. 


అనుకోకుండా ఒక రోజు నాకు తెలియకుండానే ఆమెపై హత్య ప్రయత్నం చేశాను. నాకు తెలియకుండానే నేను ఒక హంతకుడిలా ప్రవర్తిస్తున్నాను." వెక్కివెక్కి ఏడ్చాడు పద్మనాభం.


"అంకుల్! బాధపడకండి. మీ మనస్సు రిలాక్స్ అవ్వడం కోసం నేనో రాగాన్ని వినిపించనా." అని వేణువు ను పలికించాడు.


ఆ రాగానికి ఆశ్చర్యచకితుడై కళ్ళు ఆర్పకుండా చూస్తూ, "విక్రమ్!." అప్రయత్నంగానే ఆ పేరు పద్మనాభం పెదాలను దాటింది.


"గుర్తుపట్టేశారా! అవును అంకుల్, మీ దగ్గర వేణువు నేర్చుకున్న విక్రమ్నే, మీ ద్వారా చదువుకు సహాయం పొందిన విక్రమ్నే, ఇప్పుడు మీ ముందు ఉన్నాను." నవ్వుతూ సమాధానం ఇచ్చాడు విక్రమ్.


"విక్రమ్!." వేగంగా తన స్థానం నుండి లేస్తూ విక్రమ్ దగ్గరకు చేరుకొని గట్టిగా వాటేసుకున్నాడు, "నీ గతం వింటుంటే నాకు తెలిసిన గతంలానే అనిపించింది. కానీ నిర్ధారణకు రావడానికి ఇంత సమయం పట్టింది." అన్నాడు పద్మనాభం.


"మీ గురించి నాకు తెలిసింది అంకుల్. మీరు ఇలా అయిపోవడం నాకు చాలా బాధ కలిగింది. వచ్చేశాను. మీ బాధ ను మీ నుండి దూరం చేస్తాను." నవ్వుతూ అన్నాడు విక్రమ్.


ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు పద్మనాభం.


"నేను మానసిక వైద్యుడ్ని అంకుల్. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం తో ఇంతటి స్థానానికి చేరుకున్నాను." చెప్పాడు విక్రమ్.


ఏదో చెప్పాలని అనుకున్నాడు పద్మనాభం. ఇంతలో అక్కడికి చేరుకున్నారు వసంత్, ప్రకాశం.


"వసంత్! నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ నాన్నను సాధారణ స్థితికి తీసుకువస్తాను." నవ్వుతూ వసంత్ భుజం తట్టాడు విక్రమ్.


"విక్రమ్, ఎంత భయపడ్డానో తెలుసా, సమయానికి నువ్వు గుర్తుకొచ్చావు. మా నాన్న ఇలా అవ్వడానికి కారణం ఏమిటి?" అడిగాడు వసంత్.


"భయం వసంత్, మీ నాన్నలో ఉత్పన్నమైన భయం. ఎంతగానో ప్రేమించే భార్య అనారోగ్యపాలవ్వడం, ఆమె తనకు దూరమైపోతుందన్న ఆలోచన అతనిలో ఇలాంటి భయంకరమైన మానసిక పరిస్థితిని సృష్టించింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆమె, జబ్బుపడటంతో మీ నాన్న చూడలేకపోయారు. 


ఆమె చనిపోతే ఆమెకు బాధ ఉండదు కదా అని ఒక అర్థం లేని ఆలోచన మీ నాన్న మెదడును నిత్యం తొలిచేసేది. అందుకే ఇలా ఆమె మీద హత్య ప్రయత్నం చేశారు. సమయానికి మీరెవరూ తోడు లేరన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. చివరికి ఇలా అయిపోయారు. 


నేను మీ నాన్నను ఇక్కడికి తీసుకురమ్మనడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మీ నాన్నను వాస్తవంలోకి తీసుకువచ్చి నిజాన్ని అంగీకరించేలా చేస్తే అతను మళ్ళీ మామూలు మనిషి అవుతారని అంచనా వేశాను. ఆ వ్యూహాన్ని అమలు చేశాను. గ్రీఫ్ థెరపీ ఉపయోగించి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ నాన్నతో చెప్పాను. 


అది విని మీ నాన్నగారిలో ఆలోచన మొదలైంది. నిజానికి ఆ థెరపీ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. అలా మీ నాన్నగారికి నిజాన్ని అంగీకరించేలా చేసి సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. వసంత్, ఈ రిలేషన్స్ అన్నవి మనిషికి ఊపిరిలాంటివి. అవి సక్రమంగా నడిస్తే అంతా బాగానే ఉంటుంది. లేకుంటే మనిషి మానసికంగా నరకం అనుభవించి ఇలా తయారవుతాడు. 


నిజానికి మనిషికి మనిషే తోడు కదా, ఔషధం కదా. అలాంటిది మీరందరూ దూరంగా ఉండటంతో అతనిలో ఒంటరి భావన చెలరేగింది. అతనికి ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా పర్యవేక్షించాలి. రేపు క్లినిక్‌కి అంకుల్‌ను తీసుకుని రా, మిగతా ట్రీట్మెంట్ ఇస్తాను." అని వసంత్ తో చెప్పాడు విక్రమ్.


 ***సమాప్తం****


మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మళ్ళ కారుణ్య కుమార్
మళ్ళ కారుణ్య కుమార్

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page