top of page
Original.png

బామ్మ నేర్పిన పాఠం

బామ్మ నేర్పిన పాఠం, తెలుగు ఆధ్యాత్మిక కథ, తీర్థయాత్ర కథ, Inspirational Telugu Story

బామ్మతో కలిసి తీర్థయాత్రలో పాల్గొంటున్న విష్ణు, భక్తి మరియు విశ్వాసం విలువను తెలుసుకుంటున్న భావోద్వేగ దృశ్యం
బామ్మతో కలిసి తీర్థయాత్రలో పాల్గొంటున్న విష్ణు, భక్తి మరియు విశ్వాసం విలువను తెలుసుకుంటున్న భావోద్వేగ దృశ్యం

Bamma Nerpina Patam - Telugu Inspirational Story | G. S. S. Kalyani

బామ్మ నేర్పిన పాఠం - తెలుగు ప్రేరణాత్మక కథ |G. S. S. కళ్యాణి

Published in manatelugukathalu.com on 28/06/2026

విష్ణు ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ ఋణాలు మంజూరు చెయ్యడంలోనూ, చీటికీ మాటికీ తమ ఆఫీసులో జరిగే సమావేశాలతోనూ క్షణం తీరిక లేకుండా కాలం గడిచిపోతోంది. విపరీతమైన పని ఒత్తిడితో సతమతమైపోతున్న విష్ణుకి ఆరోగ్యసమస్యలొచ్చాయి. కొద్దిరోజులపాటూ ఆఫీసుపనికి దూరంగా ఉండి తన మనసుకు ప్రశాంతతను ఇవ్వాలని అనుకున్నాడు విష్ణు. మూడురోజుల సెలవు కోసం భగీరధ ప్రయత్నం చేసి, ఎట్టకేలకు సెలవు సాధించిన విష్ణు, తమ సొంత ఊరు చేరుకున్నాడు. 


"ఏరా మనవడా? ఎలా ఉన్నావురా? బొత్తిగా చిక్కిపోయావ్. మొహమంతా పీక్కుపోయింది. దేనిగురించైనా దిగులుపడుతున్నావా?", విష్ణు బుగ్గలు ఆప్యాయంగా నిమురుతూ వివరం అడిగింది విష్ణు బామ్మ పార్వతమ్మ. 


దొరికిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ తన ఆఫీసు గొడవంతా పార్వతమ్మకు చెప్పుకున్నాడు విష్ణు. 


అంతా విన్న పార్వతమ్మ, "ఒరేయ్ నాయనా! ఎటువంటివారికైనా త్వరగా మనశ్శాంతిని కలిగించే ఏకైక సాధనం భగవధ్యానం. ఆ ధ్యానం ఏదైనా పుణ్యక్షేత్రంలో చేస్తే ఫలితం త్వరగా వస్తుంది. నీకున్న కొద్దిసమయం తెలివిగా ఉపయోగించుకో. తీర్థయాత్రకు వెంటనే ప్రయాణంకా! నాకెలాగో ఒక రెండు రోజులు ఏదైనా పుణ్యక్షేత్రంలో గడిపి రావాలని ఉంది కాబట్టి నేను కూడా నీతో వస్తా!", అంది. 


పార్వతమ్మ సలహా విష్ణుకి నచ్చింది. ఇక ఆలస్యం చెయ్యకుండా మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాల జాబితాను ఇంటర్నెట్లో వెతికి పట్టుకుని, అందులో ఒక క్షేత్రాన్ని ఎంచుకుని, అక్కడికి విమానంలో వెళ్ళేందుకు టికెట్లు కొన్నాడు విష్ణు. 


మరుసటి రోజు తెల్లవారుఝామున విష్ణు లేచి, గబగబా తన లగేజీ తీసుకుని ప్రయాణానికి సిద్ధమైపోయి చెప్పులు వేసుకుంటూ ఉండగా, "ఒరేయ్ అబ్బాయ్! నువ్వెళ్ళి ఆటో పట్టుకొస్తావా?", చీర సవరించుకుంటూ అడిగింది పార్వతమ్మ. 


"ఆటో ఎందుకు బామ్మా? నీకు ఏమాత్రం కష్టం తెలియకుండా నీచేత ఈ ప్రయాణం  చేయిస్తాను చూడు!  విమానాశ్రయానికి క్యాబ్ బూక్ చేశాను. దర్జాగా కారులో వెడదాం", అన్నాడు విష్ణు. 


