బువ్వమ్మ
- Malla Karunya Kumar

- 3 hours ago
- 5 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.
బువ్వమ్మ, తెలుగు కథ, భావోద్వేగ కథ, మానవత్వం, కృతజ్ఞత, కుటుంబ విలువలు, అనుబంధం, జీవన విలువలు, గ్రామీణ జీవితం, డబ్బు, తెలుగు సాహిత్యం, Emotional Story, Village Story, Inspirational Story, Telugu Literature, Mana Telugu Kathalu

Buvvamma - Telugu Emotional Family Story | Malla Karunya Kumar
బువ్వమ్మ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In? manatelugukathalu.com On 29/06/2026
జీవితంలో డబ్బు అవసరమే అయినా, అది మనుషుల ప్రేమను, అనుబంధాలను కొనలేడు. సంపదను కూడబెట్టడంలో గడిచిపోయిన జీవితం, చివరికి ఒక నిజాయితీ గల మనిషి ద్వారా మానవత్వం విలువను తెలుసుకుంటే కలిగే ఆత్మజ్ఞానం ఎంతో గొప్పది. "బువ్వమ్మ" అనే ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు కథ, డబ్బు కంటే కృతజ్ఞత, క్షమ, అనుబంధాలు, మానవత్వమే జీవితంలో శాశ్వత సంపద అని అద్భుతంగా తెలియజేస్తుంది.
“అమ్మా! చిన్నప్పటి నుండి ఈ బాధలు పడుతున్నదాన్ని, పైగా డబ్బు విలువ ఏమిటో తెలుసుకున్నదాన్ని. డబ్బుకే సమాజం విలువ ఇస్తుందమ్మా, అందుకే ఈ నిర్ణయం. మీ కష్టానికి నా కష్టం తోడైతే మనకి ఏ బాధా ఉండదు.” తల్లి కళ్ళలోకి చూసి సమాధానమిచ్చింది లచ్చిమి.
ఆ రోజు నుండి అదే స్ఫూర్తితో శ్రమ చేస్తూ డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టింది. కూతుర్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. లచ్చిమి సంపాదిస్తుంది కనుక ఆమెకు పెళ్లి చేయాలని, కూతురి కోసం ఒక సంబంధం తీసుకువచ్చాడు తండ్రి కిష్టడు.
తన పిన్ని జ్ఞాపకంగా తన కూతురిని ‘బువ్వమ్మ’ అని ముద్దుగా పిలిచేవాడు.
“బువ్వమ్మా! నీకు మంచి సంబంధం తీసుకువచ్చాను. ఆస్తి బాగానే ఉంది. నువ్వేమంటావు?”
“నీ ఇష్టం అయ్యా,” అని బదులిచ్చింది బువ్వమ్మ.
పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన బువ్వమ్మకు కొద్దిరోజుల్లోనే భర్త గురించి నిజం తెలిసింది. అతను ఒక వ్యసనపరుడని, ఆస్తి మొత్తం విలాసాలకు ఖర్చు చేసేసాడని తెలిసి చాలా బాధపడింది. కానీ అక్కడే సర్దుకుపోవాలని నిర్ణయం తీసుకుంది.
అప్పుడప్పుడు ప్రేమగా బువ్వమ్మ దగ్గరకు చేరుకొని ఆమె దగ్గర డబ్బులు తీసుకొనిపోయేవాడు. రోజూ ఇలానే సాగడంతో బువ్వమ్మకు కోపం వచ్చి ఒకరోజు భర్తతో గొడవకు దిగింది.
“నన్నే ఎదిరిస్తావా, నీ సంగతి చెప్తా!” చెడామడా కొడుతూ, ఆమె దగ్గర డబ్బులు లాక్కొనిపోయాడు. రోజూ సాగే తతంగంకి కొన్ని సంవత్సరాల తర్వాత ముగింపు పడింది. కల్తీ సారా శరీరాన్ని గుల్ల చేయడంతో అనారోగ్యం పాలై బువ్వమ్మ భర్త కాలంచేశాడు.
బువ్వమ్మలో దుఃఖం, తన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిందని బాధ. ఆ కష్టసమయంలో తన అక్క సుందరమ్మ వచ్చి, “నీకు కలిగిన కష్టం ఓదార్చలేనిది, బాధపడకు, నేను నీకు తోడుగా ఉంటాను,” అని భరోసా ఇచ్చింది సుందరమ్మ.
రోజులు గడుస్తున్నకొద్దీ బువ్వమ్మ తన బాధను మరువసాగింది. శ్రమిస్తూ దేనికి లోటు లేకుండా చేసుకుంది. వడ్డీలకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టి, తన సంపాదన రెట్టింపు చేసింది.
వయస్సు ఏడు పదులు దాటడంతో ఆమెలో నిస్సత్తువ, నీరసంతోపాటు బద్ధకం కూడా పెరిగిపోయింది. వంటావార్పుకు స్వస్తి చెప్పి, ఇతరుల మీద ఆధారపడడం మొదలుపెట్టింది. ముఖ్యంగా తాను అప్పిచ్చిన ఇంటికి వెళ్లి టీనో, టిఫినో చేసి, మరో ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆ రోజు గడిపేస్తుండేది.
తనకి బాకీ ఉన్న విమల ఇంటికి చేరుకుంది. బువ్వమ్మను చూసి వేగంగా టీ చేసి అందించింది విమల. విమల ఇచ్చిన టీను రెండు గుక్కల్లో గొంతులో పోసి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.
బువ్వమ్మను చూస్తూ, “అదీ సరే బువ్వమ్మ, మొన్నెప్పుడో మీ అక్క కొడుకు దగ్గరకు వెళ్తానన్నావు?” బువ్వమ్మ నాలుగు రోజుల ఊరు వదిలి వెళితే కాస్త చాకిరీ తప్పుతుందన్న ఆలోచనతో అడిగింది.
“పెన్షన్ వచ్చిన తర్వాత వెళ్లి ఒక నెల పాటు ఉండి వస్తాను. ఆ! చెప్పడం మరిచిపోయాను. నేను వెళ్లేటప్పటికి నీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయ్.”
“అదేంటి బువ్వమ్మ, ఆ మాత్రం నమ్మకం లేదా? నువ్వు వచ్చిన తర్వాత ఇస్తానులే.”
“నాకు అవసరం ఉంది, నేను వెళ్లినప్పుడే నాకు ఇచ్చేస్తే మంచిది. కావాలంటే నేను వచ్చిన తర్వాత ఇస్తానులే,” అని అంటూ, ‘డబ్బు విషయంలో ఏమాత్రం జాలి చూపే ప్రసక్తే లేదు, స్నేహితురాలని నమ్మి ఇచ్చిన డబ్బును పట్టుకుపోయి తిరిగి ఇవ్వని వెంకమ్మలా అవుతుంది’ అని ఒక నిట్టూర్పు తీసి, “సరే విమల, నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకో,” అని వెళ్లిపోయింది బువ్వమ్మ.
“పోయేటప్పుడు నెత్తిన పెట్టుకొని పోతుందా ఈ సొమ్మంతా?” నిట్టూర్చింది విమల.
తనకు రావాల్సిన బాకీలు వసూలు చేసి, పెన్షన్ ఇచ్చే సమయం రావడంతో పెన్షన్ తీసుకొని, ఆ ఊరు నుండి తన అక్క కొడుకు దగ్గరకు వెళ్ళింది.
యోగక్షేమాలు మాట్లాడుతూ, “కమలమ్మకు డబ్బులు అవసరం పడ్డాయంట, నా దగ్గర కొంత ఉన్నాయి, నువ్వు అరవై వేలు ఇస్తే ఈసారి ఆమెకు ఇద్దాం,” అని అంది బువ్వమ్మ.
“ఆ... ఆ... అలాగే బువ్వమ్మ, చూద్దాం లే,” మాటలు మధ్యలో ఆపి వెళ్లిపోయాడు తన అక్క కొడుకు రాజు.
రాజు మాటలు, అతని కదలికలు బాగా గమనించింది. అతని ప్రవర్తన తనలో అనుమానం కలుగజేసింది.
********
“మనం పట్నం వచ్చి ఇలా బ్రతుకుతున్నామంటే ఆ రోజు బువ్వమ్మ చేసిన సహాయం కారణంగానే రాముడూ! ఆమె రుణం తీర్చుకోవాలి, నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదా?” చివరి శ్వాస విడిచినప్పుడు తల్లి వెంకమ్మ చివరిగా అడిగిన కోరిక ఎప్పుడూ రాముడిని వెంటాడుతుంటుంది.
కూడబెట్టిన డబ్బును ఒకసారి లెక్కపెట్టుకున్నాడు. ‘అప్పు తీర్చాలి అంటే ఇంకా చాలా డబ్బులు అవసరం. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులకు ఇవే వాడడం అయిపోతుంది.’ ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలాడు.
ఇంతలో “ఏవండీ!” అని కంగారుపడుతూ భర్త దగ్గరకు చేరుకుంది సీత.