"మీ తాతను గుర్తుచేశావురా! ఏలోకాన ఉన్నారోగానీ ఆయనకూడా ఇలాగే అనేవారు. తీర్థయాత్రలు చేసేటప్పుడు నన్ను కష్టపెట్టకూడదన్న తాపత్రయంతో  ఆయన ఎంతో కష్టపడేవారు", అంటూ చెమర్చిన తన కళ్ళను చీర కొంగుతో అద్దుకుంది పార్వతమ్మ. 


అది గమనించిన విష్ణు పార్వతమ్మ మనసు తేలిక పరచడానికి, "బామ్మా! ఒకప్పుడు ఎటువంటి సౌకర్యాలూ లేవుకనక తీర్థయాత్రలంటే చాలా కష్టం అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గర కావలసినంత డబ్బుంది. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ అవసరానికి మించిన సౌకర్యాలొచ్చేసాయ్. ఇది తీర్థయాత్రో విహారయాత్రో అన్న అనుమానం నీకొస్తుందేమోనని నా అనుమానం", అన్నాడు ముసిముసినవ్వులు నవ్వుతూ. 


"అదేవిట్రా అలా అంటావ్? విహారయాత్ర ఐహిక సుఖాలకోసం చేసేది. తీర్థయాత్ర ఇహ-పర సుఖాల కోసం చేసేది. రెండింటికీ సహస్రం తేడా ఉంది. తీర్థయాత్రలు చేసేదే భగవంతుడికోసం కనుక భారమంతా ఆయన మీద వేస్తే మనకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఆయనే చూసుకుంటాడని నా నమ్మకం. ఇక్కడ డబ్బులతో పని లేదు. భక్తి కలిగి ఉంటే చాలు", అంది పార్వతమ్మ.   


పావుగంట గడిచింది. క్యాబు రాలేదు. మరో అరగంట గడిచింది. అయినా క్యాబు రాలేదు. విష్ణు మనసులో ఆందోళన మొదలైంది. క్యాబు డ్రైవరుకు ఫోన్ చేశాడు విష్ణు. వాడు ఎత్తలేదు. కంగారుపడుతూ మళ్ళీ ఫోన్ చేశాడు విష్ణు. ఈసారి ఫోన్ ఎత్తాడు డ్రైవర్! 


"ఎక్కడున్నారండీ?", కంగారునూ , కోపాన్నీ అణచుకుంటూ అడిగాడు విష్ణు. 


"సార్ నమస్తే! నాకు వేరే పని పడి రాత్రి నిద్రపోలే.. అందుకని నేను ఇప్పుడు రాలేను.  వేరే ఎవరినైనా పిలుచుకోండి సారూ.. సారీ!", అని చెప్పి ఫోన్ పెట్టేశాడు డ్రైవర్. 

అది విని, "అబ్బా! ఈ డ్రైవరు ఇలా అంటాడేంటీ?! ఇప్పటికిప్పుడు వేరే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడూ? ఫ్లైట్ కి టైం అయిపోతోంది. ఆలస్యమైతే విమానం అందుకోలేం!", అంటూ ఏం చెయ్యాలో తోచక కాలుకాలిన పిల్లిలా ఇటూ అటూ తిరగడం మొదలుపెట్టాడు విష్ణు. 


"ఒరేయ్ మనవడా! ఊరికే అలా కంగారు పడకురా! నాకు తెలిసిన ఆటోవాడు ఒకడున్నాడు. వాడిని పిలుస్తాలే", అంటూ ఆటో డ్రైవర్ మల్లన్నకు ఫోన్ చేసింది పార్వతమ్మ. 


"అమ్మా! ఇదిగో వస్తున్నా!", అంటూ ఆటోతో అయిదునిమిషాల్లో ఇంటిముందు ప్రత్యక్షమయ్యాడు మల్లన్న. 


ఆటోలో సామానుతో ఇరుక్కుని కూర్చుని ఎలాగో ఇక్కట్లు పడుతూ విమానాశ్రయానికి బయలుదేరాడు విష్ణు పార్వతమ్మతో. విమానాశ్రయానికి కొద్దిపాటి దూరంగా ఆటో ఆపాడు మల్లన్న.


"ఇదేమిటి? ఇంత దూరంగా ఇక్కడాపావ్?", ఆశ్చర్యంగా మల్లన్నను అడిగాడు విష్ణు.