ఆమెను చూసి, “ఏమిటా కంగారు సీత, ఏమైంది?” అడిగాడు.
“పాపకు జ్వరం ఇంకా తగ్గలేదు! పైగా వాంతులు కూడా అవుతున్నాయి,” అని కంగారుపడుతూ చెప్పింది సీత. వేగంగా కూతురు దగ్గరకు పరుగుతీశాడు. కూతురు పరిస్థితి చూసి, “ఇంకా ఇక్కడే ఉంటే లాభం లేదు సీత, పాపను హాస్పిటల్ కు తీసుకువెళ్ళాలి,” అని పాపను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వేగంగా ఆసుపత్రికి చేరుకున్నాడు. డాక్టర్ పరీక్షించి, రక్త పరీక్షలు అయిన తర్వాత మలేరియా జ్వరమని నిర్ధారించాడు. వారం రోజులకు కోర్సు రాసి, అక్కడే రెండు రోజులు ఉండాలని చెప్పాడు డాక్టర్.
భార్య కంగారు పడటం చూసి ఆమెకు ధైర్యం చెప్పి బయటకు వెళ్ళాడు. కొంత సమయానికి కొంత డబ్బు తీసుకువచ్చి సీత చేతికి ఇచ్చాడు. వాటిని అందుకుంటూ భర్త వంక చెమర్చిన కళ్ళతో చూసింది.
“పాపకు ఏం కాదు, నువ్వేమీ కంగారు పడకు. నేను ఉండగా పాపకు ఏమీ కానివ్వను,” భరోసాగా అన్నాడు రాముడు.
సలైన్లు ఎక్కిస్తూ చికిత్స మొదలుపెట్టారు. పాప పక్కనే కూర్చుంటూ ఆలోచనలో పడ్డాడు రాముడు.
“ఈసారి ఇప్పటి వరకు జమైన సొమ్ము తీసుకువెళ్లి ఆ అప్పు తీర్చాలి. లేకుంటే ఎప్పటికీ తీర్చలేను,” అని దృఢమైన నిర్ణయానికి వచ్చాడు.
********
సరిగ్గా రెండు నెలలు గడిచిన తర్వాత తన ఊరుకి చేరుకుంది బువ్వమ్మ. మనిషి కాస్త నీరసంగా, వెర్రి చూపులు చూస్తూ కనిపించింది. ఆమెను చూసి మనసొప్పక కొందరు ఆమె బాగోగులు అడిగారు.
“సొంతవాడని నమ్ముకుంటే, నా అక్క కొడుకే నన్ను మోసం చేశాడు. ఇక నేను ఎవరిని నమ్మాలి?” జరిగిందంతా వివరిస్తూ ఏడ్చేసింది బువ్వమ్మ. బువ్వమ్మకు జరిగిన అన్యాయానికి విచారించారు ఆ ఊరి వాళ్ళు. రోజులు గడుస్తున్నాయి, తాను మోజుపడి దాచుకున్న డబ్బు పోయిందని ఆమెలో తెలియని బాధ ఆమెను కృంగదీసింది.
“నమ్మి సొమ్ము ఇచ్చినందుకు మోసం చేసి పారిపోయిన ఆ వెంకమ్మ, సొంతవాళ్ళని నమ్మి తన సొమ్ము దాచగా మొత్తం కాజేసిన నా అక్క కుటుంబం మొత్తం నాశనమైపోతారు,” అని ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ, “తనకి ఓ కుటుంబం ఉండి ఉంటే ఈ అవస్థ ఉండేది కాదు కదా,” అని విలపించింది.
రోజులు గడుస్తున్నకొద్దీ లేచి తిరిగే ఓపిక కూడా సన్నగిల్లుతోంది. ఏ క్షణంలో తన ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి. ఊరి వాళ్ళు కూడా ఈమె దగ్గరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడో తన తాత ఆడిన మాటలు తన మస్తిష్కంలో కదలాడుతూ ఉన్నాయి. ‘ధనమున్నా దినం తీరదు’ అన్న మాట తనని నిలువునా దహించివేస్తోంది.
తన పరిస్థితికి తనకి దుఃఖం వస్తోంది. తలుపు దగ్గర ఎవరో ఉన్నట్టు అలికిడి రావడంతో ఒక్కసారిగా తన ఆలోచనలకు స్వస్తి చెప్పి, “ఎవరది?” ఓపిక తెచ్చుకొని అరిచింది.