"ఇంతకన్నా లోపలికి ఆటో వెళ్లకూడదు బాబూ!", నవ్వుతూ సమాధానమిచ్చాడు మల్లన్న.


ఇక నడకే దారి అనుకుంటూ మల్లన్న చేతిలో డబ్బులు పెట్టి సామాను లాక్కుంటూ విమానాశ్రయానికి వెళ్ళి చెకిన్ అయ్యాడు విష్ణు.


సెక్యూరిటీ చెక్కులూ వగైరాలు పూర్తి చేసుకుని బోర్డింగ్ గేటు వద్ద పార్వతమ్మను కూర్చోబెట్టి, "బామ్మా! నీ దయవల్ల సమయానికి ఎయిర్ పోర్టుకు వచ్చేశాం. నీకొక మంచి కాఫీ పట్టుకొస్తా. ఇక్కడే కూర్చో", అన్నాడు విష్ణు.


"నాదేవుందిరా! అంతా భగవత్సంకల్పం!", అంది పార్వతమ్మ.


అంతలో విష్ణు ఎక్కాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరుతుందని సమాచారం ఇచ్చారు వైమానిక సిబ్బంది. 


"ఒకప్పుడు రైలు సమయానికి రాలేదంటూ ఉండేవారు. ఇప్పుడు ఫ్లైట్లది అదే పరిస్థితి బామ్మా! మనం కంగారు పడకుండా హాయిగా కాఫీ తాగచ్చన్నమాట!", అంటూ వెళ్ళి రెండు కప్పుల వేడి వేడి కాఫీతో పార్వతమ్మ దగ్గరకు తిరిగొచ్చాడు విష్ణు.


కాఫీ తాగి అరగంట గడిచిందో లేదో విమానయాన సంస్థవారు ఫ్లైట్ మరో రెండు గంటలు ఆలస్యమంటూ మరొక ప్రకటన విడుదల చేశారు. చేసేదిలేక అక్కడున్న దినపత్రికలు ఒకదాని తర్వాత ఒకటి చదవడం మొదలుపెట్టాడు విష్ణు. ఫ్లైటు మరో గంట ఆలస్యం ఇంకో గంట  ఆలస్యం అంటూ మొత్తానికి మధ్యాహ్నం మూడు గంటలైపోయింది సమయం. విష్ణు కడుపులో ఆకలికి ఎలకలు పరిగెడుతున్నాయ్. 


"ఏంటో బామ్మా మన ప్రయాణం! నిన్ను సుఖపెడతానని చెప్పి ఈ పూట భోజనం కూడా లేకుండా చేసేశాను. మా ఊళ్ళోలాగా ఈ ఎయిర్ పోర్టులో తినడానికి పెద్దగా స్టాళ్ళు ఉన్నట్టులేవు. నాకే కళ్ళు తిరుగుతున్నట్లున్నాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉందో ఏమో!", అన్నాడు విష్ణు పార్వతమ్మతో.


"నా గురించేం కంగారు పడకురా. నాకు అప్పుడప్పుడూ దేవుడి కోసం ఉపవాసాలుండటం అలవాటే! నీకు ఆకలేస్తున్నట్లుంది. ఇంద! ఇవి తిను", అంటూ తన బ్యాగులోంచీ రెండు బిస్కట్ ప్యాకట్లు తీసి విష్ణుకి ఇచ్చింది పార్వతమ్మ.


గబగబా బిస్కట్లు తిని నీళ్ళు తాగాడు విష్ణు. అంతలో ఫ్లైట్ ఎక్కమని పిలుపువచ్చింది. 

విష్ణు నీరసంగా ఫ్లైటు ఎక్కుతూ ఉంటే చిరునవ్వుతో పలకరించింది ఎయిర్ హోస్టెస్.


"ఇక ఇవాళ్టికి వెళ్లమేమో అనుకున్నా", అన్నాడు విష్ణు ఎయిర్ హోస్టెస్ తో.


"మమ్మల్ని క్షమించండి సర్. సాంకేతిక లోపాలకారణంగా ఫ్లైటు ఆలస్యమైంది. ప్రయాణీకుల భద్రతే మా ప్రధాన లక్ష్యం!", చిరునవ్వు చెదరకుండా అంది ఎయిర్ హూస్టెస్.


ఆ అందమైన చిరునవ్వు విష్ణు చిరాకును సగం తగ్గించింది. మరేమీ మాట్లాడకుండా సీట్లో కూర్చున్నాడు విష్ణు.


"ఒరేయ్ అబ్బాయ్! మనం ఈ రాత్రి పడుకునేందుకు వసతి ఏర్పాటు చేశావా?", విష్ణుని అడిగింది పార్వతమ్మ.


"ఓ చేశాను బామ్మా! కళ్ళు చెదిరే స్టార్ హోటల్. నువ్వే చూద్దువుగాని ఎంత బాగుంటుందో", అన్నాడు విష్ణు.


"పుణ్యక్షేత్రానికి వెడుతూ స్టార్ హోటల్ ఎందుకురా? ఏ సత్రానికో వెడితే గుడికి దగ్గరగా ఉంటుంది కదా", అంది పార్వతమ్మ. బుంగమూతి పెట్టాడు విష్ణు. 


"పోన్లేరా! నీ ఇష్టప్రకారమే కానీ", అంది పార్వతమ్మ నవ్వుతూ.


ఫ్లైటు దిగి హోటల్ కు వెళ్ళారు విష్ణు, పార్వతమ్మలు. అప్పటికి సమయం రాత్రి పదకొండైంది. రిసెప్షన్లో కూర్చున్న అబ్బాయి విష్ణు ఇచ్చిన వివరాలన్నీ తన కంప్యూటర్లోకి ఎక్కించి విష్ణువంక అయోమయంగా చూస్తూ, "సార్! మీరు ఇవాళ పొద్దున్న కదా రావాలీ?", అని అడిగాడు.


"అవునండీ! కానీ మా ఫ్లైటు ఆలస్యమైపోయింది. అందుకే మేము రావడం ఆలస్యమైంది" , చెప్పాడు విష్ణు.


"సార్! మా రూల్స్ ప్రకారం మీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి మీరు బుక్ చేసుకున్న రూం వేరే వాళ్లకి ఇచ్చేశాం. ఇప్పుడు గదులు ఖాళీ లేవు సార్", అన్నాడు రిసెప్షనిస్ట్. ఆ మాటలకు పిచ్చి కోపం వచ్చేసింది విష్ణుకి.


"నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నా రూం వేరే ఎవరికో ఇవ్వడమేమిటీ?", గట్టిగా అరిచాడు విష్ణు.


"సార్! మీరు మాకు ముందే కాల్ చేసి విషయం చెప్పి ఉండాల్సింది సార్", వినయంగానూ, ఒకింత భయంతోనూ చెప్పాడు రిసెప్షనిస్ట్.


"కాల్ యువర్ మేనేజర్!!!", ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు విష్ణు.


సూటూ-బూటూ  వేసుకున్న ఒక వ్యక్తి గొడవ విని లోపలినుంచీ పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వచ్చాడు.


"నేనే మేనేజర్ని. ఏం జరిగింది సార్?", విష్ణుని అడిగాడు మేనేజర్ అతి వినయంగా. విష్ణు జరిగినదంతా చెప్పాడు. 


"సార్! మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ..", అని ఎదో చెప్పబోతూ పార్వతమ్మను చూసి ఆశ్చర్యపోతూ, "బామ్మగారూ! మీరా? ఎప్పుడొచ్చారూ?", అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్వతమ్మ పాదాలకు నమస్కారం చేశాడు మేనేజర్.


"అరె! నువ్వు సీతారామమ్మ మనవడు రాధాకృష్ణవి కదూ?", మేనేజరును అడిగింది పార్వతమ్మ.


"అవును బామ్మగారూ. నేను ఈ హోటల్ లో పనిచేస్తున్నా. రూం కావలసినది మీకేనా? నాతో రండి బామ్మగారూ", అంటూ పార్వతమ్మ వారిస్తున్నా వినకుండా ఆవిడ చేతిలోఉన్న బ్యాగు భుజాన వేసుకుని ఖాళీగా ఉన్న రూం వైపుకు నడిచాడు రాధాకృష్ణ. వారి వెనుక కాస్త గంభీరమైన ముఖంతో వెళ్ళాడు విష్ణు.


"హమ్మయ్య! ఈ విధంగా భగవంతుడు మన గది సమస్య తీర్చేశాడు. దర్శనానికి రేప్పొద్దున్నే బయలుదేరి వెడదాం. హాయిగా పడుకో", అంది పార్వతమ్మ విష్ణుతో.