“వెంకమ్మ కొడుకును, పట్నం నుండి వచ్చాను బువ్వమ్మ.” సమాధానమిచ్చాడు అప్పుడే అక్కడకు చేరుకున్న రాముడు.
ఆమెకు ఏమీ అర్థం కాలేదు, మౌనంగా ఉండిపోయింది.
మెల్లగా బువ్వమ్మ దగ్గరకు చేరుకున్నాడు రాముడు. ఆమె ముందు కూర్చుంటూ, “ఎలా ఉన్నావు బువ్వమ్మ! ఎప్పుడో మాకు చాలా సహాయం చేశావు. కానీ పరిస్థితుల కారణంగా నీకు డబ్బు ఇవ్వలేకపోయాను. అమ్మ ఎప్పుడూ నీకు బాకీ ఉన్న రుణం గురించే చెప్తుండేది. కానీ, అవి తీర్చడం నా వలన కాలేదు. ఎంతో కొంత జమచేసిన సొమ్మును పట్టుకొని నీ దగ్గరకు బయలుదేరాను.
కానీ మధ్యలో కొందరు పాపాత్ములు నన్ను కొట్టి డబ్బు కాజేశారు. ఏం చేయాలో తెలియలేదు. మరొక్క అవకాశం ఇవ్వు బువ్వమ్మ. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎలాగోలా తీర్చేస్తాను,” ప్రాధేయపడుతూ అడిగాడు రాముడు.
కొంత సమయానికి తన ఎదురుగా ఉన్న రాముడు వెంకమ్మ కొడుకు అని గుర్తుపట్టి, రాముడు శరీరంపై ఉన్న గాయాలను చూసి దిగులుపడి, “నా కోసం వస్తూ ఇలా అవస్థలు పడ్డావా? అమ్మ ఎలా ఉంది రా?” అడిగింది.
“అమ్మ ఎప్పుడో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది బువ్వమ్మ. నీకు బాకీ తీర్చాలన్నది అమ్మ చివరి కోరిక, తీర్చడం ఆలస్యమయింది. ఇప్పటికైనా తీరుతుంది అనుకుంటే ఇలా జరిగింది,” బాధపడుతూ అన్నాడు రాముడు.
బువ్వమ్మ మనసులో కుదురుగా లేదు. ఇన్నాళ్లు వెంకమ్మను తిట్టుకుంటూ, ఆమె కుటుంబానికి శాపనార్థాలు పెట్టిన క్షణాలు గుర్తుకువచ్చి పశ్చాత్తాపం చెందింది.
“మీ అమ్మ కోరిక తీర్చడానికి, నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావా? పైగా వాళ్ళు ఎవరిచేతో దెబ్బలు తిన్నావు. నీ మాటల్లో నిజాయితీ నేను అర్థం చేసుకోగలను,” అని కాసేపు మౌనం వహించి, ‘ఇన్నాళ్లు డబ్బే సర్వస్వం అని బ్రతికాను, డబ్బుంటే అందరూ నా చుట్టే ఉంటారని భ్రమలో ఉండేదాన్ని.
కానీ మానవత్వం కలిగిన మనసులు దొరకడం కష్టమని ఇప్పుడే అర్థమవుతుంది’ కన్నీరు పెట్టుకుంటూ, రాముడు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, “రాముడూ! నాకో సహాయం చేస్తావా?” కన్నీరుతో నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది.
“ఏమిటో చెప్పు బువ్వమ్మ! చిన్నప్పుడు తల్లిలా నన్ను హక్కున చేర్చుకున్నావు, నీ ప్రేమను నేను ఎప్పుడూ మరిచిపోలేదు.”
“నమ్మిన వాళ్లు నన్ను మోసం చేశారు. మోసం చేసి పారిపోయిందని నా స్నేహితురాలిపై నింద వేశాను, ఇప్పుడు ఆమె నిజాయితీని నిరూపించడానికి నువ్వు వచ్చావు. నా కళ్ళు తెరిపించావు. అమ్మ తర్వాత అమ్మవు అన్నావు కదా, ఒక కొడుకుగా నా చివరి రోజుల్లో నాకు తోడుగా ఉంటావా?” అనుబంధం విలువ తెలుసుకున్న మనిషిలా అర్థించింది.
***సమాప్తం****
ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మానవత్వం, కుటుంబ విలువలు, జీవన సత్యాలను ప్రతిబింబించే ఇలాంటి మరిన్ని తెలుగు కథల కోసం manatelugukathalu.com ను అనుసరించండి.
మళ్ళ కారుణ్య కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్ అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.












Comments