"సరే బామ్మా! అసలే భక్తులు మామూలుకన్నా ఎక్కువగా ఉన్నారట. నా బెంగ నీ గురించే. అంత పెద్ద క్యూ లైన్లో ఎలా నిలబడతావో ఏమో! ఆలయ అధికారుల నెవరినైనా పట్టుకుని ప్రత్యేక దర్శనం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. టికెట్ల కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు నేను సిద్ధం", అన్నాడు విష్ణు.


"ఒరేయ్ విష్ణూ! ఇంతవరకూ మనల్ని తీసుకొచ్చిన ఆ భగవంతుడు, దర్శనం సంగతి కూడా చూసుకుంటాడులే. ఇంక పడుకో. బాగా అలసిపోయావ్", అంది పార్వతమ్మ విష్ణుకు దుప్పటి కప్పుతూ. 

  

మర్నాడు పొద్దునే లేచి స్నానాలు ముగించుకుని పట్టుబట్టలు కట్టుకుని దర్శనానికి సిద్ధమయ్యారు విష్ణు, పార్వతమ్మలు. విష్ణు తన ఫోన్లో ఆలయ అధికారుల నెంబర్లు వెతికి వారికి ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టాడు. గంట గడిచింది. ఒక్క అధికారి కూడా విష్ణుకి దొరకలేదు. పైగా భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక దర్శనాలన్నీ నిలిపివేశారన్న సమాచారం అందింది విష్ణుకి. 


"బామ్మా! దర్శనం ఇంత కష్టమవుతుందని అనుకోలేదు. మన రిటర్న్ ఫ్లైటు రేపు తెల్లవారుఝామున బయలుదేరుతుంది. కాబట్టి దర్శనానికి ఇవాళ మాత్రమే మనకు అవకాశం ఉంది. కానీ భక్తజనం చాలా మంది ఉన్నారట. ఆ జనంలో సాయంత్రందాకా నిలబెడితే నువ్వు ఏమైపోతావో ఏమో! ఇంకొక్క రోజు ఇక్కడే ఉంటే బాగుండేదేమో. మనకు దర్శనమయ్యేటట్లు లేదు", దిగులుగా పార్వతమ్మతో అన్నాడు విష్ణు. 


"ప్రతిదానికీ అనవసరంగా కంగారుపడి దిగులు పడిపోకురా విష్ణూ! మనం వెంటనే బయలుదేరి వెళ్ళి దర్శనంకోసం ఏర్పాటు చేసిన క్యూలో నిలబడదాం. తక్కినది పరమాత్ముడే చూసుకుంటాడు", అంది పార్వతమ్మ.


భగవంతుడిపై పార్వతమ్మకు ఉన్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయాడు విష్ణు. మారుమాట్లాడకుండా పార్వతమ్మ వెనకాలే వెళ్ళి క్యూలో నిలబడ్డాడు. పార్వతమ్మ భగవన్నామస్మరణ చేస్తూ నడుస్తోంది. జనం ఒకరినొకరు నెట్టుకోవడం మొదలుపెట్టారు.


"అబ్బ! తొయ్యకండయ్యా!", అంటూ చిరాకు పడ్డాడు విష్ణు. తోపులాట ఎక్కువయ్యింది.

ఎవరో పార్వతమ్మ కాలు గట్టిగా తొక్కేసరికి ఆవిడకాస్తా, "భగవంతుడా!", అంటూ కింద పడిపోయింది! విష్ణు గుండె ఆగినంత పనైంది. 


"బామ్మా!", అంటూ పెద్ద కేక పెట్టాడు విష్ణు. ఆ కేకవిన్న ఆలయ సెక్యూరిటీ గార్డులు ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు.


"పెద్దావిడ పడిపోయింది. కాలు విరిగిందనుకుంటా!", ఎవరో సమాధానమిచ్చారు. 


"అరెరె! అలాగా!", అంటూ ఒక సెక్యూరిటీ గార్డు బారికేడ్ల అడ్డు తొలగించి పార్వతమ్మను లేవనెత్తి క్యూలోనుంచీ బయటకి తెచ్చి, "మీతోపాటూ ఎవరున్నారమ్మా?", అని అడిగాడు పార్వతమ్మని.


"నా మనవడున్నాడు. అదుగో! వాడే", అంటూ విష్ణుని చూపించింది పార్వతమ్మ.


"సార్! మీరొచ్చి ఈవిడతో ఉండండి", విష్ణుతో చెప్పాడు సెక్యూరిటీ గార్డు. 


అంతలో విషయం తెలుసుకున్న ఆలయ ఉన్నతాధికారులు ఇద్దరు పార్వతమ్మ దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చి, "క్షమించండమ్మా! జనం ఎక్కువగా ఉండేసరికి మీకీ ఇబ్బంది కలిగింది", అన్నారు వినయంగా.


"పర్లేదులెండీ. ఎవరో నా కాలు తొక్కేసరికి చాలా నొప్పి పెట్టింది. పెద్దదాన్ని కదా! బాధను ఓర్వలేకపోయాను", అంది పార్వతమ్మ మొహమాటపడుతూ.  


"అమ్మా! మీకు దైవదర్శనం చేయించే పూచీ మాది. దయచేసి ఇక్కడేం గొడవ చెయ్యకండి. వృద్ధులైన మీలాంటివారికి ఏదైనా జరిగితే అందరూ అది మా అసమర్థత అని మమ్మల్నే తప్పుబడతారు తల్లీ!", అంటూ ఆ అధికారులు పార్వతమ్మకోసం వీల్ చెయిర్ తెప్పించి, అందులో ఆవిడని కూర్చోబెట్టి, ఆలయంలో దైవదర్శనం చేయించి ప్రసాదం ఇచ్చి మరీ పంపించారు. పార్వతమ్మతోపాటూ విష్ణుకి కూడా అద్భుతమైన దర్శనం దొరికింది. 


"సాయంత్రందాకా పడుతుందేమో అనుకున్న దర్శనం గంటలో పూర్తవ్వడమేకాక ప్రత్యేక దర్శనంకన్నా ఘనంగా జరిగింది. భగవంతుడి లీల ఎంత గొప్పదో చూశావా విష్ణూ!", అంది పార్వతమ్మ. 


"నిజమే బామ్మా! భగవంతుడి కరుణ డబ్బులతో కొనలేనిదనీ అది పొందడానికి భక్తి ఒక్కటే మార్గమనీ ఈ యాత్రవల్ల తెలుసుకున్నాను", అన్నాడు విష్ణు ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటూ. 


తీర్థయాత్ర ముగిసింది. పార్వతమ్మ మనసుకు చాలా సంతోషం కలిగింది. అది విష్ణుకి ఆనందం కలిగించింది. విష్ణు సెలవు ముగియడంతో తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు విష్ణు. రైలుకోసం ఎదురుచూస్తున్న విష్ణు మనసులో తీర్థయాత్ర తాలూకూ జ్ఞాపకాలు మెదులుతున్నాయి.


'ఏంటో! బామ్మతో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయని భ్రమ పడ్డాను. క్యాబు దగ్గరినుంచీ దర్శనందాకా ఏదీ నేననుకున్నట్లు జరగలేదు. కానీ దేవుడి దయవల్ల అంతా బాగా జరిగింది. ప్రయాణంలో ఉన్నప్పుడు అన్నీ మనమనుకున్నట్లు జరగవని తెలిసినా బామ్మ ఎంతో ప్రశాంతంగా కనిపించింది. తను దేనికీ కంగారు పడలేదు సరికదా నాక్కూడా అడుగడుగునా ధైర్యాన్ని ఇచ్చింది!


నిజానికి ప్రయాణంలో నేననుభవించిన అనిశ్చితి నేను చేసే ఆఫీసు పనిలో లేదు! అయినా ఉద్యోగంలో ప్రతిక్షణం ఏదో ఒక విషయంలో అనవసరమైన ఆందోళన చెందుతూనే ఉంటాను. బామ్మ నమ్మినట్లు ‘నా వెంట ఉండి అంతా నడిపిస్తున్నది ఆ భగవంతుడే!’ అని నేను కూడా నమ్మగలిగితే సమస్యలన్నీ తొలగిపోయి నా మనసు కచ్చితంగా తేలికపడుతుంది. అప్పుడు పని ఒత్తిడి నన్నింక బాధించదు. యాత్రద్వారా బామ్మ నాకు మంచి పాఠమే నేర్పించింది!', అని అనుకుంటూ భగవంతుడిని మనసులో స్మరించాడు విష్ణు. 


చిత్రంగా ఆ మరుక్షణం విష్ణు మనసంతా ఏదో తెలియని ప్రశాంతతతో నిండిపోయింది!   


*****

సమాప్తం. 

G. S. S. కళ్యాణి  గారి కొన్ని ఇతర రచనలు:


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

G. S. S. కళ్యాణి
G. S. S. కళ్యాణి

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page